S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేరమీ ప్రేమ

గోపాల్, ఆనంద్ ఇద్దరూ ఇంటర్‌మీడియెట్ ఒకే కాలేజీలో చదువుతున్నారు. గోపాల్ తండ్రి రాఘవరావు, ఆనంద్ తండ్రి శంకరయ్య కూడా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. రాఘవరావు ఆఫీసరు అయినా శంకరయ్య గుమాస్తాగా చేస్తున్నా చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా ఇద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవారు.
ఒకరోజు లంచ్ అవర్‌లో శంకరయ్య ఇలా అన్నాడు.
‘‘సార్! రేపు నా కొడుకు బస్సుపాస్ రెన్యువల్ చెయ్యడానికి పోతున్నాను, మీరు వస్తారా’’ అని రాఘవరావును అడిగాడు.
‘‘నాకు ఆఫీసులో పని ఉన్నది’’ అని అన్నాడు రాఘవరావు.
‘‘మీరు రాకపోతే మీ సెక్షన్‌లోని అసిస్టెంట్‌ను ఎవరినైనా పంపండి సార్. మా అబ్బాయి మీ అబ్బాయిల పాస్‌ల పని ఒకేసారి పూర్తిచేసుకొని వస్తాము’’ అని అన్నాడు శంకరయ్య.
‘‘ఏదైనా ముఖ్యమైన విషయమైతే తప్పనిసరిగా పంపుతాను. అయినా ఇలాంటి చిన్న పనులను వాళ్ళను స్వయంగా చేసుకోనివ్వండి. అప్పుడే వారిలో ఆత్మస్థైర్యం కలుగుతుంది’’ అని అన్నాడు రాఘవరావు.
‘‘సార్! మీ మాటలన్ని ఎపుడు విడ్డూరంగా ఉంటాయి. మనం సహాయం చెయ్యకపోతే ఇతరులు చేస్తారా? ఇపుడువారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే రేపు మనం ముసలివారమైన తర్వాత అంతకన్నా ఎక్కువగా చూసుకొంటారు. మీతో వాదించడం నావల్ల కాదు. ఆలస్యమైతే బస్సు పాస్ కౌంటర్ దగ్గర క్యూ పెరిగిపోతుంది. నేను వెళతాను సార్’’అని చెప్పి శంకరయ్య బయలుదేరాడు.
***
‘‘ఆనంద్! మన కాలేజీ బస్సు పాస్ గడువు రేపటితో అయిపోతుంది. ఈ రోజు రెన్యువల్ చేయించుకోవడానికిపోతున్నాను, నీవు కూడా వస్తావా?’’ అని అడిగాడు గోపాల్.
‘‘నాకు అలాంటి కష్టాలు లేవు. బస్సు పాస్ రెన్యూవల్స్, కాలేజీ ఫీజు చెల్లించటం, మార్కెట్‌కు వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సామానులు కొనుక్కురావడం, కరెంటు బిల్లులు కట్టడం.. ఏదైనా పోటీ పరీక్షలకు హాజరుకావాలన్నా వాటి అప్లికేషన్స్ తీసుకురావటం, ఆ వివరాలు పూర్తిచేసి పంపటం లాంటి అన్ని పనులు మా నాన్నగాని లేదా మా అమ్మగారు చేసిపెడతారు. అసలు ఇలాంటి పనులు చెయ్యాలంటేనే నాకు చిరాకు. మీ నాన్నగారు పెద్ద ఆఫీసరు ఉద్యోగం చేస్తున్నారు కదా! ఆయన క్రింద పనిచేసే ఎవరితోనైనా ఇలాంటి పనులు చెప్పి చేయించుకోవచ్చు కదా?’’ అని హేళనగా అన్నాడు ఆనంద్.
‘‘నేను అదే విషయం నాన్నగారితో అంటే ఏవేవో నీతి వాక్యాలు వల్లిస్తారు’’ అని అన్నాడు బాధగా గోపాల్.
‘‘కనీసం మీ అమ్మగారైనా నీకు సహాయం చెయ్యవచ్చు గదా!’’ అని లా పాయింట్ తీస్తూ అడిగాడు ఆనంద్.
