S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘గో-మాత’ అనొద్దు

ఫోన్ రింగయింది.
స్క్రీన్ వైపు చూస్తూ ‘మీ బాబాయిలా వున్నారు. వదిలిపెట్టేలా లేరు’ కేకేసింది కాత్యాయని.
‘ఎత్తమాకు. ఆయనే మానుకుంటాడు. రామకోటి, పూజ వ్యవహారాలు చాలా ఉన్నై. ఇప్పుడు కుదరదు. తరువాత చూసుకుందాం’ విసుగు ధ్వనిస్తూండగా భార్యకు సమాధానమిచ్చాడు వైద్య.
మరలా రింగయింది. తప్పేలా లేదు వైద్యనాథ్‌కు. ఈ రోజు చాలా పని ఉంది. ఇంట్లో దైవ కార్యక్రమాలు అయిన తరువాత గోమాతల మీద జరుగుతున్న హింసలు మరియు నివారణోపాయాలు మీద గోసంరక్షణ సమితి వారు ఏర్పరచిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసి ఉంది. ఆ సమావేశంలో మాట్లాడవలసిన ఉపన్యాసానికి సిద్ధం కావడం, గోవధకు మద్దతుగా నిలిచేవారి ప్రశ్నలకు సమాధానమివ్వడం మొత్తం అష్టావధానంగా ఉంటుంది. ఏ మాత్రం మానసికంగా, ప్రశాంతంగా మరియు ఏకాగ్రతగా, సిద్ధంగా లేకపోతే ప్రింట్, టీవీ మీడియా పత్రికా విలేకరుల ముందు పలుచన కావడంతోపాటు తరువాత జరిగే సమావేశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించక పోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఇన్ని ఆలోచనల మధ్య ఈయనగారి ఫోను. ఆయన మాట్లాడే విషయం గురించి ఆలోచిస్తూ, దానికి ఏం సమాధానం ఇవ్వాలో ఆలోచిస్తూ ఫోన్ ఆన్ చేశాడు. ‘ఏం బాబాయ్ బాగున్నావా? విశేషాలు ఏమిటి? అమ్మ బాగుందా?’ పలకరించాడు వైద్యనాథ్.
‘అంతా బాగానే ఉన్నారు. మీ అన్నదమ్ములకు ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. మీరేమో మీ పనులతో హడావిడిగా ఉంటారు మరి...’
‘క్లుప్తంగా చెప్పు బాబాయ్. చాలా పనులతో తీరిక లేకుండా ఉన్నాను. మీకు అవకాశం ఉంటే ఇంకో పర్యాయం వివరంగా మాట్లాడుదాం. లేకపోతే అన్నయ్యతో మాట్లాడండి. ఇంకా తప్పనిదయితే మాట్లాడండి’ ఆయన ఆ సోది ప్రవాహానికి అడ్డువేసేలా మాట్లాడాడు వైద్య.
‘ఇలా మాట్లాడితే ఎలారా?’
‘అసలు విషయం త్వరగా చెప్పండి బాబాయిగారు..’
‘మీ అమ్మ విషయం గురించే వైద్యా! వదిన వ్యవహారం...’
‘బాబాయిగారు ఆ విషయం అన్నయ్యతో మాట్లాడండి. అన్నయ్య నాతో మాట్లాడుతాడు. మేం ఇరువురం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తాము. చిన్నమ్మను అడిగానని చెప్పండి. ఖాళీగా ఉన్నప్పుడు నేనే మాట్లాడుతాను. ఉంటాను’ అటు నుండి సమాధానం ఆశించకుండా ఫోన్ ఆఫ్ చేశాడు.
‘మధ్యలో ఈయనకెందుకు మీ అమ్మగారి వ్యవహారం? మీ అన్నదమ్ములు చూసుకోలేరా? మీకు ఆ మాత్రం తెలివితేటలు లేవనుకుంటున్నారా మీ బాబాయిగారు. ఏమయినా మీ అమ్మగారు కూడా ఆమె మంచి చెడ్డలను మూడవ వ్యక్తి వద్ద మాట్లాడటం కూడా పెద్దగా బాగా లేదు.. ఇంకా...’
