S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మద్రాసంతా - ఏరాదే, ఎడమిల్లై

ఒక్క తంబుచెట్టి వీధి మాత్రమే కాదు జార్జిటౌన్‌గా వాసికెక్కిన వ్యాపార కూడలి అంతటా ‘ ఫుట్‌పాత్ డ్వెల్లర్స్’ - కాలిబాట కాపురాలు మిక్కుటం. తంబుచెట్టి వీధిలో ప్రతీ దొంతర భవనం ముందు కాలిబాట మీద పసిపాపల దగ్గర నుంచీ పెళ్లీడు ఆడపిల్లల దాకా వీధి జీవితాల్లో ఆనందంగా నివసిస్తూ కనపడతారు. వున్న ముఖ్యమైన సామానులు, విలువయిన నగానట్రా, డబ్బూ దస్కం కూడా మూటలుగా, సూటుకేసులుగా సర్దుకుని - మహాభవనాల వెంటిలేటర్లలోనూ, మెట్ల క్రిందా - అక్కడా ఇక్కడా దాచుకుంటారు. ఆంధ్రా ఇన్సూరెన్స్ నాలుగంతస్తుల బిల్డింగ్ వెనుకనున్న పెరడు అంతా వాళ్లదే. కానీ ‘నీట్’గా వుంచుతారు. రాత్రి హాయిగా బయట కాలిబాట మీదే శయనిస్తారు తప్ప భవంతులలోకి రారు. వీళ్లు దొంగలు కారు. వాళ్లే కాపలాదారులు అంటారంతా - వీళ్లని విశ్వసిస్తారంతా.
బెజవాడ కృష్ణాకాలువ గట్ల మీది జీవితానికీ, బొంబాయి ‘ఝాంపడీ’ కుటీరల జీవితానికీ రుూ ఫుట్‌పాత్ జీవుల జీవన విధానానికీ పోలికే లేదు. ‘వీళ్లదో ‘సెపరేట్ కల్చర్’ అన్నాడు ఈ వీధిలోనే ఆంధ్రపత్రిక ఆఫీసు ఎదురుగా వున్న కుంభకోణం అయ్యర్‌ల రెస్టారెంట్ ప్రక్కనే తన అంగడి (పాన్‌షాపు) పెట్టుకొని, దశాబ్దాలుగా వుంటున్న మీనన్. అతను అమ్మే దినపత్రికల్లో ‘దినతంతి’ ‘కలైనేశన్’లు టాప్. ఏదయినా సంచలన సంఘటన అతని కంటబడిందా? ‘తంతి’ కార్యాలయానికి ఫోన్ కొడతాడు. అంతే, నాలాంటి కొత్త జర్నలిస్ట్ మీనన్ కూడా ఒక క్లాసురూమేనన్నమాట!
మళ్లీ ఆనందవాణికి వెళ్దాం. ఆదినారాయణ ఆధ్వర్యంలో మరో ముగ్గురున్నారు. ఇచ్చిన మేటర్ కంపోజ్ చేసేసి పేజీలు కట్టేస్తారు యాంత్రికంగా. వాళ్లా పని చేస్తూండగానే ఆదినారాయణ ఎన్నో కబుర్లు చెప్పేవాడు.
‘ఎదుర్‌లే’ అంటే ‘ఎదురుగ్గా’ వున్న వాటాలో, శేషయ్య గారున్నప్పుడు, అతను కూడా ఆంధ్రపత్రిక ఆఫీసులో పనిచేశాడు. ఫోర్‌మాన్‌గా (?) రిటైరయినాడు. నీలంరాజు వేంకట శేషయ్యగారు ఎడిటోరియల్స్ రాయడం అంటే - ‘అదో సీను సామీ!’ అన్నాడు. ‘సారు’ ఓ చిన్నసైజు అరటి పండ్ల గెల నాలుగైదు పెడలున్నది ఎదురుగా పెట్టుకుని, పేరాపేరాకీ ఓ రెండు పళ్లు లాక్కొని, వొల్చుకొని, తింటూ సాగేదిట ఆయన సంపాదకీయ రచన. అయ్యవారికి అంటే శంభుప్రసాద్ గారికీ, శేషయ్య గారికీ చాలా ఫ్రెండ్‌షిప్ ఉండేదిట. నీలంరాజువారు, శంభుప్రసాద్ గారూ -ఒకరినొకరు, ‘బావగారూ! అంటే బావగారూ!’ అని సంబోధించుకునేవారుట!
