S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. పుడమిని..

-1-
నేను
భూగోళాన్ని
చరాచర గర్భాన్ని
చేతనా పుడమిని
నా చుట్టూ నేను తిరుగుతూ
మనిషి చుట్టూ తిరుగుతున్న దానిని
పరిణామ చరిత్రకి నేనే నిత్యసాక్షిని
-2-
అఖండాకాశం నా గగనతలం
ఖండఖండాంతర ఖ్యాతి నా విశాలత్వం
నన్ను కౌగిట చేర్చుకుని
ఎగసిపడే సముద్రం
ఆ ఘోషన ఒదిగిన నా జనజీవన ఉచ్ఛ్వాస
జవసత్వాలుడుగుతున్న ప్రాణక్రియల నిశ్వాస
ఇంతేనా ఇంతేనా నా మిగిలిన చరిత్ర.
-3-
నేనుగా నిండాల్సిన చరిత్ర పుటలలో
ఏకదిన ప్రభుత్వ జ్ఞాపిక నవుతున్నాను
వేదికలకు ప్రాసంగికాంశ మవుతున్నాను
పత్రికలకు పతాక శీర్షిక నవుతున్నాను
ఒక్కరోజుకే అపరిమిత వార్త నవుతున్నాను
తక్కిన దినాల అప్రస్తుత మవుతున్నాను
ఇంతేగా ఇంతేగా నా సమకాలీన చరిత్ర
-4-
ఎగదీస్తే మారణహోమాలు
దిగదీస్తే మానభంగాలు
రంగు అక్షరాల హంతక రాజకీయాలు
నలుపు తెలుపుల రాక్షస మత మతలబులు
కత్తులు లేకుండానే కుత్తుకలు తెగే తంత్రాలు
మానవ రూపాన నక్కిన దానవ బాంబులు
ఇంతేలే ఇంతేలే నెత్తురోడుతున్న నా చరిత్ర
-5-
ఎదగటానికి మందు పెరగటానికి మందు
కోయటానికి మందు కరగటానికి మందు
పువ్వవటానికి మందు పండవటానికి మందు
దిగుబడికి మందు ఎగుమతికి మందు
మతమతికి మందు మతిమతికీ మందు
ఏమందైనా నాకు కాదు ఎన్నటికీ మందు
ఇంతేగా ఇంతేగా నా నడుస్తున్న చరిత్ర
-6-
నేను పుట్టుకతో పంచభూత క్షేత్రాన్ని
పరిణామంలో మానవ క్షాత్రాన్ని
ప్రకృతిలో క్షాత్రంలేని క్షేత్ర మవుతున్నాను
ఋతురాజ్యంలో క్షామ మవుతున్నాను
భోగకాంక్షతో వాణిజ్య కామన నవుతున్నాను
జీవ వైవిధ్యంలేని జీవన
వైరుధ్య మవుతున్నాను
ఇంతేలే ఇంతేలే కదులుతున్న
నా క్షత చరిత్ర
-7-
జీవనదులు ప్రవహించాల్సిన మేనిపై
నాగరీకం రహదారుల పరుగవుతోంది
కట్టలు తెగాల్సిన ఏరులకు బదులు
సిమెంటు బస్తాలు తెగుతున్నాయి
పచ్చని చెట్ల స్థానంలో కాంక్రీటు స్తంభాలు
వేడెక్కుతున్న గాజు గోడల ఆకాశ హర్మ్యాలు
పొల్యూషన్‌కి సొల్యూషన్ వెతకని జనరేషన్
ఇంతేనా ఇంతేనా నా వర్తమాన చరిత్ర
-8-
నా మట్టిన తడి తరుగుతోంది
నీటిని నిప్పు పుడుతోంది
పచ్చదనం భగ్గుమంటోంది
వెచ్చదనం అగ్నికీలవుతోంది
అయినా నాలో తరిగిందీ లేదు పెరిగిందీ లేదు
నే నెప్పుడూ సమభాగస్వామినే సహజాతానే్న
అవును, నేను పుడమి తల్లిని, సంసార సారథిని
ఇంతేలే ఇంతేలే నా నిజ చరిత్ర
-9-
నేను పుడమి వేగాన్ని ఖగోళ వేగాన్ని
అయినా మనిషితో మనసుతో పోటీ
రంగులేని నాకు వయసు హంగుతో పోటీ
నేను తోసుకువచ్చి ముందుగా తిష్టవేసిన వేగాన్ని
నా చుట్టూ నేను ప్రదక్షిణనవుతున్న వేగాన్ని
సూర్యుని చుట్టూ పరిభ్రమణ నవుతున్న వేగాన్ని
కణం కణం క్షణక్షణంతో పరిగెడుతున్న వేగాన్ని
చేతనాచేతన సంతతితో పోటీ పడుతున్న వేగాన్ని
భూత ప్రకృతితో తలపడుతున్న వేగాన్ని
యంత్ర ప్రవృత్తితో విద్యుదవుతున్న వేగాన్ని
తంత్ర ప్రబుద్ధతతో దర్శనమవుతున్న వేగాన్ని
ఇంతేలే ఇంతేలే వేగవంత నా చరిత్ర
-10-
ధర్మ రక్షణను నేను శిష్ట రక్షణను నేను
ధర్మం నాలుగు పాదాల నెలకొన్న నేలను నేనే
యుగ యుగానికి ఒక్కో పాదాన్ని కోల్పోయిందీ నేనే
చివరకు ఒక పాదంగా మిగిలిన నేలనూ నేనే
అయినా నాకు నేనుగా ఒక ప్రమోదాన్ని
ఒక ప్రభంజనాన్ని, ఒక ప్రయోజనాన్ని
ఒక ప్రయోగాన్ని, ఒక ప్రబోధాన్ని
ఇంతే ఇంతే నా చిర చరిత్ర
-11-
పుణ్య భూమిని నేను, కర్మ భూమిని నేను
జ్ఞాన క్షేత్రాన్ని నేను, విజ్ఞాన క్షేత్రాన్ని నేను
హోమ గుండాన్ని నేను, పూర్ణ కుంభాన్ని నేను
హిమాలయమూ, అరుణాచలమూ నేనేలే
గురు క్షేత్రమూ, బుధ క్షాత్రమూ నేనేలే
ఖగోళ శక్తీ, జ్యోతిర్మండల వెలుగూ నేనేలే
ఇదే ఇదే నా చెరగని చరిత్ర
-12-
నేను వేద భూమిని నైమిశారణ్య పీఠాన్ని
అరూప తత్వానికి రూప ఆవిష్కరణను
జీవ ధాతువుకు కణ సంస్కృతిని
మట్టిగ ప్రచోదితమవుతున్న పరాన్ని
విరచిత అక్షర ప్రభల కీర్తి కిరీటాన్ని
మానవ వాసనల సంగమ కథనాన్ని
క్షమయా ధరిత్రిని ఆత్మాశ్రయ చరిత్రని

-విశ్వర్షి 93939 33946