S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎల్లలు లేని రంగుల ప్రేమ!

చిత్రకారుల్లో కొందరు ‘సిద్ధులు’ కనిపిస్తారు. వారు చిత్ర రచనను తపస్సుగా భావిస్తారు.. యజ్ఞంలా చేస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు విజయ్ బెల్డె. ఇదేదో మహారాష్ట్ర పేరులా ఉందనిపించినా విజయ్ తెలంగాణ బిడ్డ. వర్ణచిత్రాలకు ప్రాణం పోయడానికి తాను పుట్టానని అతిశయం లేకుండా వినమ్రతతో చెబుతాడు. ఆ కమిట్‌మెంట్ ఆయన మాటల్లో చిత్రాల్లో దండిగా కనిపిస్తుంది.
విజయ్ బెల్డె గత ఇరవై సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో మనసు పెట్టి పని చేస్తున్నారు. వర్తమానంలో ఆయన ఎద్దుల (బుల్స్)పై తన దృష్టి సారించి అద్భుత రీతిలో కాన్వాసుపై కోడెగిత్తలకు జీవం పోస్తున్నారు. కళాత్మకతనంతా రంగరించి రంగుల్లో తనదైన ముద్రను వేస్తున్నారు. మార్కెట్లోకి విడుదల చేయని ఓ కళాఖండం (గ్రీన్ బుల్) ఆయన ప్రతిభను పట్టి చూపుతోంది. కొత్త ‘స్టైల్’ను ఆయన ఈ వర్ణచిత్రంతో ప్రవేశపెడుతున్నారు. చిత్రకళా రంగంలో అరుదుగా కనిపించే ఈ శైలి అబ్బురపరిచేలా ఉండటం విశేషం. ఈ కాన్వాసుపై కనిపించే రంగుల మార్మికతను పట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. ఎన్నో ‘ఎథ్నిక్ కలర్స్’ను ఉపయోగించి వాటి మిశ్రమంతో సరికొత్త వర్ణ లేపనాలతో, లేలేత రంగుల్లో ఆ ఎద్దు దర్శనమిస్తోంది. ‘గ్రీన్ బుల్’ అని పేరు పెట్టడంలోనే చిత్రకారుడి విశిష్టత, రంగులతో ఆడుకునే నైపుణ్యం వాస్తవికతను, సృజనాత్మకంగా ఎలా చెప్పాలో తెలిసిన చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా అది భాసిస్తోంది.
తక్కువ వెలుతురులో ఆ కాన్వాసును చూస్తే అంతర్జాతీయ స్థాయి చిత్ర ప్రమాణాలన్నీ అందులో ద్యోతకమవుతాయి. ఫోర్‌గ్రౌండ్‌లో గ్రీన్ బుల్ కొంత నైరూప్యంలో కనిపిస్తే, బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మహిళా రూపం అస్పష్టంగా దర్శనమిస్తోంది. ‘ప్రకృతి - పురుషుడు’ అన్న భావనకు అతి దగ్గరగా రెండింటినీ ఒకటిగా చూపడం విశేషం. ఈ దార్శనికత విజయ్ బెల్డె విశిష్ట చిత్రకళా నైపుణ్యాన్ని తెలియజేస్తోంది. పరిణత చెందిన కుంచె నుంచి జాలువారిన రేఖలు - వర్ణాలు - ఆకృతి ఒకే ఫ్రేమ్‌లో దర్శనమివ్వడం అద్భుతమే! గ్రీన్ బుల్ మొత్తం ఆకుపచ్చ రంగులో కనిపించకుండా వివిధ ఆకుపచ్చ ఛాయల మిశ్రమంతో అనేక త్రికోణాలు, చతుర్భుజాలు, బిందువుల సమ్మిలితంగా దర్శనమివ్వడం, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో పరిశీలనగా చూస్తే నగ్నంగా (న్యూడ్) తలలేని మహిళ ఆకారం ఎద్దుకు ‘నీడ’లా.. చూపరులను ముప్పిరిగొల్పుతుంది. అందుకే ఇది సరికొత్త శైలి (స్టైల్)గా దర్శనమిస్తోందని చెప్పడం. జాతీయ అంతర్జాతీయ స్థాయి చిత్రరచన స్థాయి ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందులోని టెక్చర్, కలర్ ప్యాలెట్ ప్రత్యేకమైనవి. తాను ఎథ్నిక్ రంగులను వాడానని విజయ్ వెల్లడించాడు. ఈ రకంగా అనేక రంగుల మిశ్రమంతో, అనాటమీని స్టైలిష్‌గా, సరికొత్తగా ఇలా ఎవరూ తీర్చిదిద్దలేరని చిత్రకారుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. అది వాస్తవమేనని చూపరులకు ఇట్టే తెలుస్తుంది. ఎద్దు తల శరీర భాగానికి కేవలం సన్నగా అతుక్కుని తీర్చిదిద్దడంలో ఆయన ప్రతిభ, సృజన, దృష్టి కోణం కొత్తగా కనిపిస్తుంది. దీని వెనకాల ఎంతో మేధోశ్రమ దాగున్నదన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. ఆ మేధోశ్రమకు పరిపూర్ణ ఆకారమే ఈ వర్ణ చిత్రం. అంతర్జాతీయ స్థాయి కొలమానాలతో ఈ ‘గ్రీన్ బుల్’ను పరిశీలిస్తే అందుకు ‘పర్‌ఫెక్ట్’గా సరిపోతుంది. ఈ పరిపూర్ణతను చిన్న వయసులోనే విజయ్ బెల్డె సాధించడం అద్భుతం.
