S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-3

3
‘ఓ చిన్న క్లూ ఇద్దామని?’ నవ్విందామె. ఆమె నవ్వు అతనికి ఉత్సాహాన్నిచ్చింది.
‘చెప్పండి. ఏవిఁటా క్లూ?’ అన్నాడు ఉత్సాహంగా.
‘చిన్న క్లూయే అనుకోండి. కానీ అది మీకు చాలా ఉపయోగపడవచ్చు. సింగపడవి గుళ్లోని దోపిడీ, ఎవరో ఎక్కడ్నుంచో వచ్చి చెయ్యలేదు. ఆ పరిసరాల్లో తిరుగుతూ, ఆలయపు రహస్యాలన్నీ తెలిసిన వాళ్లే చేశారు. ఆ రూట్‌లోనే పరిశోధన సాగించండి’ అంటూ ఫోన్ పెట్టేసిందామె.
ప్రతిమలా అయిపోయాడు ప్రభు.
వెంటనే తేరుకుని చంద్ర దగ్గరకెళ్లి ‘క్లూ’ విషయమంతా చెప్పేశాడు.
‘నిజమా?’ అప్రయత్నంగా లేచి నిల్చున్నాడు చంద్ర.
‘అవును సర్. ఆవిడెవరో చాలా తెలివిగలదిలా ఉంది. ఆమెని గురించి ఎంక్వైరీ చేసినట్టు కూడా కనిపెట్టి వార్నింగ్ ఇచ్చింది కూడా!’ అంటూ ఇద్దరికీ మధ్యన జరిగిన సంభాషణ అంతా చెప్పాడు ప్రభు.
‘అయితే ఈ దోపిడీ ఆ పూజారే చేశాడంటావా?’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు చంద్ర.
‘ఛఛ! ఆయన చేసుండడు. కానీ అక్కడికి తరచూ వచ్చేవాళ్లెవరైనా చేసినా, ఎవరెవరొస్తారో, ఎవరికంత అవకాశం ఉందో తెలుసుకుని ఆ రూట్‌లో పరిశోధించాలి. ఆ విషయం అడుగుదామంటే ఇంకా ఆ పూజారిగారు షాక్‌లోనే ఉన్నాడు’ అన్నాడు ప్రభు.
‘పోనీ ఆయన కూతుర్ని అడిగితే?’ అన్నాడు ప్రభు. గౌతమిని గురించి విన్నాడతను.
‘అదే ప్రయత్నిస్తున్నారు మన పోలీసులు.’
ఇద్దరూ ఏవో చర్చించుకుని హోమ్‌మినిస్టర్‌కి ఫోన్ చేశారు. అందరూ కలిసి గుసగుసలాడుకున్నారు. చివరగా-
‘మీరేం వర్రీ అవకండి సార్! ఆ నిధి దేశం దాటకుండా తగిన ఏర్పాటు చేయించేశాను. ఇవాళ కాకపోతే రేపైనా ఆ దొంగలు నగలతో సహా దొరికి తీరుతారు’ అంటూ చంద్రకి హామీ ఇచ్చాడు.
‘ఈ దోపిడీ గురించి ఇన్ని వివరాలు చెప్తోందంటే ఆ ‘క్లూ’ ఆ పరిసరాల్లోనే ఉండి ఉంటుంది’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు చంద్ర.
‘పోనీ ఇంతకు ముందు వచ్చిన ఫోన్‌కాల్ ఎక్కణ్నించి వచ్చిందో తెలుసుకుందామా?’ అన్నాడు ప్రభు.
‘వద్దు’ గభాల్న అన్నాడు చంద్ర.
* * *
ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే సింగపడవి పరిసరాలు, ఇప్పుడు వచ్చిపోయే పోలీసులతోనూ, మీడియా వాళ్లతోనూ, ఇతర జనాలతోనూ కిటకిటలాడిపోతోంది.
ఆ రోజు పూర్తిగా తెల్లవారకుండానే ఎస్.పి. శంకరయ్య గారింటికొచ్చేశాడు తన బృందంతో సహా. తండ్రికి ఏదో మందు వేస్తున్న గౌతమి, ఎస్.పి.ని చూసి విష్ చేసి ఆహ్వానించి కూర్చోబెట్టింది.