‘‘నాకు ముగ్గురు చెల్లెళ్ళు. వారి అవసరాలు తీర్చేటప్పటికే మా అమ్మగారి పని సరిపోతుంది. ఇక నాకు ఏమి సహాయం చేస్తుంది’’ అని నిరాశగా అన్నాడు గోపాల్.
‘‘తల్లిదండ్రులు మనకు ఈ మాత్రం సహాయం చెయ్యకపోతే మనమీద వారికి ప్రేమ ఉన్నట్లే కాదు’’ అని కోపంగా అన్నాడు ఆనంద్.
‘‘నీతో మాట్లాడుతుండే నాకు ఆలస్యం అవుతుంది. లెక్చరర్‌గారి పర్మిషన్ అడిగి నేను బస్ కాంప్లెక్స్‌కు పోతున్నాను. ఇంటికి వచ్చేటప్పుడు పూర్ణ మార్కెట్‌లో వారానికి సరిపడా కూరగాయలు తెమ్మనమని మా నాన్నగారు డబ్బులు కూడా ఇచ్చారు, అందుకని త్వరగా వెళ్లాలి’’ అని చెప్పి స్కూటర్‌మీద బయలుదేరాడు గోపాల్.
‘‘అంతా నీ ఖర్మ, వెళ్ళు’’ అని హేళనగా గోపాల్‌ను అని చేతిలోని స్మార్ట్ ఫోన్‌తో గేమ్స్ ఆడటంలో నిమగ్నమైపోయాడు ఆనంద్.
***
వరండాలో స్కూటర్‌ను పార్క్ చేస్తున్న కొడుకుతో ఇలా అన్నది రుక్మిణిమ్మ.
‘‘గోపాల్ ఏమిటి, ఈ రోజు చాలా ఆలస్యం అయింది. ప్రైవేట్ క్లాస్ ఏమైనా కాలేజీలో చెప్పారా?’’ అని అడిగింది. ‘‘అదేం కాదమ్మా, బస్‌పాస్ రెన్యువల్ చేయించుకొని, మార్కెట్‌లో కూరగాయలుల కొనుక్కొని వచ్చేటప్పటికి ఇంత ఆలస్యం అయిందమ్మా!’’ అంటూ పెద్ద కూరలసంచీ స్కూటర్‌మీదనుంచి తీసి మోసుకొంటూ ఇంటిలోపలికి వచ్చాడు గోపాల్.
కొడుక్కి మంచినీళ్ళు ఇస్తూ ‘‘నేను ఇంటివద్ద సంతలో కొంటాను కదరా! మళ్లీ ఎందుకు నీకు అవస్థ’’ అని అన్నది.
‘‘ఎల్లుండి నాన్నమ్మ, బాబాయిలు పండుగకు మన ఇంటికి వస్తారట, అందుకని నాన్న తాజా కూరలు కొనమని ఉదయం డబ్బులు నాకు ఇచ్చాడు’’ అని అన్నాడు, మొఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ గోపాల్.
‘‘ఏమిటో! మీ నాన్నగారి ధోరణి నాకు అసలు అర్థం కాదు. అందరి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ కష్టపడతారో అని సౌకర్యాలు చేసి పెడుతుంటే మీ నాన్నగారి వింత ధోరణి ఇలా ఉన్నది’’ అని బాధగా అన్నది రుక్మిణమ్మ.
‘‘అమ్మా! నాన్నగారు మొదటినుంచీ ఈవిధంగానే ఉన్నారా!’’ అని అడిగాడు గోపాల్.
‘‘నా బాధలు ఏమి చెప్పమంటావురా, ఆఫీసరును పెళ్లిచేసుకొంటున్నాను కదా ఇకనైనా తిరుమలలో స్వామిని విఐపి దర్శనంతో త్వరగా చేసుకొంటాను అని కలలు కనేదాన్ని. భగవంతుని దృష్టిలో పెద్దా చిన్నా తేడాలు లేవు, అందరూ సమానమే అని నాకు గీతోపదేశం చేసి, తిరుపతికి పోయిన ప్రతిసారి సాధారణ భక్తులుగా నాకు తనతోపాటు సర్వదర్శనం చేయిస్తున్నారు. ఇది మీ నాన్నగారి వరస’’ అని బాధగా అన్నది రుక్మిణమ్మ.