‘ఈ వ్యవహారం బాబాయికి అనవసరం. అలానే మా అమ్మ వ్యవహారం నీకు కూడా అనవసరం’ ఖండించకపోతే ఎంత దూరమైనా కాత్యాయని తీసుకెళ్లగలదని సంభాషణను మధ్యలోనే ఖండించాడు.
‘మీ బాబాయిలు, అన్నదమ్ములు, అమ్మ అంతా ఒకటే. నేనే పరాయిదాన్ని. మీకు ఎంత చేసినా నన్ను మనస్ఫూర్తిగా కలుపుకోలేని తక్కువ సంస్కారం మీది’ సరిగానే బాణం వేశాననుకుంది కాత్యాయని.
సమాధానం చెప్పకుండా పూజా వ్యవహారాలు చూసుకోవడం మంచిదనుకున్నాడు. సమాధానం చెపితే కురుక్షేత్రం రావచ్చు.
* * *
గో సంరక్షణ సమితి వారు పంపిన కారులో ప్రయాణిస్తున్నాడు వైద్య. ముఖ్య అతిథిగా మాట్లాడాలనుకుంటున్న మాటలను నెమరు వేసుకుంటున్నాడు. కలికాలం. ఈ మతోన్మాదుల, హేతువాదుల వారి నుండి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. ఆవు కూడా ఒక జంతువే అంటాడు ఒకడు. ఆవుపాలు అమృతమంటే బర్రెపాలు, మేక పాలు అన్నీ అమృతమే అంటాడు ఇంకొకడు. సృష్టిలో అన్ని జీవరాసులు సమానమంటాడు వేరొకడు. జంతువుల పాలు కూడా మాంసాహారమే అంటాడు ఒక చాదస్తుడు. వాటి సంతానానికి పాలు అందకుండా మనం తాగడం జీవహింస మరియు నేరం అంటాడు ఇంకొక హేతువాది. కోడిగుడ్డు శాకాహారం, కోడి మాంసాహారం అంటాడు గుడ్డు పక్షపాతి. ఫారం కోడి మాంసం కూడా శాకాహారమే అంటాడు ఒక పైత్యస్థుడు. శాకాహారం కూడా ఆ చెట్లను హింసించి వాటి నుండి కోయడమే అంటాడు మరో వెర్రివాడు. వయసు మళ్లిన వృద్ధ ఆవులను ఏం చేయాలి? అసలు జంతువులను చంపకపోతే ఈ భూమి సరిపోతుందా? ఈ ఆలోచనల సుడిగుండం నుండి బయటపడితేనే తను మామూలుగా మాట్లాడగలుగుతాడు. గో సంరక్షణ మరియు గో వధ గురించి మీడియాలో ఈ మధ్యకాలంలో ఎవరు ఏమి మాట్లాడారు మొదలైన విషయాలు అంతర్జాలం ద్వారా సేకరించసాగాడు దీక్షగా.
* * *
చప్పట్లతో హాలు మారుమ్రోగుతోంది. పూలు, పూలదండలు మీదకు వెదజల్లుతున్నారు. విలేకరులు ఫొటోలకు అవస్థలు పడుతున్నారు. హుందాగా మెడలో పూలదండలను సర్దుకుంటూ వేదిక దిగుతున్నాడు వైద్యనాథ్. గోవులను రక్షించండి - గోవు మిమ్ములను రక్షిస్తుందని, ప్రభుత్వం గోసంరక్షణ శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక హిందువును మంత్రిగా చేయాలని, జిఎస్‌టితో పాటుగా అదనంగా ఇంకో ఒక శాతం సెస్సు వేసి ఆ వచ్చే నిధితో ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని, ఆ నిధితో గో సంరక్షణ చేయాలని, గోరక్షకులకు పద్మ బిరుదులు ఇవ్వాలని, గో వ్యతిరేకులకు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని ఇలా పలు డిమాండ్లు చేసిన సందర్భాలలో మోగిన చప్పట్లతో తృప్తిపడ్డాడు వైద్య. ఆ ఆలోచనలతో సంతృప్తిగా కారు ఎక్కాడు. అభిమానులు బహూకరించిన షాల్స్, షీల్డులు, మెమొంటోలు, ఆహ్వాన పత్రికలు, స్వీట్ బాక్స్‌లు కొంతమంది కార్యకర్తలు కారులో సర్ది డోరు సున్నితంగా వేశారు. షీల్డులను ఆనందంగా, తృప్తిగా తాకి చూసుకున్నాడు. కారు కదులుతుండగా అక్కడ చీపురు పట్టుకొని ఊడ్పునకు సిద్ధమై యున్న ఒక నడికారు మహిళకు నూరు రూపాయలు డ్రైవర్ ఇవ్వడం గమనించాడు వైద్య. ఇంత హడావిడిలో కూడా డ్రైవర్ నూరు రూపాయలు ఆ మహిళకు ఇవ్వడం గురించి దీక్షగా ఆలోచించక తప్పింది కాదు. జనాన్ని తప్పిస్తూ చిన్నగా కారు నడుపుతున్నాడు డ్రైవర్.
