S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-18

‘అన్నట్టు ప్రియ నాన్నగారి దగ్గరికొస్తోందిగా?’ అంది గౌతమి మాట మారుస్తూ.
‘అయ్యో! ఆవిడ రాకుండా ఎలా?’ ఆయన్ని కంటికిరెప్పలా చూసుకునేది ఆవిడే’ అన్నాడతను. గౌతమి ఏదో అనబోతుండగా ఉరుకులు పరుగులతో వచ్చింది చిన్ని.
‘గౌతమీ! బావొచ్చేశాడు. మీ ఇద్దర్నీ చూస్తే గొడవై పోతుంది. నేనీయన్ని ఆవులకొట్టంలోకి తీసికెళ్తాను. తనొస్తే తొందరగా మాట్లాడి వచ్చెయ్యి’ అంటూ ప్రభు చెయ్యి పట్టుకుని లాక్కెళ్తున్నట్టు ప్రభుని తీసుకెళ్లిపోయింది.
బిత్తరపోయిన ప్రభుని గురించి ఆలోచించడంలేదు గౌతమి. గభాల్న లేచి నిల్చుంది.
మరో రెండు నిమిషాల్లో కల్లా జింబో వచ్చేశాడు.
‘ఇక్కడున్నావా? నీ కోసం దర్బారంతా వెతికాను. నీ కోసం ఏం తెచ్చానో చూడు’ అంటూ బ్యాగ్‌లో నించి గాజులు, రకరకాల తలపిన్నులూ లాంటివి తీసి ఇచ్చాడు.
‘ఇవి నేనడగలేదే’ అంది గౌతమి గంభీరంగా.
ఆమె అన్న తీరుకి జింబో మొహం చిన్నబోయింది. ‘ఇంకా నీకు నా మీద కోపం పోలేదా గౌతమీ?’ అన్నాడు దీనంగా.
‘నీ మీద నాక్కోపం ఎందుకు?’
‘అదిగో నీ మాటలోనే తెలుస్తోంది, నా మీద నీకు చాలా కోపంగా ఉంది. గౌతమీ నన్నర్థం చేసుకో. నువ్వు లేందే నేను బతకలేను. నువీ అడవి వదిలి మాత్రం వెళ్లొద్దు. తొందరేం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా నీ మనసు మారుతుందని నాకు తెలుసు’ అంటూ నవ్వేశాడు జింబో. క్షణం ఆలోచించిన గౌతమి-
‘ఈ అడవిలో వుండిపోవాలా? ఈ గాజులూ పూసలూ పెట్టుకుని’ అంది వ్యంగ్యంగా.
ఆమె మాటల్లోని వ్యంగ్యాన్ని గ్రహించని జింబో ‘ఇవి నా నచ్చి తెచ్చాను. నీకేం కావాలో చెప్పు! తెచ్చి పెడతాను’ అన్నాడు ఉత్సాహంగా.
‘దొంగిలించా?’
‘గౌతమీ’
‘అవును. మీరంతా దొంగలు. దోపిడీ దొంగలు. సాక్షాత్తూ ఆ పార్వతీదేవి మెడలోని నగల్నే దొంగిలించే దుర్మార్గులు. మేం దైవాన్ని నమ్ముకుని, దైవసేవతోపాటు ప్రజాసేవ కూడా చెయ్యాలని ఆరాటపడేవాళ్లం. మీరు ప్రాణాలు తీసే హంతకులు. నేను ప్రాణాలు పోసే డాక్టర్ని. ఇక్కడే వుండి నిన్ను కట్టుకుని ఆ పాపపు సొమ్ము తింటూ.. జీవచ్ఛవంలా బతకమంటావా?’ అంది గౌతమి విసురుగా.
క్షణం ప్రతిమలా అయిపోయాడు జింబో. వెంటనే అతని కళ్లు ఎర్రబడ్డాయి.