నిజానికి శేషయ్యగారిని నేను ‘అరవై ఆరు’లో చాలాసార్లు కల్సుకుంటూ వుండేవాణ్ని. శేషయ్యగారి ఆఖరి వాడనుకుంటాను నాకన్నా పెద్దవాడే - మురళి - ఎక్స్‌ప్రెస్‌కి ఫొటోగ్రాఫర్ రిపోర్టర్ - నాకన్నా సీనియర్. అయినా - ఎక్కడ, ఏ ఫంక్షన్‌లో కలిసినా కబుర్లు చెప్పుకునేవాళ్లం. కాకపోతే, తెగ నడిపించేసేవాడు. మేమిద్దరం కోదాడలో కలిశాం ఓసారి. కాంతారావు శతచిత్ర సంబరాలకు వెళ్లినప్పుడు మేము ఎక్కిన బస్సు వూరికి మూడు నాలుగు మైళ్ల యివతల ‘బ్రేక్ డౌన్’ అయినప్పుడు - కెమెరా భుజాన వేసుకుని, నన్ను కూడా దింపేసి ‘పదపద’మంటూ వెన్యూ దాకా నడిపించేశాడు ఒకసారి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అతనికి వాళ్ల నాన్నగారిలాగే. అద్సరే.. ఆదినారాయణ ‘ఆంధ్రపత్రిక’లో - కుంచితపాదం గారనే జనరల్ మేనేజర్ వచ్చినాక అంతా స్ట్రిక్టు అయిపోయింది’ అని చెప్పాడు.
ఆంధ్రపత్రిక కబుర్లు వినడం అంటే నాకెందుకు సరదా అంటే, రాధాకృష్ణగారితో నాకు మైత్రి బెజవాడలో వున్నప్పుడే ఏర్పడ్డది. ఆనందవాణి - పత్రిక ఫారాలు కట్టాకా, వాటిని బయట ప్రింటు చేయించడానికి సిద్ధం చేసేవాళ్లం. రాత్రి వర్కర్లు వెళ్లిపోయాకా పదకొండు గంటల వేళ క్రిందికి వచ్చి - అప్పటికే నిర్మానుష్యం అయిన బాటలో నాన్నగారి దగ్గరకు వెళ్లాలంటే మధ్య మధ్య కుక్కలు అరుస్తూంటాయ్...
‘యారదీ? యార్ అప్పా! ఎంగెపోవేం?’ అన్న ఎంక్వయిరీకి ( ఫుట్‌పాత్ డ్వెల్లర్లకి) అరవంలో జవాబు చెప్పలేక ఆఫీసులో అక్కడే పెద్ద ‘ఆర్మ్‌ఛెయిర్’ వుండేది (పడకకుర్చీ) దాన్లో కునికేసేవాణ్ని. ఎక్కడా? కునుకా? పాడా?
ఆనందవాణి ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన పత్రిక.. నాకన్నా ముందే 1939లో పుట్టి, వర్థిల్లి ఇవాళ శిథిల దేవాలయమై పోయింది. అయినా పాతగుడిలోని శిల్పపుష్టి వైభవ ఛాయలు ఎక్కడికి పోతాయ్?
‘శ్రీశ్రీ’ వారంవారం శీర్షిక రాసేవాడు. రావూరు సత్యన్నారాయణ గారు ‘కప్పు కాఫీ’ రాసేవారు. ముద్దా విశ్వనాథం, శ్రీనివాస శిరోమణి, ఆరుద్ర, వాకాటి లాంటి ఎందరో మహానుభావుల సేవలందిన ఈ పత్రిక ర్యాకులు నిండా బుక్స్ -క్రింద పడి పొర్లుతున్న పత్రికల, ఫైళ్ల గుట్టలు ఎన్నో.. ఇవన్నీ - ఎలకపిల్లలాగ చక్కబెట్టేవాణ్ని. స్వరాజ్య పత్రిక బండిల్స్ వున్నాయి. ఆ పత్రిక రాజగోపాలాచారిగారి పూనిక మీద ఖాసా సుబ్బారావు ప్రభృతులు పెట్టినది. నా యింటర్‌మీడియట్‌లోనే నేను దాన్ని ‘చూశాను’. అందులో ‘రాజాజీ’ ‘డియర్ రీడర్’ కాలమ్ వున్నట్లు జ్ఞాపకం. ఖాసాగారి తెలుగు స్వతంత్ర. సరే, అదీ ‘నాదే’ అనుకునేవాణ్ని. ఇక్కడ ఆనందవాణి కార్యాలయంలో రాజాజీగారు సీరియలైజ్ చేసిన రామాయణం దొరికింది. ‘క్లిప్పింగ్స్’ అన్నీ జాగ్రత్తగా, వరుసగా కుట్టి, బైండింగ్ చేసి ఉంది. సరే, నిద్రపట్టే దాకా, రామాయణ, భారతాల పఠనం సాగేది. సంక్షిప్తంగా, సింపుల్ ఇంగ్లీష్‌లో ‘రాజాజీ’ రచన సాగింది. ఆయనకి ‘వైజ్‌మ్యాన్’ అనే నిక్‌నేమ్ ఉంది.