‘ఆమె నీకు తెలుసా? ఆమెకు నూరు రూపాయలు ధర్మంగా ఇచ్చేంత పరిచయం ఉందా? అంత ధర్మంగా ఇచ్చేంత స్థితిపరుడవైతే ఈ చిన్న

ఉద్యోగమెందుకు?’ అన్ని ప్రశ్నలు ఒకేసారి గుప్పించాడు వైద్య.
‘పెద్దగా తెలియదండీ. ఆమె ఇద్దరు కొడుకులు ఆమె ఆస్తిని మాయమాటలతో కాజేసి ఆమెను బయటకు నెట్టారు. ఆమె ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు నాకు కనిపించింది. మాటలలో పెట్టి ఆమె చరిత్రను తెలుసుకో గలిగాను. ఆమెకు రేషన్ కార్డు, ఇక్కడ పనిచేస్తున్నందుకు ఇఎస్‌ఐ కార్డు, వితంతు పింఛను మొదలైనవి వచ్చేలా చేశాను. గవర్నమెంటు వారిచ్చిన స్థలంలో చిన్న రేకుల షెడ్డు లాంటిది కూడా ఏర్పాటు చేసుకుంది. అలా ఆమె బతుకు ఆమె బతుకుతోంది. ఇలా నెలకో, రెండు నెలలకో ఎప్పుడైనా కనపడితే, అప్పుడు నేను సంతోషంగా ఉంటే కొద్దిగా నా అవకాశం బట్టి ఇస్తాను. చాలా మొహమాటస్తురాలు. చాలా కష్టంగా తీసుకునేది.’
‘ఇక్కడ పని కూడా నువ్వే కుదిర్చావా?’
‘అవునండీ’
‘మనం వచ్చింది ఒక ఫర్లాంగే కదా! కొంచెం వెనకకు తిప్పు. నేను కూడా కొద్దిగా మాట్లాడుతాను’
వౌనంగా కారును వెనుకకు తిప్పాడు. మరలా ఆడిటోరియం హాలు వద్దకు చేరుకున్నది కారు. జనం దాదాపుగా వెళ్లిపోయారు. ఆమె ఊడుస్తున్నది. డ్రైవర్ సైగతో కారు వద్దకు వచ్చింది.
కారులో ఉన్న ఒక శాలువాను, స్వీట్ పాకెట్‌ను ఆమెకు అందించాడు వైద్య. ‘నాకు ఇవి ఏమీ పనికిరావు అందుకే నీకు ఇద్దామనిపించింది. నీకు అవసరం కావచ్చు. నీ గురించి మంచిగా డ్రైవర్ చెప్పాడు. అందుకే నీకు ఇచ్చాను.’
సిగ్గుపడుతూ తీసుకుందామె.
వైద్య సైగతో కారును మరలా పోనిచ్చాడు డ్రైవర్.
‘ఆ స్వీట్ పాకెట్‌లో ఐదు వందల రూపాయలు కావాలనే ఉంచాను. డైరెక్ట్‌గా ఆమె తీసుకోదనే ఉద్దేశంతో అలా చేశాను. కాసేపాగి ఆ విషయం ఆమెకు తెలియజేయి’ మామూలుగా అన్నాడు వైద్య.
