S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రసాస్వాదనం.. భామాకలాపం’

కూచిపూడి మణిమయ కిరీటం భామా కలాపం. వందల సంవత్సరాలుగా, తరతరాలుగా చేసేవారినీ, చూసేవారినీ పవిత్రులని చేస్తూ, రసగంగలా ప్రవహిస్తోంది. భామాకలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, మాధవి పాత్రలు ఉన్నాయి. సత్యభామ సౌందర్య గర్విత; భర్తను కొంగుకు కట్టుకున్న స్వాధీనపతిక. సత్యభామ జీవాత్మకు సంకేతం. శ్రీకృష్ణుడు పరమాత్మ. అందం, అహంకారం వదిలి, జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం భామాకలాపం యొక్క సారాంశం. జీవేశ్వర అనుసంధానం భామాకలాపం సందేశం. మరి మాధవి ఎవరు? మాధవుని మాయ మాధవి. ఈమె సత్యభామ ప్రియ నెచ్చెలి. చీకటి నుండి వెలుతురుని చూపి, సత్యభామనూ శ్రీకృష్ణుడినీ ఒకటి చేస్తుంది. కొంచెం హాస్య రసం పండించి ప్రేక్షకులను అలరిస్తుంది మాధవి.
సత్యభామ పాత్ర ప్రదర్శించడం కష్టం. అందరూ ఈ పాత్రను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించలేరు. అయితే ఈ మధ్య డా.ఆచార్య అలేఖ్య పుంజాల భామాకలాపం ప్రదర్శించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, యక్షగాన కేంద్రం - కూచిపూడి సంయుక్తంగా నిర్వహించిన మూడు రోజుల తెలుగు నాట్యోత్సవాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖులైన నర్తకులు, నర్తకీమణులు పత్ర సమర్పణ, నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. జనవరి 16, 17, 18 తేదీలలో జరిగిన ఈ కార్యక్రమం అలేఖ్యగారి ‘్భమాకలాపం’తో ముగిసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నందమూరి తారక రామారావు కళావేదికలో ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సత్యభామగా ఆచార్య అలేఖ్య, శ్రీకృష్ణుడిగా గురువు, సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత శ్రీకళాకృష్ణ, మాధవిగా సంగీత నాటక అకాడెమీ యువ పురస్కార గ్రహీత డా.తాడేపల్లి సత్యం చేశారు. డా.అలేఖ్య కూడా కూచిపూడిలో 2012లో సంగీత నాటక అకాడెమీ అవార్డు పొందారు. ముగ్గురూ కేంద్రం నుండి అవార్డులు పొందిన కళాకారులు. అందువల్ల ఈ ప్రదర్శన రక్తి కట్టింది. ఈ ప్రదర్శనకు నట్టువాంగం పసుమర్తి రామలింగ శాస్ర్తీ, గాత్రం పసుమర్తి శేషుబాబు, డి.ఎస్.వి.శాస్ర్తీ, వయోలిన్ దినకర్, వేణువు వి.బి.ఎస్.మురళి, ఆహార్యం సుదర్శన్, హెయిర్‌స్టైల్ శ్రీమతి లీల, మృదంగం రాజగోపాలాచారి అందించారు. సత్యభామ అమాయకురాలు, అందమైనది, అహంకారం, అభిజాత్యం కలిగినది. ఈ పాత్రని అ లేఖ్య అవలీలగా పోషించారు. గతంలో మండోదరి, రుద్రమదేవి, నాయిక, మందాకిని, పార్వతి, సీత వంటి ఎన్నో పాత్రలకు జీవం పోశారు అలేఖ్య.
సత్యభామ ఒక సంపూర్ణ మహిళ. స్ర్తిత్వానికి ప్రతీక! సత్యభామాకలాపంలో సత్యభామ అష్టవిధ అవస్థలకూ లోనవుతుంది. ఈమె ఉత్తమ నాయిక. వయస్సుకు తగ్గట్టుగా చేయాలి. పరిపక్వత పొందిన కళాకారులే ఈ పాత్ర చేయగలరు. 16 ఏళ్ల అమ్మాయికి ఈ పాత్ర పడే బాధ, అవస్థ అర్థం కాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి.
ఒక కళాకారిణి తను చేసే పాత్రల ద్వారా ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. ఎందుకంటే నర్తకి ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను రసగంగలో పావనం చేయగలదు. ఆ ప్రదర్శనలో ఏకమై, లీనమై తాదాత్మ్యం చెంది ప్రేక్షకులు రసాస్వాదన చేసి పునీతులవుతారు. సత్యభామ పాత్ర చేయడం నాకు గర్వకారణం. నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది- అని అంటారు ఆచార్య అలేఖ్య.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి