S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అప్పటి ఆటలు

మొక్కలు, జంతువులలో లాగే జీవం లేని వాటిలోనూ దిక్కుమాలిన వైవిధ్యం ఉంది. ఎన్ని మూలకాలు, ఎన్ని ఖనిజాలు, ఎనె్నన్ని నక్షత్రాలున్నాయి - సర్ జాన్ ఆర్థర్ థామ్సన్
* * *
లోకాభిరామం కాలంలో నాస్టాల్జియా వాసన బలంగా వస్తుందని మిత్రులు ఒకరిద్దరు అనడం గుర్తుంది. అవును మరి, గతం గురించి గుర్తు చేసుకోవడం చాలా బాగుంటుంది కదా!
ఆ మధ్యన నేను ఒక జపనీస్ సినిమా గురించి రాశాను. దాని పేరు మాదదయో. ఈ మాటకు సమయం అయ్యిందా? అని అర్థం. రిటైర్ అయిన ఒక ప్రొఫెసర్ గారికి ఆయన పాతకాలపు విద్యార్థులు పుట్టిన రోజు పండుగ చేస్తారు. అక్కడ వాళ్లు ఈ ప్రశ్న అడుగుతారు. అంటే ఇక వెళ్లిపోతావా? అని అర్థం. ఆయన మాత్రం నేను ఇప్పట్లో వెళ్లేది లేదు అంటూ, మాదకయో! అని జవాబు చెబుతాడు. ఆ వ్యాసం రాసిన తరువాత అటువంటిదే ఒక మాట నా మనసులో ఇంతకాలంగా తిరుగుతున్నది.
చిన్నప్పుడు పల్లెలో ఆడపిల్లలు ఒక ఆట ఆడటం చూచాను. నేల మీద రెండు వరుసల్లో, నాలుగు ఐదు ఎన్నో గదులు గీసేవారు. వాటిలో కుండ పగిలిన ఒక ముక్కను విసిరి, దాన్ని తన్నుతూ ఒక ఆట ఆడేవారు. ఆ ముక్క పేరు మాకు బోకి పెంచుక. ఆ ముక్కను తలమీద పెట్టుకొని, నేల మీది గీతలు చూడకుండా వాటిలో గెంతుతూ ముందుకు సాగడం మరొక ఆట. చూడకుండానే గీతలు తొక్కకుండా ముందుకు సాగాలి. అప్పుడు వారు ప్రతి గెంతు తరువాత, ఐ మోట్, అని అడిగేవారు. మిగతా వారు నో అని లేదా ఎస్ అని చెప్పేవారు. వాళ్లు ఇంగ్లీషులో ఆడుతున్నారని, గెంతుతున్న అమ్మాయి నేను అవుట్ అయ్యానా అనడానికి ఇంగ్లీషులో అమ్ ఐ అవుట్ అని అడుగుతున్నదని నాకు చాలాకాలం తరువాత గానీ అర్థం కాలేదు. ఆ ఆటను మా పల్లెటూరి అమ్మాయిలు ఇంగ్లీషు వాళ్ల దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారు అన్నమాట. ఆడపిల్లలు ఆడే ఆటలు రకరకాలుగా ఉండేవి.
