S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీతను బలాత్కారంగా ఎత్తుకుని పోయిన రావణుడు.. ఏడ్చిన సీతాదేవి (అరణ్యకాండ)

రావణుడికి కఠినంగా జవాబిస్తూ సీత, ‘ఏమిరా! దేవజాతులైన యక్షులకు, గుహ్యకులకు నాతుడై సర్వ భూతవంధ్యుడైన కుబేరుడి తమ్ముడివై, ఇలాంటి పాపపు పని చేయదల్చావు. ఛీ! సిగ్గులేనివాడా! ఇంద్రియాలను జయించలేని నిన్ను రాజుగా కలవారైనందున నీ మూలాన్న రాక్షసులందరూ చస్తారు. ఓరీ! ఇంద్రుడి భార్య శచీదేవిని అపహరించినా ఏదో ఒక విధంగా బతికితే బతకవచ్చేమో కానీ రామచంద్రమూర్తి భార్యను అపహరించి మళ్లీ బతకడం నీకు సాధ్యమా? (చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెప్తూ సీత) ఓరీ! చెడ్డ మనస్సు కలవాడా! ఇంద్రుడి భార్యను హరించినా బతకవచ్చేమో కానీ రామచంద్రుడి భార్యనైన నన్ను నీచపు మాటలు అనడం వల్ల నువ్వు అమృతం తాగినా మోక్షం రాదు. ఇక హరిస్తే ఏమవుతావో ఆలోచించు. మృత్యువు నుండి నీకు విడుదల లేదు’ అన్నది.
సీతాదేవి ఇలా కఠినంగా రావణుడిని నిందించగానే రావణుడు కోపంతో శరీరం తెలియకుండా, భుజాలు ఎగురవేస్తూ అన్నాడిలా. ‘బుద్ధిలేనిదానా! నా పరాక్రమం చెప్తా విను. నేను ఆకాశంలో నిలబడి భూమిని రెండు చేతులతో పైకి ఎత్తమంటావా? మృత్యుదేవత మొర్రో అని ఏడుస్తూ వుండేలా యుద్ధంలో మొత్తమంటావా? హిమవత్పర్వతాన్ని బద్దలయ్యేట్లు కొట్టమంటావా? సూర్యుడిని నేల మీదికి తోయమంటావా? సముద్రంలోని నీళ్లన్నీ తాగమంటావా? ఓసీ! మూఢురాలా! కోరిన రూపాన్ని ధరించగలిగి, మన్మథాకారం కల నిన్ను, సర్వ సుఖాలను కలిగించే నన్ను, నాథుడిని, నా నిజ స్వరూపం చూడు’ అని అంటూ సీతను భయపెట్టడానికి తన నిజ స్వరూపాన్ని చూపించాడు.
దొంగ సన్యాసి వేషాన్ని వదిలి ఆ దుష్టుడు పది తలల, ప్రళయకాలంలో సూర్యాగ్నిలాగా మితిమించిన తేజం కల, బంగారు కుండలాల, కోపంతో కూడిన, నల్లటి మేఘంతో సమానమైన, విల్లు బాణాలు కల కాలుడితో సమానమైన తన శరీరాన్ని చూపించాడు. ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎర్రటి కళ్లతో, ఎండాకాలంలోని సూర్య తేజస్సు వేడిమితో, విజృంభించి, కఠినమైన మాటలతో రావణుడు సీతాదేవితో ఇలా అన్నాడు.
‘వినవే సీతా నా మాట! నీ మనస్సులో నీ యోగ్యతకు సరిపోయే భర్తను, ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన వాడిని కావాలనుకుంటున్నావా? కళ్యాణీ నన్ను చూడు. నేను అలాంటి పొగడ్త కలవాడిని. నీ మీద ప్రేమ వున్నవాడిని. నీకిష్టం కాని పని ఎన్నడూ చేయను. నా మాట విని ఆ మనుష్యుడిని మరిచిపోయి ధనుజుడనైన నన్ను కూడి నాకు శుభం కలిగించు. ఓసీ! బుద్ధిలేనిదానా! నువ్వు తెలివి కలదాని వనుకుంటున్నావు కానీ నీకు తెలివే లేదు. నీకు తెలివే వుంటే, ఒక ఆడదాని మాట ప్రకారం, రాజ్యాన్ని, స్నేహితులను, బంధువులను, అందరినీ వదిలి, క్రూర సర్పాలు, ఏనుగులు, మృగాలు, రాక్షసులు సంచరించే అడవిలో తిరుగుతూ, శత్రువులను ఎదిరించి రాజ్యాన్ని సంపాదించుకునే ధైర్యం లేని దరిద్రుడిని ఎలా మోహిస్తావు? ఏం గుణాలు చూసి మెచ్చావే?’ ఇలా అని అంటూ రావణాసురుడు, అయ్యో! వీడు చెడిపోతున్నాడే? అని స్నేహభావంతో మంచి మాటలు చెప్తున్న సీతను కామంతో పరవశుడై, పట్టుకున్నాడు.