ఈ సరికొత్త శైలిలో మరికొన్ని వర్ణ చిత్రాలను సైతం ఆయన పూర్తి చేశారు. శక్తికి, దృఢత్వానికి, బలిష్టానికి ఎద్దును ప్రతీకగా, (తల లేని) స్ర్తి న్యూడ్‌ని కోమలత్వానికి - ప్రకృతి సౌందర్యానికి చిహ్నంగా చూపిస్తూ రంగులను సైతం అందుకనుగుణంగా సంకేతిస్తూ వాడటం కారణంగా కొత్త.. సరికొత్త చిత్రకళా సూర్యుడు చిత్రకళా రంగంలో ఉదయించారనిపిస్తోంది. చిత్రకారుడి మాటల్లో.. ‘ఇదొక వినూత్న శైలి, అనేక మాధ్యమాలను (ఆయిల్ - ఆక్రలిక్ వగైరా) వాడి మిక్స్‌డ్ మీడియంలో చేయడంతో కొత్త టెక్చర్ ఉబికివచ్చింది. సరికొత్త సొబగులను పలికిస్తోంది’ ఈ మిక్స్‌డ్ మీడియంలో కనబరచిన ప్రతిభతో విజయ్ సరికొత్త శిఖరాలను అధిరోహించారంటే అతిశయోక్తి అవదు.
ఈ వర్తమాన బుల్స్ సిరీస్‌కు ముందు గీసిన బుల్స్ చిత్రాలను తైవాన్ అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనకు పంపగా అక్కడి పెద్ద పోటీని ఎదుర్కొని విజయ్ బెల్డె ఎద్దు/ బుల్ బొమ్మ అవార్డును అందుకుంది. గోధూళివేళ.. ఎద్దును ఎరుపు రంగులో చిత్రించినందుకు పలువురి ప్రశంసలు లభించాయని విజయ్ చెప్పారు.
నగర శివారులోని అల్వాల్‌లో ఆయన ఇంటి ముందు గంగిరెద్దుల వాళ్లు చాలాకాలంగా తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. బలిష్టమైన వారి ఎద్దులను ఉదయం లేవగానే పరిశీలించడం విజయ్ దినచర్యలో భాగమైంది. అంతేగాక మనిషి ప్రగతికి ఎద్దులు వేల ఏళ్లుగా సహకరిస్తున్నాయని, మనిషి వ్యవసాయం చేయడం నేర్చుకున్నప్పటి నుంచి సాధు జంతువుగా ఎద్దు తన సేవలను అందిస్తోందన్న తాత్విక విషయాలను ఆయన చెబుతారు. ఎద్దులు మగతనానికి, దృఢత్వానికి, బలిష్టానికి, శక్తికి చిహ్నాలని ఆయన బలంగా నమ్ముతూ ఆ భావాలనే ఆయన తన రంగుల్లో పలికిస్తున్నారు. ఇంత లోతుగా పరిశీలన, ఆలోచన అవసరమా? అని ప్రశ్నిస్తే లోతైన ఆలోచనలు చేయకపోతే సరికొత్త భావాలను కాన్వాసుపై పలికించడం కష్టమని ఆయన అంటారు. అందుకే తాను తన ఇంటి ముందున్న గంగిరెద్దులతోనే గాక ఇతర చోట్లకు వెళ్లి వాటిని గంటల తరబడి చూస్తూ గడుపుతానని, అవి ఎంతో ఆప్యాయంగా చూస్తూ, మూగ చూపులతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుందని, ఆ క్షణాలు తనను తాను మైమరచిపోయేలా చేస్తాయని, అవి అమూల్యమైన ఘడియలుగా భావిస్తానని చిత్రకారుడు విజయ్ బెల్డె చెప్పారు. దీంతో ఆయన తాదాత్మ్యం ఎంత గాఢతను సంతరించుకుందో ఊహించవచ్చు. ఇంత అంకిత భావంతో పనిచేస్తేనే రంగులు - రేఖల్లో సరికొత్త భావం - భాష పుట్టుకొస్తుందని ఆయన అంటున్నారు.
