ఇప్పుడే కాదు..
Published Saturday, 13 April 2019ఎవరికీ నమ్మకంగా తెలియని విషయం గురించి మనకు అసలు అనుమానం ఉండనే కూడదు - ఆన్ వార్డ్ రాడ్ క్లిఫ్ (రచయిత)
* * *
ఒక మనిషికి జీవితకాలంలో తినడానికి కొంత తిండి కోటా ఉంటుంది అంటారు. బతుకు ముగియకముందే అంత తిండి తినేస్తే ఆ తర్వాతి కాలంలో వారికి తిండి ప్రాప్తం ఉండదు అంటారు. బహుశా సినిమాల విషయంలో నాకు ఇటువంటి పరిస్థితి ఎదురైనట్టు అనిపిస్తుంది. చిన్నప్పుడు సినిమాలు తెగ చూసేవాడిని. డబ్బులు ఉన్నాయని కాదు, మిత్రులు, అన్నయ్య కలిసి సినిమాలు చూడడానికి మంచి వెసులుబాటు కలిగించేవారు. పరీక్షలు వచ్చే సంవత్సరం కూడా రాయవచ్చు. కానీ సినిమా మళ్లీ వస్తుందో రాదో, కనుక సినిమా చూడడమే మేలు అని, నాన్న ఒక సందర్భంలో అన్నాడు. అది నా గురించి కాదు అని అనుమానం కానీ విషయం మాత్రం నిజమే. సినిమాలు అంతగానూ చూచాను. కనుక ప్రస్తుతం నాకు సినిమాలు చూడడానికి ఓపిక లేకుండా ఉంది. అరగంట సేపు చూస్తే చాలు అలసట, అసహ్యం లాంటి లక్షణాలు అన్నీ మొదలయ్యి ఇక సినిమా చాలు అనిపిస్తుంది.
అక్కడో ఇక్కడో అరకొర సినిమాలు నచ్చినవి కూడా ఉన్నాయి. అంటే వాటిని ఇంచుమించు పూర్తిగా చూడగలిగాను అని అర్థం. అలాంటి వాటిలో అన్నిటికన్నా ముందు క్షణక్షణం గురించి చెప్పాలి. బహుశా ఈ మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉంటాను. అయినా మరోసారి చెప్పడానికి సందేహం లేదు. ఆ సినిమా అయిదు నిమిషాలు చూచిన తరువాత, అదేదో కాపీ వ్యవహారం అని అర్థం అయిపోయింది. కానీ శ్రీదేవి అమాయకత్వం, వెంకటేష్ ఏదీ పట్టి లేదు అన్నట్టు ప్రవర్తించడం, విలన్ తీరు, ఇలాంటివన్నీ కలిసి సినిమా చాలా నచ్చింది. మూసగా అందులో ప్రేమలో పాటలు అలాంటివి ఏమీ లేవు. ఏదో ఒక చిన్న సంగతిని పట్టుకుని సినిమా మొత్తం నడుస్తుంది. హిందీ విలన్ పాత్ర చాలా ఆకర్షణీయంగా ఉంది. కనుక ఆ సినిమాను ఇంచుమించు పూర్తిగా చూచాను. రెండోసారి, మూడోసారి, పనె్నండోసారి చూసినప్పుడు ఆ సినిమాను నేను ఎప్పుడూ పూర్తిగా చూడలేదు అని అర్థమైంది.
నిజం చెప్పాలంటే నా దగ్గర చాలా సినిమాలు ఉన్నాయి. వాటిని నేను ఇంట్లోనే అంచెలంచెలుగా చూస్తుంటాను. ఇక ఇంటర్నెట్‌లో అయినా సరే సినిమా చూడడానికి అదే పద్ధతి. నాకు సినిమా చూడడానికి ఓపిక లేదు అన్న మాట వాస్తవమే కానీ, నేను సినిమాలు చూడను అంటే మాత్రం అబద్ధం అవుతుంది. అయితే తెలివిగల మనుషులలోకి నన్ను కూడా లెక్క వేసుకుంటాను కనుక, కొన్ని తిక్క పనులు చేయాలి. అందరూ చూసే సినిమాలు చూస్తే మనం తెలివిగల వాళ్లు కింద లెక్క కాదు. ఎవరికీ తెలియని కొన్ని సినిమాలు, కొంతమంది డైరెక్టర్లు, మరి కొంతమంది నటులు వగైరాలను గురించి మాట్లాడుతూ ఉండాలి. అది ఫ్యాషన్ మరి. అందుకే ప్రయత్నించి అరుదైన సినిమాలు చూడడం నేర్చుకున్నాను. ఆ క్రమంలోనే అకిరా కురొసావా గురించి కూడా తెలుసుకున్నాను. నాకు తెలియకుండానే ఈ పెద్ద మనిషి తీసిన ఒకటి రెండు సినిమాలు చూశాను.