‘నిజమే. మేం ఒకప్పుడు దొంగలమే. అడవిలో పుట్టి పెరిగిన అనాగరికులమే. కానీ మీరు? సాక్షాత్తూ ఆ దైవ సన్నిధిలో వుంటూ, పూజలూ జపాలూ చేస్తూన, ధనకాంక్షతో ఆ దేవుడి కళ్లే కప్పి నగలు దొంగిలించి, మీ మీద అనుమానం రాకుండా ఆ నేరాన్ని మా మీదికి నెట్టి అందరినీ నమ్మించారు. ఆ పోలీసులకి ధైర్యం లేక అడవికేసి రాలేదు గానీ, లేకపోతే మీరు చేసిన పాపానికి శిక్ష మేం అనుభవించాల్సొచ్చేది కాదూ? ఇవన్నీ కూడా మంచి పనులేనా?’ అన్నాడు తీక్షణంగా.
కొయ్యబారిపోయింది గౌతమి.
‘ఇవన్నీ నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? ఎక్కడేం జరుగుతాయో అన్నీ మాకు తెలుసు. నువ్వు, మీ నాన్న కలిసి గుళ్లో ఉన్న సెక్యూరిటీ వాళ్లని చంపి, నగలన్నీ దోచుకుని ఎవరూ చూడకుండా అడవిలోనే దాచారు. కానీ మా వాళ్లది చూశారు. కాదనగలవా?’ మళ్లీ జింబోనే అన్నాడు.
గౌతమి వణికిపోయింది.
‘లేదు జింబో! నగలు తీసిన మాట నిజమే గానీ, వాటిని మా స్వార్థం కోసం తియ్యలేదు. సెక్యూరిటీ వాళ్లని చంపి దేవుడి నగలన్నీ దాచేశారు దుర్మార్గులు. లోపల వున్న నగలు వాళ్ల కంట పడలేదు. అవి కూడా వాళ్ల పాలవుతాయేమోనని భయంతో వాటిని మేమే తీసి దాచాం. తర్వాత అధికారులకి అప్పగించాలని. కానీ వాటినీ..’ ఆమెకి మాట రాలేదు దుఃఖంతో.
‘కానీ ఆ నగల్నెవరో దొంగిలించారు. మీరు కంగారు పడిపోయారు. విషయం కనుక్కున్న పోలీసులు మీరే నేరస్థులను నిర్ణయించేశారు. ఆ నగల్ని మా మామే దొంగిలించాడని ఆయన్ని వెతుక్కుంటూ నువ్వొచ్చావ్. కానీ ఆ నగలు ఆయన దగ్గర లేవే’ నవ్వాడు జింబో.
గౌతమి మొహం వెలవెలబోయింది. ‘దొర దగ్గర లేవా? అంటే ప్రాణాలకి తెగించి నేను రావడం శుద్ధ వేస్టన్న మాట’ అంది గొణిగినట్టు.
అతను మళ్లీ నవ్వాడు.
‘మా మావఁ దగ్గర లేవన్నాను గానీ అసల్లేవనలేదుగా’ అన్నాడు కులాసాగా నవ్వుతూ.
‘అంటే?’
‘అది నా దగ్గరున్నాయి. ఎందుకంటే వాటిని దొంగిలింది నేనే కాబట్టి’
ఆమె మొహం వెలిగిపోయింది.
‘జింబో! ప్లీజ్! ఆ నగలు నాకివ్వవూ’ అతని చేతులు పట్టుకుని వేడికోలుగా అంది.
‘నా జీవితానే్న నీ కాళ్ల ముందు పెట్టాను. నువ్వు కోరితే ఆ నగలేవిటి నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను’ అన్నాడతను మెరుస్తున్న కళ్లతో.
గతుక్కుమంది గౌతమి. అదేం గమనించకుండానే -
‘సరే! రాత్రికి ఆ నగలు అక్క చేతికిచ్చి పంపుతాను. అదే మన నిశ్చితార్థం అనుకో’ అంటూ ఉత్సాహంగా వెళ్లిపోయాడు జింబో.
నీరసంగా కూలబడిపోయింది గౌతమి.
నగల గురించి ఆనందించినా, అతని కండిషన్ విన్నాక గుండెల్లో రాయి పడింది. మరి కాసేపటికి చిన్ని, ప్రభు వచ్చేశారు జింబో అక్కడ నుంచి వెళ్లడం గమనించి. గౌతమి మొహం చూసి కంగారు పడిపోయారు. ఇంక తప్పదన్నట్టు ఆమె జింబోని గురించి అంతా చెప్పేసింది. నగల గురించి, అతను పెట్టిన కండిషన్ గురించి చెప్పింది నీరసంగా. నిర్ఘాంతపోయాడు ప్రభు.
