S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాటకు ప్రాణం పల్లవి

ఒకనాటి సంగతి... ‘యే ఆకాశ్‌వాణీకా పంచరంగీ ప్రోగ్రామ్ హై వివిధ్‌భారతి అబ్ హమారీ కర్ణాటక్ సంగీత్ సభా షురూ హోతీహై’ అనే అనౌన్స్‌మెంట్ వివిధభారతి కేంద్రాల నుండి మధ్యాహ్నం 3.45 ని. నుంచి 5.30 వరకూ ఊరూ వాడా రేడియోల్లో మారుమోగేది.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఒకవైపు సినిమా పాటలు, మరో వైపు లలిత గీతాలు ప్రసారమవుతూండేవి. ఆ వైవిధ్యభరిత గీతాలు శ్రోతలు ఎంతో ఉత్సాహంగా వినేవారు. లలిత గీతమైనా, సినిమా పాటైనా కేవలం మూడున్నర నిమిషాల్లో పదిమందీ మెచ్చుకుని, మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురగీతాలు ట్యూన్ చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంజనీరు ఊహించి వేసే ఇంటి ప్లాన్ లాటిది పాట. గాయకులందరూ పాటలు ట్యూన్ చేయలేరు. ట్యూన్ చేసేవారంతా గాయకులు కాకపోవచ్చు.
మహావిద్వాంసురాలైన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన పాటల్లో ఇతరులు చేసిన పాటలే ఎక్కువ. సినిమా పాటల వ్యవహారం వేరు. తెర మీద కనిపించే నటీనటులు చిత్ర ఛాయాగ్రాహకుడు, నృత్య దర్శకుడు మందీమార్బలంతో వినిపించే నాలుగు నిమిషాల పాటకు, గంటల కొద్దీ పడే శ్రమ ఉంటుంది. వేదికలపై సంగీత కచేరీలు చేసేవారికున్న సదుపాయాలు, సినిమా పాటలు పాడేవారికుండవు. ప్రాణమంతా పాటలపై పెట్టి పసందుగా చేసివ్వటంలో సంగీత దర్శకుల శ్రమకు విలువ కట్టలేం. వారి బ్రతుకుతెరువంతా వాటిపై ఆధారపడే ఉంటుంది. వెనకటి తరంలోని దర్శకులకూ నిర్మాతలకూ కాసె్తైనా సంగీతాసక్తి ఉండేది. అయినా సమర్థులైన సంగీత దర్శకుల మాటకే (పాటకే) విలువనిచ్చేవారు.
సంగీత రసికత్వం లేని నిర్మాతైనా దర్శకుడైనా లెఖ్ఖ చేయని సంగీత దర్శకులు అవకాశాలు వదులుకోవటానికైనా సిద్ధపడేవారు తప్ప, స్వాభిమానాన్ని చంపుకునేవారు కాదు. సలాములు చేసేవారు కాదు.
గుంటూరు శేషేంద్రశర్మ మంచి భావుకుడైన రచయిత. ‘విసిరేసెను తూరుపు ఒక శుక్రతారను.. పోదాం పద అడవుల్లో పూవులేరను’ అనే పల్లవిగల పాటొకటి రేడియోకి పంపారు.
నా గురువు వోలేటి గారు ‘సుమనీశ రంజని’లో ఆ పాటకు చక్కని వరుసను కూర్చారు.
మాటలన్నీ పసందైన స్వరాల్లో వీనులవిందుగా తయారయ్యాయి.
హైద్రాబాద్‌కు చెందిన ఆర్.్ఛయాదేవి, నరసింహమూర్తి అనే గాయనీ గాయకులిద్దరూ పాడారు. మా గురువుగారు నాకు ఆ పాట నేర్పేసి, కచేరీకి వెళ్లిపోయారు. నేనే పాటను నేర్పి రికార్డ్ చేశాను. శేషేంద్రశర్మలోని భావుకతకు అద్దం పట్టిన ఆ మాటలు ననె్నంతో ఆకర్షించాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘ముత్యాలముగ్గు’ సినిమా విడుదలైంది. అందులో ఆయన రాసిన పాటే ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచీ కమ్మని కల ఇచ్చింది’ అనే పాట మొదటిసారి ప్రసారంలోనే విన్నాను. ఆ పాటకున్న నేపథ్యం, నటీనటుల మానసిక వేదన, సన్నివేశాలకు అనుగుణంగా చేసిన సంగీతం, సుశీల కంఠం, ఒక్కసారి నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. ముఖ్యంగా, పాటకు ముందూ మధ్యలో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ సంగీతం అద్భుతం. సినీ రంగంలో అప్పటికే బాగా పేరున్న సంగీత దర్శకుడు చేసిన పాటది.
* * *
చిన్నతనం నుంచీ, గుళ్లూ గోపురాల్లో వాయించే సన్నాయి వాద్యానికి ముగ్ధుడై చదువుకు స్వస్తి చెప్పి సంగీతాసక్తి పెంచుకున్న ‘వెంకటాచలం’ వయసు అప్పుడు 21 ఏళ్లు.
