S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఎదిగీ ఎదగని మనుషులు’ విడుదల!

భెజవాడలో యిలా దిగానా? - ఇంటికి పోతూ వుంటే అదే కోతుల కంపు. నేను మద్రాసు వెళ్లి యించుమించు ఏడాదయినా పెద్ద మార్పు లేదు. బెజవాడ పరిసరాలు, కొండపల్లి వగైరా అంతా దట్టమయిన అడవులు -వాటి నిండా కోతులు. వాటిని పట్టి తెచ్చి వెదురుబద్దల బోనుల్లో బంధిస్తారు. ఇందులో ‘రిసెస్’ జాతి ఎర్రపిర్ర కోతుల్ని నిపుణులు వచ్చి ఎంచుకుంటారు. అమెరికాలో జరిగే వైద్య పరిశోధనలకి, యివి ప్రయోగ జంతువులు. ఈ కోతుల వేట, ఎగుమతీ అన్నీ ఎంతో మందికి - ముఖ్యంగా వెదురు బోనులు తయారుచేసే వారికి లాభసాటి వృత్తి అయిపోయింది. ఎగుమతి కంట్రాక్టర్లు తనకు పనికిరాని వానరాలని - అక్కడే; మా పీకల మీద, మా పేట మీద వదిలేసిపోయే వాళ్లు. ఈ కోతుల బెడద బెజవాడ ఒన్ టౌన్‌ని, ముఖ్యంగా మా వించిపేటని వెతలపాలు చేసి వదిలేసింది...
ఇంటి గుమ్మం ఎక్కేలోగా నాలో ‘స్మృతిలయలు’ పలకసాగాయి. ఢిల్లీ సైనిక్ సమాచార్ పత్రిక నుంచి గోవాడ సత్యారావు గారు - ‘మంచి కథ ఒకటి పంపండి’ అని ఉత్తరం రాశారు. అలా కోతీ - భీతీ (1960) కథ రూపు కట్టింది. ఇదే, నేను ఒకవేళ కథకుణ్ని కాకుండా ఒక జర్నలిస్టుని అయి వుంటే - ఫీచర్‌గా చేసి పత్రికలో వేసి, ప్రజాసేవ ఇంకా ఎక్కువగా చేద్దును కదా...! నా తలపులు అన్నీ సమాచార రంగం వేపు పరుగులు తీస్తున్నాయ్. ‘కోతీ - భీతీ’ కథ కోతులు పట్టే ఒక ‘ఖుద్దూస్’ కథ. ఓ పెంటయ్య వ్యధ.
2008, జనవరిలో ‘వార్త’ పత్రికల్లో - కథా ‘విహారం’ శీర్షికను నిభాయిస్తూ - విహారిగారు నా కథలని విశే్లషించాడు. ఆయన ప్రత్యేకంగా - కోతీ - భీతీ’ని ఉటంకిస్తూ - ‘వీరాజీ పాత్రలకు ‘ప్రాణ ప్రతిష్ఠ’ చేయగలడు’ అన్నాడు. కోతీ - భీతీ - కథకొక ఉన్నతాసనం వేస్తూ అన్న మాటలు ఇవి. 1960 నాటి ఈ కథ - కథకుల కొక శిక్షణ శిబిరం వుంటే - దానికొక ‘పెద్ద బాలశిక్ష’గా స్వీకరించి తీరాలి’ అన్నారు. ... ఇంటి గుమ్మంలో అమ్మ కనపడుతూనే ‘ఖుద్దూస్’ నన్ను దింపి, రిక్షా గంట కొట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఈ రిక్షావాలానే కోతుల ఖుద్దూస్ అవడం యాదృచ్ఛికం.
అమెరికన్ ఆసుపత్రి అంటేనే తెలుస్తుంది - సెంట్ ఏన్స్ ఆసుపత్రి అంటే తెలీదు. తమ్ముడు ఉల్లాసంగానే వుండి కోలుకుంటున్నాడు. తన తల క్రింద పెట్టుకున్న కవరు తీసి ఇచ్చాడు. అది హైదరాబాద్ కృష్ణా పత్రిక వీక్లీ నుంచి వచ్చింది. (ఈ పత్రిక పిరాట్ల వేంకటేశ్వర్లుగారి పత్రిక కాదు. దాన్ని 1982లో ఆయన కొనుక్కున్నారు.)
