S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషి గురించి మరింత..

వేటాడే మనిషికి పరుగుతోబాటు ఆయుధాన్ని విసరవలసిన అవసరం కూడా ఎదురయింది. ఒక వస్తువును చేతితో పట్టుకుని విసరడం ప్రైమేట్ జాతి జంతువుకు మాత్రమే వీలవుతుంది. కానీ చింపాంజీలు, ఒరాంగ్ ఉటాన్‌లు, కోతులకు ఒక వస్తువును విసరడానికి మనిషికి ఉన్న వీలు లేదు. చేతిని పైకి ఎత్తి గుండ్రంగా తిప్పి క్రికెట్ బంతిలాగ విసరడం వీటికి చేతకాలేదు. ఒకవేళ విసిరినా గురి కుదరదు. ఇక మనుషులు మాత్రం బల్లెం లేదా బల్లెం వంటి కర్రను, ఒక రాతిని చెయ్యి వెనుకకు తిప్పి భుజంపై నుండి బాగా పైకెత్తి బలంగా, సూటిగా ముందుకు విసర గలుగుతాడు. చెయ్యి నిర్మాణం, భుజంలోని కీలు అందుకు అనువుగా లేకుంటే ఈ ఒడుపు కలిగి ఉండేది కాదు. మిగతా జంతువులతో పోలిస్తే మన భుజం వేరుగా ఉంటుంది. చెయ్యి తిరిగే తీరు కూడా మరింత వెసులుబాటును ఇస్తుంది. ఇక చేతి మణికట్టు కూడా గుండ్రంగా తిరిగి వస్తువులను విసరడంలో మంచి మెళకువలకు తావును ఇస్తుంది.
మనిషి పరిణామంలో భుజం, చేతుల పాత్ర ఎంతో ఉందని పరిశోధకులు అంటున్నారు. ఈ చేతి కారణంగా మరొక జంతువును లేదా మనిషిని దూరం నుండే ఆయుధం విసిరి చంపడం మనిషికి చేతనయింది. ఇక దొంగచాటుగా చంపడం కూడా వీలయిందని సులభంగానే అర్థం అవుతుంది. ఈ విషయం సామాజిక పరిణామంలో గొప్ప బలంగా నిలిచింది అంటే ఆశ్చర్యం కాదు. బలం గల మనుషులతో వైరం పెట్టుకోకూడదు అన్నది మనిషికి అవసరంగా మారింది. కలిసి బతకడం మంచిది అన్న పద్ధతి మొదలయింది.
మన శరీరాన్ని బాగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అందులోని చాలా వివరాలు మనకు తెలిసినవే అయినా విశే్లషించినప్పుడు ఎదురయ్యే వివరాలు కొన్నిచోట్ల వింతగా కూడా కనిపించవచ్చు. కేవలం మెదడు వల్లనే మనిషి మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోగలిగాడు అన్నది మాత్రం సత్యం కాదు. మనిషి స్నానానికి శరీరం ఎంతో సాయం చేసింది. శరీరం తీరును కూడా గమనిస్తే మెదడు తీరు, మొత్తం మీద మనిషి తీరు మరింత బాగా అర్థం అవుతుంది.
శరీరంలోని కణాలు, కణజాలాలు కలకాలం కొనసాగవు. ఇవాళ తల మీద వున్న వెంట్రుకలు ఏనాటివి అని పరిశీలిస్తే వింత విషయాలు తెలుస్తాయి. మెదడులో కణాలు మాత్రం పుట్టిన నాటి నుంచి చివరి వరకు కొనసాగుతాయి. హిప్పొకాంపస్ లాంటి భాగంలో తప్ప మెదడులో కొత్త కణాలు పుట్టడం చాలా అరుదు.
తల మీద వెంట్రుకలు ఆరు నుంచి ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువకాలం కొనసాగవు. ఈ వెంట్రుకలు ప్రతి నిత్యం అర మిల్లీమీటరు వంతున పెరుగుతాయి. శరీరం మీద మిగతా భాగాలలో ఉండే వెంట్రుకలు అందులో సగం వేగంతో పెరుగుతాయి. కనురెప్పల చివరన ఉండే వెంట్రుకలు రెండు నెలలకు ఒకసారి కొత్తవి పుడతాయి. ఇలాంటి వివరాలు మరెన్నో గమనించదగినవి ఉన్నాయి.