‘‘నాన్నగారి సంతి ఏమోకానీ.. మోహన్‌రావుగారు మాత్రం నాకు ప్రతిసారి కనపడి నీకేమైనా సహాయం కావాలా’’ అని అడుగుతుంటారు అని అన్నాడు గోపాల్.
‘‘అతను ఎవరు’’ అని అడిగింది రుక్మిణమ్మ.
‘‘మోహన్‌రావుగారు మన నాన్నగారు పనిచేసే ఆఫీసులో పనిచేస్తుంటారు. నేను ఏ పనిమీద వెళ్లినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా నాకు ఇతరుల సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. అందుకే సున్నితంగా అంకుల్‌కు సారీ చెప్పి పంపిస్తుంటాను’’ అని అన్నాడు గోపాల్.
‘‘సరే, త్వరగా స్నానం చేసిరా అన్నం పెడతాను’’ అని రుక్మిణమ్మ లోపలికి వెళ్లింది.
***
కొంతకాలానికి ఇద్దరు మిత్రులు ఇంటర్, బిటెక్ పాస్ అయి ఉద్యోగ అనే్వషణలో పడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏమీ లాభం లేకపోయింది.
గోపాల్ తన తెలివితేటలు ఉపయోగించుకొని ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతనిలో వుండే చొచ్చుకుపోయే మనస్తత్వం, అధికారులను ప్రసన్నం చేసుకొనే వాక్‌చాతుర్యం, తోటివారితో కలిసిమెలసి వుంటూ వారితో శ్రద్ధగా పని చేయిస్తూ నిర్ణీత లక్ష్యాలను ఇచ్చిన గడువులో పూర్తిచేస్తూ కంపెనీకి లాభాలు సంపాదించి పెట్టాడు.
గోపాల్ యొక్క పనితనాన్ని, యాజమాన్య లక్షణాలను గమనించి ఒక్క సంవత్సరానికే ముఖ్యమైన మేనేజరు పోస్టుకు ప్రమోషన్ చేస్తూ జీతం లక్ష రూపాయలకు పెంచారు.
ఆనంద్ మాత్రం ఇంట్లో కూర్చుని నాన్న సంపాదించి పెడుతుంటే, తల్లి ఇష్టమైన ఆహార పదార్థాలు చేసి పెడుతుండే కమ్మగా తింటూ టీవీలో డిస్కవరీ ఛానెల్ చూస్తూ కాలక్షేపం చెయ్యసాగాడు.
కొడుకు వాలకం చూసి శంకరయ్యకు కోపం వచ్చి ఒకరోజు ఇలా అన్నాడు.
‘‘ఏరా! ఇంట్లో గుడ్లుపొదిగే కోడిపెట్టలాగా, ఊరక కూర్చోకపోతే బయటకు పోయి ఏదైనా చిన్న ఉద్యోగం అయినా చెయ్యవచ్చు కదా? నీ స్నేహితుడు గోపాల్ చూడు ఏదో ప్రయివేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. సిగ్గులేకపోతే సరి నీకు’’ అని కోపంగా అన్నాడు.
‘‘గోపాల్ నాన్నగారు పెద్ద ఆఫీసురు, కనుక వారి సిఫారసుతోనే అతనికి ఉద్యోగం వచ్చింది. నీవు కూడా నాకు ఎక్కడైనా ఉద్యోగం చూసిపెట్టు, చేస్తాను’’ అని అన్నాడు మొండిగా ఆనంద్.
‘‘రాఘవరావుగారు చాలా సిన్సియర్ ఆఫీసర్. తన కొడుకు కోసం ఎటువంటి ప్రయత్నం చెయ్యలేదు. మా ఆఫీసులోని స్ట్ఫా అందరూ అనుకొంటుంటే నేను విన్నాను. నీ తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇతరులపై అభాండాలు వేయడం మంచి లక్షణం కాదు’’ అని కోపంగా అన్నాడు శంకరయ్య.
