S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మ వీలునామా

‘అమ్మని ఒక్కదానే్న వదిలి రాలేనంటే ఎలా? మరి అమెరికా వెళ్లి ఎమ్మెస్ ఎందుకు చేసినట్టు? ఇక్కడ చిన్నచిన్న ఉద్యోగాలు చేయటానికా?’ భర్త వేణుని నిలదీసింది కళ్యాణి.
చెవి కింద జోరీగలా నస పెడుతున్న భార్యకు నచ్చజెప్పటానికి విఫలయత్నం చేస్తున్నాడు వేణు. ‘అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడా ఉంది కళ్యాణీ! అప్పుడు నాన్నగారు ఉన్నారు. అక్క కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు నాన్నగారు పోయారు. బావగారి ఉద్యోగరీత్యా అక్క అమెరికా వెళ్లిపోయింది. ఇప్పుడు మనం కూడా అమెరికా వెళితే అమ్మని ఎవరు చూసుకుంటారు?’
అరిగిపోయిన రికార్డులా భర్త చెప్పే మాటలతో కళ్యాణికి విసుగొచ్చింది. ‘అంటే మన బతుకులు ఎనే్నళ్లు గడిచినా ఇలాగే ఉండిపోవాలా? మనకు మాత్రం ఆశలు ఉండవా?’ అని ఒక్క క్షణం ఆగి, ‘మరొకసారి ఆలోచించు వేణూ? పోనీ అత్తయ్యగారిని కూడా మనతో తీసుకెళ్దాం. ఆవిడకి రావటం ఇష్టం లేకపోతే ఇక్కడే ఏదైనా ఓల్డేజ్ హోంలో చేరుద్దాం’ అంది నచ్చజెపుతున్నట్లుగా.
వారం రోజుల నుంచి కొడుకు, కోడలు మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉంది సుభద్ర. కోడలి వాదనా పటిమ ముందు కొడుకు ప్రతిసారీ ఓడిపోతూనే ఉన్నాడు. ఏదో ఒకనాడు కళ్యాణి వాదనను వేణు అంగీకరించక తప్పదు.
భార్య పోరు రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈలోపు తను పనిచేస్తున్న కంపెనీలోనే, ఏదో కొత్త ప్రాజెక్టు పుణ్యమాని అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. రాకరాక వచ్చిన అవకాశం అతన్ని అమెరికా వైపు లాగటంతో, వేణు భార్య చెప్పిన దానికి అంగీకరించాడు.
తల్లి ఏమనుకుంటుందో అని సందేహిస్తూనే, నిదానంగా ఆమెకు తన విదేశీ ఉద్యోగం గురించి చెప్పాడు. సుభద్రకు విషయం ముందే తెలుసు కనుక అంతగా ఆశ్చర్యపోలేదు. ఆమె విని ఊరుకుంది. తల్లి వౌనం అతడిని మరింత భయపెట్టింది.
వేణు తల్లిని ఒప్పించటానికి నానా తంటాలు పడుతుంటే, కళ్యాణి వచ్చి ‘మీరేం దిగులు పడకండి అత్తయ్యగారూ! అయిదారేళ్లుండి మళ్లీ ఇండియా వచ్చేస్తాం. అంతవరకు మీరు అన్ని సౌకర్యాలు ఉన్న ఆశ్రమంలో ఉందురుగాని. డబ్బు ఎంతైనా ఫర్వాలేదు’ అంది.
సుభద్ర నిర్లిప్తంగా చూస్తూ ‘ఈ వయసులో నేనెక్కడ ఉంటే ఏంలేమ్మా? మీ భవిష్యత్తుకు అడ్డు రాకుండా ఉంటే అదే చాలు’ అంది.
తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదని అర్థం అవుతూనే ఉంది. కానీ భార్య మాటలు, పిల్లల భవిష్యత్తు, అమెరికా జీవితం అన్నీ కలిసి ఆ మాతృమూర్తి ఆవేదనను పక్కకు నెట్టేశాయి.
వేణు అక్క సునీతకు ఫోన్ చేసి అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చుతున్నట్లు చెప్పాడు. అక్కా తమ్ముళ్లిద్దరూ కాసేపు వాదులాడుకున్నారు.
చివరికి కళ్యాణి జోక్యం చేసుకుని సునీతను కూడా ఒప్పించింది.
అమెరికా వెళ్లటానికి నాలుగు రోజుల ముందే తల్లిని తీసుకెళ్లి అన్ని వసతులు ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చాడు.
