S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జటాయువు, రావణుల యుద్ధం( అరణ్యకాండ)

పరాక్రమవంతుడైన రావణుడు ఇంకో విల్లు తీసుకుని, బాణవర్షంలో జటాయువును ముంచేశాడు. బాణాల మధ్యలో పక్షిలాగా కాసేపున్న జటాయువు, తన రెక్కల వేగంతో వాటన్నిటినీ చెదరగొట్టి, బాణాలను, విల్లును తుంచాడు. అంతటితో ఆగకుండా జటాయువు రావణాసురుడి కవచాలను తన రెక్కల దెబ్బలతో పొడి పొడి చేసి నేల మీద పడేశాడు. బంగారు కవచాలలో ప్రకాశించే కంచర గాడిదల రథాన్ని నిలబడేశాడు. చంద్రుడి లాంటి తెల్ల గొడుగును దాన్ని పట్టుకున్న వారితో సహా, చామరంతో కలిపి నేలపడేశాడు. సారథి శిరస్సును ముక్కతో నొక్కి తుంపడంతో, విల్లు విరిగి, సారథి చచ్చి, గుర్రాలు నేలకూలిన రావణుడు, సీతాదేవిని గట్టిగా పట్టుకుని నేల మీద పడ్డాడు. ఇది చూసిన భూతాలన్నీ జటాయువును మేలు మేలంటూ స్తోత్రం చేశాయి. ముసలివాడు, అలసట చెందిన వాడైన మహాబలుడు జటాయువును చూసి, ఇక వీడు ననే్నమీ చేయలేడని సంతోషంతో సీతతో సహా రావణుడు ఆకాశానికి ఎగిరాడు. ఇలా ఎగిరిపోతున్న రావణుడిని చూసి జటాయువు జాలిపడి, తెంపు చేసి, వాడికి అడ్డంగా పోయి, ‘ఓరీ! రామచంద్రుడి భార్యను నువ్వు తీసుకుని పోవడం రాక్షస వంశ సమూల నాశనానికే సుమా!’ అంటాడు.
జటాయువు రావణుడిని పరుషోక్తులతో ఇలా అంటాడు. ‘స్నేహితులతో, చుట్టాలతో, కొడుకులతో, సమూహంతో, మనుమలతో, విషాన్ని మంచినీళ్లలాగా తాగుతున్నావు వివేకహీనుడా! ఇంతమందితో విషం తాగడం ఎలాంటిదో సీతను అపహరించి తీసుకుపోవడం అలాంటిది. బుద్ధిలేని మనుషులు నీలాగే, ఇలాంటి పనిచేస్తే, దుష్ఫలితాలు కలుగుతాయే! అని ఆలోచించక చేయకూడని పని చేసి తరువాత ఆపదల పాలవుతారు. యముడు నీ మెడకు పాశం తగిలించి గట్టిగా ముడి వేశాడు. కాబట్టి నువ్వెక్కడికి పోయినా నీకు చావు తప్పదు. చేప గాలంతో ఎరను మింగినట్లయింది నీ పని. రావణా! వాళ్ల బలపరాక్రమాలు అపరిమితమైనవని తెలియక నువ్వు వాళ్లతో విరోధించావు. వాళ్లు నీకంటే తక్కువవారు కాదు. నువ్విలా తమ ఆశ్రమంలోని సీతను అపహరించడం వల్ల వాళ్లు బాగా కోపం తెచ్చుకుని, నిన్ను బంధువులతో సహా యుద్ధంలో చంపుతారు. చెడిపోవద్దు రావణా! పరుగెత్తకు.. నిలు.. నిలు. ఓరీ! పిరికివాడా! ఈ ఆడదానిని అపహరించి ప్రాణభయంతో పారిపోతున్నావే? ఇది లోకం నిందించే దొంగపని కాదా? శూరుడు ఇలా చేయవచ్చా? నువ్వు శూరుడివైతే కాసేపు ఆగు. రాముడి చేతిలో నీ తమ్ముడు చచ్చినట్లే నువ్వూ యుద్ధంలో చస్తావు. మరణకాలం సమీపిస్తుంటే, తన నాశనానికి పురుషుడు ఎలాంటి పాపపు పని చేస్తాడో, అలాగే నువ్వు నీ దుష్టతనంతో చేయతలపెట్టావు. కాబట్టి నీకు చావు తథ్యం. నీలాగా ఎవడురా పాపపు పని చేస్తాడు? నువ్వు చేశావు కాబట్టి నీ నాశనం తప్పదు. బ్రహ్మదేవుడైనా పాపపు పని చేస్తే చెడిపోతుంటే, నువ్వెంతరా?’
ఈ విధంగా హితోక్తులు చెప్పి జటాయువు వేగంగా, రావణాసురుడి వీపు మీద వాలి, గోళ్లతో వాడి వీపు చీల్చి, రావణుడు కదలకుండా చేశాడు. రావణుడి తల వెంట్రుకలను తన వాడి గోళ్లతో, బాణం లాంటి ముక్కుతో, పెరికాడు. కోపంతో రావణుడు పెదవి కొరుకుతూ, గిర్రున వెనక్కి తిరిగాడు. సీతను అలానే గట్టిగా ఎడమ చేత్తో పట్టుకుని, కుడిచేత్తో జటాయువును కొట్టాడు. ఆయన దాన్ని వేగంగా తప్పించుకుని, రావణుడికి ఎదురుముఖంగా వచ్చాడు. జటాయువు తన ముక్కుతో సీతను పట్టుకున్న రావణుడి పది ఎడమ చేతులను తుంపాడు. అవి మళ్లీ మళ్లీ మొలిచాయి. తన చేతులు తెగడంతో, రోషంతో మండుతున్న కళ్లతో, రావణుడు సీతను వదిలి తన పిడికిళ్లతో, పాదాలతో, జటాయువును కొట్టాడు. దరిమిలా, రాక్షస రాజుకు, జటాయువుకు ఘోర యుద్ధం జరిగింది.
ఇలా ఘోర యుద్ధం జరుగుతుంటే, రావణుడు కత్తితో జటాయువు కాళ్లను, రెక్కలను నేలమీద పడేట్లు నరికాడు. రావణుడిలా నరకగా, నేలమీద పడి, కొనవూపిరితో వున్న జటాయువును చూసి సీతాదేవి, తన వల్ల కదా, ఆయనకు ఇలాంటి విపత్తు కలిగింది అని దుఃఖపడింది. ఏడ్చింది. నల్లని మేఘం లాంటి, తెల్లని రొమ్ము కల నేల మీద పడి ఉన్న జటాయువును రావణుడు చూశాడు.
(పర్ణశాలకు ఒక మైలు దూరంలో వున్న జటాయువు వృక్షం దగ్గర యుద్ధం ప్రారంభించి అక్కడికి సుమారు 5-6 మైళ్ల దూరంలోని దుమ్మగూడెం దగ్గర వున్న జటాయువు గుట్ట దాకా యుద్ధం చేశారు. అక్కడ జటాయువు రెక్కలు ఖండించి పడగొట్టాడు రావణాసురుడు.)
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12