S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కర్ణాటక సంగీతంలో కారణజన్ములు

గానవిద్య యోగవిద్య లాంటిది. తేడా ఏమంటే యోగికి బ్రహ్మ సాక్షాత్కారం కోసం మాత్రమే ఆ విద్య ఉపయోగపడుతుంది. కానీ సంగీతం కేవలం గాయకుణ్ణే కాదు, వినే శ్రోతను కూడా ఉద్ధరిస్తుంది. గమ్మత్తేమంటే విద్వాంసుడు చేసే సాధన కూర్చుని వినే శ్రోత చెయ్యడు. అవసరం లేదు. లోకంలో లౌకికమైన విద్యలెన్నో ఉన్నాయి. శిల్పం, కవిత్వం, నృత్యం, చిత్రలేఖనం లాంటివన్నీ ప్రజ్ఞలు అందరికీ అలవడవు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి.
ఎవరో ఒక మహాగాయకుడు తనలో తాను గానం చేస్తూ అందులోనే లీనమై పోతూంటాడు. ఆ నాదంలోని రుచిని అనుభవించగలవాడు పక్కనే చేరి అదే తన్మయత్వాన్ని పొందుతూంటాడు. ఈ సమానస్థితి ఎక్కడో నూటికో కోటికో గానీ కనపడదు. ఆ స్థితిలో పాడగలిగిన వారికి వినగలిగిన వారు తారసపడాలి.
ఉయ్యాలలో పసిపిల్లవాణ్ణి తొట్టెలో పడుకోబెట్టి తల్లి ఏదో కూనిరాగంతో జోలపాట పాడుతూ ఊపుతోంది. అయినా పిల్లవాడు ఏడుపు ఆపటంలేదు. తల్లి ఓదారుస్తోంది. వాడు మానటంలేదు. తండ్రి తీసుకున్నాడు. ఇంకా ఏడుపెక్కువైంది. ఏం చేయాలో తల్లికి పాలుపోవటం లేదు. ఇంతలో వాకిట్లో ఒక హరిదాసు తంబురా శృతిలో లీనమై మైమరచి పాడుతూ నిలబడ్డాడు. అంతే.. ఠక్కున ఆ పాట చెవిన పడిన పిల్లాడి ఏడుపు కాస్తా ఆగిపోయింది. తేరిపార చూస్తున్నాడు. లీలగా వింటున్నాడు. తల్లి జోల ‘గోల’గా వినిపిస్తోందన్న మాట.
ఎటువంటి సంగీత నేపథ్యమూ ఉండదు. ఎక్కడా నేర్చుకున్న దాఖలాలుండవు. గొంతు విప్పితే సమ్మోహన గానం. పర్వదినాల్లో మన ఇళ్ల ముందు నిల్చుని పాడే హరిదాసుల్ని గమనించండి. తెలుస్తుంది. చేతిలో తంబురాకు రెండో మూడో తీగలుంటాయి. హాయిగా షడ్జ పంచమాలు రెండూ శృతిపక్వంగా వీనులవిందుగా ట్యూన్ చేసి ఉంటాయి. ఆ నాదంలో అతని పాట లీనమై పోతూంటుంది. అదీ సహజ గానమంటే. అది జన్మతః లభించిందే గానీ, తెచ్చిపెట్టుకున్నది కాదు.
కారణ జన్ములైన సంగీత విద్వాంసుల జీవితాలు కూడా అలా సహజంగానే మొదలౌతాయి. ఎవరికో జన్మిస్తారు. ఎక్కడో పుడ్తారు. సుఖమయ జీవితాలు గడపలేక పోవచ్చు. కొందరికి ఆర్థికమైన బలం లేకపోవచ్చు. కానీ, దైవం ప్రసాదించిన విభూతిని సద్వినియోగం చేసుకునే పరిస్థితులు వాటంతట అవే ఏర్పడిపోతూంటాయి. మహావిద్వాంసులు, సంగీత దర్శకులు, గాయకులు ఈ కోవకు చెందిన వారెందరో కనిపిస్తారు. ప్రతికూల పరిస్థితులలోనే సంగీతం నేర్చుకున్న విద్వాంసులున్నారు. మృదంగ వాద్య విశారదుడైన పళని సుబ్రహ్మణ్య పిళ్లై తల్లి బాల్యంలోనే గతించింది. తండ్రి ముత్తయ్ పిళ్లై డోలు విద్వాంసుడు. మళ్లీ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకో పుత్రుడు పుట్టాడు. తండ్రి దృష్టి ద్వితీయ కళత్రం మీదే ఉండేది. ఆమెకు పుట్టిన వాడి బాగోగులు చూసేవాడు. మొదటి భార్యకు పుట్టిన ‘పళని’ని గాలికొదిలేశాడు. చిన్నప్పటి నుండే సుబ్రహ్మణ్య పిళ్లైకు లయ జ్ఞానం మెండు. తండ్రి ప్రోత్సాహముండేది కాదు. పినతల్లి కొడుకు పట్ల శ్రద్ధ పెట్టినా, తండ్రి పళని బాగోగులు చూసేవాడు కాదు. మృదంగ పాఠాలు నేర్చుకునే సవతి తల్లి కుమారుణ్ణి చూస్తూ, క్రమంగా గురువుగారు చెప్పే పాఠాల్ని బయట నుండే వినేవాడు. ఇంటికి రాగానే సాధన చేసేవాడు. అఖండ జ్ఞాన సంపన్నుడై సంగీత లోకంలో చిరయశస్సును సంపాదించుకున్నాడు.