ఏసీ, టెలివిజన్, వార్తాపత్రికలు, ఇంటర్‌కామ్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న విలాసవంతమైన గదిని, అద్దె పాతికవేలైనా లెక్కచేయకుండా, తల్లి కోసం ఏర్పాటు చేశాడు. వెళ్లే ముందు అక్కడున్న సిబ్బందికి అనేక జాగ్రత్తలు చెప్పాడు. తల్లి పట్ల ఆ తనయుడికి ఉన్న ప్రేమ చూసి వాళ్లు ఎంతో ముచ్చటపడ్డారు.
కొడుకు వెళ్లిపోయిన తర్వాత సుభద్రని ఒంటరితనం ఆవహించింది. ఆమె మదిలో భర్త జ్ఞాపకాలు మెదిలాయి. ఆయన తననెంత అపురూపంగా చూసుకున్నాడు. తన అత్త,మామలు కూడా తనకి ఏనాడూ ఏ లోటూ రానివ్వలేదు. పొంగుతున్న దుఃఖాన్ని బలవంతంగా అణచి పెట్టుకుంది.
సునీత అమెరికా వెళ్లే ముందు ‘అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఏ లోటూ రానివ్వకు. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను అమెరికా వెళుతున్నాను’ అని తమ్ముడితో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
తరువాత మనవడు, మనవరాలు గుర్తుకొచ్చారు. ‘నువ్వూ మాతో వచ్చేయి బామ్మా’ అని ఆ పిల్లలు మారాం చేయటం గుర్తొచ్చింది. ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. గుండెల్లో ఏదో గుబులుగా ఉంది. ఆమెకి అక్కడ ఉండబుద్ధి కాలేదు.
సుభద్ర నేరుగా ఆశ్రమం ఆఫీసుకి వెళ్లి ‘ఇక్కడ ఈ గదిలో నేను ఒక్కదానే్న ఉండలేను. ఇది నాకు బందిఖానలాగా ఉంది. నేను ఉమ్మడి కుటుంబాల్లో సందడిగా పెరిగినదాన్ని. నలుగురితో కలిసి ఉండే అవకాశం లేదా?’ అనడిగింది.
ఆశ్రమ కార్యదర్శి గోవిందరావు ‘కొత్త ప్రదేశం కదమ్మా. నాలుగు రోజుల్లో అలవాటు అవుతుంది. ఇది కూడా మీ ఇల్లే అనుకోండి. మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు’ అన్నాడు.
ఆమె పరిసరాలను పరికించి చూస్తూ ‘అందరూ ఎవరి గదుల్లో వాళ్లున్నట్టున్నారు. అందరూ కలిసి ఒకేచోట ఉంటే బాగుంటుంది కదా! ఒకరికొకరు తోడుగా ఉంటారు’ అన్నాడు.
అతను కాస్త తటపటాయిస్తూ ‘అనాధలు, ఏ దిక్కూ లేనివాళ్లు, ఆర్థిక స్తోమత లేని వాళ్లు ఉండటానికి సామూహిక వసతి ఒకటి ఉందమ్మా. కానీ మీలాంటి వారు అక్కడ ఉండలేరు’ అన్నాడు.
సుభద్ర కాస్త ఊపిరి పీల్చుకుని ‘నాకా పట్టింపులేం లేవు బాబూ! నేను కూడా అక్కడే ఉంటాను’ అంది.
కార్యదర్శి నొచ్చుకున్నాడు. ‘వేలకు వేలు డబ్బు కడుతూ మీరు అక్కడ ఉండటం ఎందుకమ్మా? సామూహిక వసతి పూర్తిగా ఉచితం. పైగా అక్కడ కాస్తోకూస్తో ఓపిక ఉన్న వాళ్లు చిన్నచిన్న పనులు కూడా చేస్తుంటారు. అయితే అది తప్పనిసరి మాత్రం కాదు’ అన్నాడు.
ఆమె పట్టువదలకుండా ‘్ఫర్వాలేదు. నేనూ వాళ్లతోనే ఉంటాను. నాకు చేతనైన పనులు చేస్తాను. నాకు ఉచితంగా అవసరం లేదు. మీ డబ్బులు మీరు జమ చేసుకోండి’ అంది.
అతడు తలాడించి ‘సరేనమ్మా మీ ఇష్టం. ఇక మీ అబ్బాయి ప్రతినెలా డబ్బు పంపనవసరం లేదు’ అన్నాడు.
