S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైద్యం సంగతులు

అయ్యా, దయచేసి మీకు మీకు తెలియనిది ఏమిటో చెప్పండి. -బేజ్ హాట్ వాలర్ (న్యాయవాది)
నిజమే, అన్నీ తెలిసినట్టు మాట్లాడే వారితో మనకే కష్టం. లాయర్లకు మరీ కష్టం.
* * *
హైదరాబాద్‌లో ఆధునిక వైద్య విద్య మొదలైన తీరు గురించి గడచిన వారం కొన్ని సంగతులు చెప్పాను. అది చదవని వాళ్లు కూడా ఈ వ్యాసాన్ని హాయిగా చదవవచ్చు. అఫ్జల్‌గంజ్ ఆసుపత్రికన్నా ముందే మెడికల్ కాలేజీ పుట్టిందని తెలుసు. కానీ అది ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారడం మాత్రం చాలా తర్వాత కాలంలో జరిగింది. ఫసలీ 1330 అనగా 1920 సంవత్సరంలో అప్పటివరకు పేరు లేకుండా సాగుతున్న విద్యాలయం తీరు మారింది. అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ప్రభువుగా ఉన్నారు. ఏడవ నిజాం ఆయన. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా ఆయన కాలంలోనే వచ్చింది. ఆయనే ఒక ఫర్మాన్ విడుదల చేసి వైద్య విద్యాలయాన్ని మెడికల్ కాలేజీగా గుర్తించాడు. ఇచ్చిన డిగ్రీని అప్పట్లో ఎంబిబిఎస్ అనేవారు కాదు. దాన్ని ఎల్‌ఎం అండ్ ఎస్ అనేవారు. నిజానికి అప్పటి వరకు అక్కడ ఉత్తీర్ణులై వచ్చిన వారు పేర్ల ముందు డాక్టర్ అని రాసుకునే వీలు కూడా ఉండేది కాదు. ఏడవ నిజాం ఆ విషయంగా నిర్ణయించేశారు. హకీం అనే మాట బదులు డాక్టర్ అని వైద్యులను గుర్తించే పద్ధతి అలవాటులోకి వచ్చింది.
డాక్టర్ జ్యోత్స్న అనే ఒక ఆవిడగారు కష్టపడి సేకరించిన కొన్ని విశేషాలు నాకు ఎంతో సరదా కలిగించాయి. రుచికరమైన దేనినైనా ఒకరే అనుభవింప కూడదని ఒక పద్ధతి చెబుతుంది. నాకు చదువులో తిండికన్నా ఎక్కువ ఆనందం కనిపిస్తుంది. కనుకన చదివిన పుస్తకాల గురించి సంగతులను గురించి కూడా చెబుతూ ఉంటాను. చూసిన సినిమాలను గురించి చెబుతూ ఉంటాను. నాకు కలిగినట్టే మరి కొంతమందికి ఆనందం కలుగుతుందని నమ్మకం.