యోగ్యత ఒక్కటే కాదు. యోగం కూడా కలిసి రావాలి. తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో పట్ట్భారామయ్య, సూర్యకాంతం దంపతులకు లేకలేక ఓ బాలుడు పుట్టాడు. పుట్టిన కొన్నాళ్లకే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతుడైన ఆ బాలుణ్ణి తల్లీ తండ్రీ తానే అయి పెంచాడు తండ్రి పట్ట్భారామయ్య. పుత్రుడి సంగీతాభిరుచిని గమనించిన తండ్రి బెజవాడలో ఆ రోజుల్లో గురువుల పేరిట ఉత్సవాలు చేసిన సద్గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతుల్ని ఆశ్రయించాడు. త్యాగరాజ శిష్య పరంపరకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు, బోధకుడు పారుపల్లి వారు. పట్ట్భా రామయ్య తన పుత్రుణ్ణి పంతులుగారి దగ్గర చేర్చాడు. ఏకసంథాగ్రాహి అయిన బాలుడు క్రమంగా ఎదుగుతూ పట్టుమని ఎనిమిదేళ్లు నిండకుండానే కచేరీలు ప్రారంభించాడు.
ఆ బాలుడు ‘బాలమురళి’గా అవతారమెత్తి అశేష సంగీత ప్రియుల్ని అలరించి అందరానంత ఎత్తుకెదిగిపోయాడు.
బాలమేధావిగా భాసిల్లిన డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ గతజన్మలో చేసిన సాధన సంస్కారమే పునాదిగా ఆయన సంగీత యాత్ర సాగింది. తెలుగు భాషలోని మకరంద మాధుర్యం, మాటలో స్పష్టత, పాటలో స్వచ్ఛత. మురళీ గానంలో అదే ప్రత్యేకత. సంగీతమే తనను వరించిందనీ, తనకు తానే గురువునని చెప్పేవారు. తల్లి వీణావాద మాధుర్యం ఆమె గర్భంలో ఉన్నప్పుడే విన్న భాగ్యశాలికి నాదానుభవం కొత్తగా అనిపించలేదు.
పుట్టినప్పుడు అందరూ పసివారే. పసివాడిలోని గాన లక్షణం కొందరికే బహిర్గతమవుతుంది. పది పదిహేనేళ్లు దాకా గాయక లక్షణాలు తెలియవు. మరి కొందరికి వయసుతో పనిలేదు. మహా గాయకుడవటం వేరు. మహా గాయకుడని కీర్తి పొందటం వేరు. బాలమురళీ రెండో కోవకు చెందిన వ్యక్తి.