మర్నాడుదయం బెడ్‌కాఫీ (‘కాఫీ’ అనరాదు. అక్కడ మదరాసులో ‘కాపీ’ అనాలి.) కాళిదాసుసారు తెచ్చేవారు. ఎంత గొప్ప అంటే నాకు జీతంకన్నా ఈ ‘నాతం’ (అపురూప సంబంధం) ఎంత గొప్ప! నాకు రుూ బెడ్‌కాఫీ అలవాటు, యూనివర్సిటీల్లో చేరే దాకా వుండేది. అక్కడ ఇలాంటి ఏర్పాట్లు కుదరక మానేశాను. కానీ ఇప్పుడు - రెడీ... కాఫీ తాగేసి, నాతో తెచ్చుకున్న ‘బినాకా డెంటల్ సెట్’తో (ఉప్పునీటి) ముఖ ప్రక్షాళనం చేసుకుని (ఓవర్ హెడ్ టాంక్సులో అక్కడ ఉప్పునీళ్లే వుండేవి.) ఇడ్లీ సాంబారు, వడా తిన్నాక - కాళిదాసుగారు తన పని చేసుకుంటూ వుండగా నాన్నగారి దగ్గరికి వచ్చేసేవాణ్ని నేను ‘బై సార్’ అని చెప్పి.
‘హిందూ’ పత్రిక రెడీగా వుండేది. నాన్నగారు సాయంకాలం ‘మెయిల్’ తెప్పించి చదివేవారు. ఉదయంపూట ‘హిందూ’ పేపర్‌బోయ్ - ఏనాటి నుంచో ఆఫీసుకి వేస్తున్నాడు - వేసేవాడు. ‘టైము’ చాలదని నాన్నగారు తొమ్మిదికే బయలుదేరేవారు. ఆయన పారిస్ నుంచి ‘మవుంట్ రోడ్’కి పోవాలిగా.
ఇక ఈ నాన్నగారి రూము అతి విశాలమయిన హాలు. కిటికీ మడత తలుపులు తెరిచి చూస్తే - దృశ్యం అద్భుతం! ఎదురుగ్గా చైనా బజార్, అవతల ఫుట్‌పాత్‌ల నిండా - నేల రుూనినట్లు - సిటీబస్‌ల కోసం - క్యూలలో నిలబడి పారిస్ కార్నర్ పొడవునా - నిరీక్షిస్తున్న రంగురంగుల జనాలు. ఆ వెనుక హైకోర్టు బిల్డింగు - పెద్ద లైట్‌హవుస్. ఈ పాడులోకానికి పహరా కాస్తున్న ‘పరలోక వాసి’లాగ వుండేది. నగర చోద్యాన్నీ, జనాల పొట్టతిప్పల ప్రస్థానాన్నీ తొంగి తొంగి చూసే మేఘాలు! ఒకప్పుడిది కూడా తెలుగు వాళ్లది. కానీ ‘ఇప్పుడది’ మనది కాదు కదా! (1960ల మాట ఇది)
పొయిట్రీ గొణుక్కుంటున్నాను - అవతల హోరున ‘రొద’
‘హాయ్ అల్లా! అటు చూడు
స్టాన్లీ గార్డనర్ నవలలో సస్పెన్స్‌లా మరి
కాస్సేపట్లో బస్సే వస్తుందో? కారే
వచ్చి గ్రుద్దేస్తుందో - జిఓకే!
అనగా ‘గాడోన్లీ నోస్’
బస్‌స్టాపులో క్యూ చూస్తే (వవ్)
బాపురే! ధరల్ ఆపై పన్నులదనం అన్నీ
ఈ ‘క్యూ’ ముందు బలాదూరే పిసరంతే...
ఆఫీస్‌ల టైముకెల్లా? హనుమం
తుని తోక చివర.. ఇలా నత్తనడకన
క్యూలో హాయ్ అల్లా! లేటయితే ఎన్నపన్రేమ్
సిఎల్లా? ఎప్ఫెల్లా? ఏదో ఒకటి పారేయ్...
అంటూ రాసి, ఆగి చూస్తే మధ్యాహ్నం లంచవర్ ఆసన్నమయింది.
హోటల్లో జెబ్బ సత్తువతో జొరబడి
సాంబార్ ‘సాదామ్’ ‘సాపాటా?’ ఆర్.. (లేక)
మాడ్రన్ కేఫ్‌లో కేవలం
ఇడ్లీ వడా దోసై ఏదో ఒకటి
సాంబారులో ముంచి తేల్చి లోపలికి వేసైడమా? ఓ గాడ్!
