S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిరియాలు.. మిరపకాయలు

కొత్త మాటలని పుట్టించటం అనేది నేనిప్పుడు కొత్తగా సృష్టించిన ప్రక్రియ ఏమీ కాదు. కొత్త పదాల అవసరం అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇది వరలో - వ్యాసాలలోను, బ్లాగులలోను - ఎన్నో కోణాల నుండి చర్చించాను. ఇప్పుడు మరొక కోణం నుండి పరిశీలిద్దాం. ఉదాహరణకి ఈ దిగువ జాబితాలో తెలుగు పేర్లు చూడండి. మిరప, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, జామ, మొక్కజొన్న, పొగాకు, బంగాళాదుంప మొదలైనవి. ఇవేవీ మన దేశపు పంటలు, కాయగూరలు, ఫలాలు కావు. ఇవన్నీ దక్షిణ అమెరికా, కరిబియన్ ప్రాంతాల నుండి మనకి బుడతగీచుల ద్వారా దిగుమతి అయినవి. ‘వీటికి మనం బుడతగీచు పేర్లు వాడేసుకుంటే సరిపోయేది కదా, ఎందుకొచ్చిన గొడవ’ అని అప్పట్లో ఎవ్వరూ అనుకున్నట్లు లేదు! వీటికి ఈ తెలుగు పేర్లు ఎలా వచ్చాయో చెబుతాను.
అసలు పాశ్చాత్యులు అమెరికాకి రావటానికి కారణం మనమే! అంటే భారతీయులం. మన దేశానికి పచ్చి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క మొదలైన సుగంధ ద్రవ్యాలు కొనుక్కుందుకి, సముద్రపు దారి కనుక్కునే హడావిడిలో వీళ్లకి కాలం కలిసి వచ్చింది. దారి తప్పితే తప్పారు కానీ, తంతే బూర్ల గంపలో పడ్డట్లు వీళ్లు అమెరికా ఖండంలో వచ్చి పడ్డారు. ఇక్కడ (అంటే దక్షిణ అమెరికా, కరిబియన్ ప్రాంతాలు అని చదువుకోండి) వీళ్లకి మిరియాలు కనిపించలేదు కానీ మిరపకాయలు కనిపించాయి. అంతవరకు మిరియాలని ఇంగ్లీషులో ‘పెప్పర్స్’ అనేవారు. ఇవి కూడా అవే కాబోలు అని అనుకుని వీటిని కూడా ‘పెప్పర్స్’ అనటం మొదలుపెట్టారు. కానీ మిరియాలు నల్లగా, గుండ్రంగా ఉంటాయి. ఈ మిరపకాయలు ఎర్రగా, కోలగా ఉన్నాయి. పైపెచ్చు ఈ రెండింటి రుచులలో కూడా తేడా ఉంది. ఇటువంటి పరిస్థితులలో వీటిని మిరియాలే అంటే ఏం బాగుంటుందని నాలాంటి చాదస్తుడు గొణగటం మొదలెట్టి ఉంటాడు. ఈ సణుగుడు భరించలేక, అప్పటి నుండి నల్లగా, గుండ్రంగా ఉన్న వాటిని ‘బ్లాక్ పెప్పర్స్’ అనిన్నీ, పచ్చగా, కోలగా ఉన్న వాటిని ‘గ్రీన్ పెప్పర్స్’ అనిన్నీ, ఎర్రగా, కోలగా ఉన్న వాటిని ‘రెడ్ పెప్పర్స్’ అనిన్నీ అనటం మొదలెట్టారు. మిరియాల జాతి వేరు. మిరపకాయల జాతి వేరు. అయినా ఈ పేర్లు అలా అతుక్కుపోయాయి.
ఈ మిరపకాయలని బుడతగీచులు మన దేశం తీసుకువచ్చినప్పుడు వాటిని వాళ్లు ‘రెడ్ పెప్పర్స్’ అనే అర్థం స్ఫురించేలా ఏదో పోర్చుగీసు భాషలో మాట మాట్లాడి ఉంటారు. దానిని మనవాళ్లు తెలిగించి ‘ఎర్ర మిరియపు కాయలు’ అనే వారు. (నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ ఎర్ర మిరియపు కాయలలో మిరియాలూ అనే్న ఉన్నాయన్న విషయం తెలిసి కూడా!0 మన తెలుగు వాళ్లు చాలా జోరుగా మాట్లాడుతారు - మీరు గమనించారో లేదో. అసలు బుర్ర ఎంత జోరుగా ఆలోచించగలదో అంతకంటె జోరుగా మాట్లాడతారు, మన వాళ్లు. ఈ జోరులో ఆ మిరియపు కాయ కాస్తా మిరపకాయ అయింది. దీనే్న తెలుగు బాగా రాని వాళ్లు మెరపకాయ అని అనటం నేను విన్నాను. కానీ ‘మిరప’ ఎక్కువమంది అంగీకరించిన ప్రయోగం.
