S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఆవడి’ యుద్ధ టాంకుల ఫ్యాక్టరీ!

వి.కె.కృష్ణ మీనన్ మన దేశానికి రక్షణ మంత్రిగానే కాదు - ఇంగ్లండ్, అమెరికాలకు దౌత్యాధికారిగా కూడా వెళ్లాడు. సమితిలో మన దేశ ప్రతినిధిగా కాశ్మీర్ సమస్య మీద ఎనిమిది గంటల సేపు అనర్గళంగా ప్రసంగించి, పాక్ విదేశాంగ మంత్రికి చెమటలు పట్టించినవాడు. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. చాలా వివాదగ్రస్తుడే కానీ అప్పట్లో నాకు, ఆయనంటే గొప్ప గ్లామర్.
1961 నవంబర్‌లో వి.కె.కె.ని నేరుగా చూసే, మాట్లాడే అవకాశం నాకు లభించింది. ‘ఆవడి’లో భారీ యుద్ధ శకటాల కర్మాగారం యొక్క శంఖుస్థాపనకీ, ‘ఆవడి’లోనే వున్న మిలిటరీ దుస్తుల తయారీ కర్మాగారాన్ని పరిశీలించడానికీ - డిఫెన్స్ మినిస్టర్‌గా వచ్చాడు. ‘ఆవడి’ మద్రాసుకి (చెన్నై అయేదాకా, మద్రాసు అనే రిఫర్ చేస్తాను) నలభై కిలోమీటర్ల దూరంలో వుంది. వైజయంత్ యుద్ధ టాంకు టి-72 మరటాంకులు తయారుచేసే ఈ ఫ్యాక్టరీ ఫంక్షన్ కవరేజ్‌కి వెళ్లాను.
అదో థ్రిల్లింగ్ జ్ఞాపకం. ఆరు బయట అరవై డెబ్బై ఎకరాల స్థలంలో. హోరున శీతగాలి - షామియానాల క్రింద ఏర్పాట్లు చేశారు. అవి గాలికి లేచిపోతున్నాయి. వి.కె.కృష్ణమీనన్ గారిని చూడాలని - సినీ ఫ్యాన్‌లాగ కోరిక. పెద్దపెద్ద విలేకరుల బృందం మధ్య - మేకపిల్లలాగ ఒదిగి ఉండి ఎదురుచూస్తున్నాను. అతని వాగ్ధాటిలాగా ఉంది వాతావరణం కూడా. ఆయన వరసాగ్గా, ‘ప్రెస్’ వాళ్లని పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ‘ముక్కు’ - అది గ్రుచ్చుకుంటుందా, అన్నట్లుంది మన యిప్పటి గవర్నర్ నరసింహన్ గారి ‘ఎర్రసూది ముక్కు’ చూసినప్పుడల్లా వి.కె.కృష్ణ మీనన్‌గారి ‘నల్లసూది ముక్కు’ జ్ఞాపకం వస్తుంది నాకు. షేక్‌హ్యాండ్ ఇచ్చాడాయన. (అబ్బ! గరుకుగా ఉంది) మురిసిపోతూ, చూస్తున్నాను, గానీ నవంబర్ గాలికి స్వెటర్ లాంటిది వేసుకుని కూడా, ముడుచుకు పోతున్నాను. ఆయన, నా స్వెటర్ కాలర్ పట్టుకుని, యిలా గుంజి ‘వ్వాట్‌యంగ్ మ్యాన్! చలేస్తోందా? నన్ను చూడు. అసలు కోటు కూడా లేదు. బీ యే బ్రేవ్ మలయాళీ బోయ్!’ అంటూ ప్రశంసించాడు. ఆనందాతిరేకంలో కూడా ‘కంగు’తిన్నాను.
నా సన్నని మీసకట్టు (ఇంకా బాగా రాని) ఉంగరాల నల్లని జుట్టు, నా ‘రంగు’ - ఇవి చాలాసార్లు మద్రాసు సెంటర్లలో - నేను మళయాళీనేమోననే అనుమానం కలిగించేవి. ‘మణి ఎన్నా?’ అంటే ‘టైమెంతా?’ అనడానికి బదులు, మళయాళంలో ‘ముక్కుతో’ అడిగేవారు నన్ను.