సుభద్రకు కాస్త ఊరట కలిగింది. ‘నేను ప్రత్యేకమైన గది వద్దంటే వాడు బాధపడతాడు. వాడికి ఈ సంగతి తెలియకూడదు’ అంది.
గోవిందరావు ఆమెతో ఏకీభవిస్తూ ‘అవునమ్మా! మీ అబ్బాయికి మీరంటే ఎంతో ఆపేక్ష. ఆయన పంపే డబ్బులు మీ ఖాతాలోనే జమ చేస్తాం. అవసరమైనప్పుడు వాడుకుందురుగాని!’ అన్నాడు.
ఆమె నిర్లిప్తంగా నవ్వుకొని ‘అవును, చాలా ఆపేక్ష’ అని స్వగతంగా అనుకుంది. అతనికి ధన్యవాదాలు చెప్పి, తన మకాం ఏసీ గది నుంచి కామన్ హాల్లోకి మార్చుకుంది.
కొద్ది రోజుల్లో ఆమె అందరితో కలిసిపోయింది. అక్కడ ఉన్న వాళ్లతో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ. ఎవరూ లేని అనాథలు, పిల్లలు ఉన్నా ఇంటి నుంచి గెంటివేయబడ్డ నిర్భాగ్యులు, బతికి చెడ్డవారు చాలా మందే ఉన్నారు.
సుభద్ర దీర్ఘంగా నిట్టూర్చి ‘నేను కూడా ఇంతే కదా! అందరూ ఉన్న అనాధని’ అనుకుంది మనసులో బాధగా.
ఆమె ఆశ్రమంలో ఓ స్వచ్ఛంద కార్యకర్తగా మారి సేవలు చేయసాగింది. వంటలో సాయపడటం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సపర్యలు చేయటం వంటి పనులు చేస్తుంటే ఆమెకు ఎనలేని తృప్తి కలుగుతోంది. ఇంకా సమయం చిక్కితే మొక్కలకు పాదులు చేయటం, నీళ్లు పట్టటం చేస్తోంది.
ప్రతిరోజూ ఉదయం వార్తాపత్రికలు, సాయంత్రం పురాణాలు చదివి అందరికీ వినిపిస్తుంది. ఆమె ఆత్మీయమైన పలకరింపు, సహచర్యం తోటి ఆశ్రమ వాసులకి ఆనందాన్ని ఇస్తున్నాయి.
అమెరికా వెళ్లిన కొత్తలో తరచుగా ఫోన్లు చేసిన వేణు, క్రమేణా ఫోన్లు చేయటం తగ్గించాడు. ఎప్పుడైనా చేసినా ఒక్క నిమిషంలో క్షేమ సమాచారాలడిగి ఫోన్ పెట్టేస్తున్నాడు. మొదట్లో కొంత బాధపడినా తర్వాత్తర్వాత ఆమె కూడా దానికంత ప్రాధాన్యత ఇవ్వటం మానేసింది.
సునీత మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది.
ఇప్పుడు సుభద్రకు తన వాళ్లు దగ్గర లేరనే చింత లేదు. ఆశ్రమంలో ఉన్న వాళ్లందరూ తన ఆత్మీయులే అనుకుంటుంటే, ఆమెకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతోంది.
రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. సుభద్ర ఆ వృద్ధాశ్రమంలో చేరి అప్పుడే రెండు సంవత్సరాలు అవుతోంది. ఈ రెండేళ్లలో ఆమె ఎంతోమంది ఆప్తులను సంపాదించుకుంది.
ఈ మధ్య ఆమెకి తరచుగా ఆయాసం వస్తోంది.
ఆశ్రమంలో ఉన్న డాక్టర్‌కి చూపిస్తే, గుండె జబ్బు లక్షణాలు ఉన్నాయని, ఒకసారి పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చాడు.
గోవిందరావు ఆమెకు ధైర్యం చెప్పి ‘మీరేం దిగులు పడకండమ్మా! ఇవ్వాళ మీ అబ్బాయికి కబురు చేస్తాను’ అన్నాడు.
ఆమె తల అడ్డంగా ఊపి ‘వద్దు బాబూ! నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాడు తట్టుకోలేడు’ అని వారించింది.
తోటి వృద్ధులు ఆమెకు ధైర్యం చెప్పి ‘కనీసం పరీక్షలన్నా చేయించుకోండి. మేమంతా ఉన్నాం కదా తోడుగా’ అన్నారు.