పెళ్లైన కొత్తలోనే అమాయకురాలు మా ఆవిడని కూడా వెంటబెట్టుకుని వెళ్లి ‘కగేముష’ అనే ఒక సినిమా చూశాను. అది ఒక సమురాయ్ వీరునికి సంబంధించిన కథ. నిజం చెబుతున్నాను. సినిమా నాకు ముక్క అర్థం కాలేదు. మా ఆవిడకు అంతకన్నా అర్థం కాలేదు. ఆ తరువాతో, అంతకు ముందో ఎప్పుడో గానీ సెవెన్ సమురాయి అనే సినిమా కూడా చూశాను. ఇది నలుపు - తెలుపు సినిమా. అంటే చాలా ముందు తీసింది అని అర్థం. అందులో గూండాల బాధలు ఎదుర్కోవడానికి ఊరి వాళ్లు పైనుంచి వీరులను అరువు తెచ్చుకోవడం అసలు కథ. నిజానికి మన దేశంలో సూపర్ డూపర్ హిట్‌గా వచ్చిన ‘షోలే’ అనే సినిమాకు ఆధారాలు కురొసావా సినిమాలో ఉన్నాయి అంటారు. కిరాయి వీరులు అన్న మాట ఒకటి తప్పిస్తే రెండు సినిమాలలో పోలిక లేనే లేదు. మళ్లీ ఒకసారి చెబుతున్నను, ఆ సినిమా కూడ నాకు అర్థం కాలేదు.
సినిమా చూస్తే పోతుంది కదా? అందులో అర్థం కావడానికి ఏముంది? అనుకోవచ్చు కూడా. అట్లాగే అనుకుని అకిరా కురొసావా సినిమాగా తీసిన రషోమన్ అని ఒక కథను నాటకంగా చూశాను. దాన్ని లలిత కళాతోరణంలో ఎమ్మెస్ సత్యు లాంటి కొన్ని పెద్ద పేర్ల ప్రభావం కింద ప్రదర్శించారు. నాకు ముక్క అర్థం కాలేదు. ఆ తరువాత కొంచెం తెలివి తెలిసినప్పుడు, అకుటగవ అనే రచయిత సంకలనాన్ని సంపాదించి ఆ కథ మొత్తం చదివాను. కథ వేరు, నాటకం సినిమా వేరు. వెర్రి కాకపోతే నాకు ఎందుకని ఈ డైరెక్టర్ల సినిమాలు చూడాలని యావ? ఫ్యాషన్ మరి.
అకిరా కురొసావా చాలా సినిమాలు తీశాడు. నేను వాటిలో చాలా చూచినట్టు కూడా ఉన్నాను. అతని వయసు పెరిగిన కొద్దీ, సినిమాలు, కథలు, తీసిన తీరు అన్నింటిలోనూ మార్పు కనబడింది. కురొసావా చివరిగా తీసిన చిత్రం ‘మాదదయో!’ ఇది ఒక ప్రశ్నకు జవాబు! 30వ సినిమాగా తీశారు కాబట్టి, అప్పటికి కురసావా రిటైర్మెంట్ మూడ్‌లో ఉన్నట్టున్నాడు. కనుక రిటైర్మెంట్ గురించి బొమ్మ తీశాడు. ఈ సినిమా మాత్రం నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది.
