S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పూల కూరలు

ఫువ్వుల్ని కూడా కూరగానూ, పప్పుగానూ, పచ్చడిగానూ చేసుకోవచ్చు. అలా అనుకూలంగా ఉన్న కొన్నింటిని ఇక్కడ మీ కోసం. ఔషధ విలువలు కలిగి, రుచికరంగా ఉండి ఆరోగ్యదాయకమైన వాటిని చక్కగా ఉపయోగించుకో గలగటమే విజ్ఞత. పిజ్జాలు, బర్గర్లే శరణ్యం అనుకోవటం ఆత్మహత్య సదృశ్యం కాగలదు. మన ఆలోచనా విధానంలో ఆరోగ్య స్పృహని మరింత పెంపు చేయటమే ఈ శీర్షిక లక్ష్యం.
అరటి పూవు కూర, పప్పు, పచ్చడి, పెరుగుపచ్చడి
అరటి పూవు మీద డిప్పల్ని తొలగిస్తే లోపల చిటికెన వేలంత పరిమాణంలో కేసరాలుంటాయి. వీటిని వొలుచుకుని లోపల పుల్లల్లా ఉండే భాగాలను తొలగిస్తారు. ఈ పుల్లల్ని కొన్ని ప్రాంతాల్లో దొంగలు అని కూడా పిలుస్తుంటారు. ఈ దొంగ చేదుగా ఉంటుంది. అందుకని తీసేయాలి. అలా తీసేయగా మిగిలిన కేసరాలు రుచికరంగా కొద్ది వగరు రుచిని కలిగి ఉంటాయి. వీటితో కూర, పప్పు, పచ్చడి, పులుసుకూర, పెరుగు పచ్చడి లాంటివి చేసుకుంటారు. కొందరు ఆవపెట్టి తాలింపు కూరగా చేసుకుంటారు కూడా! వీటి రసంలో రసం పొడి వేసి చారుకాచుకుని అన్నంలో తినవచ్చు. ‘టీ’ కూడా కాచుకోవచ్చు. చాలామంది ఇష్టంగా తినే పుష్పశాకం ఇది.
శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కడుపులో పైత్యాన్ని, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఉడుకు విరేచనాలను ఆపుతుంది. శరీరంలో వేడి ఎక్కువైనందు వలన కలిగే విరేచనాలు, మూత్రంలో మంట, అరికాళ్లు, అరిచేతులు, కళ్లల్లో మంటల్ని తగ్గిస్తుంది. పెరుగుపచ్చడి లాగా చేసుకుని తరచూ తింటూ ఉంటే అమీమియాసిస్ వ్యాధి త్వరగా తగ్గుతుంది. జిగురు, రక్తంతో కూడిన విరేచనాలు అవుతున్నప్పుడు అరటిపూల పెరుగు పచ్చడి తప్పనిసరిగా తినాలి. నెలసరి సమయంలో అమితంగా ఋతుస్రావం అయ్యే స్ర్తిలకు దీన్ని పెరుగుపచ్చడి రూపంలో అన్నంలో గానీ, నేరుగా గానీ తినిపిస్తే రక్తస్రావం ఆగుతుంది.
దీనికి విరేచనాన్ని బంధించే గుణం ఉంది. అందుకని మలబద్ధత కలిగిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యంగా అరుగుతుంది. కాబట్టి ఆకలి సరిగా లేనప్పుడు ఎక్కువగా తినకుండా ఉండటం మంచిది.
ఈ అరటి పూల రసాన్ని తీసి అందులో పెరుగు కలిపి, కొద్దిగా శొంఠిపొడి, ఉప్పు కలిపి చిలికి తాగితే అమీబియాసిస్ వ్యాధికి ఉత్తమ ఔషధంగా పని చేస్తుంది.
అరటిపూల కేసరాలను, నానబెట్టిన మినప్పప్పునీ కలిపి రుబ్బి పిండి వడియాలు పెట్టుకుంటారు. దగ్గు, ఆయాసం, శే్లష్మం పడటం తగ్గించే గుణం ఈ వడియాలకుంది. ఈ వడియాలను నూనెలో వేయించే కన్నా, ఏదైనా కూరగాయతో కలిపి కూరగా వండుకుంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పైన చెప్పిన గుణాలన్నీ వీటికీ ఉన్నాయి.