కొన్ని లక్షణాల కారణంగా ప్రపంచంలోని ప్రతి మనిషిని ప్రత్యేకంగా గుర్తించవచ్చు అనుకున్నాము. మరి కొన్ని లక్షణాలు చాలామందిలో ఒకే రకంగా ఉంటాయి. కనుక వాటిని మనం అంతగా పట్టించుకోము. మన శరీరం మన అదుపులో ఉంది అన్న భావన మనిషికి నిండుగా ఉంటుంది. కానీ ప్రశాంతంగా కనిపించే ఈ శరీరంలో పట్టు తప్పే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. చాలా సందర్భాలలో అవి మనలను ప్రమాదాలకు, అవమానాలకు గురి చేస్తాయి. ఉదాహరణకు గాలి వదలడం గురించి చెప్పుకోవచ్చు. ముల్లా నస్రుద్దీన్ ముఖం చాటు చేసే పేరున తన ఊరు వదిలి వెళ్లాడు. చాలాకాలం తరువాత తిరిగి వచ్చాడు. తెలిసిన వారు ఎవరూ కనిపించలేదు. తను వెళ్లి చాలాకాలం అయిందని అర్థం అయింది. అతను ఒక కుర్రవాడిని పిలిచాడు. కుటుంబం గురించి అడిగాడు. తెలిసిన వాళ్లే అనిపించింది. నీ వయసు ఎంత అని అడిగాడు. ‘నస్రుద్దీన్ మసీదులో గాలి వదిలినప్పుడు నేను పుట్టానట’ అన్నాడు కుర్రవాడు. అపానవాయు ప్రయోగం గురించి అంతగా పట్టించుకోను అవసరం లేదని మన అభిప్రాయం. అలాగే ఎక్కిళ్లు, దురద, ఆవులింతలు లాంటి మరెన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ మనకు అనుభవంలో ఉన్నవే. అయినా వాటి వెనుక విచిత్రమయిన వివరాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యం తప్పదు. రామాయణంలో లక్ష్మణుని ఆవులింత గురించి చెపుతారు. అడవిలో ఉన్నంతకాలం ఆయనకు నిద్ర ధ్యాసే లేదట. పట్ట్భాషేకం ముగిసిన తర్వాత ఆవులింత వచ్చి నిద్ర కూడా వచ్చిందంటారు. ఇక ఎక్కిళ్లు, దురద సంగతి ఎన్నో కథలకు ఎక్కింది. అయినా పరిశోధకులు మాత్రం వాటిని పట్టించుకున్న ఆధారాలు కనిపించవు. మామూలు విషయాలను పట్టించుకోవడం పద్ధతి కాదు అనుకున్నారు. నిజానికి మానవ శాస్త్రం అనే ఆంత్రోపాలజీలో సామాజిక లక్షణాలతోపాటు మనిషి శరీర లక్షణాలను పరిశీలించే పద్ధతి ఉన్నది. ఒడ్డు, పొడుగు, కదలికలు, తల వంటి వివరాలను ఈ రంగంలో పరిశీలిస్తారు. నిజానికి ఇవన్నీ వైజ్ఞానిక పరిశోధనల కిందికి రావు అనుకోవడం యూనివర్సిటీ స్థాయిలో కూడా జరిగింది. కనుక ఈ శాఖ కొన్ని చోట్ల సామాజిక శాస్త్రాలతో బాటు ఉండేది. కనీసం ఇటీవలి కాలంలోనయినా మన ప్రవర్తనలోని కొన్ని అంశాలను గురించి పరిశీలనలు అంతగా జరిగినట్టు లేదు. మొత్తానికి మనిషి తీరును అర్థం చేసుకోవడానికి మరింత పరిశీలన అవసరం అని తేలిపోయింది.