అద్సరే.. మీనన్ గారు గార్మెంట్ ఫ్యాక్టరీ అంతా తిరిగి పని తీరు, దుస్తుల ‘స్టాకు’, వగైరాలన్నీ చూశాకా - మేం ‘తోక’లాగా వుండాలిగా (అదే ‘ప్రెస్’ అవడం అంటే) వున్నాం. ఆనక గంభీరంగా చైనా, పాక్‌ల ప్రస్తావన చేస్తూ - వైజయంత్ టాంకులు రణరంగంలోకి వస్తే ఎలా ఆ శతఘు్నలు శత్రువు గుండెల్లో ‘దడ’ పుట్టిస్తాయో - అవీ మాట్లాడి అదరగొడుతూ వుంటే - పత్రికల వాళ్లకు షామియానాల క్రింద బల్లలు వేసి, వాటి మీద లౌడ్ స్పీకర్ డబ్బాలు పడేశారు. రాసుకోండన్నారు. జ్వరం వచ్చేసినంత పనయింది. ఐతేనేం? మీనన్‌గారితో కరచాలనం చేశాను. మాట్లాడాను. భుజం తట్టాడాయన. విన్నాను. అది చాలదా? అదే హుషారు.
ఆనక, లేచాం. గవర్నమెంటు పి.ఐ.బి. శాఖ పీఆర్‌వో ఒకరు ‘ప్రెస్సు’ వారికి తయినాతుగా వచ్చి కూల్‌డ్రింకులు, చాయ్, సిగరెట్‌లు వగైరాలు ఇచ్చి - ఖుషామత్ చేస్తూ - తిరిగి వాళ్ల వ్యాన్ ఎక్కించారు. ట్రిపిల్ కేన్‌లో కాబోలు వాళ్ల ఆఫీసు, అక్కడికి చేరాకా గవర్నమెంట్ వ్యాన్‌లో నుంచి విలేఖరులను తిరిగి అక్కడే వదిలేశారు.
ఇక వ్యాన్‌లో మా ‘వృత్తి’లో స్టాల్ వార్ట్స్ -ని చూశా. అందులో హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్‌మన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, పిటిఐ, యుఎన్‌ఐ, హిందుస్థాన్ సమాచార్ (హిందీ) వీటన్నిటి ‘అతిరథులు’ వున్నారు. వాళ్ల సరసన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చూస్తున్నా. వారిలో నలుగురికైనా (‘ఎయిరోడ్రోములు’) అంటే, బట్టతలలున్నాయి. ‘పండి’పోయారన్న మాట! వాళ్లల్లో వాళ్లు కూడబలుక్కుంటున్నారు. మీనన్‌గారి ప్రసంగంలో ఏది ‘హైలైట్’ అన్నది ఆరా తీసుకున్నారు. నోట్స్ కంపేర్ చేసుకున్నారు. ‘అందరం ‘లీడ్’ ఒకటే కొడదాం. ‘బాడీ’ (లోపలి మేటర్) మన యిష్టం’ అని తీర్మానించుకున్నారు పిటిఐ ని. ‘ఇంట్రో’ కొట్టబ్బా’ అన్నారు. ఆ పాయింట్లు నేను కూడా ఎక్కించుకున్నాక, మనస్సు కాస్త కుదుటపడ్డది - బ్రతికాను దేవుడా.
ఉదయం అయిదు గంటలకు లేచాను. మెల్లిగా ఆఫీసుకు తిరిగి చేరేసరికి ఒంటి గంట అయింది. బరబరా రాసుకుపోతున్నాను ఐటమ్. వాళ్లు ఇచ్చిన బులిటెన్లు, ‘హ్యాండ్ అవుట్’లు, కాగితాలు అవీ ముందేసుకున్నాను. ‘తన్నీకొండువా’ అంటున్నాను. (మంచినీళ్లు పట్రా అని) ప్రకాశరావుగారిని ఇక మీదట ‘పి.ఎస్.’గా రిఫర్ చేస్తాను. ఆయన నవ్వుతూ వచ్చాడు. ‘ఏంటి, వ్యాస మహర్షీ రాసేస్తున్నాడు?’ అంటూ. ‘అసలు స్పీచ్ తలకి ఎక్కిందా?’ అన్నాడు. ‘అవతల పిటిఐ మిషన్ మీద ఏమిస్తున్నాడో తీసి పట్రా, శంకరూ!’ అని చెప్పాడు శంకర్‌కి.
‘లీడ్ పెట్టాను. ఎనిమిది కాలమ్స్ బ్యానర్ మాత్రమే మీ వంతు’ నవ్వాను. ‘కాదులే.. ఆగు’ అన్నాడు. ఆయనకి ఎప్పుడూ పిటిఐ ఏమిస్తే అది వేదం! శ్రీరాములుగారు ‘అంతా ఓకేనా?’ అన్నట్లు చూస్తూ నవ్వారు. ‘ప్రకాశరావు చూసుకుంటాడులే.. రాసి పడేసి పో...’ అంటూ ‘సైగలు’ చేశారు ‘్భజనానికి పో’ అన్నట్లు.