‘ఇదేం గొడవ?’ అన్నాడు గొణిగినట్టు.
‘బాధపడకండి ప్రభూ! ఎవరికెవరు రాసున్నారో? బావ గౌతమిని చేసుకుంటే ఎంచక్కా మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అంటూ వెళ్లిపోయింది చిన్ని. ఈసారి గౌతమి, ప్రభు కొయ్యబారిపోయారు.
* * *
ప్రభు కనిపించక కలవరపడుతున్న చంద్రకి ప్రతిపక్ష నాయకులు, మీడియా వాళ్లూ మరింత చికాకు పెట్టేస్తున్నారు. కొందరు ప్రబుద్ధులు ‘ఇద్దరూ కలిసి ఎక్కడికో ఉడాయించేశారు’ అంటూ కథలల్లుతున్నారు. గౌతమి, ప్రభులు అడవిలో ఆటవికులకి బందీగా ఉంటారన్న నమ్మకం విజయ నాయక్‌కి, చంద్రకి కూడా ఏర్పడిపోయింది.
‘ఇంత జరిగాక ఇంక దాచడం అనవసరం అనుకున్న చంద్ర నాయక్‌తో సంప్రదించి అడవి చుట్టూ పోలీసు బలగాన్ని కాపలా పెట్టించాడు. అనిల్‌కేమైనా వార్త అందిందేమో అన్న ఆశతో విజయ నాయక్ అతనిక్కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు.
‘ఇంత గొప్ప నాయకుడు, అంత దయ గల ప్రజాబంధువు అని పేరు తెచ్చుకున్న ఈ సి.ఎం. ఏమిటీ, పిరికివాడిలా మీనమేషాలు లెక్కపెడుతున్నాడు’ అంటూ గుసగుసలు మొదలుపెట్టారు జనాలు.
‘మిస్టర్ నాయక్! ఇంక ఉపేక్షించి లాభం లేదు. బలమైన బలగాన్ని తీసుకుని అడవిలోకి ప్రవేశించి, ఆ బ్లాక్‌టైగర్ ముఠాని అంతం చెయ్యాల్సిందే’ అన్నాడు చంద్ర ఆవేశంగా.
‘వద్దు సార్! ఇప్పటికే మన పోలీసు బలగాలు అడవి చుట్టూ మోహరించి ఉన్నాయి. లోపలికి జొరబడతే, ముందుగా ప్రభుగారూ వాళ్లకి, తర్వాత పోలీసుల బలగాలకీ ముప్పు రావచ్చు. ఆ టైగర్ ఎంత కర్కోటకుడో అందరికీ తెలిసిందే. అందుకే రహస్యంగా నేను మాత్రం వెళ్లి గాలిస్తాను’ అన్నాడతను.
‘మీరా? కానీ...’
‘్ఫరవాలేదు. నేనక్కడికెళ్లడం గురించి నా భార్యా పిల్లలక్కూడా తెలియనివ్వను. ఆ విషయం రహస్యంగానే ఉంచుదాం’ అన్నాడు నాయక్ చంద్ర మాట పూర్తి కాకుండానే.
ఆలోచనలో పడ్డాడు చంద్ర.
విజయ నాయక్ తండ్రి సి.ఐ.గా పని చేస్తూ, ఓ యాక్సిడెంట్‌లో పోయాడు. అతను నిజాయితీపరుడే కానీ, బ్లాక్ టైగర్‌కి భయపడో, డబ్బు కాశించో, అతని ముఠాకి సహాయ సహకారాలందిస్తున్నట్టు వార్త వచ్చింది. కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. చివరికి అతను ఓ దొంగల ముఠాలో వుండగా చూసిన పోలీసులు, దొంగలతోపాటు అతన్నీ కాల్చేశారని చెప్పుకునేవారు. తన తండ్రి చేసిన పనికి, తండ్రంటే అమితంగా ప్రేమించే నాయక్ మనసు గాయపడింది. తనూ పోలీసాఫీసరై అతి నిజాయితీగా ప్రజాసేవా, తద్వారా దేశసేవా చెయ్యాలని నిర్ణయించుకుని కష్టపడి చదివి ఆ పొజిషన్ కొచ్చాడు. దశాబ్దాల క్రితం జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ అతని మనసులోంచి తొలగలేదు. ఈ విషయాన్ని దాదాపు అందరూ మర్చిపోయారు. నాయక్‌ని నీతి నిజాయితీ, ధైర్య సాహసాలూ ఉన్న మంచి పోలీసాఫీసర్‌గా ఆదరిస్తున్నారు. ఇదంతా చంద్రకి తెలుసు. అందుకే అతను అడవిలోకెళ్తానంటే ఆలోచనలో పడ్డాడు. అది అతని నిజాయితీని శంకించి కాదు. తండ్రిలా అతనికీ ఏదైనా కీడు జరుగుతుందేమో అని.