సాధారణంగా లలిత కళలపై ఆసక్తి కలిగిన పిల్లలకు చదువుపై ఆసక్తి సన్నగిల్లడం సహజం. అందుకే పిల్లల్ని అటువైపు వెళ్లనివ్వరు. వాళ్లలోని ఆసక్తిని, సృజనాత్మకతను చాలామంది తల్లిదండ్రులు గమనించక వారికున్న ఆసక్తినే బలవంతంగా పిల్లలపై రుద్దే ప్రయత్నం చేస్తారు. వారి కోరిక అలాగే వుండిపోతుంది. కానీ అనుకున్నది సాధించాలనే పట్టుదల ఓ పట్టాన కూర్చోనివ్వదు. బుర్ర తోచనివ్వదు. వెంకటాచలం తండ్రి, తాతలు సంగీతజ్ఞులే. కానీ ప్రోత్సహించలేదు. ఒక శుభ ముహూర్తంలో మద్రాసు వెళ్లిపోయాడు. అదృష్టం కొద్దీ ఓ నిర్మాత దృష్టిలో పడ్డాడు. నటుడుగా అవకాశమొచ్చింది. దురదృష్టం కొద్దీ ఆ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. ఇంటి ముఖం చూడాలనిపించలేదు. భుక్తి కోసం హోటల్‌లో సర్వర్‌గా చేరి కొన్నాళ్లు కాలక్షేపం చేశాడు. లోపలి సంగీత తృష్ణ పెరుగుతూనే ఉంది. ఒక రికార్డింగ్ కంపెనీని వెతుక్కున్నాడు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, వసంతకుమారి లాంటి ఆనాటి స్టార్ సింగర్ల పాట రికార్డు చేసే అవకాశం కలిగింది. సంగీత వాతావరణం నచ్చింది. తన ప్రవృత్తికి తగ్గ వృత్తి దొరికిందనుకున్నాడు. క్రమంగా అనుభవం పెరిగింది. సంగీత జ్ఞానమూ పెరిగింది. క్రమంగా అవకాశాలు రాసాగాయి.
1958లో ‘ముందడుగు’ అనే చిత్రాని దర్శకుడై చేసిన పాటలు జనం మెచ్చుకున్నారు. జగ్గయ్య నాయకుడు. ‘చినదానా ఓయ్ చినదానా!’ మాధవపెద్ది పాడాడు. సత్యం, జానకితో కలిసి పాడిన పాట (కోడెకారు చిన్నవాడా) అప్పట్లో చాలా పాపులర్. వెనకటి తరంలోని పాత పాటలన్నీ 78 ఆర్‌పిఎం రికార్డుల్లో వుండేవి. మూడున్నర నిమిషాల్లో ఆ 78 ఆర్‌పిఎం రికార్డుల్లో సరిపెట్టగల పాటల్లో, సంగీత దర్శకుడి విశ్వరూపమంతా కనిపించాలి. ఆర్కెస్ట్రా ప్రారంభమవ్వగానే పాటను గుర్తించగలిగేలా సినిమా పాటలన్నీ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండేవి. ఆ పాటలు కట్టిన సంగీత దర్శకులు నిజంగా మేధావులే. కాకపోతే ఇనే్నళ్లపాటు వింటామా? పాటకు ట్యూన్ కట్టేస్తే సరిపోదు. ముందూ మధ్య చివరా వాద్య బృంద సంగీతం కూడా ఆ పాటకు అనుగుణంగా భావపురిపుష్టతతో నిండి వుండాలి. ఆ పాటలో, ఈ వాద్య సంగీతం పాలు, నీరులా కలిసిపోవాలి. అది కూడా ఒక ప్రజ్ఞే.
ఇది కాకుండా మళ్లీ ఆరంభం నుంచి జైహింద్ వరకూ రకరకాల సన్నివేశాలు గుండెకు హత్తుకునేలా వినబడే నేపథ్య సంగీతం బాధ్యత కూడా సంగీత దర్శకుడిదే. దీనే్న రీ రికార్డింగ్ అంటారు. ఇది వరకటి రోజుల్లో, ఇప్పటిలా ట్రాక్ రికార్డింగ్ పద్ధతి లేదు. చిన్న తప్పు పాడినా, వాయించినా ఆర్కెస్ట్రా బృందంతో మళ్లీ అదే, ఉత్సాహంతో మూడ్‌తో, భావంతో ఓపికతో గాయనీ గాయకులు పాడాలి. వాద్య బృందం కూడా హుషారు తగ్గకుండా వాయించాలి. అసిధారావ్రతమే.
పాట ‘ఓకే’ అనేంతవరకూ అర్ధరాత్రైనా అపరాత్రైనా అలా స్టూడియోల్లో మగ్గిపోతూండేవారు. ఇప్పుడా బాధ లేదు. ఎవరి ‘బిట్’ వారు వాయించి వెళ్లిపోవచ్చు. ఎవరి పాట వారు పాడేసుకుని వెళ్లచ్చు. ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవాల్సిన పనిలేదు. డైలాగులైనా, సన్నివేశాలకు తగిన సంగీతమైనా, పాటైనా, పద్యమైనా ఎవరికి ఖాళీ దొరికితే వారు అప్పుడే వెళ్లి రికార్డు చేసి ఎంచక్కా వచ్చేయవచ్చు.