ఇక సపోటా సంగతి. స్పానిష్ భాషలోనూ, పోర్చుగీసు భాషలోనూ కూడ ఈ పండుని ‘సపోటా’ అనే అనేవారు. ఇప్పటికీ అంటున్నారు. ఎందువల్ల? దక్షిణ అమెరికాలో అప్పటికే ఉంటూన్న ‘ఇండియన్లు’ వీటిని సపోటా అనే వారు. ఇది అచ్చుతో అంతం అయే మాట కనుక మన భాషలో ఇమిడిపోగలిగింది. కనుక దీన్ని మనమే కాదు, ప్రపంచం అంతటా సపోటా అనే అంటున్నారు.
పోతే, జామపండు. ఇదీ మన దేశపు పండు కాదు. దీన్ని దక్షిణ అమెరికాలో ‘గ్వావా’ అంటారు. ఇంగ్లీషులోనూ ఆ మాటే స్థిరపడిపోయింది. కాని గ్వావా నుండి ఈ జామ అన్న మాట ఏ దారి వెంబడి వచ్చిందో పరిశోధన చేసి కనుక్కోవాలి. దీనిని మన తెలుగు విద్యార్థులకి పరిశోధనా అంశంగా వదిలిపెడుతున్నాను.
ఇంగ్లీషు భాషలోకి ‘టుబాకో’ ఎక్కడ నుండి వచ్చిందో తేల్చి చెప్పటం కష్టం కానీ, ఈ ఆకులని చుట్టలు చుట్టి ‘హైతీ’ అనే దేశంలో కాల్చడం కొలంబస్ చూసేడుట. ఆ చుట్టలని వారు ‘తంబాకు’ అనేవారుట. ఈ ‘ఆకు’ శబ్దం తెలుగులో ఆకులా ఉంది కనుక మనం దీనిని తంబాకు అనేసి ఉండుంటే సరిపోయి ఉండేది. కానీ బుడతగీచులో, మరెవ్వరో తంబాకు నుండి ‘టుబాకో’ని తయారుచేశారు. మరెవ్వరో మహానుభావులు ‘టుబాకో’ నుండి పొగాకు అనే పేరుని పీకి పుణ్యం కట్టుకున్నారు. వారి వారసులే ‘డ్రెడ్జర్’కి తవ్వోడ అని పేరు పెట్టి ఉంటారు. ఇంత సహజమైన పేర్లు పెట్టినందుకు వీరికి నిజంగా ఒక వీరతాడు వెయ్యాలి. ఒక్క తాడు వేసి మరొకసారి తంబాకు దగ్గరికి వెళదాం. పొగాకుని కాల్చకుండా తమలపాకులో కట్టబెట్టి బుగ్గలో పెట్టుకుంటే దానిని తంబాకు అనడం నా చిన్నతనంలో విన్నాను.
మెక్సికో వంటి ఉష్ణ మండలాలలో మరో రెండు జాతుల పళ్లు దొరుకుతాయి. వాటికి వాళ్ల భాషలో ఉన్న పేర్లు మన నోట ఇమడవు. మన భాషలో ఇమడవు. అందుకని మనలో ఎవరో మహానుభావులు (వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను) వాటికి ‘సీతాఫలం’ ‘రామాఫలం’ అని పేర్లు పెట్టారు. చూడండి మన తెలుగు పళ్లల్లో ఈ రెండింటికే ‘్ఫలం’ అనే సంస్కృతపు తోక ఉంది. మిగిలినవి అన్నీ ‘పండు’తోనే అంతం అవుతాయి. మామిడి పండు, అరటి పండు, నేరేడు పండు మొదలైనవి. కనుక సీతాఫలం, రామాఫలం అన్న పేర్లు పురాతనమైనవి కావనిన్నీ, ఇటీవల కాలంలో వాడుకలోకి వచ్చాయనిన్నీ నా సిద్ధాంతం.
రామాఫలం యొక్క శాస్ర్తియ నామం Annona reticulata.. దీనిని ఇంగ్లీషులో Bull's Heart. అని అంటారు. సీతాఫలం యొక్క శాస్ర్తియ నామం కూడా ఇదే కానీ దీనిని ఇంగ్లీషులో custard apple అని అంటారు.

- వేమూరి వెంకటేశ్వరరావు