అయినా నాయక్ వినలేదు. అతి సాహసంగా, ఒంటరిగా అనామకుడిలా బయల్దేరాడు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోలేదు. భార్యాబిడ్డలకి ఏదో కేంప్‌కని చెప్పడంతో వాళ్లూ పెద్ద కంగారు పడలేదు.
అడవికి చేరువగా ఉండే గ్రామాలన్నీ గాలించాడు. గౌతమి రాసిన ప్రిస్క్రిప్షన్స్ ద్వారా అడవిలో ఆమె క్షేమంగానే ఉందని గ్రహించాడు. అయితే అడవిలోకి ఏ మార్గంలో వెళ్తే సురక్షితమో తెలుసుకోవాలని అమాయకుడిలా ఎంక్వయిరీ చేశాడు. చివరికి రెండు మార్గాలు ఎంచుకున్నాడు. అదీ అడవి అందాలు చూడాలన్నట్టు.
‘జాగ్రత్త బాబూ! మరీ లోపలికెళ్లకండి. ప్రమాదం’ అంటూ హెచ్చరించారు కొందరు. అతను సరే అన్నట్టు ముందుకి నడిచాడు. మనసులో మాత్రం-
‘తనెన్ని భయంకరణ్యాలు చూడలేదు. కిరాతకుల్లాంటి రాడికల్స్‌ని ఎంతమందిని మార్చి జనావళిలో కలపలేదూ. సి.ఎం.గారి అనుమతైతే సింగపడవిని మాత్రం వదిలేవాడా?’ అని నవ్వుకున్నాడు.
అనుకున్నట్టే ఓ బ్యాగ్, కెమెరాల్లాంటివి తీసుకుని దైవాన్ని తల్చుకుంటూ, ‘సరైంది’ అనుకున్న ఓ సన్నదారిగుండా అడవిలో ప్రవేశించాడు. నిజంగానే అతనికి అడవులంటే చాలా ఇష్టం. చాలారోజుల తర్వాత, మళ్లీ ప్రభూ వాళ్ల కోసం అడవికేసి నడిచాడు.
* * *
రాత్రి పది గంటలయింది. అడవంతా నిశ్శబ్దంగా ఉంది. ఆరుబైట ఒంటరిగా పడుకున్న జింబో అసహనంగా పక్కమీద పొర్లుతున్నాడు. కళ్లు తెరిచినా, కళ్లు మూసినా గౌతమి రూపం కనిపించి కలవరపరుస్తోంది. అంతవరకు ఎలాగైనా ఆమెని ఒప్పించి తనదాన్ని చేసుకోవాలన్న ఆశ ప్రభు రాకతో అంతరించి పోయింది. దానికి మించి దొర వాళ్లిద్దర్నీ దంపతుల్లా స్వేచ్ఛనిచ్చి అపురూపంగా చూడడం అతని ఒంటినిండా కారం రాసినట్టుంది.
అంత పొద్దుపోయినా ఇంటికి రాని తమ్ముణ్ని వెతుక్కుంటూ వచ్చిన కొండమ్మ తమ్ముణ్ణి చూసి-
‘ఇంకా ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేంరా. నీ కోసం అన్నం కూడా తినకుండా చూస్తున్నాను’ అంది అతని భుజం మీద చెయ్యేసి.
‘నాకు ఆకలిగా లేదక్కా! నువ్వెళ్లి తినై’ అన్నాడతను.
‘ఏవైందిరా? అలా వున్నావేంటి? ఒంట్లో బాగాలేదా?’ ఆతృతగా అంది కొండమ్మ.
‘నా మనసు బాగా లేదక్కా. ఆ ప్రభుగాడ్ని చంపెయ్యాలనిపిస్తోంది’ ఆవేశంగా అన్నాడు జింబో. బిత్తరపోయిందావిడ.
