S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాముడి బారి నుండి తప్పించుకున్న వైనం రావణుడికి చెప్పిన మారీచుడు (అరణ్యకాండ)

‘విశ్వామిత్ర యాగ రక్షణ సమయంలో రామచంద్రుడు యుద్ధ రంగంలో అందరినీ చంపి నన్ను ప్రాణాలతో ఎందుకు విడిచాడో కారణం తెలియదు. బతికి వుండడం మాత్రం తెలుసు. ఇది పాత సంగతి. కొత్తగా ఇటీవల జరిగిన కథ చెప్తా సావధానంగా విను. రాముడితో దెబ్బతిన్న నేను దండకారణ్యంలో గర్వంతో తిరుగుతూ క్రూరంగా ప్రవర్తించేవాడిని, తపస్వుల సమూహాలను తన్ని వాళ్ల నెత్తురు తాగుతూ, వారి మాంసం తింటూ, అధర్మ మార్గంలో వొళ్లు తెలియకుండా తిరుగుతుంటే ఒకనాడు, ముని వేషంలో వున్న రామచంద్రుడు, పరమ పతివ్రత అయిన సీత, లక్ష్మణుడు ఒకేచోట కనిపించారు. అప్పుడు రామచంద్రుడిని పొడవడానికి పోయాను దగ్గరికి. ఆయన నావైపు చూసి, చాపం ఎక్కుపెట్టి, వజ్రం లాంటి మూడు బాణాలను విడిచాడు. ఆ బాణం వేగం తెలిసిన వాడిని కనుక ముందే పరుగెత్తాను.’
‘రామచంద్రుడి బాణాలు వెనుక వైపు నుండి తగలవు కాబట్టి నేను బ్రతికిపోయాను. నా వెంట వచ్చిన వారిద్దరూ ఆ బాణాలు తగిలి చనిపోయారు. రామచంద్రుడిని ఎదిరించి బతకడం ఎవరికీ సాధ్యం కాదు. అలా బతికిపోయిన నేను, ఇంకా అలానే తిరుగుతుంటే చంపుతాడనే భయంతో, ఆనాటి నుండి ఈ ప్రదేశంలో గర్వహీనుడనై, యోగాభ్యాసం చేస్తూ, మునిలాగా వున్నాను. ఆ శ్రీరాముడిని మనసులో అనుకున్నా నేను పడే పాట్లు నాకే తెలుసు. రావణా! చెట్టు చెట్టులో శ్రీరాముడే పెద్ద విల్లు పట్టుకొని, నారచీరెలు, జింక చర్మం ధరించి, పాశం పట్టుకున్న యముడిలా కనిపిస్తున్నాడు. ఒక్కచోట ఒక్క రాముడు కనిపిస్తే అలా అనుకోవచ్చు. ఎల్లవేళలా, వేలాది మంది రామచంద్రమూర్తులు, నాకు కనిపిస్తుంటారు. అడవంతా రామమయంగా కనపడుతున్నది. ఇంద్రజాలం అంటావేమో? రాముడు లేని దూర ప్రదేశానికి పోయి వుందామంటే అక్కడా ఆయనే కనపడుతున్నాడు. పగలు, రాత్రి, కళ్లు మూసుకున్నా, తెరిచినా రాముడే కనపడుతుంటే అరుచుకుంటూ లేస్తాను. ఆ కారణాన నిద్ర అనేది లేకుండా పోయింది. నేనేం చేయాలి?’
‘రాముడిని చూసి భయపడడం అలా వుంచితే, ఆయన పేరు వింటేనే భయం కలుగుతున్నది. రాముడి పేరే కాదు... ‘ర’ కారంతో మొదలైన ఏ శబ్దం, రత్నం, రథం లాంటివి విన్నా రాముడే వస్తున్నాడని భయం కలిగి మనసు కలవరపడుతున్నది. రావణా! రామచంద్రుడి మీద విరోధం మానుకో. యుద్ధంలో నువ్వు ఆయనకు సమానుడివి కాదు. నీ శక్తి నాకు తెలుసు. ఆయన శక్తీ నాకు తెలుసు. ఆయన ఎవరినైనా వధించగల శక్తిమంతుడు. నీకు శక్తి వుంటే, నువ్వే పోయి ఆగ్రహంతో యుద్ధం చేయి. బలం లేకపోతే, అయిందేదో అయింది.. ఏం చేయలేమని, బంధువుల మరణం సహించి వూరుకో. మీ ఇద్దరి మధ్య నా ప్రాణం తీయాలని ఎందుకు ఆలోచిస్తావు? ఆ రెండిటిలో ఒకటి చేయి కానీ దొంగతనం చేయొద్దు. ఇంకా నేను కొన్ని రోజులు బతికి భూమీద వుండడం నీకు ఇష్టమైతే ఆ సీతాపతి కథ నాతో చెప్పవద్దు. నా తలపొయ్యే పనౌతుంది. అనేక మంది సాధువులు వాళ్లు ధర్మాత్ములైనప్పటికీ, ఇతరుల దోషం వల్ల నశిస్తారు. అలాగే, నేను నువ్వు మతిమాలి చేసే పనివల్ల చెడిపోతాను. ఇది నిజం. నీ వెంట రాను. ఈ విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నన్ను వదిలిపెట్టు.’
‘రామచంద్రమూర్తి అసమాన బలాతిశయుడు. దృఢమైన తేజస్సు కలవాడు. అధికమైన గర్వం, మనోదార్థ్యం, శరీర బలం కలవాడు. ఇలాంటి వాడిని రాక్షస జన నాశకుడిగా ఎందుకు చేస్తావు? అడవిలో వారంతట వారు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని, ఒకరి పేరు ఎత్తకుండా ఉంటుంటే, మన శూర్పణఖ పొగరుబోతు తనంతో ఏమని బెదిరించడానికి పోయింది? అంతటితో ఆగకుండా ఖరాడులను యుద్ధానికి పురిగొల్పింది. వారంతా గుంపుగా పోయి యుద్ధం చేశారు. రాముడి చేతిలో చనిపోయారు. దీంట్లో రామచంద్రమూర్తి నేరం ఏముందో చెప్పు? బంధువుల మేలు కోరి, నేను చెప్పిన మాటలు నీకు చేదైతే, బంధువులతో, స్నేహితులతో, యుద్ధంలో చస్తావు.’
న్యాయంగా, పనికొచ్చే విధంగా చెప్పిన మారీచుడి హితవాక్యాలు, చావకోరేవాడు వైరాగ్యంతో ముందు నిరాకరించినట్లు, రావణుడికి రుచించలేదు. నీతియుక్తమైన, హితమైన మారీచుడి మాటలకు జవాబుగా ఆయన్ను చూసి రావణుడు నిష్ఠూరంగా మాట్లాడాడు.
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12