‘మాదదయో’ నాకు అంతగా నచ్చడానికి బహుశా కొన్ని కారణాలు ఉన్నాయి. సినిమా తీసిన కురొసావా వృద్ధాప్యంలో ఉన్నాడు. నేను కూడా 60 ఏళ్లు దాటిన వాడిని. సినిమాలో నాయకుడైన సెంసయ్ అంటే గురువుగారు అప్పటివరకు తాను చేసిన అధ్యాపక వృత్తికి వీడ్కోలు చెప్పి పుస్తకాలు రాస్తూ సుఖంగా బతుకుతాను అంటాడు. అందుకు అనువుగా ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనకు భార్య ఉంది. ఆమె కూడా భర్తను గురువుగారు అంటుంది. పిల్లలు మాత్రం లేరు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన వద్ద జర్మన్ నేర్చుకున్న కుర్రవాళ్లు అంతా ఇప్పుడు పెద్దవాళ్లయి మంచి పొజిషన్లలో ఉన్నారు. వాళ్లంతా ఆయన పిల్లలుగా ఉంటారు. ఏటా ఆయన పుట్టినరోజు జరుపుతారు. సినిమా మొత్తంలోకి ఈ పుట్టినరోజు పార్టీలు ప్రత్యేక ఆకర్షణలు. విద్యార్థుల కుటుంబాలతో సహా ఒకచోట చేరుతారు. సెన్సయ్ గారిని ఘనంగా సన్మానిస్తారు. అదేమి ఆచారమో తెలియదుగానీ ఒక పేద్ద గ్లాసు నిండి బియర్ పోసి ఆయన గారికి తాగడానికి ఇస్తారు. ఆయన ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేస్తాడు. అప్పుడు సినిమా పేరు వినిపిస్తుంది. విద్యార్థులంతా కలిసిమాదకై అని అడుగుతారు. గురువుగారు మాదదయో అంటాడు. మాదకై అంటే సమయం వచ్చిందా అని అర్థం. మాదదయో అంటే అప్పుడే రాలేదు అని అర్థమట. గురువుగారిని ఇక జీవితం నుండి సెలవు తీసుకుంటావా అని పిల్లలు అడగడం, ఆయన ఇప్పుడే కాదు మరింత కాలం బతుకుతాను అనడం, ఇంచుమించు అదే వయసులో ఉన్న నాకు బాగా నచ్చింది అంటే ఆశ్చర్యమేముంది?
విద్యార్థులు గురువుగారి గురించి పట్టించుకున్న తీరు కంటతడి పెట్టిస్తుంది. రిటైర్ అయిన తరువాత భార్యా భర్తలు ఇద్దరూ బతుకుతున్న ఇంట్లో రక్షణ ఎంతగా ఉందో చూడాలని ఇద్దరు విద్యార్థులు రాత్రిపూట ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తారు. దొంగలకు దారి అన్న బోర్డు ఎదురవుతుంది. ఆ సన్నివేశం నిజంగా చాలా బాగుంటుంది. మొత్తానికి రక్షణ బాగుంది అని తెలుస్తుంది. ఎదురు గోడ మీద మూత్రం పోయడం గురించి రాసి ఉంటుంది. స్వంతదారు ఆ పొలాన్ని మరెవరికో అమ్మడంతో గురువుగారు అక్కడి నుండి కదలవలసి వస్తుంది. విద్యార్థులంతా కలిసి ఆయనకు ఒక గుడిసె ఏర్పాటు చేస్తారు. ఆ గుడిసె ద్వారం ఉండదు. మిగతా సౌకర్యాలు అన్నీ ఉంటాయి. చుట్టుపక్కల ఎట్లున్నా అసలైన జపాను పద్ధతిలో కాగితాలతో పరదాలు మొదలైనవి ఏర్పాటు చేసిన ఆ గుడిసె మాత్రం చాలా బాగుంటుంది. విద్యార్థులు ప్రతి నిత్యం అక్కడికి వస్తుంటారు. ఎవరిలోనూ అది కేవలం ఒక చిన్న గుడిసె అన్న భావన కనిపించదు.
సినిమాలో పుట్టినరోజు పార్టీలు మళ్లీమళ్లీ వస్తాయి. వాటికన్నా ముఖ్యంగా చెప్పుకోవలసింది పిల్లి గురించిన విషయం.
గురువుగారికి ఒక పిల్లి దొరుకుతుంది. దాన్ని ఇంచుమించు సొంత బిడ్డలా పెంచుకుంటారు. మధ్యలో ఆ పిల్లి కనిపించకుండా పోతే వెదకడంతో సినిమా ఎంతో ముందుకు సాగుతుంది. అక్కడ కొంచెం విసుగు కలిగిన భావన కనిపించవచ్చు కానీ, అది కూడా సినిమా నిర్మాణంలో భాగం ఏమో అనిపించింది.