ఆవులింత గురించి ప్రసక్తి వచ్చింది. కానీ దాన్ని అక్కడే వదిలేశాము. కానీ ఆవులింత అంత ఆషామాషీ సంగతి కానే కాదు. నిద్రకు ఆవులింత ఒక సూచన అన్నారు. ఆక్సిజన్ తక్కువయితే ఆవులింత వస్తుంది అన్నారు. నోరు పెద్దదిగా తెరిచి గాలిని పీల్చి వదలడం అన్న ఈ ప్రక్రియ వెనుక ప్రయోజనం ఏమిటో తెలియదు. కానీ అందరము అదుపు లేకుండా ఆవులించిన వాళ్లమే. పైగా ఆవులింత అంటువ్యాధిలాగ పక్కనున్న వారికి కూడా సోకుతుంది అని మానవ సమాజాలు అన్నింటిలోను అనుభవం మీద తెలుసుకున్నారు. ఎదుట ఉన్న మనిషి ఎవరయినా ఆవులిస్తే అప్రయత్నంగా అక్కడి వారు అందరు ఆవులించడం మొదలవుతుందట. ఇది నిజానికి నాడులకు సంబంధించిన విషయం. కళ్లు చికిలించి, నోరు పెద్దదిగా తెరిచి, గాలిని గట్టిగా పీల్చుకుని ఒక్కసారిగా వదులుతున్న మనిషిని చూస్తే మనకు అనుకోకుండానే కళ్లు మూసుకుపోతాయి. నోరు తెరుచుకుంటుంది. ఈ మాటలు చదువుతున్న మీరు బహుశా ఆవులిస్తున్నారేమో! ఆవులింత గురించి మాట్లాడినా, విన్నా, చదివినా, చివరికి ఆలోచించినా ఆవులింత పుడుతుందట! పరిశోధకులు తమ ప్రయత్నంలో భాగంగా కొంతమందికి ఆవులింత వీడియోలు చూపించారట. అందులో చప్పుళ్లు లేవు. అయినా సరే చూచిన వారిలో సగానికి సగం ఆవులించారట. అది కూడా అయిదు నిమిషాల లోపలే జరిగింది. ఆవులించని వారు కూడా తమకు ఆ భావన కలిగిందని ఒప్పుకున్నారు.
మనిషి కాక మరికొన్ని జంతువులలో కూడా ఆవులింత పద్ధతి ఉంది. చింపాంజీలు, కుక్కలు ఆవులించడం మామూలుగా గమనించవచ్చు. మనిషి తల్లి కడుపులో ఉండగానే ఆవులింతలు మొదలవుతాయట. అయితే ఒకరిని చూచి మరొకరు ఆవులించడం నాలుగు, ఐదు సంవత్సరాల వయసు నుంచి మొదలు అవుతుందని గమనించారు.
అప్పటికి పిల్లలకు తమ సంగతి, ఎదుటి వారి సంగతి అర్థం చేసుకునే శక్తి కలుగుతుంది. నాడీ మండలంలో, శరీరంలో ఈ ప్రక్రియ వలన ఉండే ప్రయోజనాలు, కలిగే మార్పులను గురించి ఇవాళటికి కూడా వివరం తెలియదు. అయితే ఆవులింత వచ్చిందంటే అది మనలను వివశులను చేస్తుంది. దాన్ని ఆపడానికి అసలు వీలు ఉండదు. మనుషులు గుంపుగా బతకడం మొదలయిన తరువాత ఒకరి వల్ల ఒకరికి ఇటువంటి ప్రభావాలు కనిపించి గుంపులో ఒక రకమయిన ఐక్య భావం కలిగి ఉంటుంది. అందరం ఒకే రకం వాళ్లము అన్న భావన చెప్పకుండానే తెలిసి ఉంటుంది. ఆవులింతకన్నా ఆసక్తికరమయిన మరొక సంగతి దురద. మన పాత పుస్తకాలలో ఎక్కడయినా దురద గురించిన ప్రసక్తి ఉందేమో తెలియదు. డాంటే రాసిన ఇన్‌ఫెర్నో అనే గ్రంథంలో మాత్రం