సుభద్ర చిరునవ్వుతోనే తిరస్కరించింది. ఆమె ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
‘కొడుకు డబ్బు పంపుతూనే ఉన్నాడు కదా! ఇంకా ఈ పిసినారితనం ఎందుకు?’ అని కొంతమంది గుసగుసలాడుకున్నారు కూడా.
ఆమె మాత్రం తన మనసు మార్చుకోలేదు. తన రోజువారీ కార్యక్రమాలు ఆపలేదు. ఆమె తీరు చూస్తే ప్రాయోపవేశానికి సిద్ధపడినట్లుంది. కానీ ఆమెలో ఉత్సాహం మాత్రం రెట్టింపు అయింది.
ఒకరోజు పొద్దునే్న గోవిందరావుని పిలిచి అతనికో కవరు ఇచ్చి ‘మా అబ్బాయి వచ్చినప్పుడు ఇది వాడికివ్వండి’ అని చెప్పింది. అతనికి మరో కవరు ఇచ్చి ‘దీనిని మీ ట్రస్టీలకు అందజేయండి’ అని కోరింది.
ఆ రోజు తన పుట్టినరోజని చెప్పి, అందరికీ తనే స్వయంగా పాయసం చేసి వడ్డించింది. ఆ రోజంతా ఆమె ఒక పర్వదినంలా గడిపింది. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించింది. ఆమె ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు కొంతమంది గమనించినా, పెద్దగా పట్టించుకోలేదు.
* * *
రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పనులు మొదలుపెట్టే సుభద్ర - ఇంకా నిద్ర లేవలేదు. ఆమె సన్నిహితులు తట్టి లేపే ప్రయత్నం చేశారు. ఆమె అప్పటికే మహానిద్రలోనికి జారిపోయింది.
వృద్ధాశ్రమంలో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా, విషాదంగా మారిపోయింది.
అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశారు. తను వెంటనే బయల్దేరుతున్నానని, నాలుగు రోజుల్లో అక్కడ ఉంటానని చెప్పాడు వేణు.
నాలుగో రోజుకి అక్క సునీతను, భార్యా పిల్లలనూ వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు వేణు. మార్చురీలో ఉంచిన తల్లి పార్ధివ దేహాన్ని అతనికి అప్పగించారు.
సునీత దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకోవటానికి విఫల యత్నం చేస్తోంది. కళ్యాణి ఏ భావం లేకుండా అక్కడున్న వారితో పొడిపొడిగా మాట్లాడుతోంది. పిల్లలు ఆమెనంటి పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.
వేణు వదనం మ్లానమైంది. ఆఖరి ఘడియల్లో దగ్గర లేనందుకు, మనసులో ఏ మూలో కలిగిన అపరాధ భావన అతడిని ముల్లులా పొడుస్తోంది. పొంగుతున్న దుఃఖాన్ని దిగమింగి, తల్లికి ఉత్తర క్రియలు పూర్తి చేశాడు.

అమ్మ వీలునామా (7వ పేజీ తరువాయ)
మరునాడు గోవిందరావు వచ్చి సుభద్ర ఇచ్చిన కవరుని వేణుకి అందజేశాడు. వేణు కవరు తెరిచి, అందులో ఉన్న లేఖను చదవసాగాడు.
‘కన్నయ్యా! నిన్ను చిన్నప్పుడు ఇలాగే పిలిచేదాన్ని. ఇలా పిలిస్తేనే నేను నీతో చనువుగా మాట్లాడగలను. వేణూ అంటే నాకు కొడుకు కన్నా కోడలి భర్తే గుర్తుకు వస్తాడు. ఈ వృద్ధాశ్రమం వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నువ్వు పంపిన డబ్బు నా ఖాతాలోనే పదిలంగా ఉంది. అందులో నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు. భవిష్యత్తులో నీకు ఉపయోగిస్తుందని - ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనంలో నీ పేరుతో ఒక గది కట్టటానికి, ఆ సొమ్ము మొత్తం విరాళంగా ఇచ్చాను. నా పెంపకం వల్లనేమో, నన్ను దూరంగా ఉంచినా, నాకు డబ్బు పంపావు. మీ పెంపకంలో పెరుగుతున్న పిల్లలు మీకు ఆ మాత్రమైనా చేస్తారన్న ఆశ నాకు లేదు. భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరం ఇప్పటికన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నీ పేరు మీద కడుగుతున్న గది నీకే కేటాయిస్తారు కనుక నా వయసు వచ్చాక మీకు వసతి సమస్య ఉండదు. ఈ ఉత్తరానే్న నా వీలునామాగా భావించమని నా కోరిక. అక్కనీ బావనీ జాగ్రత్తగా చూసుకో. నీకు, కళ్యాణికి, పిల్లలకు నా ఆశీస్సులు.. ఇక ఉంటాను కన్నయ్యా!’ చదవటం పూర్తి చేసి శిలా ప్రతిమలా ఉండిపోయాడు వేణు.