‘మీరడిగినట్లు మీ నవల వ్రాతప్రతిని రైల్వే పార్సిల్‌గా పెట్టేసి పంపేస్తున్నాం. పోయి తెచ్చుకోండి’ అన్నది ఉత్తరం యొక్క సారాంశం. పోయినేడాది, మే నెలలో, రామ్మోహన్‌గారు ‘నన్నట్టుకుపోయి’ - జామ్ బాగ్ - హైదరాబాద్ - కృష్ణా పత్రికలో యిప్పించిన - ‘ఎదిగీ ఎదగని మనుషులు’ నవల ఏడ్నెల్ల తర్వాత ఇలా లకోటా అయింది.
మా ఇద్దరి మొహాలూ వికసించాయి. అప్పుడే ఎడిటర్ శర్మగారు దీన్ని సీరియల్‌గా మొదలెట్టాలనుకున్నారు. ఆ సంగతి మంజుశ్రీ రాశాడు. మహీధర రామ్మోహన్ గారికి ఏనాడో కబురు కూడా వచ్చింది. కానీ, అట్లా జరగలేదు. పూజ్యులు విశ్వనాథ సత్యనారాయణ గారు అడ్డం పడ్డారు. పాపం! నిజానికి ఆయన ఏ పాపమూ ఎరగరు. కాకపోతే - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ అన్న నవలని కృష్ణా పత్రిక సీరియల్‌గా వెయ్యమని పంపారు. అంతే. ‘వీరాజీని ఆపి విశ్వనాథ వారిని బజారులోకి ముందు వదిలితే అభ్యంతరం ఉంటుందా?’ అని మహీధర వారికి, నాకూ కూడా కబురెట్టారు ఎడిటర్‌గారు. ‘అలాగా ‘ఎదిగీ ఎదగని మనుషులు’ కృష్ణా పత్రిక కార్యాలయంలో - కునుకు తీశారు. అయితే, చెప్పానుగా, నేను విశాలాంధ్ర నుంచి ‘వ్యర్థం నుంచి అర్థం’ - చేద్దామనుకుంటూ - ‘టాస్’ వార్తా సంస్థ వారి బులిటెన్స్‌ని తెచ్చుకుని వాటి వీపుల మీద - నా నవలలు రెంటిని వ్రాశాను. అవి బండ కాగితాలు. కాలపరీక్షకి నిలవలేక, అక్షరాలు వెలిసిపోయి - మసకమసగ్గా కనబడ్డాయిట! అందుకని వ్రాత ప్రతి అంతా ‘సాపు’గా రాసి, చిన్నచిన్న పొరపాట్లు దిద్దుబాటు చేసి పంపాలి. అంతా ‘టూ వీక్స్’లో కావాలి - విష్ణు శర్మగారు దుకాణం కట్టేసుకుని వెళ్లిపోతున్నారు - వీరాజీగారి ‘నిశానీ’ దిగాలి’ అన్నది ఆ ఉత్తరం సారాంశం.
‘చచ్చింది గొఱ్ఱె’ అన్నాడు మా వాడు.
ఐతే, మరో మాటుంది ఉత్తరంలో.
(శ్రీపతిగారే కార్డు రాశారు అనుకుంటాను - యాదస్తు లేదు) అదేమిటంటే - ‘నవలని, మూడు వారాలకు ‘చాలినంత ‘సాపు’ ప్రతి చేసి పంపు. ఆనక ‘కిత్తాల’ వారీగా పంపాలి మిగతాది. అభాసు కాకుండా వ్రాతప్రతి క్రమంగా అందుతూనే వుండాలి. అదీ షరతు’ అంటూ, అక్కడి నుండి అంగీకారం కూడా అందింది. ‘లక్కీ’గా, కాళిదాసుగారి ‘హుకుమ్‌నామా’ కార్డు కూడా రాలేదు. అట్లా - ‘ఎదిగీ ఎదగని మనుషులు’ - పత్రికలో పడ్డారు. అలాగే, ‘వీక్లీ’లో - నా తొలి సీరియల్ మొదలైంది. ఇది, ఆంధ్రపత్రికలో నేను చేరాకా కూడా వస్తూనే వుంది. పూర్తిగా ఏడాది పాటు సీరియల్‌గా జనరంజనం చేసింది. (కథకి మొదట నేను పెట్టిన శీర్షిక ‘చలో హనీమూన్’) ఇది కథగా అచ్చయి వచ్చాక విజయ సాహితీ శిబిరంలో చదివాను - ఆ కథని.
