S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆహార ఔషధాలు -7

తీగ బఛ్చలి ఆకు పప్పు, పచ్చడి, పులుసుకూర
తీగ బచ్చలి ఆకుల్ని, కాడల్నీ పప్పుగానూ, పచ్చడిగానూ, పులుసు కూరగానూ వండుకుంటారు. ఇండియన్ స్పైనాచ్ అని దీనికి పేరు. చలవచేసే కూర. విరేచనం అయ్యేలా చేస్తుంది. చింతపండు వగైరా ఎక్కువగా వేయకుండా వండితే, ఎసిడిటీని తగ్గిస్తుంది. పాలకూర, పొన్నగంటి లాంటి ఆకు కూరలతో కలిపి వండుకుంటే మంచిది. అన్ని వ్యాధుల్లోనూ తినదగినదే! విష దోషాలను హరించే గుణం దీనికుంది. బచ్చు అంటే వెండి బంగారం లాంటి విలువైనవి కలిగిన ధనాగారానికి అధిపతి అని. బచ్చలి అలాంటిదని భావార్థం.
ఉపోదక, తీగబచ్చలి, అల్లు బచ్చలి, పొలము బచ్చలి, దుంప బచ్చలి, ఎర్ర అల్లు బచ్చలి, మట్టు బచ్చలి - ఇలా చాలా పేర్లతో బచ్చలి దొరుకుతుంది. తీగబచ్చలే మనకు కూరగాయల మార్కెట్లలో ఎక్కువగా దొరుకుతుంది.
తీగ బచ్చలిని తప్పనిసరిగా నీళ్లలో వేసి ఉడికించి.. నీరు వార్చేసి తినాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి. దీనిలోని దోషాలకు అది విరుగుడు. దురదలు, దద్దుర్లు తగ్గిస్తుందనీ, గనేరియా, సిఫిలిస్ లాంటి సుఖవ్యాధుల్లో ఇది బాగా పని చేస్తుందనీ, మెడిసినల్ ప్లాంట్స్ అనే గ్రంథంలో దీని గురించి ఉంది. ఏమైనా ఏ వ్యాధులూ లేనివారికి హితకరంగా ఉంటుందనే అభిప్రాయం దీని గురించి వైద్య గ్రంథాల్లో చదివితే అర్థమవుతుంది.
పుదీనా ఆకు పచ్చడి/ టీ
పుదీనా ఆకులతో పచ్చడి ఎక్కువ రుచికరమైన వంటకం. కఫ దోషాలను పోగొట్టేందుకు ప్రకృతి ప్రసాదించిన ఒక ఆహార ఔషధం పుదీనా. దీని ఆకులు, కాడల రసంలోంచి మెంథాల్ అనే ఘాటైన ద్రవ్యాన్ని తీస్తారు. పుదీనా మొక్క సారమే మెంథాల్. దీన్ని పుదీనా పువ్వు అని పిలుస్తారు. ఇది తక్షణం వాతాన్ని తగ్గించి, జీర్ణశక్తిని పెంచుతుంది. తెరలు తెరలుగా వచ్చే కడుపులో నొప్పి, కడుపులో ఎసిటిడీ, గ్యాస్‌లను పోగొడుతుంది. పేగుల్ని బలసంపన్నం చేస్తుంది. వాంతి వికారాల్ని పోగొడుతుంది. వైరస్‌ల కారణంగా వచ్చే జలుబు వ్యాధిని నివారిస్తుంది. పుదీనా ఆకులు రసాన్ని గానీ, నీళ్లలో ఆకులు వేసి గానీ టీ కాచుకుని త్రాగితే పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి. శరీరాన్ని సమస్థితికి తెచ్చే ద్రవ్యాలలో ఇదొకటి. ఆహారంలో పోషకాలను వొంటబట్టేలా చేసి, రక్తహీనతను, ఇతర ధాతు లోపాలను నివారిస్తుంది. కొద్దిగా వేడి చేసే స్వభావం ఉంటుంది. అందుకని వేడి శరీర తత్త్వం ఉన్న వారికి మేలు చేస్తుంది. ఋతుకాలంలో స్ర్తిలు దీన్ని పరిమితంగా వాడుకోవటం మంచిది. ఋతుస్రావాన్ని పెంచే గుణం దీనికుంది.
ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలకు పుదీనా ఒక దివ్యౌషధం. నోటికి రుచి తెలిసేలా చేసి, అన్న హితవు కలిగిస్తుంది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. పచ్చి ఆకులని నలిపి వాసన చూస్తే తలతిరుగుడు, మైగ్రేన్ తలనొప్పి నెమ్మదిస్తాయి. జలుబు భారం తగ్గుతుంది. అన్నీ కల్తీమయంగా ఉన్న ఈ రోజుల్లో పాలను కూడా నమ్మలేని స్థితి. పాలలో నాలుగు పుదీనా ఆకులు వేసి కాస్తే, పాలు విరక్కుండా ఉంటాయి. పాలలో దోషాలు తగ్గుతాయి.