గతంలో మా పెద్దలు కొంతమంది నిజాం ప్రభువును దర్శించుకోవడానికి వెళ్లేవారట. ఆ సందర్భంలో వారు పైన వేసుకున్న శాలువాతోపాటు తలకు కూడా మరొక శాలువా పాగావలె కట్టుకునేవారట. ప్రభువుల ముందుకు వెళ్లాలంటే అప్పట్లో ప్రోటోకాల్ ఉండేదన్న మాట. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఫార్మల్ డ్రెస్ గురించి రూల్స్ ఉంటాయి. నిజాంను దర్శించ దలచిన వాళ్లు సరైన దుస్తులలో ఉండాలన్నది అప్పటి నియమం. నడుముకు తప్పకుండా బుగ్లూస్ అనే ఒక పటకా కట్టుకోవాలి. ఆ విషయంలో ఎవరికి మరొక దారి లేదు. తలకు కూడా పాగా ఉండి తీరాలి. ఇక టోపీ పెట్టుకునే వాళ్ల సంగతి వేరుగా చెప్పనవసరం లేదు. వైద్య విద్యాలయం మొదలైనప్పటి మొదటి బ్యాచ్‌లో చదువుకున్న హకీం ఒకాయన నిజాంకు సన్నిహితులుగా ఉండేవారు. ఆయన పేర అరస్తూ యార్ జంగ్. ఆయన చురుకుగా వైద్యం ప్రాక్టీస్‌లో ఉండేవాడు. నిజాం సంస్థానంలో పెద్ద పదవిలో ఉన్న ఒక అధికారి కుమారునికి తీవ్రమైన అనారోగ్యం కలిగింది. అరస్తూ గారు ఆ అబ్బాయికి వైద్యం చేస్తున్నారు. మందులతో పరిస్థితి చక్కబడే వీలు కనిపించలేదు. శస్తచ్రికిత్స చేయాలి అని నిర్ణయించారు. కుర్రవాని తండ్రి ఉన్నతాధికారి. తన బిడ్డడిని మామూలు మనిషిలాగా ఆసుపత్రికి పంపించే పద్ధతి ఆయనకు నచ్చలేదు. ఆ సర్జరీ ఏదో తన ఇంట్లోనే జరగాలని పట్టుపట్టాడు. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా అని ఒక మాట ఉంది. కనుక వైద్యశాల వాళ్ల ఇంటికి తరలి వచ్చింది. ఇంట్లోనే శస్తచ్రికిత్స జరుగుతుంది అని నిర్ణయం కూడా జరిగింది. నిర్ణయమే కాదు ఆపరేషన్ కూడా అన్ని విధాలా విజయవంతంగా ఇంట్లోనే జరిగింది. దగ్గరి బంధువు, ఉన్నతాధికారి బిడ్డడు కాబట్టి ఆ అబ్బాయిని నిజాం ప్రభువు వచ్చి చూస్తాను అన్నాడు. మరి మర్యాదలన్నీ జరగాలి కదా! శస్తచ్రికిత్స చేయించుకున్న పిల్లవాడికి తలకు టోపీ పెట్టడం పెద్ద సమస్య కాదు. కానీ ఆపరేషన్ కడుపునకు జరిగింది. అటువంటి పరిస్థితిలో నడుముకు పట్టీ కట్టడం ఎంత మాత్రం కుదరదని వైద్యులు అంటున్నారు. మర్యాద గురించి గొప్పగా చర్చలు సాగుతున్నాయి. ఉన్నతాధికారి అయిన ఆ పెద్ద మనిషి మాత్రం మర్యాదల గురించి మరీ పట్టుబడుతున్నాడు. గొంతు పెంచి అరుస్తున్నాడు కూడా. ఈ వాగ్వివాదాలు ఒకవైపు జరుగుతూ ఉండగానే నిజాం ప్రభువు ఆ గదిలోకి వచ్చేశారు. మర్యాదల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. పిల్లవాని ఆరోగ్యం బాగుపడటం అన్నిటికన్నా ముఖ్యం అన్నాడు. మర్యాదల గురించి అంతగా పట్టించుకుంటున్న పెద్దమనిషికి పారితోషికాలను లేదా బహుమానాలను సమర్పించుకునేవారు. అటువంటిది ఈ సందర్భంలో నిజాం స్వయంగా ఒకరికి కానుకలను ఇవ్వడం గుర్తించవలసిన విషయం.
