నేను.. ఎదురీతను
Published Saturday, 22 June 2019నేను
కాను, ఒక ఎదురీతను.
ఎదురీతనే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ.
*
జీవితం
సుడులు తిరుగుతున్న వరద
విస్తృతమయ్యే ప్రవాహ ఉధృతి
వొరుసుకుని గట్లు తెగినా
వొరిపిడికి గాట్లు పడినా
దిగుమతి అయింది కొట్టుకుపోవలసిందే.
పట్టుదొరకని వర్తమానం దిగువకు చేరాల్సిందే
గతిలేని అతి సముద్రంపాలు కావల్సిందే
ఈ అక్షరాలలో వొదగని బ్రతుకును నేను
అవును, నాది ఎదురీతనే.
*
ఆకాశానికి వేలాడిన ఆశలు
సూర్య కిరణాల్లా ఆశల్ని చీల్చుకున్న ఆశయాలు
చిరుతుంపరకే అరమోడ్పులైన ఇంద్రధనుస్సులు
నూనూగు మీసాల నిలిచిన సవరింపులు
పారాడిన బ్రతుకుకు తాత్కాలిక చిరునామాలు
అయినా, నేను ఎదురీతనే.
*
నా జేబు నింపుకోవటం నాదే అయినపుడు
నిలువునా చీరేసిన నా సమ సమాజం
వేలెత్తి చీదేసిన నా సభ్య సమూహం
పడిపోయిన నాలో
తమ గెలుపును చూసుకున్నప్పుడు
వాటి గెలుపులో
నా అస్తిత్వాన్ని నేనుగా చూసుకున్న నాడు
నా చిరునామా నా ఎదురీతనే.
*
పగటి ఆకాశం వేడెక్కించిన సంధ్యా సమయాన
చీకటి కమ్మిన ఆకాశాన చందమామలా నేను
నక్షత్రాలను పూయించిన నింగిన
పాలపుంతలా నా జీవితం
అయినా నా మార్గం ఎదురీతనే.
*
నా ఆలోచనకు ఎదురీత నేర్పిన గురువు
మట్టిని విప్పిన ఇక్కడి విత్తనమే
నా చేతలకు ఎదురీత నేర్పిన గురువు
గాలిని చీల్చిన ఇద్దరి పక్షినే
నా పాదాలకు ఎదురీత నేర్పిన గురువు
కడలిన దూసుకెళ్లిన ఈ తీరపు జాలరినే
నా అక్షరాలకు ఎదురీత నేర్పిన గురువు
కనలిన ముద్రిత వాక్య విన్యాసమే
నా చిరునామాకు ఎదురీత నేర్పిన గురువు
ప్రశ్నించిన పేరుకు అంటిన చిరుకీర్తే
నా కాలానికి ఎదురీత నేర్పిన గురువు
కాగితానికి దూరమైన కలం కనువిప్పే
నా అంతరంగానికి ఎదురీత నేర్పిన గురువు
నడతకు చేరువైన ఆత్మ పథమే.
*
రా రమ్మని చేతులు చాపిన అమ్మ
నా బుడిబుడి అడుగులకు
నేర్పించింది ఎదురీతనే!
అక్షరాలను అందంగా దిద్దించిన నాన్న
నా వ్రేళ్ల కొసలకు నేర్పించింది
అనుకరణకు ఎదురీతనే!
పాఠాలు చెబుతూ పరిహసించిన పంతుళ్లు
నా అమాయకతకు నేర్పించింది
ఆత్మవంచనకు ఎదురీతనే!!
గతం కొమ్మకు విరబూసిన చాందసులు
నా బ్రతుకుకు నేర్పించింది
ప్రాపంచికతకు ఎదురీతనే!
ముద్రారాక్షస పరిహారంలో శిక్షిత కలం
నా అక్షయ అక్షరానికి నేర్పించింది
తలతిప్పుడుకు ఎదురీతనే.