పెరుగు తోటకూర పప్పు/ కూర/ చారు
ఇప్పుడు మార్కెట్లో కేవలం తోటకూర అనే పేరుతోనే దొరుకుతున్న ఈ ఆకు కూర మొక్కని పెరుగు తోటకూర, నీరు బొలిమిడి కూర ఇలా కూడా పిలుస్తుంటారు. సంస్కృతంలో శాకవీర అంటారు. 3-4 అడుగుల ఎత్తు వరకూ కూడా పెరిగే కూర కాబట్టి దీన్ని పెరుగు తోటకూర అంటారు. ఈ తోటకూర కాడల్లో ఆహార పీచు (డైటరీ ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇష్టంగా తోటకూర కాడల్ని కూడా తింటారు. మార్కెట్లోకి తోటకూర మొక్కల్ని చిన్నవిగా ఉన్నప్పుడే వేళ్లతో సహా పెకలించి తెచ్చి అమ్ముతున్నారు. దీనివలన రైతులకు గానీ, వినియోగదారులకు గానీ ఏ ప్రయోజనం కలుగుతుందో తెలీదు. తోటకూర ఆకుల్ని మాత్రమే కోసుకుంటూ మొక్కని ఎదగనిస్తే మంచి ఫైబర్ ఉన్న కాడల్ని తినేందుకు వీలౌతుంది. తెలుగు రైతులు గోంగూర విషయంలో కూడా ఇదే విధంగా లేతమొక్కల్ని పీక్కొచ్చి అమ్ముతుంటారు. నిజానికి గోంగూర మొక్క 17 అడుగుల వరకూ కూడా పెరుగుతుంది. అలా పెరగనిస్తే, ఆకుల్ని మాత్రమే కోసుకుంటూ ఉంటే, గోగునార ఉత్పాదకత పెరుగుతుంది. అది నార ఆధారిత పరిశ్రమలకు చేరి అదనపు ఆదాయం సమకూర్చి పెడుతుంది.
పెరుగు తోటకూర మూత్రాశయంలో వేడిని, మంటను, మూత్రంలో ఎసిడిటీని తగ్గించి శరీరానికి చలవనిస్తుంది. మొలల వ్యాధిలో రక్తస్రావం అవుతున్నప్పుడు ఋతుస్రావం లాంటి సమస్యలున్నప్పుడు తోటకూరని చలవచేసే పద్ధతిలో అంటే చింతపండు, మసాలాలూ లేకుండా వండుకుని తింటూ ఉంటే ఎక్కువ మేలు చేస్తుంది. తోటకూరని సన్నగా తరిగి మిక్సీలో వేసి రసం తీసి, అందులో రసం (చారు) పొడి వేసి కమ్మగా కాచిన చారును మూడు పుటలా రోజూ త్రాగుతుంటే రక్తస్రావాలు తగ్గుతాయి. అన్నంలో కూడా తినవచ్చు. రక్తంతో కూడిన విరేచనాల వ్యాధిలో కూడా ఇది ఉత్తమ ఔషధంలా పని చేస్తుంది. కీళ్ల వాతంతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదా! మరీ ఎక్కువగా తీసుకోకండి. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తోటకూరని, పాలకూరని వాడుకోవటం ఉత్తమం.
పొన్నగంటి ఆకు కూర పప్పు/ పచ్చడి/ పొడికూర
పొన్నగంటి అంటే, బంగారపు కళ్లు అని! అరవంలో పొన్నాం కణ్ణి అంటారు. నేత్రవ్యాధుల్లో ఇది బంగారం లాంటి ఔషధం కాబట్టి ఈ పేరు వచ్చిందని అర్థం చేసుకోవాలి. తీపి తక్కువ, వగరు, చిరుచేదు రుచులు ఎక్కువగా కలిగిన కూర కాబట్టి షుగరు వ్యాధికి ఉత్తమ ఔషధం. చలవచేసే కూరల్లో ఇదొకటి. మూత్ర దోషాలను పోగొడుతుంది. మూత్రం బాగా అవ్వటం లేదనిపించే వారికి దీన్ని తీసుకుంటే మలమూత్రాలు రెండూ ఫ్రీగా అవుతాయి. అన్ని రకాల రక్తస్రావాలనూ తగ్గిస్తుంది. రక్తస్రావం అయ్యే అన్ని వ్యాధుల్లోనూ వాడుకోవచ్చు. అన్ని దోషాలను పోగొట్టి, శరీరానికి సమస్థితిని తెస్తుంది. వీర్య కణాలను పెంచుతుంది. వీర్యంలో వేడిని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, తుమ్ముల్లాంటి ఎలర్జీ వ్యాధుల్లో ఇది ఎలర్జీ తీవ్రతని తగ్గిస్తుంది. ఆహారంలో విషదోషాలను పోగొడుతుంది. జ్వరాలు, దీర్ఘకాలంగా ఆసుపత్రిలో గడుపుతున్న వారికి పెట్టదగిన కూరల్లో ఇదొకటి. పొన్నగంటి ఆకులను తోటకూర మాదిరే కూర, పప్పు, పులుసుకూర, పచ్చడి వగైరా చేసుకోవచ్చు. పొన్నగంటి ఆకుల రసంలో చారుపొడి వేసి చారు కాచుకొని తాగవచ్చు.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com