పిటిఐ ఏమిచ్చాడో టెలిప్రింటర్‌కు (దీన్ని ‘టిక్కర్’ అని రిఫర్ చేస్తాం) అని పరిగెత్తాను. మొత్తానికి పి.ఎస్.గారు ‘డాక్’కే, నా అయిటమ్‌ని ‘అర్జెంట్’ అని దాని మీద మార్క్ చేసి పంపేశాడు.
‘ఏడో తారీఖు దీపావళి సంచిక ఆదివారం మేటర్ ఈవ్నింగ్ సిక్స్‌కి వచ్చి చూసుకుంటానంటూ’ లేచా. శ్రీరాములుగారు తల పంకించారు. ఇక పి.ఎస్.కి చెప్పలేదు. తోటకూర కాడలా వాడిపోయి - క్రిందికి దిగుతూంటే - వెనుక నుంచి ‘వుండరా అయ్యా! నేనూ డ్యూటీ దిగుతున్నా’నంటూ రామప్రసాద్ కేకేశాడు. అతనికి నేనంటే అమిత వాత్సల్యం. ఇష్టం. ‘పద. బండెక్కుదువుగాని. మీ ‘నాయన’ ఇంటికి (అదే, రూముకి) వొచ్చేపాటికి తిరిగి దింపుతాలే’ అన్నాడు. అతనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్‌సైకిలుంది. పిడికిట సిగరెట్ బిగించి - వో దమ్ము లాగి, దాన్నక్కడ పడేసి, ‘ఇక లాగించనులే’ అన్నాడు. పైకి, మా బిల్డింగ్ వైపు వ్రేలెట్టి చూపించాను. ఇలా పోయి, వెంటనే దిగుతాను అన్నాను. ‘పోయిరా, నేనిక్కడే మరో దమ్ము లాగిస్తూ నిలబడతా’నన్నాడు. అసలు సంగతి, నేను, వాష్‌రూమ్‌కి, సాధ్యమైనంత వరకూ ఎక్కడా పోను. పైకి పోయి, మొహం కడుక్కుని నాన్నగారికి, బల్ల మీద ‘స్లిప్’ పెట్టాను. ‘రాంప్రసాద్‌తో వెళ్తున్నా. భోజనం చేసెయ్యండి, లేటవుతానేమో?’ నంటూ రాశాను. రాంప్రసాద్ నాటకాలు రాయడం, ఆడించడం, పుంఖానుపుంఖాలుగా చారిత్రిక నవలలు రాయడం - అన్నీ చేసినవాడు. అతనికి శిష్యకోటి జాస్తి. సినిమా నటులలో (వర్ధమాన) అతన్ని ‘గురూజీ’ అంటూ, అతని చేత తిట్లు కూడా హ్యాపీగా తినేవాళ్లుండేవారు. గానీ, ‘నీ దగ్గర నాకు ‘బెయ్యం’ అనేవాడు. నా ‘తొలిమలుపు’ నవలని అనలైజ్ చేశాడు.
బండి మీద ఎక్కించుకుని, మవుంట్ రోడ్ బుహారీ హోటల్ అప్‌స్టెయిర్స్‌కి తీసుకెళ్లాడు. ‘వామ్మో! అక్కడ ఎంత రష్‌గా ఉందో? ‘పంజాబీ లస్సీ’ అంటే ఏమిటో, రుచి చూశానక్కడ. రాంప్రసాద్‌కి టి.నగర్‌లో ‘చిత్ర’ సినిమా పత్రిక యజమాని, ఎడిటర్ అయిన - నరసింహారావు ఒక శిష్యుడు. ఆత్మీయుడు. ‘అక్కడ వాడింటి దగ్గర్నుంచి నీకు క్యారియర్ తెప్పిస్తా. వేడివేడి మిరియాల చారూ, అన్నం తిందువు’ అన్నాడు నవ్వుతూ రా.ప్ర.
‘నాన్నగారో?’ అన్నాను. మేటర్ రాయాలి సండే ఎడిషన్‌కి - నాన్నగారు వెయిట్ చేస్తారు’ అన్నాను. ‘ఓకే.. ఆర్టికల్ రాత్రి నాయన పండుకొన్నాక రూమ్‌లో రాయి. ప్రొద్దున్న ప్రెస్‌లో తగలెట్టు’ అంటూ, అలా ట్రిప్లికేన్ బీచ్ మీదుగా ఓసారి త్రిప్పి - చైనా బజార్‌లో దింపేశాడు. ‘నువ్వు అంత దూరం తిరిగి పోవద్దా?’ అంటూ కృతజ్ఞతా భావంతో అన్నాను.
