S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సత్తాలేని దినములు వచ్చెనా?

1948 జనవరి 31వ తేదీ, భారతజాతి నివ్వెరబోయిన రోజు, విషణ్ణ వదనాలతో చింతాక్రాంతమైన రోజు. ‘జాతిపిత’ మహాత్మాగాంధీ బిర్లా మందిరం నుండి ప్రార్థన ముగించుకుని వస్తూండగా ఒక అజ్ఞాత వ్యక్తి అమాంతం ఎదురుబడి మహాత్మునికి నమస్కరించిన ఉత్తర క్షణంలో తుపాకీ కాల్పుల శబ్దంతో మారిపోయిన వాతావరణం. ‘హేరామ్’ అంటూ వౌనంగానే రోదిస్తూ నేలకొఱిగిన జాతిపిత. అదే రోజు సాయంత్రం 6 గంటలకు దావానలంలా వ్యాపించిన వార్తను అధికారికంగా ప్రకటించిన రేడియో.
మహాత్ముడి పార్థివ దేహ యాత్ర, కళ్లకు కట్టినట్లు ప్రత్యక్ష ప్రసారంగా సాగిన వ్యాఖ్యానం. ప్రతి అక్షరం, ప్రతి మాటా నిశితంగా చెవులకెక్కించుకున్న, బాధాతప్త హృదయాలతో గుండెలు బరువెక్కిన శ్రోతలు.
దేశ స్వాతంత్య్రం కోసం పరితపించి, పస్తులుండి లాఠీదెబ్బలు తిని చాలీచాలని బట్టలతో జీవితకాలమంతా గడిపిన మహాపురుషుడు.. వందలాది వేలాదిమంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి... కోట్లాది మందిని చైతన్యవంతుల్ని చేసిన ఒకే ఒక్కడు... అహింసా మార్గమే లక్ష్యంగా సాగిన ఆ చైతన్యమూర్తి జీవితం హింసతోనే ముగిసిందా? ఆవేదనా భరితమైన భావనలను తన మాటలతో పొదిగి సాగుతున్న వ్యాఖ్యానం వింటున్న శ్రోతలకు ఆ వ్యాఖ్యాత కాస్తా ఆత్మబంధువుగా తోచాడు. ఆత్మీయుడై పలకరిస్తున్న అనుభూతికి లోనయ్యారు.
తన అనునయింపు మాటలతో బాధాతప్త హృదయాలను శాంతపరుస్తూ సాగిన ఆ వ్యాఖ్యాత ‘మెల్‌వెల్ డిమెలో’ (1913-1989). మాటకున్న శక్తి ఏమిటో ఎంతో నిరూపించినవాడు.
ఎక్కడో జరిగిన దానిని మన కళ్ల ముందు జరిగినట్లుగా, దర్శించిన అనుభూతిని ఆవిష్కరించగలిగిన వాచస్పతి.. డిమెలో. ఆయన అడుగుజాడల్లో నడిచిన రామానుజ ప్రసాద్ సింగ్, వినోద్ కాశ్యప్, సుశీల్ ఝవేరీ, విజయ్ డానియల్ లాంటి న్యూస్ రీడర్స్‌తో సాటి మరెవ్వరూ లేరు. అదంతా గత వైభవం. రేడియో వార్తలకు ఒక ఠీవినీ, దర్జాను, దర్పాన్నీ కలిగించిన వాచస్పతులు (రీడర్స్) ఈ వేళ లేరు. చవులూరించేలా చదవగల సుస్వర బేహారులు లేరు. సాధికారిత ప్రస్ఫుటమయ్యే విధంగా వార్తలు చదివేవారు లేరు. వంటింట్లో కూరలు తరుగుతూ పక్కింటావిడతో కబుర్లు చెప్తున్నట్లుగా వార్తలు చదివేవారు కొందరు, ఎంతో కష్టపడి సేకరించిన వార్తలు మీరు వినకపోతే ఎలా? అని బ్రతిమాలుతూ, వార్తలు చదివేవారు మరికొందరు. వారు చదివే వార్తల సారాంశం వారికే అర్థంకాక, సమన్వయం లేక మొక్కుబడిగా చదివేది మరికొందరు. అజమాయిషీ చేయలేని అశక్తతతో అధికారులు భాషాపరంగా ఉచ్చరించే మాటల్లో దోషాలు. రేడియో ఒకప్పుడు ఆత్మబంధువు. వివిధ కళారూపాలకు నిలయం. కవులకూ కళాకారులకూ నెలవు.