అమ్మాయిల ఆటల్లో అన్నిటికన్నా నాకు బాగా గుర్తున్నది గచ్చకాయల ఆట. మాకు అవి కచ్చకాయలు. దొరికితే కచ్చ గింజలు, లేదంటే ఆ సైజులోనే ఉండే నునుపైన పలుగురాళ్లు వాడి ఈ ఆట ఆడేవారు. ఆట ఒక పోటీగా నడిచేది. ఒకసారి ఒకరు మాత్రమే ఆడతారు. ఆడుతున్న అమ్మాయి గచ్చకాయలతో రకరకాల విన్యాసాలు చేస్తుంది. ప్రతిసారి ఒక రాతిని పైకి ఎగురవేసి అది కిందకు వచ్చేలోగా రకరకాల సంఖ్యలో రాళ్లను తిరిగి పట్టుకుని ఆలోగానే పడిపోయే రాతిని పట్టుకోవాలి. ఇందులోని చాకచక్యం, లాఘవం బహుశా ఒలింపిక్ క్రీడలలో కూడా ఎందులోనూ కనిపించదు. అదే పద్ధతిలో మరొక చేతి వేళ్లను కింద ఆన్చి ఎగిరిన రాయి కిందకు వచ్చేలోగా ఆ వేళ్లలోకి రాళ్లను పంపించడం మరొక పద్ధతి. ఈ ఆట ఇప్పటికీ ఎవరికైనా వస్తే వాళ్ల చేత ఆడించి వీడియో తీసి యూ ట్యూబ్‌లో పెట్టాలని నాకు అనిపిస్తున్నది. మా అక్కయ్యకు ఈ ఆట బాగా వచ్చు. ఇప్పుడు మరి ఆమె గచ్చకాయలు ఆడడానికి సిద్ధమవుతుందా అన్నది నా ప్రశ్న. నా గుర్తులో ఈ ఆటను చాలా బాగా ఆడిన వాళ్లంతా నాలాగే పెద్దవాళ్లు అయిపోయారు. ఇప్పటి పిల్లలు అసలు ఈ ఆట ఆడుతున్నారు అంటే నాకు కొంచెం అనుమానమే.
ఆడపిల్లల ఆటల్లో పుంగిడి పూత, అనే రింగ రింగా రోజెస్ లాంటి ఆట గుర్తున్నది. వాన వాన వల్లప్ప కూడా ఇటువంటి ఆట కిందే లెక్క. అయితే ఇవి ఎక్కువ కాలం ఆడగలిగే ఆటలు కావు. వానగుంతల పీట అని ఒక ఆట ఉండేది. ఒక చెక్కలో రెండు వరుసలుగా ఏడేసి గుంటలు మలిచి ఉంటాయి. వాటిలో చింత గింజలు లాంటివి వాడి వరుసగా గింజలను ఒక్క గుంటలో వేస్తూ ఆట సాగేది. మా ఇంట్లో ఉన్న పీట, మిగతా ఎన్నో కళాత్మకమైన వస్తువులలాగే అడ్రస్ లేకుండా పోయింది. ఆ మధ్యన శ్రీరంగం క్షేత్రం వెళ్లినప్పుడు అక్కడ నాకు రంగనాథుని ఆలయం ముందు వరుసగా ఉన్న అంగళ్లలో వానగుంతల పీట కనిపించింది. అది నేను కొని తెచ్చాను. కానీ అది కూడా నాకు కనిపించడం లేదు. ఈ ఆటను మిగతా ప్రాంతాలలో ఓమన గుంటలు అంటారని తెలుసు. ఈ మధ్యన వెతికితే, యూ ట్యూబ్‌లో వామన గుంటలు అనే పేరుతో ఆట కనిపించింది. పీటలు కూడా అమ్ముతారు అంటున్నారు. తమిళులు దీన్ని పల్లాంగుడి అనే పేరుతో ఆడతారు. సప్తపర్ణిలో పీట అమ్మకానికి ఉండడం చూచినట్లు ఇప్పుడు గుర్తుకు వస్తున్నది. సప్తపర్ణి గురించి తెలియని వారు క్షమించాలి. త్యాగరాజ స్వామి రాసిన విననాసకొని ఉన్నానురా అనే ప్రతాపవరాళి రాగ కీర్తనలో, రామచంద్రమూర్తి, సీతమ్మతో ఓమన గుంటలు ఆడినట్లు ప్రసక్తి వస్తుంది.
కొన్ని ఆటలు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్లు కూడా ఆడగలిగేవి ఉండేవి. ఉండేవి అంటున్నాను కానీ ఇంకా ఎక్కడో వాటిని ఆడుతూనే ఉంటారు అని నాకు అనుమానం బలంగా ఉంది.
