S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గురువే భాస్కరుడు

సంవత్సరంలో పనె్నండు పౌర్ణములు వస్తాయి. దేనికదే ప్రాముఖ్యం వహిస్తుంది. అన్నీ విశేషమైనవే. అయితే, పూర్వాషాఢా నక్షత్రంలో వచ్చే పౌర్ణమి, ఆషాఢమాసంలో వస్తుంది. పూర్వాషాఢా నక్షత్రం, ధనూరాశిలో ఉంటుంది. ధనూరాశికి అధిపతి గురుడు. గురుడు విద్యా కారకుడు. ధన కుటుంబ గృహ వాహన కారకుడు. కొన్నిసార్లు ఉత్తరాషాఢా ప్రథమ పాదంతో కూడి పౌర్ణమి, ఆషాఢ మాసంలో రావచ్చు. ఉత్తరాషాఢ ప్రథమ పాదం కూడా ధనూరాశిలోనే ఉంటుంది. కనుక, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ‘గురు’ సంబంధమైనది. అందుకే ఈ పౌర్ణమిని ‘గురు పౌర్ణమి’గా పిలుస్తారు.
మనిషి, మనిషిగా పుట్టటం అదృష్టం, ఒక వరం. మనిషికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్నిచ్చాడు, పరమాత్మ. ఇది మనిషి బుద్ధి వికాసానికి దోహదం చేస్తుంది. సృష్టిలో మిగతా ప్రాణికోటి కంటె విశిష్ఠుడుగా పరిగణింపబడేవాడు, మనిషి. ఎదిగి ఎదిగి పరమాత్మలో ఐక్యం కావటానికి కావలసిన అన్ని పరిస్థితులనూ కల్పించాడు పరమాత్మ, మనిషికి. అయితే, కదల కలిగినవాడు, కదిలించే శక్తివంతుడు, కదలవలసిన వాడు అయిన మానవుడు - చైతన్య రహితుడై స్థాణువులా అయిపోతున్నాడు. బాల్యంలోనూ, వయస్సులోనూ, వయస్సు మీరినా, ఎంత వయస్సు వచ్చినా, చేసిన తప్పులే మళ్లీమళ్లీ చేసుకుంటూ పోతున్నాడు. కాల ప్రాముఖ్యాన్ని, జీవితం విలువలను గుర్తించి, తనలో ఉన్న పశు రాక్షసత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి క్షాళన చేసికొంటే, మానవతా విలువలు తెలుస్తాయి. అప్పుడు అంతర్లీనంగా అంకురిస్తున్న దైవ తత్త్వాన్ని దర్శించి, ప్రజ్వలింప చేసికొంటే, చెడు నుంచి మంచికి, మంచి నుండి మహోన్నత స్థానానికి ఎదిగిపోతాడు, మనిషి. అదే విజ్ఞత. ఆ స్థితిని కరుణించే మహనీయుడు గురుడు.
అహింస, ప్రేమ తత్త్వాలతో సత్యానే్వషణ చేసి సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షింపచేసే జ్ఞాన స్వరూపుడు - గురువు. సంఘంలో లౌకికంగా ఎంతో ఎదిగినా మానసిక అశాంతి మాత్రం, మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. అశాంతిని తొలగించి శాంతి సౌఖ్యాలను పొందే, సుపథను అనగా మంచి మార్గాన్ని చూపించే మార్గదర్శకుడు, ధర్మస్వరూపుడు, గురువు.
శిలలను శిల్పంగా తీర్చిదిద్ది, దేవాలయంలో అర్చామూర్తిగా ప్రతిష్ఠింపచేసే మహాశిల్పి లాంటివాడు - గురువు.
నిత్యం ఎదురయ్యే సమస్యలతో అనునిత్యం జరిగే సంఘర్షణలతో ఆటుపోట్లతో ఉబ్బితబ్బిబ్బై పోతున్న మానవులలో ‘నేనెవరిని? ఎందుకు వచ్చాను? ఈ జీవితంలో సాధించేదేమిటి? సాధించవలసిందేమిటి? అనే జీవిత తత్త్వాన్ని విశదీకరించి, జీవితంలో చెలరేగే మానసిక అశాంతిని ఆందోళనను తొలగించే చైతన్యమూర్తి - గురువు.