ఒక యోగికి లోకంలో ఎంతో పేరు ప్రతిష్టలుంటాయి. తపోసమాధిలో ఎక్కడో ఓ గుహలో ఉంటాడు. కానీ తీర్థప్రజల్లా ఆ యోగిని చూసేందుకు జనం వెర్రిగా అనుసరిస్తూంటారు. ఏమైనా మహిమలున్నాయేమో అనుకుని వస్తూంటారు. ఆయన సందేశం వింటారు. తలలూపేసి వెళ్లిపోతారు. ఆ యోగికి కాస్త సమీపంలోనే మరో యోగి ఉంటాడు. ఇద్దరూ ఆధ్యాత్మికంగా పండిన వారే. కానీ మొదటి యోగికి లోకదృష్టి విశేషం. రెండవ యోగి ఎంతసేపూ అంతర్ముఖుడయ్యే ఉంటాడు. లోకంతో పనిలేదు. ఇద్దరి లక్ష్యం ఆధ్యాత్మిక సిద్ధియే. ఇందులో బాలమురళీకృష్ణ మొదటి కోవకు చెందిన సంగీత యోగి. లోకంతో పనిలేని యోగులు, వారి తపస్సు, వారి సాధన, వారిని వారు ఉద్ధరించుకోవటానికే. సాధారణంగా ఇటువంటి వారు చాలా అరుదుగా ఒక్కసారే పుట్తారు. సద్గురు త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, దీక్షితులు, సద్గురు నారాయణ తీర్థులు, సదాశివ బ్రహ్మేంద్రులు, మొదలైనవారు ఈ కోవలోని వారు.
అసలైన సంగీత రూపం ఇలా ఉండాలని తెలియజెప్పేందుకే నాదరూపుడైన శంకరుడే ఈ రూపాల్లో వీరిని పుట్టించాడేమో! ప్రతి సంగీత విద్వాంసునికీ సంగీతాభిరుచి కలిగిన సంతానం కలుగుతుందనే నమ్మకం లేదు. కొందరు ప్రత్యేక పరిస్థితులలో జన్మించి అనూహ్యంగా కీర్తి కాములై నిలిచిపోతారనేందుకు నిదర్శనం ఈ బాల మేధావులు.
ఒకప్పుడు పెళ్లిళ్లలోనూ, లేదా ఏ శుభ కార్యాల్లోనైనా ముందుగా చెవుల్లో వినబడేది మంగళ వాద్యమైన నాదస్వరమే. తమిళనాడులో నాదస్వర విద్వాంసులెక్కువ. వీరితో సమానస్థాయిగల వారు ఒంగోలు, చిలకలూరిపేట, నెల్లూరు ప్రాంతాల్లో ఉన్నారు. ‘సంగీత కళానిధి’ షేక్ చినవౌలానా సాహెబ్ చిలకలూరిపేట వాసి. శ్రీరంగం వెళ్లి స్థిరపడ్డ పెద్ద విద్వాంసుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కొబ్బరికి ప్రసిద్ధి. సస్యశ్యామలమైన ఊరు. క్షీరారామ లింగేశ్వరుడు కొలువున్న పుణ్యక్షేత్రంలో ‘ఉప్పలపాటి సత్యనారాయణ బ్యాండ్’ ఆ రోజుల్లో బాగా పేరున్న వాద్యబృందం. అభిరుచికి అనుగుణంగా ఆ ట్రూప్‌లో మధ్యమధ్యలో కీర్తనలు వినిపించినా - సినిమా పాటలతో, పెళ్లీ పబ్బాలకు వచ్చే జనాన్ని ఉర్రూత లూగించేవారు. అందులో మాండలిన్ వాద్యంతో ఒక చిన్న పిల్లవాడు అందర్ని ఆకర్షించేవాడు. ఎటువంటి క్లిష్టమైన సినిమా పాటైనా అత్యంత వేగంతో శ్రుతిబద్ధంగా, లయబద్ధంగా వాయిస్తూ జనాన్ని నిలబెట్టేసేవాడు. పక్కన క్లారినెట్ వాయిస్తూండే తండ్రికి, అదే పెద్ద వరం. పుత్రుడి ప్రతిభ వింటూ ఆనందించేవాడు.
స్వేచ్ఛగా స్వరాలు పలికించే వీలులేని మాండలిన్.. అతి చిన్నదైన పాశ్చాత్య వాద్యం. మెట్లున్న వీణావాద్యానికున్న సౌకర్యం ఈ వాద్యానికి లేదు. వెనకటి రోజుల్లో సినిమా పాటల వెనుక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో బాగా ఉపయోగించేవారు.
గమకాలు పలికించే వీలులేని క్లిష్టమైన ఈ వాద్యాన్ని తన సొంతం చేసుకున్న కుర్రవాడు ‘రుద్రరాజు సుబ్బరాజు’ అనే విద్వాంసుడి కళ్లబడ్డాడు. దిశానిర్దేశం చేయాలనే సంకల్పం పుట్టింది. అంతే! మద్రాసుకు తీసుకుపోయి అక్కడ తనకు తెలిసిన సినీ సంగీత దర్శకులకు పరిచయం చేశాడు. ఆ బాలుడి ప్రతిభ పదిమందికీ తెలిసింది. అలవోకగా శ్రుతిశుద్ధంగా సుస్వరాల జల్లుతో సమ్మోహనంగా వాయించే ఆ పిల్లవాడి భవిష్యత్ ఊహించిన సుబ్బరాజుకు మెరుపులాంటి ఆలోచన పుట్టింది.