ఇంట్లో కూర్చుని వేసవిలో నీడపట్టున తీరికగా కాలక్షేపం కొరకు ఆడే ఆటల్లో ముఖ్యంగా పచ్చీసీ, బారాకట్ట, పరమపదం ముందుంటాయి. పచ్చీసీ అన్నది మహాభారతంలో కౌరవ పాండవులు ఆడినట్లు చూపిస్తారు. అందులో నాలుగు వేపులకు పొడుచుకుని గడులు ఉంటాయి. నలుగురు ఆడవచ్చు. గవ్వలతో పందెం వేసి, పడిన పందెం ప్రకారం తమ పావులను ముందుకు నడిపిస్తారు. భారతంలో కేవలం పాచికలతో మాత్రమే ఆడిన ఆట కూడా చూపించినట్టు గుర్తున్నది. గవ్వల సంఖ్య ప్రకారం, లేదా ఎముకతో, దంతంతో తయారుచేసిన పాచికల మీద అంకెల ప్రకారం పందెం వేయడం ఇందులోని పద్ధతి. ఇవేవీ లేకుంటే పగలగొట్టిన చింతగింజలతో ఆట సాగుతుంది. మా ఇంట్లో వేసవిలో ఈ ఆట గంటలపాటు సాగేది. పెద్దవాళ్లు పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ ఆటను ముందుకు సాగించేవారు. నిజానికి ఒక్కొక్క సందర్భంలో పరిస్థితి కోపతాపాల దాకా కూడా వెళ్లేది. పేకాట కూడా మా ఇళ్లలో అంత ఆనందంగానూ ఆడుకునే వాళ్లం. అయితే అందులో డబ్బుల ప్రసక్తి మాత్రం లేదు. రమీ నుంచి మొదలు ట్రంప్ అనే తరుపు దాకా ఆటలు చాలా సరదాగా సాగేవి.
పేకాట కన్నా ముందుగా చెప్పుకోవలసినది బారాకట్ట గురించి. ఇది బహుశా మొగల్, హిందూ మిశ్ర సంస్కృతిలో నుంచి వచ్చిన ఆట అని నాకు అనిపిస్తుంది. పచ్చీసులో కూడా వేసిన పందాలను తెలుగు మాటలతో పిలిచేవారు కాదు. దుగా, ధచ్చి, భేత్రి, భార ఇలాంటి మాటలతో పందేలకు గుర్తింపు ఉండేది. బారాకట్టలో నేల మీద సుద్దముక్కతో అటు 5 ఇటు 5 గా గడుల చట్రం గీసేవారు. వీలుంటే చెక్కమీద గీసేవారు. మొత్తం 25 గదులు ఉంటాయి. మధ్యలో గడి పండిన కాయలు పోయేది. అయితే ఇంత చిన్న ఆట తొందరగా అయిపోతుంది కనుక, మా ఇంట్లో ఏడేండ్ల, 9 ఇండ్ల ఇంకా ఎక్కువ ఇండ్ల బారాకట్ట గీసి ఆడడం నాకు బాగా గుర్తుంది. మధ్యలో కొన్ని గడులలో ఒకరి కాయలను ఒకరు చంపుకునే వీలు లేకుండా ఒక పద్ధతి ఉండేది. కానీ మా వాళ్లు ఆట బాగా బలంగా సాగాలని అటువంటి రక్షణ గడులను ఆటలో నుంచి తొలగించేవారు. ఆట సాగుతుంటే పెద్దలు భోజనాలకు రమ్మని పిలుస్తారు. అప్పుడు ఆట మీద కాగితం లేదా తువ్వాలు కప్పి వెళ్లి భోజనం చేసి వచ్చి మళ్లీ ఆట సాగించిన సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి.
పులిజూదం, చర్‌బర్ లాంటి మరికొన్ని గడుల ఆటలు అప్పట్లో మాకు ఆడడం అలవాటు. అవన్నీ ఇప్పుడు ఉన్నదీ లేనిదీ తెలియదు.
క్యారమ్స్ కూడా ఈ రకంగానే ఆడేరు కానీ ఆ దిగుమతి ఆటలను గురించి చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. పరమపద సోపాన పటము అని మరొక ఆట ఉండేది. అందుకు అచ్చువేసిన ఒక పెద్ద చార్ట్ అవసరం. అది తమిళనాడులో అచ్చయి వచ్చేది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఉండవలసిన మాటలు తెలుగులోనే ఉన్నప్పటికీ వాటి తీరులో మాత్రం తమిళం కనిపించేది. రాక్షసుడు అనడానికి అరుకాసుడు అని ఉన్నట్టు నాకు గుర్తుకు వస్తున్నది. ఇది పాములు నిచ్చెనలు అనే పేరుతో ప్రపంచమంతటా ప్రచారంలో ఉన్న ఆట. కానీ ఎంతో మారి పక్కా దేశీ పద్ధతిలో ఉండేది.