మనస్సు, వాక్కు, క్రియల ఏక రూపమే - మానవత్వమని దానిని, తనను ఆశ్రయించిన శిష్యుల్లో పెంపొందించి, మానవ జీవితాన్ని సుగమమం, సుసంపన్నం చేసి, తద్వారా విశ్వశ్రేయస్సును చేకూర్చే మహనీయుడు - గురువు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి, జ్ఞాన వెలుగును ప్రసాదించి, నవ్య మార్గంలో నడిపించే, ఆదర్శ ధర్మమూర్తి - గురువు. అందుకే ‘ఆచార్య దేవోభవ’ అన్నారు.
‘అప్రత్యక్షో మహాదేవః సర్వేషామాత్మ మాయ యా
ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే’
పరమాత్మయే జీవులను ఉద్ధరించటానికి సద్గురువు రూపంలో అవతరిస్తాడన్నది - భారతీయ తత్త్వం. అందుకే, ‘గురుర్ గురుతమో ధామః సత్యః స్సత్య పరాయణః’ అన్నది విష్ణు సహస్ర నామం.
‘గృణాది హితమస్యేతి గురుః’ అన్నది బ్రహ్మాండ పురాణం. హితమును చెప్పేవాడు గురుడు.
బాగా ఎర్రగా కాలిన ఇనుముపైన పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోతుంది. ఆ నీటిబిందువే, తామరాకు మీద పడితే, ముత్యంలాగా కనపడుతుంది. ఆ నీటిబిందువే సముద్రంలోని ముత్తెపు చిప్పలో పడితే, వౌక్తికమణి అనగా మంచి ముత్యం అవుతుంది. కనుక, ఆశ్రయము ననుసరించి మార్పు ఉంటుంది. సద్గురువును ఆశ్రయిస్తే జీవన సాఫల్యం చేకూరుతుంది. ఇది సదుర్గువు ఆశ్రయసిద్ధి.
వ్యక్తిలో స్వార్థం విజృంభిస్తే, ధర్మం పతనమవుతుంది. ధర్మచ్యుతి జరిగితే, సమాజంలో సమన్వయ సమరస భావం ఉండదు. దుర్మార్గం ప్రబలుతుంది. దుష్టశిక్షణ శిష్టరక్షణకు ధర్మాన్ని పునరుద్ధరించటానికి ‘గురువు’ కావాలి. ‘యదాయదాహి తాని ధర్మస్య గ్లాని ర్భవతి భారతాః అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం’ ‘్ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ ద్వాపర యుగంలో ఇలా జరిగితేనే, శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. ఆయనే ‘జగద్గురువు’ ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నారు.
‘పూజ్యశ్చ గురుర్గరీయాన్’ పూజ్యుడవై సర్వోత్తమమైన గురువువై ప్రకాశిస్తున్నా’వని అర్జునునిచే స్తుతింపబడిన శ్రీకృష్ణ పరమాత్మ - జగద్గురువు.
వేద వాఙ్మయాన్ని వ్యవస్థీకరించి, బహువిధములుగా విస్తరిల్లిన వేద ధర్మములలోని క్లిష్టతను వైరుధ్యాన్ని తొలగించి, స్పష్టత సమన్వయం చూపెట్టే విధంగా వేద విభాగకర్తయై, అష్టాదశ పురాణాలను రచించి, పంచమ వేదమని ప్రసిద్ధిగాంచిన మహా భారతాన్ని రచించి, ఆత్మానందానికి సంపూర్ణ ఆధ్యాత్మిక ఔన్నత్య సాధనకు మహాభాగవతాన్ని బ్రహ్మసూత్రాల్ని రచించిన మహర్షి వేదవ్యాసుడు. ఆయన మానవకోటికి ఆదిగురువు. ‘మునీనామవ్యహం వ్యాసః’ అన్నాడు గీతాచార్యుడు. భారతీయ సంస్కృతికి జగద్గురువు వ్యాసమహర్షి. ఆ మహర్షి జయంతి - ఆషాఢ పూర్ణిమ. అందుకే ఆషాఢ పౌర్ణమిని ‘వ్యాసపూర్ణిమ’ అని పిలుస్తారు. అత్యంత శ్రద్ధ్భాక్తులతో జరుపుకుంటారు ‘గురు పౌర్ణమి’ని.