బాబూ మూవీస్ మనసుల త్రయంతో సినిమాలు తీశారు. తేనె మనసులు, మంచి మనసులు, మూగ మనసులు. ఆశ్చర్యం? అన్నీ విజయవంతమే. అనేక కారణాల్లో దీనికి సంగీతం కూడా ఒకటి. కెవి.మహదేవన్‌గా ప్రసిద్ధుడైన వెంకటాచలం..
వాద్యబృందంపై చేసిన విన్యాసాలు, పసందైన పాటలు, పదిమందీ మెచ్చుకున్న వరసలు ఈ మూడు చిత్రాలకు పంచేశాడు. మహదేవన్‌తో చివరి దాకా వున్న పుహళేందిని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. ఆలోచనలన్నీ ఒకరివైతే ఆచరణ మరొకరిదీ.
పాట సాహిత్యం చూడగానే అనుభవజ్ఞులైన సంగీత దర్శకులకు అప్పటికప్పుడే ట్యూన్ తట్టేస్తుంది.
ఎంతో శ్రమ పడితేనేగానీ భావన, కొందరికి బయటకు రాదు. తీరా వచ్చిన తర్వాత, తమకు సంగీత సాహిత్య జ్ఞాన మున్నట్లుగా నటించే నిర్మాతలకు, దర్శకులకూ ఆ పాట నచ్చాలి. నచ్చకపోతే మరో ట్యూమ్ మనసులో పుట్టి తీరాలి. ఇంత చేసినా, ఆఖరికి ఆ పాట మనకూ నచ్చాలి. అప్పుడే ఆ సంగీత దర్శకుడి భవిష్యత్తు మూడు పువ్వులు ఆరుకాయలై వర్థిల్లుతుంది.
చక్కని భావుకుడైన సంగీత దర్శకుడు కృష్ణ కోయిల్ వెంకటాచలం మహదేవన్. నా పదమూడవ ఏట చూసిన సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఆ సినిమాకు మన మహదేవుడే సంగీతం. ఆ తర్వాత ఏవోకొన్ని సినిమాలు చేసినా మన తెలుగు వారికి, అటు సినీ నిర్మాతలకూ దర్శకులకూ బాగా దగ్గరై పోయాడు. భాషేదైతేనేం? కావలసింది భావం. ఇక్కడ కూర్చుని వివిధ భారతిలో హిందీ పాటలు విని ఆనందించే రసజ్ఞులెందరు లేరు? పాటకు స్వరమే ఆధారం. సకల జనులనూ కలిపేది ఈ స్వరమే. మహదేవన్‌ను తలుచుకుంటే గుర్తుకు తెచ్చుకోవలసింది ‘శంకరాభరణం’. దేశ విదేశాల్లో ఈ సినిమా ఎంత కీర్తి గడించిందో తెలుసు. కర్ణాటక సంగీతంలోనూ, పాశ్చాత్య సంగీతంలోనూ, హిందూస్థానీ బాణీలోనూ బాగా ప్రాచుర్యమున్న రాగం, ఎన్నో జన్యురాగాలున్న పెద్ద మేళకర్త రాగం ‘శంకరాభరణం’. ఈ రాగ పూర్తి స్వరూపం మీకు బాగా తెలియాలంటే ‘్భకైలాస్’ చిత్రానికి ఎం.ఎల్. వసంతకుమారి పాడిన ‘దేవ మహదేవ మము బ్రోవుము శివా’ అనే పాట మంచి ఉదాహరణ. రక్తిగా ఉండే వరసలు కట్టి ఆ సినిమా విజయానికి కారణమైన మహదేవన్ బహుముఖ ప్రజ్ఞ మాత్రం అనన్య సామాన్యం.
సినిమా సంగీతం కొన్నికొన్ని సందర్భాల్లో రాగరస నిర్ణయం చేస్తూ, పాడిస్తే కొందరు రసజ్ఞులు మెచ్చుకోవచ్చునేమో. కానీ, సామాన్యులు, ఆ పాటల స్థాయినందుకో లేకపోవచ్చు. అందరూ మెచ్చుకుంటూ ఆనందించేదే సినిమా సంగీతం. కొందరికి మాత్రమే నచ్చేది శాస్ర్తియ సంగీతం. 1979లో విడుదలై సంచలనం సృష్టించిన ‘శంకరాభరణం’ జాతీయ పురస్కారం నోచుకోవడానికి కారణమైన వారిలో మహదేవన్ ఒకడు.
‘మెల్లిశై చక్రవర్తి’ ‘కలైమామణి’ ‘స్వరబ్రహ్మ’ బిరుదులందుకున్న ఈ సంగీత దర్శకుడు లేకపోయినా ఆయన పాటలు మనల్ని నిరంతరం పలుకరిస్తూనే ఉంటాయి.

- మల్లాది సూరిబాబు 90527 65490