S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృతజ్ఞత

న్యాయమూర్తి పదవిలో వున్నప్పుడు కూడా చాలామంది లీగల్ సమస్యలు వున్నప్పుడు సలహాల కోసం, సహాయం కోసం వచ్చేవాళ్లు. నా వృత్తికి సంబంధం లేని విషయాల్లో సలహాలు ఇచ్చేవాణ్ని. అవసరమైన సందర్భాలలో మాట సహాయం కూడా చేసేవాణ్ని. న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత కూడా చాలామంది సలహా సంప్రదింపుల కోసం వస్తూనే వున్నారు. తోచిన రీతిలో ఏదో సహాయం చేస్తూనే వున్నాను.
ఆ మధ్య ఓసారి అమెరికా వెళ్లే ముందు ఓ తెలిసిన వ్యక్తి వచ్చాడు. భార్యా అతని కూతురు వచ్చారు. మా సోదరుడు చెప్పడం వల్ల వాళ్లని రమ్మని చెప్పాను. వాళ్ల సమస్య విన్నాను. అతని కూతురికి అల్లుడికి మధ్యన ఇబ్బంది ఏర్పడింది. వారిరువురు కలిసి జీవించలేని పరిస్థితి ఏర్పడింది. పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆరు మాసాలు గడిచాయి. ఇద్దరూ కలిసి కోర్టులో ఒప్పుకుంటే విడాకులు మంజూరవుతాయి.
సమయం దగ్గరికి వచ్చిన తరువాత కోర్టుకి రావడానికి అతను వీళ్లను సతాయిస్తున్నాడు. అతనిపైన క్రిమినల్ కేసు కూడా ఉంది. అయినా వీళ్ల దగ్గర నుంచి డబ్బులు లాగడానికి వీళ్లను ఇబ్బంది పెడుతున్నాడు. విడాకులు మంజూరవుతే మరో పెళ్లి చేయాలని ఆ తండ్రి తాపత్రయం, ఇదీ పరిస్థితి అని చెప్పారు.
అమ్మాయి యుక్త వయస్కురాలు. తప్పు ఎవరిదో చెప్పలేం. ఎందుకంటే అతని కథనం నేను వినలేదు. డాక్యుమెంట్స్ ప్రకారం ఇద్దరూ విడాకుల కోసం ఒప్పుకొని దరఖాస్తు చేసుకున్నారు. మొదట అతను విడాకుల కోసం కేసు వేస్తే దాన్ని పరస్పర ఆమోదం కోసం కేసుగా మార్చుకున్నారు.
సాధారణంగా నేను పోలీసు అధికారులకి ఫోన్ చెయ్యను. కానీ ఆ అమ్మాయి విషయంలో ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడారు. కేసు సెటిల్ అయ్యింది. విడాకులు మంజూరయినాయి.
ఆ పోలీసు అధికారి నాకు వాట్సప్ కాల్ చేసి ఆ విషయం చెప్పారు. కానీ ఆ అమ్మాయి గానీ వాళ్ల తండ్రిగానీ ఫోన్ చేయలేదు. చివరికి నేనే మా సోదరునికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాను.
మనకు సహాయం చేసిన వ్యక్తులకి కృతజ్ఞత చెప్పడం మన కనీస ధర్మం. మన కోసం వాళ్లకు తిరిగి రాని కాలాన్ని వాళ్లు వెచ్చిస్తారు.
ఈ విషయం తెలిసీ తెలియక కొంతమంది కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతూ వుంటారు.
ఆ కృతజ్ఞత కూడా హృదయం నుంచి చెప్పాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001