ఇక నిజంగా స్థానికమైన ఆటలను గురించి చెప్పాలంటే మేము బిల్లకట్టె అని పిలిచిన గిల్లీ దండా అసలైన మగపిల్లల ఆట. అందుకు కావలసిన గిల్లీలను, దండాలను మేమే తెచ్చి మలుచుకుని ఆడేవాళ్లం. అంటున్నాను కానీ నాకు ఈ ఆటలో అంత ప్రావీణ్యం లేదు. కనుక చీరిక అంటూ కొంత వెసులుబాటు ఇచ్చినా ఓడిపోయి వచ్చి బయట నిలబడే వాడిని.
రాత్రి వెనె్నలలో మట్టి కుప్పలుగా పోసి, వాటిని ప్రతిపక్షం వాళ్లు లెక్కవేసి గెలుపు ఓటములు తీర్చిన వెనె్నల కుప్పలు అనే ఆట గురించి ఎవరికైనా గుర్తుందేమో తెలియదు. అలాగే ఇసుకలో పుల్లను దాచే ఆట మరొకటి ఉండేది. మరీ చిన్నపిల్లలైతే గుడుగుడు గుంచం, చేతులు ఎక్కడికి పాయె, లో లో తిమ్మన్న లాంటి ఆటలతో కాలక్షేపం చేసే వాళ్లు. వీటిలో నాకు కూడా కావలసినంత ప్రావీణ్యం, ప్రవేశం ఉండేది.
పడమటి ఆటలను గురించి చెప్పను అన్నాను కానీ, మేము యువకులుగా ఉన్నప్పుడు చాలా సరదాగా ఆడిన ట్రేడ్ గురించి చెప్పకుండా ముగించాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. ట్రేడ్ అనే ఈ ఆట ఆడడానికి కొంత సరంజామా కొని తెచ్చుకోవాలి. అది ఒక సెట్‌గా దొరుకుతుంది. అందులో ఒక అట్ట మీద కొన్ని వివరాలలు బొమ్మగా ఉంటాయి. ఇండ్లు, వాటిని కొనడానికి డబ్బులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇదే అసలు సిసలైన వ్యాపారం. బొంబాయి నగరంలోని వీధులన్నీ ఆటలు ఉంటాయి. పందెం వేసి దాని ప్రకారం ముందుకు నడుస్తూ వెళ్లి చేరిన గదిలో ఇల్లు కట్టవచ్చు. అవి రెండు, మూడు కూడా ఉండవచ్చు. తరువాత ఎవరైనా వచ్చి ఆ గదిలో పడితే ఇండ్లకు బాడుగ కట్టవలసి ఉంటుంది. కట్టే ఇండ్లకు ఖర్చు కూడా ఉంటుంది. ఈ రకంగా ఆట సాగి సాగి, ఒక్కొక్కరి దివాలా తీస్తారు. బహుశా ఈ ఆట ఇప్పుడు కూడా దొరుకుతుందని నా భావం. చాలా బాగుంటుంది మేము గంటలపాటు ఆడేవాళ్లం. అప్పట్లో మాకు క్రికెట్ ఇలాంటి ఆటలు తెలియవు. టీవీ లేదు. సెల్‌ఫోన్ అంతకన్నా లేదు. కనుక కాలక్షేపానికి పుస్తకాలతో పాటు మిగిలినవి ఈ ఆటలు మాత్రమే. ఇప్పటి పిల్లలకు ఇటువంటి ఆటలు తెలుసు అని నేను అనుకోవడం లేదు. వీటిలో కొన్ని శరీరపరంగా వ్యాయామం కలిగిస్తే, మరి కొన్ని మెదడును చురుకు పరిచేవి. సెల్‌ఫోన్‌లో ఆటలు కూడా కొన్ని బాగానే ఉంటాయి. కానీ వాటిని పట్టించుకుంటున్నారా అన్నది సమస్య!

-కె.బి.గోపాలం