‘నాన్నగారెలా వున్నారు?’ అన్నాడు ఎస్.పి. సంభాషణ నాందిగా.
‘పర్లేదు సర్! కానీ ఎవరితోనూ పెద్దగా మాట్లాడటంలేదు’ అంది గౌతమి బాధగా.
‘తగిలిన షాక్ అలాంటిది. అవునూ.. ఈ ఆలయానికి సంబంధించిన వాళ్లు చాలామంది వస్తుంటారు కదా! మీకెవరి మీదైనా అనుమానం ఉందా?’ ఆమెనే పరిశీలనగా చూస్తూ అన్నాడు ఎస్.పి.
ఆమె తల అడ్డంగా ఊపింది.
‘కానీ.. ఈ ఆలయానికి సంబంధించిన వాళ్లే ఈ దోపిడీ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాదు, రాత్రి గుర్రాల మీద ఎవరో ఇటుగా వచ్చారని కూడా తెలిసింది’
‘గుర్రాల మీదా? ఏం నాన్నా?! రాత్రి గుర్రాలు వచ్చిన శబ్దం వినిపించిందా?’ అంది గౌతమి తండ్రికేసి చూస్తూ.
‘గుర్రాలు పరిగెడుతున్న చప్పుడు వినిపించిన మాట నిజమే. కానీ అలాంటి చప్పుళ్లు తరచూ వింటూనే ఉంటాంగా’ నీరసంగా అన్నాడు శంకరయ్య.
‘ఆ బ్లాక్ టైగర్ గుర్రాల మీద తిరుగుతూంటాడా?’ కాస్త ముందుకు వంగి కుతూహలంగా అడిగాడు ఎస్.పి.
‘అనే అంటారు. కానీ చూసినవాళ్లు లేరు’ భారంగా అన్నాడు శంకరయ్య.
‘ఆ బ్లాక్ టైగర్ వల్ల ఇనే్నళ్లుగా మీకెలాంటి ఇబ్బందీ కలగలేదా?’
‘లేదు’
‘సరే! ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పుడైనా వివరంగా చెప్పగలరా?’ అన్నాడు ఎస్.పి.
‘చెప్తాను. ఆ రాత్రి నేను గుళ్లో వుండగా హఠాత్తుగా ఏదో చప్పుడయింది. వెంటనే కరెంటు పోయింది. తర్వాత గన్ పేలిన చప్పుళ్లు, సెక్యూరిటీ వాళ్ల చావు కేకలూ వినిపించాయి. నేను హడలిపోతూ అటుకేసి పరిగెత్తాను. చేతుల్లో టార్చ్‌లతో నలుగురు ముసుగు మనుషులు కనిపించారు. వాళ్లందరి దగ్గరా మిషన్ గన్స్ ఉన్నాయి. వాళ్లలో ఓ స్ర్తి కూడా ఉంది. నెత్తురు మడుగుల్లో కొట్టుకుంటున్న సెక్యూరిటీ వాళ్లని చూసి భయంతో అరవబోయాను. బలాఢ్యుడైన ఒకతను నా మీద దాడి చేసి, నా ముక్కు దగ్గర ఏదో పెట్టి స్పృహ తప్పించాడు. మళ్లీ మా అమ్మాయి పిలిచేదాకా నాకేం తెలియలేదు’ వణికిపోతూనే అంతా చెప్పాడు శంకరయ్య.
‘ఆ ముసుగు మనుషుల్ని అంతకు ముందెప్పుడైనా చూశారా?’
‘లేదు’
‘మళ్లీ వాళ్లని చూస్తే గుర్తు పట్టగలరా?’
‘ముసుగులున్నాయి కదా. కష్టమే’ అన్నాడు శంకరయ్య.
అదోలా నవ్వాడు ఎస్.పి.
‘నాదో చిన్న అనుమానం?’ అన్నాడు ఓరగా చూస్తూ.
‘చెప్పండి!’
‘సాధారణంగా గుడి తలుపులు ఎనిమిది గంటలకే మూసేస్తారని విన్నాను. దోపిడీ జరిగింది సుమారు పనె్నండు గంటలకి. ఎనిమిది లోపే పూజలు ముగించుకున్న మీరు, పనె్నండింటి దాకా ఏం చేస్తున్నారు?’