‘చాలా సంతోషం బాబుగారూ. మీ మేలు ఆమె జన్మజన్మలకు మర్చిపోదండి’
‘అది సరే నువ్వు ఇలా ఇస్తూ వుంటే నీ జీతం ఏం సరిపోతుంది? నువ్వు ఇబ్బంది పడవా?’ ఆరాగా అడిగాడు వైద్య.
‘అవకాశం ఉన్నంతవరకు చూస్తాను. మా ఆవిడ కూడా ఇళ్లల్లో గినె్నలు కడిగే పనికి పోతుంది. ఇద్దరి సంపాదన కాబట్టి పెద్దగా బాధ ఉండదు.’
డ్రైవర్ ఉన్నత భావాల గురించి కొద్దిగా ఆశ్చర్యపడ్డాడు వైద్య.
‘మనం ఒక అమ్మను బజారున పడకుండా ఆదుకుంటే మన అమ్మ బజారులో పడకుండా భగవంతుడు కాపాడుతాడని నా ఆలోచన సార్. రేపు నన్ను నా భార్యను బజారులో వేయకుండా చూసేలా భగవంతుడు చేస్తాడని అనుకుంటాను సార్. మనం చేసే పనులన్నీ మీ భగవంతుడైనా, మా భగవంతుడైనా మన ఖాతాలో రాస్తాడని భావిస్తాను. ఏమిటో నాదో పిచ్చి.’
కొద్దిగా అతని మనసు, మతము అర్థమయ్యాయి వైద్యకు. అతని మానసిక ఔన్నత్యం గొప్పదనుకున్నాడు. అయితే ఆ మాటలు అనలేక పోయాడు. ‘నా వద్ద ఇంకా కొన్ని శాల్స్, స్వీట్ పాకెట్స్ ఉన్నాయి. నేను వీటిని వాడుకోను. అవసరమైతే, అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి పట్టుకెళ్లు’
‘మాకు ఇటువంటి తినుబండారాలు చాలా అరుదుగా తక్కువగా దొరుకుతై. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్లి ఇచ్చి వెంటనే వస్తాను.’
‘అలానే ఇచ్చిరా’ తనకు ఉపయోగపడకపోయినా ఎవరో ఒకరికి ఉపయోగపడతాయని తృప్తిగా అనుకున్నాడు వైద్య.
అక్కడే ఉన్న గల్లీలోకి కారు ప్రవేశించింది. అదొక స్లమ్ ఏరియా. కారు ఆపాడు. ‘తమకు ఇష్టమైతే మా ఇంటిలోకి వచ్చి మమ్ములను ఆశీర్వదించండి మాస్టారూ’ చేతులు కట్టుకుని దీనంగా అన్నాడు డ్రైవర్.
అతని మనసునే కాక అతని ఇంటిని కూడా పరిశీలించవచ్చనుకున్నాడు వైద్య. కొన్ని పాకెట్స్, షాల్స్ డ్రైవర్‌కి ఇచ్చి కారు దిగి డ్రైవర్ వెనుకనే వారి ఇంటిలోకి ప్రవేశించాడు. ప్లాస్టిక్ కుర్చీ దులిపివేశాడు డ్రైవర్. ఇల్లు శుభ్రంగా పొందికగా అమర్చుకున్నారనిపించింది. అతని భార్యను, తల్లిని, ఇద్దరు పిల్లల్ని పరిచయం చేశాడు డ్రైవర్. అతని భార్యకు వైద్యనాథ్ గురించి, ఆయన వాగ్ధాటి గురించి ఆయన దయతో తమ ఇంటికి వచ్చి కానుకలు ఇచ్చిన విషయం గురించి అబ్బురంగా, ఆనందంగా చెప్పాడు.
ఆ కానుకలను డ్రైవర్ అతని భార్యకు ఇచ్చాడు.
‘నాకు ఇస్తావెందుకు? ‘మా’ కు ఇవ్వరాదు’ అంటూ భర్త చేతి నుండి కానుకలను తీసుకొని ‘మాజీ! తమరే అందరకు ఇవ్వండి’ అత్తకు ఇస్తూ అంది.
అత్తయ్యను ‘మా’ అంటుందేమిటి? ఇదేం పద్ధతి? కొద్దిగా ఆశ్చర్యంగా ఆలోచనలలో పడ్డాడు వైద్య.