ఈ బుల్సు సిరీస్ వేయక ముందు ఆయన గణేశుడి చిత్రాలు వేశారు. ఇందులోనూ ఆయన తనదైన ‘ముద్ర’ను కనబరిచారు. క్రియా యోగం అనేది అతి పురాతనమైనదని, అందులోని అనేక ముద్రలు అనేక విషయాలను వెల్లడిస్తాయని, ఆ ముద్రల నన్నింటినీ గణేశుని ద్వారా తన వర్ణచిత్రాల్లో చూపించానని విజయ్ చెప్పారు. ఈ సిరీస్ వేసేందుకు సైతం విజయ్ ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు అధ్యయనం చేశారు. క్రియా యోగ గూర్చిన సంపూర్ణ సమాచారాన్ని అధ్యయనం చేశాడు. గణపతి సచ్చితానంద స్వామి ‘కృప’ సైతం తనకుందని చిత్రకారుడు భావిస్తున్నారు. ఈ చిత్రాలను కేలండర్ ఆర్ట్‌గా గాక సాధారణ మానవ కదలికలకు అతి దగ్గరగా చూపానని దాంతో వైవిధ్యం కనిపిస్తోందని, ముఖ్యంగా శరీర ఛాయ, ముఖ కవళికలు, అలంకరణ, ఆభరణాలు ధరించడం, జంధ్యం వేసుకునే తీరు, విభూతి ధారణ అంతా ‘స్థానికత’కు అతి దగ్గరగా తీసుకొచ్చేందుకు కృషి చేశానని అన్నారు. ఒక తల, రెండు తలలు, మూడు తలలు, ఐదు తలల గణపతులను, చేతుల్లో రకరకాల సంగీత వాయిద్యాలను చిత్రకారుడు చూపారు. ఇలా మొత్తం 101 వర్ణచిత్రాలను రూపొందించాక హైదరాబాద్‌లో 2012 సంవత్సరంలో ‘సోలో’ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ మరుసటి సంవత్సరం ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఆహ్వానంపై బొంబాయిలోని కమల్ నయన్ బజాజ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. దీనికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. మీడియా సైతం చిత్రాలను కొనియాడింది. ఆ ప్రదర్శన విజయ్ బెల్డె జీవితంలో పెద్ద మలుపు. ఈ చిత్ర కళా ప్రదర్శనతోనే తన కళా నైపుణ్యం వివిధ రాష్ట్రాల వారికి తెలిసింది. వ్యష్టి ప్రదర్శనలేగాక సమష్టి (గ్రూప్) ప్రదర్శనల్లో సైతం 1996 సంవత్సరం నుంచి ఆయన పాల్గొంటున్నారు. అలా అనేక మెట్రో నగరాలలో, నగరాల్లో తన చిత్రాలను ప్రదర్శించారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన బెల్డె జగన్నాథం, వరలక్ష్మిల ఆఖరి సంతానంగా 1975లో పుట్టిన విజయ్ బెల్డె ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం అంకిత భావం, చిత్రకళ పట్ల ఆరాధనా భావం, రంగులంటే పారవశ్యం చెందడం. తాను భూమీద జన్మించింది చిత్రకళ కోసమేనన్న స్పృహ భావన బలంగా ఉండటం.
తనకు పదేళ్ల వయసున్నప్పుడు ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం ఓ సినిమా పనిపై తన గ్రామం ప్రజ్ఞాపూర్‌కు రావడం, తన (విజయ్) మాస్టారు ఇంట్లో విడిది చేయడం, అక్కడ వైకుంఠం గీసే డ్రాయింగ్స్, స్కెచ్‌లు, రంగుల బొమ్మలు గమనించే అవకాశం రావడంతో ఆ రంగంపై మనసు పారేసుకున్నాడు. గ్రామంలో పాఠశాల విద్య ముగిశాక వైకుంఠం ఇంటిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి, అనంతరం 1994 సంవత్సరంలో మాసాబ్ ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్‌ఏ లో చేరాడు. సమాంతరంగా వైకుంఠం దగ్గర శిష్యరికం చేశాడు. రెండు చోట్ల అనుభవం అపురూపమైనదిగా ఆయన భావిస్తారు. ఆ తరువాత కొంతకాలం యానిమేటర్‌గా పని చేశారు. బహుళ జాతి సంస్థ డి.క్యూ. ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో కార్టూన్ చిత్రాల (మూవీస్) తయారీలో కీలక పాత్ర పోషించారు. వాల్ట్‌డిస్నీ వాళ్ల అనేక కార్టూన్ చిత్రాల రూపకల్పనలో ఆయన పాత్ర ఉంది.
అలా కొంత ఆర్థికంగా స్థిరపడ్డాక పూర్తి స్థాయి చిత్రకారుడిగా గత దశాబ్దంగా పని చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ చూపే విజయ్ చిత్రరచనలోనూ ఆ క్రమశిక్షణ పాటిస్తారు.
ఇంతవరకు ఆయన స్టేట్ హార్టికల్చర్ అవార్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బతుకమ్మ అవార్డు, కోనసీమలోని చిత్రకళా పరిషత్ వారి అవార్డు, తైవాన్‌లోని ఆర్ట్ రెవల్యూషన్ తైపీ అవార్డు అందుకున్నారు. చిత్రకళా రంగంలో తాను పుట్టి పెరిగిన గడ్డ గర్వపడేలా చేస్తున్నారు.
విజయ్ బెల్డె 82472 76607

-వుప్పల నరసింహం 99857 81799