‘ప్రభు బాబుని చంపాలనుందా? నీకేమైనా పిచ్చెక్కిందా? మన దొరకి ప్రాణదానం చేసిన డాక్టరమ్మక్కాబోయే భర్త. ఆవిడ కోసం వచ్చాడు. ఆయన్ని చంపుతానంటావేంటి?’ అంది చిరాగ్గా.
‘చంపాలి. ఎందుకంటే ఆ గౌతమిని నేను పెళ్లి చేసుకుంటాను’
ఈసారి అదిరిపడింది కొండమ్మ.
‘ఆ డాక్టరమ్మని నువ్వు చేసుకుంటావా? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు చేసుకుంటాననగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకోడానికి ఆవిడ అడవి పిల్ల కాదు. అయినా చిన్నతనం నించీ నీమీదే ఆశలు పెంచుకున్న చిన్నినేం చేస్తావ్?’

అంది అరిచినట్టు.
‘అదంతా నాకు తెలియదు. ఎలాగైనా నేను గౌతమిని మనింటికి తీసుకొచ్చేస్తాను. అక్కడైతే ఆవిడకి సౌకర్యంగా ఉంటుంది. నాలుగు రోజులు పోతే తనే ఒప్పుకుంటుంది’ నిర్లక్ష్యంగా అన్నాడు జింబో.
‘మనింటికా? నిజంగానే నీకేదో దెయ్యం పట్టింది. ఇంతవరకూ, తనకి ప్రాణదానం చేసిన డాక్టరమ్మకి మనిళ్ల సంగతే చెప్పలేదు మావ. అలాంటిది ఇప్పుడు మనింటికి తీసుకెళ్తే నరికిపోగులు పెడతాడు మావ’ అంది కొండమ్మ కోపంగా.
‘ఏవిఁటి మనిళ్ల దగ్గరికొస్తే.. పాతాళస్వర్గం గురించి తెలిసిపోతుందనేగా. ఫరవాలేదు. తనని అటుకేసి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. ఆ ప్రభుని మాత్రం ఇట్నించే తరిమేస్తాను’ మొండిగా అన్నాడతను.
కొండమ్మకి వణుకు వచ్చేసింది.
‘చూడు పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మావ ఆరోగ్యం కుదుటపడగానే మర్యాదగా వాళ్లిద్దర్నీ నగరానికి చేర్చే ఉద్దేశంలో ఉన్నాడు మావఁ. ఇప్పుడు నీ మాటలు వింటే కోపం రావడం అటుంచి, ఆయన ప్రాణాలకే ముప్పు రావచ్చు. తిండి తినాలనుంటే కొంపకి రా. లేదంటే ఇక్కడే పడుండు’ అంటూ విసురుగా వెళ్లిపోయింది కొండమ్మ.
నీరసం వచ్చేసింది జింబోకి. కొండమ్మకి అతనంటే ప్రాణం. కన్నబిడ్డకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అందుకే అక్క ద్వారా తన కోరిక నెరవేరుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అతని ఆశలు అడియాసలై పోయాయి.
అలా ఆలోచిస్తూ ఎంతసేపున్నాడో, కాస్త పక్కగా వున్న పొద దగ్గర ఏదో చప్పుడవడంతో గభాల్న లేచి పక్కనే వున్న టార్చ్‌లైటు వేసి కొయ్యబారిపోయాడు.
అక్కడ పులి, సింహాల్లాంటివేం లేవుగానీ, ప్రభు, చిన్ని అతి చేరుగా కూర్చుని ఏదో గుసగుసలాడుకుంటూ, తమ మీద వెలుగు పడగానే, గభాల్న లేచారు.
‘మీరా? అక్కడేం చేస్తున్నారు?’ తేరుకున్న జింబో కఠినంగా అన్నాడు.
‘ప్రభుగారూ అడవి చూద్దామంటే వచ్చాం. నువ్వేం చేస్తున్నావ్? చెట్లలో మంచం వేసుకుని మరీ కూర్చున్నావ్?’ అంది చిన్ని నిర్లక్ష్యంగా.
ఈసారి మరీ బిత్తరపోయాడు జింబో. చిన్ని అతనితో అంత నిర్లక్ష్యం ఎప్పుడూ మాట్లాడలేదు.