‘ఎవరైతే ఏం బేటీ ఎవరైనా ఇవ్వవచ్చు’ అంటూ కొడుకుతోపాటు అందరకు స్వీట్లు పంచింది డ్రైవర్ అమ్మ.
కోడలిని కూతురుగా సంబోధించే ఈ అత్తగారిని చూసి మరలా ఆశ్చర్యపోయాడు వైద్య.
‘మీరు కూడా ఒకటి తీసుకుంటారా బేటా!’ తీసుకుంటారో, తీసుకోరో, ఏమనుకుంటారో సందిగ్ధంగా అడిగింది.
ఆమె బేటా అనడంతో ఇంకేం ఆలోచన లేకుండా ఆమె నుంచి స్వీట్ తీసుకుని తిన్నాడు. వీరి గురించి, వీళ్ల ఆచారాల గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. వారి వద్ద వీడ్కోలు తీసుకొని మరలా కారులో బయలుదేరాడు వైద్య.
‘మీ ఇరువురు భార్యాభర్తలు మీ అమ్మగారిని అమ్మ అనడం ఎలా కుదురుతుంది? అలాగే మీ అమ్మ మీ ఇరువురిని బేటా, బేటీ అనడం ఎలా

గో-మాత అనొద్దు (7వ పేజీ తరువాయ)
వీలవుతుంది? ఇబ్బంది లేదా?’ ప్రయాణంలో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్‌ను ప్రశ్నించాడు వైద్య.
‘ఇబ్బందనుకుంటే అంతా ఇబ్బందే. మిగతా వారు ఎలా పిలుచుకుంటారో నాకు తెలియదు. మేం మాత్రం ఇలానే పిలుచుకుంటాము. మతమేదయినా చాలామంది ఇలాగే పిలుచుకుంటారని అనుకుంటాను. మా గురించి మీరనుకుంటారు తేడాగా. మీ గురించి మేం అలాగే తేడాగా అనుకుంటాము. కానీ అందరూ ఒకలానే అంటారు అనుకుంటాను. మీ కోడళ్లు కూడా అత్తమ్మ, మామయ్య అని వాళ్ల అత్తమామలను అంటారనుకుంటాను. అలాగే మీ పిల్లలను మీ భార్యాభర్తలు ఇరువురు కూడా అమ్మనాన్న అంటారనుకుంటాను. మీరు అమ్మనాన్న అన్నవారినే మీ భార్యగారు అమ్మ నాన్న అనడం కుదిరితే మేమూ అలానే అంటే ఎందుకు కుదరదు? ఆలోచనలోనే తేడా. అత్తను అమ్మగా, కోడలిని కూతురుగా చూసుకొనగలిగిన ఔదార్యముంటే సంసారాలు విచ్ఛిన్నమవవని, తల్లిదండ్రులు కొడుకులకు దూరంగా ఉండరని భావిస్తాను’ తాపీగా సమాధానం చెప్పాడు డ్రైవర్.
కారు చిన్నగా వెళుతోంది. రకరకాల ఆలోచనలు ముప్పిరి కొనసాగినై అనేక ప్రశ్నలు వేధించసాగినై.
‘ఇందాక మీ ఉపన్యాసంలో గోమాత, గోసంరక్షణ గురించి చాలా ఉన్నతంగా మాట్లాడారు. అభ్యంతరం లేదు. ముందు మాతను కాపాడమనండి. తరువాత గోమాతను కూడా కాపాడమనండి. అమ్మను బజారులో పడేసి, గోమాతను ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ గోమాత కూడా నవ్వుతుంది మానవుడి జాణతనం గురించి. అమ్మను ఇంట్లో ఉంచుకున్నాక ఏ మాతను గౌరవించినా అభ్యంతరం ఉండదు. అసలు అమ్మను వద్దన్నాక ఏ అమ్మను గౌరవించినా ఫలితం ఉండదనుకుంటాను. ఇకపై తమరు చెప్పే ఉపన్యాసాలలో ఈ అర్థం వచ్చేలా చెపితే చప్పట్లు మాటేమో గానీ ప్రజలు కొద్దిగా ఆలోచనలో పడి వృద్ధులను గౌరవించడం నేర్చుకుంటారనుకుంటాను. ఆవులను సంరక్షిస్తే అవి మనను సంరక్షిస్తాయో లేదో తెలియదు కానీ తల్లిదండ్రులను గౌరవిస్తే మన పిల్లలు మనలను గౌరవిస్తారన్నది కచ్చితంగా నిజం. మన పిల్లలు మనలను చూసి నేర్చుకుంటారు. మనలను ఆదరిస్తారు. నేటి మనమే రేపటి వృద్ధ తల్లిదండ్రులం. ఈనాటి మన పిల్లలు రేపు మనలాగా తయారవుతారు. నేను చెప్పే భాషలో కొద్దిగా తప్పులుంటే ఉండవచ్చు గానీ భావంలో మాత్రం కరెక్ట్. దయ ఉంచి అర్థం చేసుకోండి. తప్పయితే క్షమించండి.’