కానీ మన కళ్లెదుటే నెమ్మదిగా ఈ రేడియో ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవస్థ.. పైకి మేడిపండు. వ్యవస్థాగత లోపాలతో కునారిల్లుతోంది.
దీన్ని పట్టించుకునే నాథుడు లేడు. తామునిగిందే గంగ, తా వలచిందే రంభ’ చందంలా ప్రసార మాధ్యమంపై పట్టులేని వారూ, బొత్తిగా అవగాహన లేనివారు కొత్తగా వచ్చి చేరుతున్నారు. పదోన్నతులతో తృప్తి చెందిన పాత వారు పరిపూర్ణ జ్ఞాన సంపన్నులమనుకుంటూ ఉన్నతులమనే భ్రమలో వున్నారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి తయారయ్యే సినిమా ప్రజా సంబంధం కలిగి ప్రజల ఇష్టాయిష్టాలతో ముడిపడి వున్నదే. నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు. నచ్చితే నెత్తికెక్కించుకుంటారు. రేడియో కూడా దీనికి మినహాయింపు కాదు. ఇష్టం లేకపోతే వినరు.
కేవలం వినోదం కోసం తయారయ్యే సినిమాల కోసం పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌తో బాటు ఎందరెందరో సాంకేతిక నిపుణులు, ఒకరేమిటి? మొత్తం అందరికీ జవాబుదారీతనం ఉంటుంది. ఈవేళ రేడియో ప్రసారాల్లో ఈ జవాబుదారీతనం కనిపించటం లేదు. పెట్టుబడి మాత్రమే మిగిలింది. ప్రజల కోసం, ప్రజల మధ్య బతికే ఈ ప్రసార మాధ్యమంలో, యాంత్రికత ప్రవేశించింది. అలసత్వం ఏర్పడింది. సృజనాత్మకత లేదు. నాలుగు సినిమా పాటలు వినిపించేసి, ఏవేవో కబుర్లు చెప్పేస్తే గడిచిపోతుందనే ఆత్మవిశ్వాసం పెరిగింది. రేడియో కేంద్రాల్లో ఇప్పుడు చాలా వరకూ సంగీత సాహిత్యాల గురించి మాట్లాడుకునేవారు దాదాపు మృగ్యం. కళాకారుల రాకపోకలు రెండూ లేవు. ప్రజ్ఞానిధులైన కళాకారులను పిలిచే ఆర్థిక స్తోమత లేదు. వనరులు లేవు. ఈ దౌర్భాగ్యం రేడియోకే పరిమితం కాదు. ప్రజలతో సంబంధం కలిగిన దూరదర్శన్ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సంస్థలు సృజనాత్మకతా భావాలు లేని వ్యక్తుల వల్ల నీరసించిపోతున్నాయి. ఆర్థిక పరిపుష్టి లేక సతమతవౌతున్నాయి. సంగీత సాహిత్య రూపాలుగా పరిగణింపబడే విద్వాంసులు అన్యాక్రాంత మనస్కులై పదిలంగా ఉద్యోగాలు కాపాడుకుంటూ వచ్చి వెళ్లడమే పరమావధిగా కాలం గడుపుతున్నారు. సంగీత విలువలను, సంగీత విద్వాంసుల ప్రతిభను గుర్తించే అధికారులు లేరు.