‘రండి ప్రభూ! తనతో మనకేంటి?’ అతని చెయ్యి పట్టుకుని లాగుతూ అంది చిన్ని.
‘అర్ధరాత్రి ఈ షికార్లేంటి? ఈ విషయం మావకి తెలిస్తే చంపి పాతేస్తాడు’ అరిచినట్టు అన్నాడు జింబో.
‘నా సంగతి నీకెందుగ్గానీ.. నీ పని నువ్వు చూసుకో’ అంటూ ముందుకు నడిచింది చిన్ని.
‘అటెక్కడికి? అక్కడంతా నల్లతాచులు వీరవిహారం చేస్తాయి. తెలియదా?’ వెనక నించి అరిచాడు జింబో.
‘ఎందుకు తెలియదూ? కానీ నీకన్నా మంచి టార్చ్‌లైట్ ప్రభుగారి దగ్గరుంది’ నవ్వింది చిన్ని.
‘ఆగు!’ అరిచాడు జింబో.
చిన్ని ఆగింది. ప్రభు చిరాగ్గా చూస్తూ-
‘చిన్నీ! అతనేదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు. నే వెళ్తాను. నువ్వు మాట్లాడి రా’ అంటూ కదిలాడు. చిన్ని చిరాగ్గా వెనక్కొచ్చింది. ఎందుకో ఆమె ధోరణి కాస్త కంగారు పెట్టించింది జింబోని. లేచి ఆమె దగ్గరగా వచ్చి-
‘ఇలా రాత్రులు పరాయి మగాడితో తిరగడం అంత మంచిది కాదు చిన్నీ! అదీగాక అంత క్షేమం కాదు కూడా. రాత్రులు ఒక్కోసారి చిరుతలు కూడా వస్తాయి తెలుసుగా. అంతగా ఆయనకి అడవి చూడాలనుంటే రేపు పగలు చూపించు’ అన్నాడు అనునయంగా.
‘నిజమే. గుహ దగ్గరికి చిరుతలొస్తుంటాయి. మనకైతే అలవాటయింది గానీ, పాపం - ప్రభుగారికి కొత్త కదా. దాని అరుపు వింటేనే హడలిపోతారు. అందుకే ఓ పథకం వేశాను’ అంది చిన్ని ఉత్సాహంగా.
‘పథకమా?’
‘అవును. ప్రభుగారిని మా ఇంటికి తీసికెళ్తున్నాను’
‘ఏవిఁటీ?’ కెవ్వుమన్నంత పని చేశాడతను.
‘అవును. బాబాతో చెప్పే తీసికెళ్తున్నాను’ అని అతని భావాలని చూడకుండానే వెళ్లిపోయింది చిన్ని.
* * *
ఉదయం ఎనిమిది గంటలయింది. దొరకి వేడినీళ్లతో ఒళ్లు తుడిపించి, సెలైన్ అమరుస్తోంది గౌతమి. ప్రస్తుతం దొర ఆరోగ్యం చాలావరకు మెరుగైంది. ఇక ప్రాణభయం లేదని గౌతమి చెప్పేసరికి అందరి మనసులూ కుదుటపడ్డాయి.
అప్పుడే పిల్లిలా వచ్చాడు జింబో. అతన్ని చూసి సన్నగా నవ్వాడు దొర. ఆప్యాయంగా పలకరించింది గౌతమి.
‘మావాఁ! నీతో కాస్త మాట్లాడాలి’ నసిగినట్టు అన్నాడు జింబో.
‘ఏవిఁట్రా.. నువ్వు కొండ కింది కెళ్తున్నావా?’ అన్నాడు దొర నవ్వుతూనే.
‘కాదు. నీతో ఒంటరిగా మాట్లాడాలి’ గౌతమికేసి అదోలా చూస్తూ అన్నాడు జింబో. అది అర్థం చేసుకున్న గౌతమి దొరకి చెప్పాల్సినవి చెప్పి వెళ్లిపోయింది.
‘మావాఁ! నేనో మాటంటాను కోప్పడవుగా?’ నసిగినట్టు అన్నాడు జింబో.
‘నీమీద నాక్కోపం ఏవిఁట్రా? నువ్వు తెచ్చిన నగలు గౌతమికిచ్చేశావ్. అంతేగా’ తేలిగ్గా అన్నాడు దొర.