కర్ణాటక సంగీత రంగంలో ఎన్నో వాద్యాలున్నా మాండలిన్ వాద్యం ఎవరూ ఎరుగరు. పైగా ఆ చిట్టి వాద్యంలో గమకాలు పుట్టించటం ఎవరివల్లా కాదు. అక్కడున్న సంగీత విద్వాంసుల దృష్టిలో పడ్డ ఈ బాలమేధావి భవిష్యత్తుకు క్రమంగా మార్గం ఏర్పడింది. పేరున్న విద్వాంసులు ఆశ్చర్యపడేలా విన్నది విన్నట్లుగా వాయించగలిగిన బాలుడికి బ్రహ్మరథం పట్టడం ప్రారంభించారు. అతిరథ మహారథులైన సంగీత విద్వాంసుల వరసలో చేరిపోయాడు. మాండలిన్ వాద్యాన్ని తన ఇంటిపేరుగా మార్చేసుకున్న ఆ ఘటికుడే ‘మాండలిన్ శ్రీనివాస్.’
గత జన్మల్లో బాగా సాధన చేసి, కోరిక తీరక ప్రాణ సమానమైన సంగీతాన్ని వదల్లేక వెళ్లిపోయిన మహా విద్వాంసుల వాంఛా ఫలాలుగా కొందరు జన్మిస్తారు. ఇక్కడ వారు ప్రత్యేకంగా చేసే సాధనంటూ ఏమీ ఉండదు. పాడటమే.. వాయించి వినిపించటమే.. దీనికి సాక్షులే.. ఒకరు బాలమురళీకృష్ణ, మరొకరు శ్రీనివాస్. ఇద్దరూ మనోధర్మ ద్వారపాలకులే. వీరిని దాటి లోపలికి ప్రవేశించిన విద్వాంసులు అరుదు. డోలాయమాన స్థితిలో నివ్వెరబోయి విన్నవారు ఎందరో వున్నారు. పాటలో ప్రతి అక్షరం, శ్రుతి, మాధుర్యం నింపుతూ చెవికి చేర్చిన గంధర్వ పురుషులీ ఇద్దరు విద్వాంసులు.
1984 ప్రాంతంలో విజయవాడ రేడియో కేంద్రంలో ఈ బాలమేధావితో పరిచయ కార్యక్రమం చేశాను. రికార్డింగ్ బూత్‌లో వోలేటి గారున్నారు. అప్పుడు శ్రీనివాస్ వయస్సు 14 సం.లు. ఏళ్ల తరబడి సాధన చేసినా, సద్గురువు లభించినా ఓ పట్టాన వశం కాని మనోధర్మంతో రసజ్ఞులను ఆశ్చర్యపరచిన శ్రీనివాస్, అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకున్న అవార్డులూ రివార్డులకూ లెఖ్ఖలేదు. కర్ణాటక సంగీత రంగంలో కీర్తిప్రతిష్టలు తెచ్చుకున్న పెద్దపెద్ద విద్వాంసులు సైతం శ్రీనివాస్ వాద్యం వినేందుకు ముందు వరుసలో కూర్చుని వినేవారు.
గంధర్వాంశతో జన్మించే కారణజన్ములు అర్థంతరంగా కనుమరుగవటం సంగీత లోకానికే శాపం.
‘దివ్యమైన సంగీతానికీ దిశ లేని పాటకూ వ్యత్యాసముంది. రక్తిగా పాడే సంగీతానికి కారణం బుద్ధి. శక్తి ప్రధానం కాదు. రక్తి మనస్సుకు సంబంధం. తృప్తిలేని బ్రహ్మానందాన్నిచ్చే సంగీతానికి విలువకట్టే షరాబు లేడు. అలాంటి విద్వాంసులు గానం, వాద్యం వినటానికీ సంస్కారం కావాలి. సంగీతం కోసమే పుట్టిన బాలమురళీకృష్ణ, మాండలిన్ శ్రీనివాస్ లాంటి రత్నాలను మళ్లీ ఆ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడా?

- మల్లాది సూరిబాబు 90527 65490