‘‘ఔను నాన్నా, నేను తెలివితేటలు లేనివాడినే. స్వతంత్రంగా ఏ పని చేసుకోలేని అసమర్థుడిని. కొత్తవారి వద్దకు ధైర్యంగా వెళ్లి తెలివితేటలతో మాట్లాడలేని వాడినే. దీనికంతటికీ నీవు, అమ్మా కారణం. నన్ను ఎప్పుడూ చదువు.. చదువు అని సతాయించేవారు. ఎప్పుడైనా బయటి ప్రపంచం గురించి నేర్పారా? ఇపుడు నన్ను అంటే లాభం ఏమున్నది? నన్ను ఎక్కువగా సతాయించితే మీకు చెప్పకుండా దేశాలు పట్టి పోతాను. తరువాత మీ ఇష్టం’’అని బెదిరించాడు ఆనంద్.
కొడుకు అన్నమాటలకు శంకరయ్య నిర్ఘాంతపోయి ఏమి మాట్లాడాలో తెలియక అయోమయంగా కొడుకును చూడసాగాడు.
***
మరుసటి రోజు ఆఫీసులో రాఘవరావును కలిసి శంకరయ్య ఇలా అన్నాడు.
‘‘సార్! నా కొడుకు విషయంలో చాలా బాధగా ఉన్నది. మీ కుమారునితోపాటు మావాడు మంచి మార్కులతో ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. మీ అబ్బాయి దర్జాగా ఉద్యోగం చేస్తున్నాడు. నా కొడుకు ఆనంద్ మాత్రం ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఏదైనా ప్రయివేట్ కంపెనీలో ప్రయత్నం చెయ్యరా అంటే నాకు బిడియం, సిగ్గు.. ఎక్కడికీ ఒంటరిగాపోయి ఉద్యోగం కొరకు ప్రయత్నం చెయ్యలేను. నావల్ల కాదు. మీరు ఎక్కడైనా పని చూసిపెడితే చేస్తాను. నన్ను అనవసరంగా విసిగిస్తే ఏదైనా అఘాయిత్యం చేసుకొంటాను అని బెదిరిస్తున్నాడు. అందుకని దయచేసి మీ అబ్బాయిగారిని అడిగి వారి కంపెనీలో మావాడికి ఏదైనా చిన్న ఉద్యోగం చూడమని చెప్పండి సార్’’ అని బాధపడుతూ అడిగాడు శంకరయ్య.
‘‘శంకరయ్యా! నేను నిర్మొహమాటంగా ఒక విషయం చెబుతాను. మనస్సు చిన్నబుచ్చుకోవు కదా?’’ అని అన్నాడు రాఘవరావు.
‘‘మీరు పెద్దవారు. ఏదైనా మంచి విషయమే చెబుతారు. ఇందులో నేను బాధపడేది ఏముంది చెప్పండి’’ అని అన్నాడు శంకరయ్య.
‘‘నీవు నీ భార్య కలిసి అజ్ఞానమైన ప్రేమను మీ కొడుకుపై చూపించి అతనిని మానసికంగా ఎదగకుండా చేశారు. స్వతంత్రంగా ఆలోచించి కష్టపడి సమస్యలను ఎదుర్కొనే విధంగా కాకుండా అన్ని వసతులు బంగారు స్పూన్‌తో నోటికి అందించినట్లు ఏర్పాటుచేసి ఎందుకు పనికిరానివాడుగా తయారుచేశారు’’ అని అన్నాడు రాఘవరావు.
‘‘అదేమిటి సార్! మన పిల్లలని ప్రేమించినవారికి సహాయం చెయ్యడం కూడా తప్పేనా?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు శంకరయ్య.