శ్రీకృష్ణుడు జగద్గురువు. కృష్ణ పరమాత్మ కూడా ఒక గురువు వద్ద విద్య నేర్చుకున్నాడు. ఆ గురువే సాందీపుడు. గురుదక్షిణగా ఏదైనా కోరుకోమన్నాడు కృష్ణుడు. గురుపత్ని మృతుడైన తన పుత్రుణ్ణి ప్రసాదించమని దీనంగా అడిగింది. ‘వైశ్యసృజ మగ్నించి న్వానః శరీరం ప్రత్యక్షేణ..’ అన్న వేదవాక్కు ననుసరించి, కృష్ణుడు, వైశ్యానరాగ్నిని ఉపాసించి, దాని ప్రభావంతో గురుపుత్రుని కనుగొని, బ్రతికించి, గురుదక్షిణగా ఇచ్చాడు. ఎంతటి పరబ్రహ్మమైనా మన సంస్కృతిని, ఆచారాన్ని ఆచరించి ఆదర్శంగా నిలవాలి. అందుకే ‘కృష్ణం వందే జగదుర్గుం’ అన్నారు.
వ్యాస మహర్షి మనకందించిన వాఙ్మయమంతా ఎక్కువ భాగం ధర్మాన్ని గురించి లోకానికి తెలియజెప్పింది. మోక్ష ధర్మాన్ని గురించి ఎక్కువగా తెలియజేశాయి. ఐహిక అనగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆచరించవలసిన ధర్మాన్ని కొంతవరకూ చెప్పినా, దాన్ని మానవ జీవితానికి అన్వయించి, అందరికీ తేలికగా అర్థమయ్యేటట్లుగా చెప్పలేదనే భావన వ్యాసుని మనస్సులో ఉంది. మోక్షాన్ని కాంక్షించి, నివృత్తి మార్గాన్ని అనుసరించి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందేవారు, లోకంలో ఎంతమంది ఉంటారు? అనే ప్రశ్న ఆయనకు వచ్చింది. కోట్లాది మంది మనుషుల్లో ఏ ఒక్కరో ఆ ప్రయత్నం చేస్తాడు, మరి మిగిలిన కోటానుకోట్ల మంది సంగతేమిటి? ఎక్కువమంది వీళ్లేగదా ఉండేది. సామాన్యునికి కూడా తమ జీవితాన్ని తరింపచేసికోవాలని ఉంటుంది గదా. వాళ్లు వేద వేదాంగాలను, బ్రహ్మసూత్రాలను చదవలేదు, చదవలేదు. వాటి గురించి ఏ మహనీయులో చెప్పినా అర్థంకాదు. అర్థం చేసుకోవాలన్న శ్రద్ధాసక్తులు ఉండవు. ఐహిక జీవితాన్ని అర్థ, కామాలతో అనుభవించటమే వాళ్లకు తెలుసు.
ఇదిగో, వాళ్లని దృష్టిలో పెట్టుకునే, అర్థ కామాల్ని ధర్మబద్ధం చేసి అనుభవించాలని, స్వార్థాన్ని వీడి, సమాజ హితాన్ని కాంక్షిస్తూ సమాజానికి తన వంతు కర్తవ్యాన్ని అందించాలనే ధర్మాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పి, వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవనంలో, సుఖ సంతోషాలుండాలని ఆకాంక్షించిన నారాయణ స్వరూపుడు, వ్యాస మహర్షి. అలా జరగని నాడు వ్యక్తి పతనవౌతాడు. అది, అతనితోనే పోదు, కుటుంబం సమాజం కూడా చెడిపోతుంది. కనుకనే, మానవ స్వభావాన్ని, మానవ జీవితాన్ని, ధర్మతత్త్వాన్ని, జీవిత పరమార్థాన్ని సర్వ సమగ్రంగా చిత్రించి, మహాభారత ఉద్గ్రంథాన్ని లోకానికి అందించిన మహనీయుడు వ్యాస భగవానులు. నాలుగు వేదములను, వ్యాస వాఙ్మయాన్ని, వారి శిష్యులైన సైల, సుమాత, వైశంపాయన, జైమిని మహర్షులు ప్రచారం చేశారు.