ఎప్పటికప్పుడు కార్యక్రమాలలో వైవిధ్యాన్ని ఆశించే వారికి ఆర్థిక బలం లేకుండా అంగబలం వున్నా ఏమి ప్రయోజనం? ఒకప్పుడు ఆకాశవాణి ప్రజల మధ్యనే వుండేది. ఇప్పుడది చాలా దూరమై పోయింది. రేడియో మీద ఆధారపడవలసిన స్థితి దాటిపోయి రేడియో ఉనికే ప్రశ్నార్థకమై కూర్చుందంటే ఆశ్చర్యం లేదు. సంజీవని లాంటి సెల్‌ఫోన్స్ ప్రధాన కారణం. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రధాన రేడియో కేంద్రాలలో నియమితులైన కొందరు నిలయ విద్వాంసులు చాలావరకూ సంగీతం మినహా ఇతర వ్యాపకాలతో మునిగి తేలుతున్నారు. సంగీత విద్వాంసునికి, ఆ వ్యాసంగమే కరువైతే, క్రమంగా సంగీతానికే అతని మనస్సు దూరమై స్తబ్దత ఏర్పడుతుంది. చాలా రేడియో కేంద్రాలలో నెలకొన్న పరిస్థితి ఇదే. కళా నిలయాలుగా వుండవలసినవి కళ తప్పకూడదు. కళావిహీనంగా కనిపించరాదు. వ్యవస్థలు బాగుపడాలంటే రావలసిన మార్పు వ్యక్తుల్లోనే. వాటిని ఆశ్రయించుకుని బతికే వ్యక్తులే వాటి కీర్తిప్రతిష్టలకు కారకులు.
తాము పనిచేసే వ్యవస్థను లేదా సంస్థను తక్కువచేసి మాట్లాడే వ్యక్తులకు గౌరవం వుండదు. నాటక శాఖలో బందా కనకలింగేశ్వర్రావు, బుచ్చిబాబు, స్థానం నరసింహారావు సంగీత శాఖల్లో డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, డా.ఈమని శంకరశాస్ర్తీ, సాహిత్య శాఖలో పింగళి లక్ష్మీకాంతం, జలసూత్రం, సంగీత సాహిత్యాల సవ్యసాచి బాలాంత్రపు రజనీకాంతరావు వంటి మేధావులు పని చేసిన రేడియో కేంద్రాల గత వైభవాన్ని ఈ తరం రేడియో అధికారులు లేదా ఆర్టిస్టులు మరిచారు.
1942 జులై 1వ తేదీన నేను రేడియోలో నిలయ కళాకారుడిగా చేరాను.(రచయిత). ఆనాటి కార్యనిర్వహణాధికారులకు వ్రాత పనులు చేసిపెట్టేవాణ్ని. ఆ తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మారాను. ఆ మొదటి పదేళ్లలో మద్రాసు కేంద్రం నిర్వహించిన డైరెక్టర్లను, వారి పరిపాలనా పద్ధతులూ, సామర్థ్యమూ, వ్యక్తిగత విశిష్ట చాతుర్యమూ, సమర్థతలు చూస్తూంటే విలక్షణ వ్యక్తులుగా ఎంతో ఎత్తుగా పైకి తలెత్తి చూడవలసిన వాళ్లుగా కనిపించేవారు. అటువంటి డైరెక్టర్ కుర్చీలో నేనూ కూర్చుని, వివిధ శాఖలనీ, అందులోని కళాకారులనీ రచయితలనూ, నా పూర్వపు డైరెక్టర్ల మాదిరిగా నడుచుకుంటూ సమర్థవంతంగా నిర్వహించ గలుగుతాననే ‘ఆశ’ ఏ కోశానా వుండేది కాదని అంటూనే రేడియో మహర్దశకు కారణమై చక్కని దిశా నిర్దేశం చేసి ఆకాశవాణి వైభవాన్ని ఇనుమడింప చేసిన కళాప్రపూర్ణుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారి వంటి సృజనాత్మక ప్రజ్ఞా దురంధరుల అనుభవాలు నేటి ఆకాశవాణి అధికార, అనధికార గణానికి స్ఫూర్తిదాయకాలు.

- మల్లాది సూరిబాబు 90527 65490