గోకుడు అనే దురద గురించి చక్కని ప్రసక్తి వస్తుంది. ఇంతకూ గోకుడు ఎందుకు, దురద అంటే ఏమిటి? తెలుసుకున్న తరువాతే మన చర్చ ముందుకు సాగాలి. శరీరానికి పై తొడుగుగా చర్మం ఉంది. బయటి నుంచి వచ్చే అన్ని అఘాతాల నుంచి అది లోపలి భాగాలను కాపాడుతుంది. శరీరపు ఆకారాన్ని, అందాన్ని నిలబెడుతుంది. ఇక పురుగులు, పువ్వులు, ఇతర వాతావరణ విశేషాల కారణంగా చర్మానికి ఏదో అసౌకర్యం జరుగుతుంది. అది జరిగిన చోటు మెదడుకు తెలియడానికి ఈ గోకుడు అన్నది ఒక హెచ్చరిక. ఇక చేతులు పనిలోకి కదులుతాయి. దురద పుట్టిన చోట గోకుతాయి. అసౌకర్యానికి కారణమయిన పదార్థాలను బయటకు పంపించడానికి అది ఒక ప్రయత్నం. అయితే దురద అన్నది చర్మానికి మాత్రమేనని, లోపలి భాగాలకు లేదని మనకు సులభంగానే అర్థం అవుతుంది. సరిగా ఉడకని చేమ దుంపను తింటే నోటిలో కొంత దురద వస్తుంది కానీ, కడుపు పట్టించుకోదు.
గజ్జి, తామర, సోరియాసిస్ వంటి పరిస్థితి మరింత లోతుకు వెళుతుంది. వాటికి కారణమయిన క్రిములు కూడా చర్మానికి అసౌకర్యం కలిగిస్తున్నట్టే లెక్క. కనుక అక్కడ కూడా దురద ఉంటుంది. దురద ఉన్న చోట గోకుడు కూడా ఉంటుంది. కొంతమందికి థైరాయిడ్ లోపం, చక్కెర లోపం కారణంగా కూడా చర్మం పొడిబారి దురద మొదలవుతుంది. నొప్పి పెరిగితే దురద తెలియదు. కానీ దురద మాత్రమే ఎక్కువగా ఉంటే, గోకుడు ఎక్కువ అవుతుంది. చర్మానికి హాని జరుగుతుంది. అయినా సరే, కొంతకాలం పాటు అసౌకర్యం తెలియకుండా పోతుంది. కానీ, గోకినందుకు దురద పెరుగుతుంది. మళ్లీ గోకాలని అనిపిస్తుంది. ఈ రకంగా దురద, గోకుడు ఒక క్రమంగా కొనసాగుతాయి. ఆవులింతలాగే దురద కూడా ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. మరెవరో గోడుతుంటే, కేవలం చూచిన మనకు కూడా గోకాలి అనిపిస్తుంది. దురద గురించి చెపుతుంటే చాలు, మనకూ దురద పుడుతుంది. చివరకు దురద కలిగించే పురుగు బొమ్మ చూపించినా తెలియకుండానే చాలామంది గోకడం మొదలుపెట్టారు. ఈ రాసిన నాలుగు అక్షరాలు చదువుతుంటే మీకు గనుక దురద పుడితే ఆశ్చర్యం లేదు. దురద కూడా పరిణామ క్రమంలోని ఒక ముఖ్యమయిన అంశం. పక్కవారు దురదతో గోకుతారు. వారి దురదకు కారణం మన మీదకు కూడా వచ్చే వీలు ఉంటుంది. కనుక మనం ముందే గోకుతాము. ఇక అప్పుడు ఆ కారణమేదో వచ్చే పరిస్థితి తగ్గుతుందేమో! మొత్తానికి తీటగల భాగ్యశాలికి గోకుడు కన్నా గొప్ప సుఖం లేదు అన్న మాట ప్రపంచంలో అంతటా ప్రచారంలోకి వచ్చింది.

-కె.బి.గోపాలం