అరస్తూ యార్ జంగ్ గురించి మరి కొన్ని సంఘటనలు కూడా గుర్తుంచుకో దగినవి ఉన్నాయి. అతను వైద్యుడు. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అయినా రాచమర్యాదలు కాదనడానికి మాత్రం లేదు. ఒకనాడు సాహెబ్ జంగ్ అనే ఒక అధికారి ప్రభువుల ముందుకు అనుకున్న సమయానికన్నా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. ప్రభువు చాలా కోపగించుకున్నాడు. గట్టిగా అరిచాడు కూడా. ఆ అవమానాన్ని మరీ సీరియస్‌గా తీసుకున్న ఆ పెద్దమనిషికి గుండెపోటు వచ్చింది. ఆ కారణంగా అతను చనిపోయాడు. ప్రభువుల పట్ల గౌరవం అప్పట్లో అలాగా ఉండేదన్న మాట. సరిగ్గా అదే రోజున అరస్తూ గారు కూడా నిజాం ప్రభువును చూడవలసి ఉంది. ఆయన కూడా ఏదో కారణంగా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. ఆ సమయానికి ప్రధానమంత్రి కూడా అక్కడే ఉన్నాడు. ప్రభువులు అంతకు ముందు చూపిన ప్రవర్తన తెలిసినవాడు గనుక, సమయానికి తగినట్లు అతను కలుగజేసుకున్నాడు. పాపం ఈ వైద్యులకు క్షణం తీరిక ఉండదు. కనీసం తిండి తినడానికి కూడా వారికి విరామం దొరకదు, అన్నాడు ఆ ప్రధానమంత్రి. ఆ మాటల వెనుక అంతరార్థం ప్రభువులకు అర్థం అయింది. కనుక వైద్యుడు అరస్తూ గారికి పచ్చలు తాపిన నడుము పట్టీని అంటే బుగ్లూస్ బహుమతిగా ఇచ్చాడట! ఎందుకు? ఆలస్యంగా వచ్చినందుకా?
అరస్తూ యార్ జంగ్ కుమారుడు ఖుర్షీద్ హుస్సేన్ కూడా వైద్యుడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన కాలంలో అతను నిజాం ప్రభుత్వం సేవలో ఉన్నాడు. అతని వద్దకు ఒక బీద రోగి వచ్చాడు. ఆ మనిషికి శస్తచ్రికిత్స అవసరం అని తేలింది. బాధ భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. సంగతి తెలిసి ఖుర్షీద్ గుండె కరిగిపోయింది. చికిత్సకు అవసరమైన పరికరాలను లండన్ నుంచి తెప్పించవలసి ఉంటుంది. అప్పట్లో విమానాలు వాటి ద్వారా రవాణాలు అంత సులభంగా జరిగేవి కాదేమో. పరికరాలు రావడానికి మూడు నెలల సమయం పడుతుందని అర్థం అయింది. ఈలోగా రోగి చాలా బాధపడుతున్నాడు. భరించలేక పోతున్నాడు. ఖుర్షీద్ తన తెలివిని ఆ సందర్భంలో ప్రదర్శించిన తీరు చాలా గొప్పది. వెదురు బద్దలతో అతను శస్త్ర చికిత్సకు అవసరమైన పరికరాలను రూపొందించాడు. విజయవంతంగా చికిత్స కొనసాగించాడు. ఈ సంగతి ప్రభువుల దృష్టికి కూడా వెళ్లింది. వెంటనే ఆ వైద్యుడిని హైదరాబాద్‌కు రప్పించాలని నిజాం నిర్ణయించాడు. ఆ తరువాత జీవితకాలమంతా ఖుర్షీద్ హైదరాబాద్‌లోనే సర్జన్ వృత్తిలో తన కార్యక్రమాలను కొనసాగించారు.
బేగంపేట విమానాశ్రయం పక్కన రోనాల్డ్ రాస్ అనే ప్రపంచ ప్రఖ్యాత పరిశోధకుడు పని చేసిన ఒక చిన్న పరిశోధనశాల ఉంటుంది. అది ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగం నిర్వహణలో ఉందని నా అనుమానం. అక్కడ నిజానికి ఏమీ జరగదు. కానీ ఆ రోనాల్డ్ రాస్ హైదరాబాద్‌లో మలేరియా సూక్ష్మజీవులను గురించి కనుగొన్నాడు. అందుకుగాను అతనికి 1902లో నోబెల్ బహుమానం కూడా వచ్చింది. అతను సూక్ష్మజీవులను గురించి అప్పటి వైద్య విద్యాసంస్థలో పని చేస్తున్న డాక్టర్లకు తెలియజేశాడు. వాళ్లంతా ఆసక్తి కనబరచి తాము కూడా వాటిని చూడాలని చెప్పారు. కారణం ఏమిటో తెలియదు కానీ, రోనాల్డ్ రాస్, రోగి రక్తంలో ఆ క్రిములను చూపలేక పోయాడు. వైద్యులు నిరాశ పాలయ్యారు. పరిశోధకుడు మాత్రం పట్టు వదలలేదు. ఆ పట్టుదల కారణంగానే ఆయన సూక్ష్మజీవిని కనుగొనగలిగారు. హైదరాబాద్ మెడికల్ స్కూల్‌తో ఆయన పరిశోధనకు ఎటువంటి సంబంధం లేదని మనం గుర్తుంచుకోవాలి.