‘కాదు!’
‘మరి?’
‘ఆ ప్రభుని గురించి మనకేం తెలియదు. అతను పోలీసులు పంపిన మనిషే అని ఇంకా నాకనుమానమే. అలాంటి వాడ్ని మన గూకెనికెలా పంపావ్? అదీ మన చిన్నితో!’ అన్నాడు జింబో గొంతు బాగా తగ్గించి.
‘ఓ! అదా! ఇందులో తప్పేం వుందిరా? ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లిద్దరూ ఒకచోటే వుండాల్సిన వారేగా?’ తేలిగ్గా అనేశాడు దొర.
‘వాళ్లిద్దరూ ఒకేచోట వుండాల్సిన వాళ్లా?’ అదిరిపడ్డాడు జింబో.
‘అవును! వాళ్లు ఒకళ్లంటే ఒకళ్లు ఇష్టపడుతున్నారు. ఆ దేవుడు ఎవరికెవరు రాసిపెట్టాడో?’ భారంగా అన్నాడు దొర.
‘అబద్ధం! అది నన్ను ప్రేమించింది. చిన్ని నన్ను తప్ప ఎవర్నీ చేసుకోదు’ అరిచినట్టు అన్నాడు జింబో.
‘కానీ నువ్వు ప్రేమించలేదుగా?’ అన్నాడు దొర తీక్షణంగా.
‘అదీ... అదీ...’
‘అదీ లేదు ఇదీ లేదు.. పెళ్లిళ్లనేవి స్వర్గంలో జరుగుతాయంటారు. సరే. వెళ్లి నీ పనులు చూసుకో. నన్ను విశ్రాంతి తీసుకోమని మా డాక్టరమ్మ ఆజ్ఞ’ బలవంతంగా నవ్వాడు దొర. జింబో మొహం నల్లబడింది.
‘అది కాదు మావాఁ! నిజంగా మన చిన్నిని ఆ ప్రభు ప్రేమించలేదు. ఇక్కడి గుట్టుమట్టులన్నీ తెలుసుకుని, మన పాతాళ స్వర్గంలో ప్రవేశించాలని వాడి ఆలోచన. అయినా ఇంతవరకూ గౌతమినే గూడెనికి వెళ్లనివ్వలేదు. అలాంటిది, ఆమెని వెతికే వంకతో వచ్చిన అతనె్నలా వెళ్లనిచ్చావ్? గూడెనికెళ్తే పాతాళ స్వర్గం దగ్గరికెళ్లినట్టేగా?’ చిరాగ్గా అన్నాడు.
‘అయితే ఏవిఁటి. చూసినంత మాత్రాన ఆ స్వర్గాన్ని నెత్తిన పెట్టుకుని పారిపోతాడా?’
‘అది కాదు మావాఁ...’
‘జింబో! ఇంక పిచ్చిపిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు. అయినా ఆ పాతాళస్వర్గం వైపు వెళ్లకుండా చూసే బాధ్యత మన చిన్నిది! అతను కూడా అటుకేసి తొంగి చూడనని చెప్పాకే ఒప్పుకున్నాను. నువ్వేం దిగులు పడకు’ అన్నాడు దొర. జింబో ఏదో అనబోతుండగానే గౌతమి వచ్చేసింది.
‘ఏంటిఁ ఇంకా మీ రహస్య చర్చలు పూర్తి కాలేదా? ఇదిగో చూడు జింబో! బాబాకిప్పుడు విశ్రాంతి అవసరం. ఏంటలా చూస్తున్నావ్? దొర అనకుండా బాబా అన్నాననా? బాబాకి నేను పెద్ద కూతుర్ని’ అంటూ నవ్వేసింది.
‘నాకేం పర్లేదమ్మా! నువ్వింటికెళ్లి ఏదైనా తినిరా! నా దగ్గర జోగీ వాళ్లంతా ఉంటారు’ అన్నాడు దొర నవ్వుతూ.
‘ఇంటికా?’ అప్రయత్నంగా అన్నాడు జింబో.
‘అన్నట్టు నీకు చెప్పలేదు కదూ. నేనూ, ప్రభూ కూడా బాబా ఇంట్లోనే ఉండబోతున్నాం’ అంటూ వెళ్లిపోయింది గౌతమి. శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు జింబో.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్