తరుణ వయస్కురాలయిన కొత్త జంట, అమ్మ చిట్టెమ్మ ముఖ్య పాత్రలు. పెళ్లయిన వెంటనే- వంటింటికీ, పెరటికీ అంకితమై పోయి అత్తగారిని తప్పించుకుని - ‘ఆవారా - రుూవారా’ దొంగ ఆలింగనాలు చేసుకుంటూ - చప్పుడు చెయ్యని ముద్దులెట్టేసుకుంటూ - ‘ఫ్రస్టేట్’ అయిపోకూడదు - అంటుందీ కథ. ‘మా జీవితానికి సారె గదిలోనిదే రొమాన్సు’ (ఇది ‘ఆరుద్ర’గారి కొటేషన్) అన్నట్లుగాక - తిరుపతికో, శ్రీశైలానికో, మద్రాసుకో, కలకత్తాకో చెక్కెయ్యాలి కొన్నాళ్లు. కానీ, అత్తాకోడళ్ల మధ్య వైరుధ్య, వైవిధ్యాలను కొత్త మోడల్ సంసార పక్షంగా - బెజవాడ - తిరుపతి - వాల్తేర్‌ల మధ్య నడిపించాను. ‘శ్రీఖాకోళం’ కూడా వుంది.
‘దీన్ని నవల చెయ్యాలోయ్’ అన్నారు ప్రజాశక్తి పెద్దలు. ‘సంతర్పణ వంట’ నెత్తికెత్తుకుని బొమ్మరింటి ‘లక్కపిడతల వంట’ లాగా కథ రాశావోయ్’ అని కూడా అన్నారు. కొండపల్లి కోటేశ్వరమ్మ, తాపీ రాజమ్మ (తాపీ ధర్మారావుగారి కోడలు) పోలవరపు శ్రీహరిరావు గారి సతీమణి (పేరు జ్ఞాపకం రావటం లేదు) జనతా శాస్ర్తీగారు, పురాణం సూర్యప్రకాశరావు గారు - ఇలా అందరూ, ఈ ‘చలో హనీమూన్’ కథని నవలగా తీర్చిదిద్దమనే ‘యస్’లు కొట్టారు-
* * *
ఈలోగా, ఓనాడు సంధ్యకాంతులు సన్నగిల్లుతున్న సమయంలో వాకాటి పాండురంగారావు, అతనితోపాటు ఆంధ్రపత్రిక విలేఖరి రాజగోపాల్రావులు ఇల్లు వెదుక్కుంటూ వచ్చారు.
‘వీరాజీ! నేను వాకాటి పాండురంగారావుని. ఈ పెద్ద మనిషి ఆంధ్రపత్రిక విలేఖరి రాజగోపాలరావు. మిమ్మల్ని చూసి, మీ ఇల్లు చూద్దాం అనుకున్నాం. గానీ, ముందు మీ ఇల్లు చూసి, అంటే వెదుక్కొని మిమ్మల్ని కలిశాం’ అన్నాడు. గొప్ప స్పీడు ‘వాకాటిగారు’. అప్పుడే నా ‘తొలిమలుపు’ మీద ఆయన రివ్యూ - ‘స్నేహలత’ పత్రికలో వచ్చింది. రాజగోపాల్రావూ, ఆయనా కొన్నాళ్లు ప్రకాశం పంతులుగారి దినపత్రికలో కలిసి పని చేశారుట. అలా వాళ్లిద్దరూ ఫ్రెండ్సు. కబుర్లయినాక వాళ్లిద్దర్నీ ‘దుర్గ్భావాన్’ గాంధీనగర్ (ఆంధ్రపత్రిక కార్యాలయం)లోని ఆంధ్ర గ్రంథమాల అన్న బోర్డున్న మూల గదికి దిగబెట్టాను. వాళ్లిద్దరూ ఆ రూమ్‌లో క్యారియర్ విప్పుకొని అరిటాకులలో భోజనం చేశారు. కర్నూలు, ఢిల్లీ, విశాఖ, హైదరాబాద్‌లు అన్నీ ‘ఉద్యోగయానం’ చేసినా - వా.పా.రావుగారు నాకు లెటర్స్ రాయడం, నా రచనలు చదవటం, ప్రోత్సహించటం ఆపలేదు. అదంతా చెబితే ‘శానా’ అవుతుంది. కాబట్టి, ఓ ‘కామా’ పెడతాను.