‘ఎందుకో తలుపులు సరిగ్గా వేశానో లేదో అని అనుమానం వచ్చి వెళ్లాను. అప్పుడు సెక్యూరిటీ వాళ్లతో మాట్లాడాను కూడా’
‘ఓకే! గుడి తాళాలు మీ దగ్గరే వుంటాయి గదూ?’ అన్నాడు ఎస్.పి. సూటిగా శంకరయ్యకేసి చూస్తూ.
‘నా దగ్గరా, మా ధర్మకర్తగారి దగ్గరా ఉంటాయి?’
‘ఆయన తరచూ వస్తుంటారా?’
‘లేదు. ఎప్పుడోగాని రారు’
‘అయితే ఈ దారుణం ఆ బ్లాక్ టైగరే చేశాడని అనుకోవచ్చా?’
‘కచ్చితంగా అతను కాదు. అతను దొంగిలించాలంటే ఏనాడో దొంగిలించేవాడు. ఇది ఏ పెద్ద దొంగల ముఠా పనో అయుంటుంది’ అన్నాడు శంకరయ్య.
‘అలాగే అనుకుందాం కానీ ఆ ముఠా వాళ్లు మీకేం అపకారం తలపెట్టకుండా ఎందుకెళ్లారంటారు?’ కాస్త వ్యంగ్యంగా అన్నాడు ఎస్.పి.
ఇదంతా వింటున్న గౌతమి ఒళ్లు మండిపోయింది.
‘మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. చెప్పేదేవిఁటో సూటిగా చెప్పండి’ అంది గంభీరంగా. ఎర్రబడిన ఆమె మొహం చూసి కాస్త తగ్గాడు ఎస్.పి.
‘అది కాదు డాక్టర్ గౌతమీ! ఈ దోపిడీ బైటవాళ్లు చెయ్యలేదనీ, గుడికి సంబంధించిన వాళ్లే చేశారనీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మా అనుమానాలు మాకుంటాయిగా’ అన్నాడు సౌమ్యంగానే.
‘అంటే.. మేమే ఆ దొంగతనం చేశామని చెప్పారా ఎవరైనా?’ అంది గౌతమి వ్యంగ్యంగా.
‘మీరంటే మీరని కాదు. బైటి వాళ్లు చెయ్యలేదని మాత్రం గట్టిగా చెప్పారు’
‘ఎవరా చెప్పింది?’
‘క్లూ!’
‘వ్వాట్!’
‘యస్! క్లూ అన్నావిడ చెప్పింది’
‘అయితే ఇంకేం? ఆవిణ్నే వచ్చి దొంగల్ని పట్టుకోమనండి’ అంది గౌతమి చిరాగ్గా.
‘ఎస్.పి.గారూ! దశాబ్దాలుగా అమ్మని నమ్ముకుని ఈ కొండ మీద బతుకుతున్నాం. అమ్మ సేవే మహాభాగ్యం అనుకునే మమ్మల్ని అనుమానిస్తారా?’ బాధగా అన్నాడు శంకరయ్య.
అప్పుడే ధర్మకర్త ధర్మారావు రావడం, విషయం వినడం జరిగిపోయాయి. ఆయన మొహం కూడా గంభీరంగా అయిపోయింది.
‘చూడండి ఎస్.పి.గారూ! ఆ భగవంతుణ్నయినా అనుమానించచ్చు గానీ, పారిజాతమంత పవిత్రమైన మా శంకరయ్య గారిని అనుమానించడం దారుణం. దయచేసి మీ ధోరణి మార్చుకోండి. అసలు దొంగల్ని పట్టుకోవడం మీ వల్ల కాకపోతే వదిలెయ్యండి. మా ప్రయత్నాలు మేం చేసుకుంటాం’ అన్నాడు కాస్త గట్టిగానే.
అతని పరపతి తెలిసిన ఎస్.పి. తేలిగ్గా నవ్వేసి
‘మీరు పొరపడుతున్నారు. శంకరయ్యగారు చెప్పేవి చిన్నపిల్లల కథల్లా అనిపించి అలా మాట్లాడానే కానీ, ఆయన దొంగని ఎలా అంటాను’ అంటూ పది క్షమార్పణలు చెప్పుకుని లేచాడు.