ఆముదం పూల పచ్చడి
చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారు గానీ, ఆముదం నిజంగానే మహావృక్షం. దాని ఉపయోగాలు దానికున్నాయి. శరీరంలోని దోషాలను పక్వ స్థితికి తీసుకొచ్చి బయటకు వెళ్లగొట్టే మహత్తర కార్యాన్ని ఆముదం నిర్వహిస్తుంది. అందుకని దాన్ని తక్కువ చేసి చూడకూడదు. దోషాన్ని వెళ్లగొట్టడంకన్నా గొప్ప మేలు ఇంకేముంటుంది. వ్యాధి రాకుండానే తగ్గించే ఔషధం ఇది. ఆముదం పూలను కూరగానూ, పచ్చడిగానూ చేసుకుంటారు. కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి, రోటి పచ్చడి చేస్తారు. రుచికరంగా ఎలా చేసుకోవాలన్నది మీ చాకచక్యం. దాని ఉపయోగాలు తెలుసుకుని, అది అందుబాటులో ఉన్నప్పుడు చక్కగా వాడుకోగలగటమే అసలు విజ్ఞత. ఆముదం పేరు చెప్తే శరీరంలో వికటించిన వాతం పారిపోవాలి. జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపులో వాతాన్ని అరికడుతుంది. కీళ్లవాతం, కాళ్లనొప్పులు, పిక్కలనొప్పులు, మోకాళ్ల నొప్పులు, అకారణంగా వచ్చే నడుంనొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఇలాంటి నొప్పులన్నింటికీ తక్షణ శరణ్యం ఆముదం పూల పచ్చడి.
ఇప్పపూల పాయసం, చారు, టీ, హల్వా
భద్రాచలం అనగానే ఇప్పపూలు గుర్తుకొస్తాయి. చాలాకాలం ఎండుద్రాక్ష కిస్మిస్ లాగానే సీసాలో భద్రపరచుకో దగినవిగా ఉంటాయి. నిద్ర మత్తును కలిగిస్తాయి కాబట్టి మాదక ద్రవ్యం లాంటివైనప్పటికీ కాఫీ టీ గంజాయిల్లాగా శరీరంలో విష దోషాలను పెంచేవిగా కాకుండా, విష దోషాలను హరించేవిగా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడూ వీటిని ఆహార పదార్థంగా తయారుచేసుకుంటూ ఉండొచ్చు.
మానసిక ప్రశాంతతని కలిగిస్తాయి. మనసులో దిగుళ్లను పోగొడతాయి. బీపీనీ అదుపులో పెడతాయి. వేడి వలన కలిగే పొడి దగ్గును తగ్గిస్తాయి. ఎలర్జీ వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి. ఉబ్బసం రోగులకు మంచివి. వాత వ్యాధులన్నింటిలోనూ ఇవి వాత తీవ్రతను తగ్గించేవిగా ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్లకు మేలు చేస్తాయి. వాపుల్ని, నొప్పుల్ని తగ్గిస్తాయి. చలవనిస్తాయి.
వీటిని వేడిగా చారు రూపంలో గానీ, టీ రూపంలో గానీ తీసుకోవాలి. వేడినీరు ఇప్పపూలకు విరుగుడుగా ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్నారు.
పాలలో ఇప్పపూలను వేసి పాయసంలా కాచి జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, జీడిపప్పు, ఏలకులు వగైరా తగినంత కలిపి రోజూ రాత్రిపూట వేడిగా తీసుకుంటూ ఉంటే కమ్మని నిద్ర పడుతుంది. శారీరక, మానసిక నపుంసకత్వాలు పోయి, లైంగిక సమర్థత పెరుగుతుంది.
ఇప్పపూలను నేతితో వేయించి, మెత్తగా గుజ్జులా చేసి, పాకం పట్టి హల్వాగానో లడ్డూగానో చేసుకుని పరిమిత మోతాదులో తీసుకున్నా ఈ ఫలితాలు కలుగుతాయి.
వీటిని పరిమితంగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అది మాదకద్రవ్యం కాబట్టి ప్రమాదం. ఈ హెచ్చరికని గుర్తుంచుకుని ఇప్పపూలను జాగ్రత్తగా వాడుకోవటం మంచిది.

(మిగతా వచ్చే సంచికలో)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com