* * *
నాన్నగారు మద్రాసు నుంచి వచ్చారు. అమ్మకి సుస్తీ చేసిందని.. అదృష్టవశాత్తూ త్వరలోనే కోలుకుంది. నాన్నగారు ఆంధ్రా సిమెంట్ కంపెనీ, తన ఆఫీసుకి ఓసారి వెళ్లి వచ్చారు. అప్పుడు (అటు తర్వాత ‘జ్యోతి రాఘవయ్య’గా వాసికెక్కిన గ్రేట్‌మ్యాన్) రాఘవయ్య గారికీ, సిమెంటు కంపెనీకీ ఏమి సంబంధమో నాకు తెలియదు గానీ, ఆయనా, మా నాన్నగారూ ఫ్రెండ్స్. ఏమనుకున్నారో, ఎలా జరిగిందో? జ్ఞాపకం రావటం లేదు గానీ - వి.వి.రాఘవయ్య గారు - నన్నూ, నాన్నగారినీ, నార్లగారి ఇంటికి తీసుకెళ్లారు.
నార్ల గారిని రచయితగా (‘కొత్తగడ్డ’ అనే నాటకాల సంపుటి నా దగ్గరుండేది) కూడా నేనెరుగుదును. ‘ఆంధ్ర సర్వస్వం’ గ్రంథంలో ‘విదేశీ వ్యవహారాలలో దిట్ట’ అన్న రైటప్‌తో నార్ల వారి సైడుపోజు బొమ్మ నాకిష్టం. ‘కమ్యూనిస్టువా అబ్బాయ్?’ అన్నాడాయన. నా ‘తొలి మలుపు’ బాగుందన్నారు. గోయంకా సంస్థకి గుడ్‌బై చెప్పిన కార్మిక పక్షపాతి నార్లగారు, ఆంధ్రజ్యోతిని వెలిగించి - ప్రభ జోరుని దెబ్బ తీయాలని చూస్తున్న తరుణంలో నాలాంటి కుర్రాడు వెళ్లి - కలుసుకుంటే - ఉద్యోగం కోసమేననుకుంటారు కదా? (ఈయనకి ఎంత ‘గర్ర’ అనుకున్నాను - అదేదో నాకు లేనట్లు)
రాఘవయ్య వేపు తిరిగి - నాతోపాటు విద్వాన్ విశ్వం కూడా కేమ్‌ఔట్’ అన్నారు. ‘నా కోసం ఉద్యోగం వదలుకుని వచ్చిన వాళ్లందరి గురించి ఆలోచిస్తున్నాను’ అన్నారు, నా వేపు, ‘నిరుత్సాహపడకు’ అన్నట్లు చూసి, ‘మళ్లీ కలుద్దువులే’ అన్నారు. నేనసలు ఆ కోణంలో ఆలోచించి, అక్కడికి పోలేదు కదా - కాస్త ‘కంగు’ తిన్నాను.
‘నేను మీ అభిమానిని సార్. మిమ్మల్ని చూడాలనీ...’ (అంటే, ‘నాట్ ఫర్ జాబ్’ అన్నట్లు పోజు పెట్టి) అంటూ నసిగాను. ‘సెలవు’ తీసుకున్నాం, ఓ గంట తర్వాత -
విద్వాన్ విశ్వంగారు ప్రభ వీక్లీ ఎడిటర్‌గా, నా కథలు అయిదారు వేశారు. ఆయన పెనే్నటి పాట (ఏదీ ‘పెన్న’ ఎదీ పెన్న? ఎదీ పినాకినీ.. నిదానించి నడు’ నాకు నచ్చింది) ఆయన డైలీకి ఎంత చేస్తారో?’ అన్నాను (పెద్ద ఆరిందాలా మాట్లాడకురా నాన్నా! ఆనందవాణి మీద మరేదయినా పత్రిక బెటర్ కదా?’ అన్నారు నాన్నగారు.
అట్లా అయింది నా అభిమాన జర్నలిస్టు నార్లగారితో నా మెమొరబుల్ ఎన్‌కౌంటర్! ‘గ్రేట్ ఎడిటోరియలిస్ట్’ ఆయన!
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com