ఇంకా ఆలోచనల్లో పడ్డాడు వైద్య. తన తండ్రి చనిపోయి మూడు సంవత్సరాలయింది. అమ్మ ఇక్కడికి వచ్చినపుడు తన భార్య వ్యంగ్యోకులతో కించపరచటం, ఏం మాట్లాడినా పెడర్థం తీయడం, తన పిల్లలను నానమ్మకు దూరం చేయటం, వారి పుట్టింటి గురించి గొప్పగా చెప్పడం, తన అమ్మ ఆచార వ్యవహారాలను కీతాగా చేయడం మొదలైన కార్యక్రమాల గమనించి, తన భార్యను ఏమీ అనలేక పోవడం, ఆమె క్రుంగిపోయి తన పల్లెకు వెళ్లడం.. ఆలోచిస్తే తను ఎంత అల్పుడో, ఎంత దౌర్భాగ్యుడో.. ఛీఛీ.. తన సంస్కారం, చదువు, ఆధ్యాత్మిక భావం నిజంకావా? పరుల కోసమేనా? తన బతుకంతా నాటకమేనా? ఒక గోవును చూసిన మాత్రం అమ్మను చూడలేడా? ఇది ఒక అన్యమతస్థుడైన, చదువులేని ఒక డ్రైవర్ ద్వారా తెలుసుకోవాలా? తనకు స్వంతంగా అర్థం కాదా? అమ్మ బాధ గురించి ఉదయం బాబాయి ఫోనులో బతిమిలాడితే ఆలకించడా? అన్న ఉంచుకోలేక పోతే అమ్మను తను ఉంచుకోలేడా? అన్నను చదివించిన దానికంటే తనను ఇంకా ఎక్కువ చదివించిన అమ్మ నాన్నల గురించి ఇలానేనా ఆలోచించేది? అన్నతో పోటీ పెట్టి తనను తక్కువ చదువుతో ఆపలేదు కదా? ఆర్థిక ఇబ్బందుల వలన అన్నయ్య కాదంటే తను కూడా అమ్మను కాదనాలా? ఎంత తెలివితక్కువ! తల్లిని కాదని చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట నా బోటివాడు! అలానే ఉంది తను అమ్మను కాదని గోమాతను పూజ చేయమనడం. రేపు నేను నా పిల్లలకు దూరమయ్యే విషయం తలుచుకుంటే ఈ రోజే ఆత్మహత్య చేసుకుందామనిపిస్తుంది. ఇలాగే అమ్మ కూడా బాధ పడుతుంటుందా? ఎంత బాధపడుతుందో? అమ్మా క్షమించు. అమ్మను తన భార్య అంగీకరించేలా, కచ్చితంగా అంగీకరించేలా చేయాలి. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి నయానా భయానా అంగీకరింపజేయాలి. అలా కాని పక్షంలో అమ్మను నగరంలోనే వేరుగా ఉంచి ఆమె మంచి చెడ్డలు చూడగలగాలి. అలా కాని పక్షంలో తన ఉద్యోగానికి తాత్కాలికంగా సెలవు పెట్టి పల్లెకు వెళ్లి ఆమెను సంతోషపెట్టాలి. తరువాతనే ఏ విషయమైనా. ఈ విషయం అమ్మకు, బాబాయికి వెంటనే ఫోన్ చేయాలి...
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-బి.వి.కోటేశ్వరరావు.. 9948047389