‘‘పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చేవరకు జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ తరువాత యుక్తవయస్సులో వారికి స్వతంత్రంగా ఆలోచించి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశాలు కల్పించాలి. అలా అని పూర్తిగా వదిలెయ్యమని నా ఉద్దేశం కాదు. నీకు తెలియదు, నా కుమారుడు ఏదైనా కాలేజీ పనులకు లేదా ప్రవేశ పరీక్షలకు అప్లికేషన్లు పంపే క్రమంలో ఏదైనా అవసరమైతే సహాయం చెయ్యమని మన మోహనరావును పంపుతుండేవాడిని. కాని ఈ విషయం మా అబ్బాయికి చెప్పేవాడిని కాదు. ఒక తండ్రిగా నా కొడుకు భవిష్యత్తు ముఖ్యం.
కాని ఈ తరం పిల్లలు తమకు ఎవరో ఒకరు సహాయం చెయ్యాలి అని చకోర పక్షుల్లా ఎదురుచూడటం అలవాటు చేసుకొంటున్నారు. పిన్ను దొరక్కపోయినా ప్రాణాలు పోయే విధంగా బాధపడుతున్నారు. ఎందుకంటే మీలాంటి తల్లిదండ్రుల అజ్ఞానప్రేమవల్ల చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఎరుగరు. పరీక్ష తప్పితే కష్టం, అప్లికేషన్ ఫారమ్ దొరక్కపోతే కష్టం, అమ్మ తిడితే కష్టం, నాన్న డబ్బులు ఇవ్వకపోతే కష్టం, ఆఖరికి తన తమ్మున్ని అమ్మా నాన్న కొద్దిగా ఎక్కువగా గారం చేస్తే ద్వేషం. క్లాస్‌లో ప్రక్కవాడికి తనకన్నా రెండు మార్కులు ఎక్కువస్తే తను జీవితంలో వెనుకబడిపోతున్నాననే నిరాశ, నిస్పృహ. ఈ విధంగా మానసిక బలం తగ్గిపోయి, చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసకొంటున్నారు.
మీ అతిగారాబ ప్రేమలతో బయటికి రాలేని బావిలోని కప్పల్లా తయారవుతున్నారు. మీ గొప్ప కోపం కీర్తి పంజరాలలో బంధిస్తున్నారు. ఒకవేళ గమ్యాలు చేరకపోతే ఇదిగో మీ కొడుకులాగా త్రిశంకు స్వర్గంలో ఊగిసిలాడుతున్నారు. కష్టపడే అవకాశాలు కల్పించినపుడే వారికి పూర్తి మానసిక స్వేచ్ఛ లభించి అధిక చైతన్యంతో తెలివితేటలు పెంపొందించుకొని అప్రమత్తంగా ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవటానికి దోహదం చేసినవారిమి అవుతాము.
ఇపుడు అన్ని రంగాలలో వున్న పెద్దవారందరూ చిన్నపుడు కష్టపడి పైకి వచ్చినవారే. నేటి సమాజంలోని ఎక్కువమంది తల్లిదండ్రులు తమ బాధ్యతలను విస్మరించి తమ పిల్లలపై అతిగారాబాలు చూపించి వారి బంగారు భవిష్యత్తులనుచేతులారా నాశనం చేస్తున్నారు’’ అని అన్నాడు.
‘‘సార్ మీరు చెప్పిన విషయం చాలా సబబుగా ఉన్నది. కాని అంతా అయిపోయిన తరువాత ఇపుడు బాధపడితే లాభమేముంది సార్!’’ అని అన్నాడు శంకరయ్య వైరాగ్యంగా.
‘‘నినే్న మా అబ్బాయి వారి ఆఫీసులో ఒక సూపర్ వైజర్ పోస్టు ఖాళీగా ఉన్నది. అని నాతో చెప్పాడు. మీ ఆనంద్‌ను రేపు వెంటనే ఒక్కసారి మా గోపాల్‌ను కలవమను. ఆలస్యం చేస్తే ఆ ఖాళీలో ఇతరులు చేరుతారు. తరువాత మీ ఇష్టం’’ అని అన్నాడు రాఘవరావు.
‘‘చాలా సంతోషం సార్. ఈ రోజే మా అబ్బాయికి ఈ విషయం చెబుతాను’’ అంటూ సంతోషంగా ఇంటికి బయలుదేరాడు శంకరయ్య.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-జన్నాభట్ల నరసింహప్రసాద్ 7995900497