అనుకుంటూ వుంటే పోస్ట్‌మ్యాన్ - ‘పోస్ట్’ అంటూ విసిరేశాడు. ఓ కట్ట ఆఫీసు ఉత్తరాలు. అందులో రెండు పర్సనల్ లెటర్స్ కూడా వున్నాయి. ఒకటి తమ్ముడు రాసినది. ‘నీ ‘విడీవిడని చిక్కులు’ నవలని పోస్ట్‌లో - ఆంధ్రసచిత్ర వార నవలల పోటీకి పంపేశాను. టైమయిపోతోంది. గడువు చివరి రోజుకి అందుతుందేమో? ఇక నీవు రాసిన ‘రావి చెంత బావి’ కథని - మొన్న అర్ధరాత్రితో గడువు ముగుస్తున్నందున ‘ప్రభ’కి, కథల పోటీకి - స్వయంగా వెళ్లి యిచ్చేశాను’ - అని తమ్ముడు వారం రోజుల క్రితం డేట్‌తో రాసిన ఉత్తరం. పోనీలే, మంచిదే. నేరుగా ప్రచురణకర్తలకు ఇవ్వకుండా - పత్రిక సీరియల్‌గా వస్తే ఎక్కువమంది పాఠకులు చదువుతారు - అనుకున్నాను. రెండో ఉత్తరం, నా ‘రూమ్మేటు’ గోపాలం రాసింది. వాడు ఆలిండియా రేడియోకి ‘టెక్’గా సెలెక్టయ్యాడుగా - బెంగళూరులో ట్రెయినింగ్‌కి రమ్మన్నారుట. తర్వాత పోస్టింగ్ వస్తుంది. అందువల్ల వాళ్లూరు పెనుగొండ నుంచి బెజవాడ వచ్చి రైల్వే రిజర్వేషన్ చేసుకున్నాడు. ‘మీ ఇంటికి వెళ్లి ‘అమ్మ’నీ, తమ్ముళ్లనీ, చెల్లెమ్మల్నీ చూసి తిరిగి పెనుగొండ వెళ్లిపోతాను. పై వారం బెంగుళూరు ప్రయాణం’ అని రాశాడు. ఐతే, అందులో, ఒక ముఖ్య విషయం అని అండర్‌లైన్ చేస్తూ రాశాడు. ‘మీ తమ్ముడు శాస్ర్తీకి కొంచెం సుస్తీ చేసింది. కంగారు పడకు. కానీ మొన్న అమెరికన్ ఆసుపత్రిలో చేర్పించారు. అటు నైట్‌డ్యూటీలు, ఇటు ప్రొద్దుట పబ్లిసిటీ వర్కు, ఓవర్‌స్ట్రయిన్, దగ్గూ, జ్వరం అంతే’నంటూ రాశాడు...
‘వెళ్లాలి.. నేను వెళ్లాలి’ - అని గట్టిగా బయటికే అనుకున్నాను. ఆ రోజుల్లో రైలు ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ కావాలీ అంటే, స్టేషన్‌కి వెళ్లి ‘క్యూ’లో నిలబడి చేయించుకోవాలి. లేదా, హౌరామెయిల్‌లో కాకినాడ కంపార్ట్‌మెంట్‌లో, ఎలాగో అలా దూరి - చచ్చి బ్రతికి బెజవాడ ఇంటికి చేరాలి.
క్రిందికి బస్‌స్టాపులోకి పోయి నిలబడ్డాను. బస్సులొస్తున్నాయి. క్యూలు కొంచెం కొంచెం తరుగుతున్నాయి. అరవం రాదు నాకు. వాళ్లు తెలుగూ, ఇంగ్లీషూ మాట్లాడితే లక్ష్యపెట్టరు. కండక్టర్ బస్సు ఆగంగానే ‘ఏరుంగో.. ఏరుంగో’ అని అరుస్తాడు. మరుక్షణం ‘రైట్.. రైట్’ అంటూ విజిల్ వేసేస్తాడు. ‘ఏరాదే, ఎడమిల్లై.. ఏరాదే.. ఎడమిల్లై’ - అన్న కండక్టర్ల కేకలే అన్ని దిశలా వినబడుతూంటుంది. అంటే అర్థం ‘ఎక్కరాదు - చోటు లేదు’ అని. కాని మొదట్లో కన్‌ఫ్యూజన్ చాలా వుండేది. కండక్టర్ ‘ఎరుంగో.. ఎరుంగో..’ అంటూ వుంటే ఫ్రంట్ డోర్‌లోంచి దూరిపోదామని వెళ్లేవాణ్ని. వాడు (సారీ, కండక్టర్‌గారు) ‘కఁయ్’ మనేవాడు. మరి? అతనే కదా, ‘ఏరుంగో ఏరుంగో’ అన్నాడు (ఎక్కండి.. ఎక్కండి) గానీ, కాదుట;
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com