‘ఏంటంటావే (మరీ ముద్దొస్తే ‘వే’ అనో, ‘రా’ అనో అనేవాడు) ఏం చేద్దాం? మీ రూమ్‌లో పండుకోనా, వచ్చి? కానీ, అవతల రాత్రికి ‘సెషన్’ ఉంది. ధనికొండ బ్రహ్మానందరావు లాంటి వాళ్లు వస్తారు. నే పోకపోతే గోలెడతారు’ అంటూ నసిగాడు.
ఓకే.. అతను బందీ మట్టేశాకా’ నాలుగు నిమిషాలకి తేరుకుని, వోపిక లేక, మెల్లిగా కాళ్లీడ్చుకుంటూ బిల్డింగ్‌కి చేరుకున్నాను. నో ‘లిఫ్ట్’ ఏడున్నరకే బంద్ అది. నాన్నగారు క్యారియర్ అలా పెట్టి, బీడీ కాల్చుకుంటూ తలుపు వేపే చూస్తూ నిరీక్షిస్తున్నారు. ‘సారీ! మీరు తినేసి వుండాల్సింది’ అనాలనుకున్నాను. కానీ, నోరు పెగల్లేదు. నేను చేతులు కడుక్కుని వచ్చేలోగా ఐదు గినె్నల పెద్ద క్యారియర్ ఒక దాని తర్వాత ఒకటిగా - ఓపెన్ చేసి, గినె్నలు పెట్టేశారు వరసగా. నిన్నటి మెయిల్ పేపర్ ఇప్పి - దాని మీద అరిటాకులు పరిచి - నీళ్లు చల్లటం కూడా పూర్తి చేశారు. పగలు నాన్నగారికి ‘నో మీల్స్’. ఆఫీసులో తేలికపాటి టిఫిన్ తినేవారు. రాత్రి, నాకోసం, డబుల్, అయిదు గినె్నల (పెద్దపెద్ద గినె్నలు) క్యారియర్ తెప్పించేవారు. అది నర్సయ్యగారి సంతానంలో ఎవరో ఒకరు విజయా లాడ్జి నుంచి తెచ్చి పెట్టేస్తారు. మేము తినేదాకా నిరీక్షిస్తారు. ఎందుకంటే మేం ఇద్దరం ఆ క్యారేజీలో నాలుగో వంతు కూడా ‘లాగించలేం’. దండిగా సాంబారు, రసం (చారు) మోరు (మజ్జిగ) వుండిపోతాయి. వాళ్లకి అన్నం కూరలు (దిక్కుమాలిన కూరలు తినలేం) అక్కరలేదు. రసం, సాంబారు మాత్రం కావాలి. అన్నం వండుతుంది మంగమ్మ. పిల్లలు అందులో ఇవి వేసుకు తినేస్తారు.
‘పాపం! వాళ్లు ఆకలి మీదున్నార్రా’ అనేవారాయన, నేను లేటయితే. వాళ్లకీ ‘సప్పరు’ లేటు ఆ రోజు.. గొప్ప అరేంజ్‌మెంట్ నాన్నగారిది. అరిటాకుతో సహా పేపర్‌ని - మసాలా దోసె ప్యాకెట్‌లాగా చుట్టచుట్టి కిటికీలోంచి నడవలోకి తాపీగా పడేసేవారు. ప్రొద్దునే్న స్కావెంజర్ బోయ్‌కి పైసలిచ్చే ఏర్పాటు చేశారు. గప్‌చిప్‌న తెల్లారే పాటికి - కిటికీ ప్రక్క నడవ నీటుగా చేసేసేవాడు. నేను ఓసారి ‘చక్కర్’ కొట్టి - రౌండ్ మెట్లుండేవి, వెనుక నుంచి. వాటి మీదుగా దిగేవాణ్ని కిందికి సరదాగా.
బెజవాడ వచ్చేకా - ‘ఆ క్యారేజీని మాత్రం ఒక మొమెంటో లాగా దాచీ, ‘అమ్మా! అదే మాకు అన్నం పెట్టేది’ అనేవాణ్ని. సరే, రాత్రి కూర్చుని, ‘దిబ్బు, దిబ్బు దీపావళీ’ వ్యాసం రాశాను. కృష్ణమీనన్‌గారు అడ్డం పడుతూ వున్నా - దీపావళీ గేర్‌లోకి వెళ్లిపోయాను. లైట్‌హవుస్ సాక్షిగా - నన్ను రాత్రి తెల్లార్లూ -వి.కె.మీనన్ గారి గుర్రం బుర్రా, సూది ముక్కూ - ఆయన స్పీచ్ వెంటాడాయి...
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com