జీవితం పట్ల, అందులో తనకు కావలసిన సౌకర్యాలు, సంగతుల పట్ల పెద్ద వయసులో కూడా ఒక మనిషికి ఉండే ఆసక్తి గురించి కురొసావా తీసిన సినిమా, నాకు మాత్రం అద్భుతంగా కనిపించింది. నిజానికి సినిమా మొత్తం ఈ ఒక్క విషయం మీదనే ఆధారపడి ఉంటుంది అనవచ్చు. అందరికీ నచ్చిన ఒక పెద్ద మనిషి తన జీవితాన్ని తాను ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. అప్పుడే అందులో నుంచి బయటపడాలి అని అనుకోవడానికి కూడా వీలు లేనంతగా తను జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. నాకు నిజానికి జీవితం మీద అంత గట్టి ప్రేమ లేదు. అయినా సరే సినిమాలో ప్రొఫెసర్ కనబరిచిన తీరు నాకు చాలా నచ్చింది.
సినిమాలో నిజానికి ఎక్కడా కూడా గోల గందరగోళం కనిపించదు. వినిపించదు కూడా. అంతా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. కురొసావా అందుకు తగినట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో పాశ్చాత్య శాస్ర్తియ సంగీతాన్ని వినిపించాడు. పార్టీలో కూడా అటువంటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం మనిషి మీద ఒక ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కెమెరా కదలికలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. పరుగులు ఫైట్లు లాంటివి ఊహించడానికి కూడా ఈ సినిమాలో ఉండవు. ఉన్నది చిన్న గుడిసె అయినా, అది గుడిసెలాగా కనిపించదు. అందంగా ఉంటుంది. వచ్చిన విద్యార్థులు నిజానికి విద్యార్థులు కాదు. వాళ్లంతా పెద్దపెద్ద ఉద్యోగాల్లో చేరిన వాళ్లు. నగరంలో నాయకులుగా చెలామణి అవుతున్న వారు కూడా. ఈ సంగతి పార్టీ సందర్భంగా బయటపడుతుంది.
సినిమాలో ప్రొఫెసర్ అలాగే మొత్తం సినిమా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది ఈ సినిమా ప్రత్యేకత. ఆ ప్రొఫెసర్ మన వంటి ప్రేక్షకులను కూడా తన పద్ధతిలోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాడు. అది అతను నేరుగా చేయడు. అప్పుడే యత్నంగా అది జరిగిపోతూ ఉంటుంది. స్వార్థం ఏ మాత్రం కనిపించని తీరు మనసుని తాకుతుంది. సింప్లిసిటీ అనే ఒక లక్షణం మనం కూడా నేర్చుకుంటే బాగుండును అనిపిస్తుంది.
మనకు సినిమా అంటే కేవలం ఒక సరదా. సినిమాలలో జరిగే విషయాలు మామూలు జీవితాలలో అసలు కనిపించవు. అట్లా కనిపించాలని మనం ఎప్పుడూ అనుకోము. అటువంటి మనకు ఇప్పుడే కాదు అన్న ఈ సినిమా చూస్తే అది విచిత్రంగా కనిపిస్తుంది అనడంలో సందేహం మాత్రం లేదు. ఈ సినిమా యూట్యూబ్‌లో దొరుకుతున్నది. నిజంగా ఆసక్తి గలవారు దాన్ని చూడడానికి ప్రయత్నించండి. కొంచెం ఓపికగా చూడండి. నాకు సినిమాల గురించి రాసినప్పుడు మ్యూజిక్‌తో మూడు గంటలు పద్ధతిలో మొత్తం కథ చెప్పడం అలవాటు లేదు. ఇక్కడ కూడా కథ చెప్పను. చివరకు ఏమవుతుంది అన్న సంగతి అసలే చెప్పను. అప్పుడుగాని ఆరుగురు అయినా సినిమాను చూస్తారు ఏమో అని నా అనుమానం. అకిరా కురొసావా గొప్ప దర్శకుడు. నేను చెప్పవలసిన అవసరం లేదు. మీరు కూడా నాలాగా ఆ విషయాన్ని మీ అనుభవం ప్రకారం తెలుసుకుంటారేమో అని నా ఆశ.