ఆ లేఖలో ఏముందో అర్థంకాని సునీత, కళ్యాణి వేణు వంక ప్రశ్నార్థకంగా చూశారు. వేణు తల్లి లేఖను భార్య చేతిలో పెట్టాడు. ఆమె చదివి సునీతకిచ్చింది.
అత్తగారి వీలునామా చూసిన కళ్యాణికి మొదటిసారిగా భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది.
గోవిందరావు అతని ముందు కొన్ని కాగితాలు ఉంచి, ‘సార్! మీకు మొదటి అంతస్తులో గది కేటాయించాం. వీటి మీద సంతకాలు చేయండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. మీరొచ్చేవరకు అందులో మరొకరికి వసతి కల్పిస్తాం’ అన్నాడు.
వేణు వౌనంగా సంతకాలు చేసి, అక్కడి నుండి బయటపడ్డాడు అక్క, భార్యాపిల్లలతో.
అత్తగారి వీలునామాతో కళ్యాణిలో పశ్చాత్తాపం కలిగింది. ‘మేం తప్పు చేశాం వదినా! ఊహ తెలుస్తున్న పిల్లల ముందే అత్తయ్యగారిని వృద్ధాశ్రమంలో చేర్చాం. రేపు మా గతి ఏమిటి అని తలుచుకుంటేనే భయం వేస్తోంది’ అంది ఏసీ కోచ్‌లో భర్త భుజం మీద తలవాల్చి.
సునీత మనసులోనే బాధ పడింది. ఇప్పటికీ అత్తగారు పోయారన్న బాధ కన్నా, తమ భవిష్యత్తు అత్తగారిలా అవుతుందనే భయమే కళ్యాణి మాటల్లో ధ్వనిస్తోంది.
వేణు అసహనంగా కదులుతూ ‘అది కాదే అక్కా! మేం పంపిన డబ్బుతో దర్జాగా ఉండక, ఆ డబ్బుతోనే మా కోసం గది కట్టించటం ఏమిటి? మా మీద అమ్మకి కోపం పోలేదా లేక నిజంగానే మేం ఇబ్బంది పడకూడదని అలా చేసిందా?’ అన్నాడు.
సునీత కళ్లు తుడుచుకుంటూ ‘వేలకు వేలు తల్లి కోసం ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవటమే కానీ అమ్మకి రవ్వంత ప్రేమని కూడా ఇవ్వలేకపోయాం’ అంది ఆవేదనగా.
వేణు ఉక్రోషంగా అన్నాడు ‘అదేమిటి? ప్రేమ ఉండబట్టే కదా డబ్బెక్కువైనా, అన్ని సౌకర్యాలు ఉన్న ఓల్డేజ్ హోమ్‌లో చేర్చింది’
సునీత తమ్ముడిని మందలించి ‘నువ్విచ్చిన డబ్బుతో అమ్మ అక్కడ ఉండలేదురా. ఆశ్రమం వాళ్ల ఔదార్యంతో ఉంది. చివరి రోజుల్లో అయిన వాళ్లు దగ్గర లేక ఎంత క్షోభ అనుభవించిందో ఎప్పుడైనా ఆలోచించావా? బహుశా నీకు బుద్ధి చెప్పాలనేమో, నిన్ను అక్కడే ఉండమని అమ్మ వీలునామా రాసినట్లుంది’ అంది.
వాళ్ల మాటలు వింటున్న పిల్లలు ‘అయితే మీ ఇద్దరూ బామ్మ కట్టించిన రూములోనే ఉంటారా? మరి మేం ఎక్కడుండాలి?’ అని అమాయకంగా ప్రశ్నిస్తుంటే, కళ్యాణి, వేణు మొహమొహాలు చూసుకున్నారు. సునీత నిర్వికారంగా నవ్వుకుంది.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-బలభద్రపాత్రుని ఉదయ శంకర్.. 9494536524