రావణుడు, ఎడమచేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడిచేత్తో తొడలను, శీఘ్రంగా పట్టుకుని, తన మాయారథం అక్కడికి రాగానే, ఆ క్రూరుడు భయంకరమైన బెదిరించే మాటలతో బెదిరించి, బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, రథంలో వేశాడు. ఆ సమయంలో యముడితో సమానమై, తీక్షణంగా ప్రకాశించే కోరలతో, పర్వతమంత శరీరంగల ఆ రాక్షసుడిని చూసి వనదేవతలు భయంతో అడవుల్లోకి పరుగెత్తారు. ఈ విధంగా ఆకాశంలో శీఘ్రంగా పోయే రథం మీద కడు బాధతో సీతాదేవి పిచ్చిపట్టినట్లు భ్రమ చెందిన దానిలాగా ఏడ్చింది.
(సీతాదేవిని రావణుడు ప్రత్యక్షంగా తాకాడా? లేదా? అనే విషయం చర్చనీయాంశం. వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. రామచంద్రమూర్తి మాయామృగం వెంట పోయినప్పుడు అసలు సీతను దాచి మాయా సీతను ఆశ్రమంలో ఉంచాడనీ, రావణుడు తాకింది ఆమెనేననీ కొందరి వాదన. సీతాదేవి చుట్టూ గిరిగీసి, దానిన సీత దాటిపోవలదని లక్ష్మణుడు, రాముడి కొరకై పోయేటప్పుడు చెప్పినట్లు మరికొందరి వాదన. రావణుడు పెళ్లను తీసుకుపోయాడే కానీ సీతను తాకలేదని వారంటారు. రావణుడు అపహరించినది మాయా సీత అనడానికి వాల్మీకి రామాయణంలో ప్రమాణం లేదు.)
రావణుడు ఎత్తుకుపోతున్న సీత రామలక్ష్మణులను తలచుకుంటూ ఏడ్చిందిలా. ‘అయ్యో! లక్ష్మణా! పెద్దల పాదసేవ చేయడంలో ఆసక్తి ఉన్నవాడా! మీరు ఖరాదులను చంపాడన్న కోపంతో ఈ పాపాత్ముడు బలవంతంగా నన్ను దొంగిలించి ఎవరి అడ్డం లేకుండా పోతున్నాడు. మహా భుజబలం కలవాడా! ఇది నీకు తెలియదా? ఆశ్రీత రక్షణార్థివైన రామచంద్రా! నీ ఆశ్రీతురాలైన నన్ను వీడు ధర్మం తప్పి తీసుకుపోవడం చూడలేదా? రామా! న్యాయాన్ని ధిక్కరించి తిరిగే దుష్టులను శిక్షించే నువ్వు నన్ను దొంగిలించిన ఈ దుష్టుడిని ఎందుకు వదుల్తున్నావు? పాపాత్ముడా! రావణా! నీ పాపఫలం వెంటనే అనుభవానికి రావు. కొంతకాలానికి అవి పక్వాలై ఫలితమిస్తాయి. నువ్వు చేసే పాపానికి ఫలితం త్వరలోనే అనుభవిస్తావు. నీకు చెడిపోయే కాలం దాపురించినందున రావణా! ఇలాంటి పాపకార్యం చేయడానికి వచ్చావు. కాబట్టి శత్రువులకు మృత్యువైన శ్రీరాముడి చేతిలో నీ ప్రాణాలు పోతాయి.’
‘అయ్యో! కైక మాకు ఇలాంటి ఆపద రావాలని కోరికదా, మమ్మల్ని అడవులకు పంపింది? ధర్మాత్ముడైన రాముడి భార్యను నన్ను, ఈ నీచుడు అపహరించడం వల్ల కైక కోరిక నెరవేరింది కాబట్టి, ఇక ఆమె తనకు కావాల్సిన వాళ్లతో పూర్తిగా సుఖ పడుతుంది. అడవిలోని పూలతో, పండ్లతో నిండివున్న వృక్ష సమూహాల్లారా! తీగల్లారా! ఆకాశాన సంచరించే వాళ్లూ, మీరు రాముడిని చూసినప్పుడు సీతను రావణుడు అపహరించాడని దయతో చెప్పండి. మాల్యవంత పర్వతమా! దేవా విరోధి అయిన రావణుడు నీ భార్యను అపహరించి తీసుకుని పోతున్నాడని రాముడికి చెప్పు. గోదావరీ నదీ! నీకు దండం.. దండం. కోదండ ధరుడైన రాముడితో నీ భార్యను రావణుడు అపహరించాడని చెప్పు. అడవిలోని చెట్ల మీద వుండే దేవతా సమూహాల్లారా! దండకలో నివసించే నానా విధమైన పక్షి నాయకులారా! మృగ నాయకులారా! మీకు నమస్కారం. నా మీద దయ వుంచి శ్రీరాముడి దగ్గరకు పోయి నా గతి ఇదీ అని చెప్పండి. మీకు దయ వుంటే త్వరగా చెప్పండి. ఓ పర్వతాల్లారా! తన ప్రాణం కంటే ఎక్కువైనా సీతను రావణుడు హరించాడని, రక్షించమని శ్రీరాముడికి చెప్పండి. పర్వతాల్లారా! నా మీద దయ వుంచి ఈ మాత్రం మాట సహాయం చేస్తే, ఆ తరువాత నేను స్వర్గంలో ఉన్నా, యమలోకంలో వున్నా, రామచంద్రమూర్తి నన్ను విడిపిస్తాడు.’
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12