క్లోరోఫామ్ వాడకం ప్రపంచమంతటా కొనసాగుతున్నది. ఈ విషయంగా హైదరాబాద్ మెడికల్ స్కూల్లో ఆ కాలంలోనే గొప్ప పరిశోధనలు జరిగాయి అంటే ఆశ్చర్యం. కొంతకాలంపాటు క్లోరోఫామ్ అనగానే అందరికీ ఉస్మానియా గుర్తుకు వచ్చేదట. 1888లో క్లోరోఫామ్ గురించి పరిశోధించడానికి కమిషన్‌ను నియమించారు. అందులో ముగ్గురు బ్రిటిష్ నిపుణులు సభ్యులుగా ఉండేవారు. లానె్సట్ అనే వైద్య పరిశోధన పత్రిక ఈనాటికి కూడా నడుస్తున్నది. ఆ పత్రికలో గొప్ప పరిశోధన ఫలితాలను ప్రచురిస్తారు. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అప్పట్లో ఆ పత్రిక వారికి క్లోరోఫామ్ గురించిన పరిశోధనకు గాను 1000 పౌండ్లు పెట్టుబడిగా ఇచ్చారు. ఆ తరువాత రెండవ క్లోరోఫామ్ కమిటీ కూడా వచ్చింది. దాన్ని హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్ అన్నారు. పరిశోధన బాగా జరిగింది. ఫలితాలకు ప్రపంచమంతటా ప్రచారం కలిగింది. హైదరాబాద్ పద్ధతిని అప్పట్లో లండన్‌లో పరీక్షకు పెట్టారు. సర్ ఫ్రెడరిక్ అనే ఒక ప్రసిద్ధ వైద్యుడు ఆ పద్ధతిని వాడి శస్తచ్రికిత్స కొనసాగించాడు. అది అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ నగరంలో చదువుకున్న వైద్యులు ప్రస్తుతం ప్రపంచమంతటా గొప్ప సేవలు అందిస్తున్నారు. అందులో ఆశ్చర్యం లేదు. గతంలో అంటే నేను నగరంలోకి వచ్చిన కాలంలో కొంతమంది వైద్యులను గురించి గొప్పగా చెపుతూ ఉండేవారు. వారిలో చిత్రంగా మరాఠీలు, కాయస్థులు ఎక్కువగా ఉండేవారు. మనవాళ్లు లేరని కాదు. ఇప్పటికీ మా వెనుక వీధిలో మంగ్రూల్కర్ గారు ఉంటారు. ఆయన ఇప్పటి గురువులకు గురువు. అయినా ఓపికగా పాఠాలు చెపుతారు. సభలు సమావేశాలకు వెళ్లి ప్రసంగిస్తారు. ఆయన గారితో నాకూ పరిచయం ఉండడం నా ఆనందం.
హైదరాబాద్‌లో వైద్య విద్య గురించి చాలా సంగతులు ఉన్నాయి. అయినా అందరికీ అన్నింటిలో ఆసక్తి ఉంటుంది అన్న నమ్మకం నాకు లేదు. కనుక ఎక్కడో ఒకచోట ఆపేస్తాను. లోకాభిరామంలో ఏమి చెప్పాలి అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అసలు ఏమీ చెప్పకుండా ఉంటే ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న నా ముందు ఉంది!

-కె.బి.గోపాలం