అతన్ని గుమ్మందాకా పంపి వచ్చిన ధర్మారావు,
‘ఈ పోలీసుల నోపిడి హద్దూ పద్దూ ఉండదు’ అన్నాడు చిరాగ్గా.
‘మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గారు కూడా అదే అన్నారు’ అంది గౌతమి. ఆ మాట వినగానే ధర్మారావు మొహం మాడిపోయింది.
‘వాడెప్పుడొచ్చాడు?’ అన్నాడు ఆవేశపడిపోతూ.
‘నిన్న సాయంత్రం వచ్చి రెండు నిమిషాలుండి వెళ్లిపోయారు’ అంది గౌతమి.
‘వాణ్ని రానీయకండి. వాడి శనే గుడికి పట్టింది’ అంటూ వెళ్లిపోయాడు ధర్మారావు.
‘గుడిక్కాదు, వీళ్లిద్దరి శనీ మనకి పట్టింది’ గొణుక్కుంది గౌతమి.
* * *
అనుకున్న విధంగా పోలీసు జాగిలాలు వచ్చాయి. వస్తూనే గుళ్లోకి, గుడి పరిసరాల్లోకి పరుగులు తీశాయి. కొండంతా కలియతిరిగాయి. శంకరయ్య ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. కొండ వెనుక నించి దిగుతూ అడవికేసి దూసుకుపోయాయి.
అంతవరకూ ఊపిరి బిగించి వాటి చర్యలు గమనిస్తున్న వారందరి గుండెల్లో రాయి పడింది. బ్లాక్ టైగర్ రూపం రకరకాలుగా కనిపించి వణికించింది.
జాగిలాలు కొంతదూరం వెళ్లి ఠక్కున వెనక్కి తిరిగి నలుమూలలా పరుగులు తీసి ఓ సెంటర్‌లో బైఠాయించాయి.
దోపిడీ చేసింది బ్లాక్ టైగరేనన్న నమ్మకానికొచ్చేశారంతా. ఎస్.పి., ధర్మకర్త ధర్మారావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాంతారావు ఉసూరుమంటూ శంకరయ్య వాళ్లింటికొచ్చేశారు. ఉప్పు, నిప్పులా వుండే కాంతారావు, ధర్మారావు ఆ టైమ్‌లో కూడా ఒకళ్ల మీద ఒకళ్లు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. ఎస్.పి. సర్దుతూనే ఉన్నాడు.
విషయం విన్న గౌతమి-
‘అంటే ఆ నగలన్నింటినీ బ్లాక్ టైగరే దొంగిలించాడన్న మాట’ అంది బాధగా.
‘వాడే దొంగిలించాడని అనుకుంటూనే ఉన్నారు. కానీ, వాటిని అడవిలోనికి తీసుకెళ్లి ఏం చేసుకుంటాడు?’ అన్నాడు కాంతారావు.
‘అక్కణ్నించే బిజినెస్ చేసుకుంటాడేమో. ఇంతకీ మన రోజులు బాగోలేవు. ఇంక ఆ బ్లాక్ టైగర్ దగ్గర్నించి చిన్నం నగ కూడా రాబట్టలేం’ నిట్టూర్చాడు ధర్మారావు.
‘అసలు వాటిని అంత నిర్లక్ష్యంగా వదలకపోతే, కొండ దాటిపోయేవే కాదు’ ధర్మారావు కేసి కొరకొర చూస్తూ అన్నాడు కాంతారావు. అతను కస్సున లేచాడు. ఇద్దరూ కాట్ల కుక్కల్లా పోట్లాడుకున్నారు.
‘దయచేసి మీరు కామ్‌గా ఉంటారా?’ కాస్త చిరాగ్గా అన్నాడు ఎస్.పి. మరి నోరెత్తలేదెవరూ.
గౌతమీ వాళ్లకి ధైర్యం చెప్పి వెళ్లిపోయారంతా.
* * *
గుళ్లో దొంగతనం గురించి, అంతకన్నా మరో విషయం లేదన్నట్టు ప్రతిచోటా అదే చర్చలు జరుగుతున్నాయి.
‘అమ్మవారి మంగళసూత్రాలు కూడా రక్షించలేని ఈ సి.ఎం. ఇంకా జనానే్నం కాపాడగలడు’ అని ప్రతిపక్షాలు బాహాటంగా చర్చించుకుంటున్నాయి.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్