వ్యాసుని అసలు పేరు ‘అపాంతరతముడు’. పరమాత్మ మనస్సు నుండి ఆవిర్భవించాడు. వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడినాయి. వ్యాసుణ్ణి, వేదములను అధ్యయనం చేయమని, అన్ని మన్వంతరములలో వ్యాసునిగా జన్మిస్తూ, వేద వ్యాప్తికి కృషి గావింపమని మన్వంతరములలో వ్యాసునిగా జన్మిస్తూ, వేద వ్యాప్తికి కృషి గావింపమని ఆదేశమిచ్చాడు పరమాత్మ. దాని ప్రకారమే, ప్రస్తుత దైవస్వత మన్వంతరంలో పరాశర మహర్షి, సత్యవతులకు పుత్రునిగా జన్మించాడు. ఆ జన్మనిచ్చింది ఒక ద్వీపంలో, కనుక కృష్ణద్వైపాయనుడిని, నల్లటి కృష్ణ వర్ణరూపంలో ప్రకాశించుట వలన కృష్ణద్వైపాయనుడిని, పరాశరాత్ముడైనందున పారాశర్యుడని, సత్యవతి తనయుడు కనుక సాత్యవతీయుడని, బదరికా వనంలో తపస్సు చేసినందున బాదరాయణుడని, వేద విభాగకర్తగా వేద వ్యాసుడనే పేర్లతో పిలువబడేవాడు - వ్యాసమహర్షి.
గురువంశమే పూర్తిగా నశించిపోయే పరిస్థితి ఏర్పడినపుడు, తల్లి సత్యవతి కోరిక మేరకు, అంబిక యందు ధృతరాష్ట్రుని, అంబాలిక యందు పాండురాజునకు జన్మనిచ్చాడు. వ్యాస భగవానులు ఈ విధంగా వ్యాసుడు కురువంశానికే మూల పురుషుడు.
తపస్సు కంటె ఉత్తమ మార్గం లేదని చెప్పి, తల్లి సత్యవతికి, అంబకు అంబాలికకు యోగవిద్యను బోధించాడు, వ్యాస మహర్షి. యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది సత్యవతీదేవి. కురు పాండవ యుద్ధానంతరం కోడళ్లు కూడా కాలాంతరంలో యోగ మార్గంలోనే శరీర త్యాగం చేశారు.
పాండవులు అరణ్యవాసంలో ఉన్నపుడు, భవిష్యత్తులో యుద్ధం అనివార్యమని తెలిసికున్నాక, తమ శక్తిసామర్థ్యాల గురించి అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. కౌరవ పక్షంలో భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మొదలగువారున్నారు. మనకుండే బలాబలాలేమిటి? అని బేరీజు వేసుకుంటున్నారు. వ్యాసమహర్షి వారొచ్చారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల కంటె ఎక్కువ అస్తస్రంపద పాండవులకు కూడా ఉండాలని చెప్తూ, వాటి సాధనా మార్గంగా ‘ప్రతిస్మృతి’ అనే విద్యను అర్జునుడికి, ధర్మరాజుకి ఉపదేశించాడు, వ్యాస భగవానులు. దీనినిబట్టి మనకేం అర్థమవుతుంది? ధర్మ విజయానికి తన వంతు కర్తవ్యాన్ని వ్యాసుడు ఎప్పుడూ అందిస్తాడు.

గురువే భాస్కరుడు (10వ పేజీ తరువాయ)
ఆయన ధర్మపక్షపాతి. అందుకే తను ఉపదేశించిన విద్య, తపోబలతో ఇంద్రుడిని కుబేరుణ్ణి, యముణ్ణి వరుణుణ్ణి ఆ తరువాత పరమశివుణ్ణి కూడ ప్రత్యక్షం చేసికొని, వారి కృపా కటాక్షములతో దివ్యాస్త్రాలు పొందుతారని, భీష్మాదుల్ని గురించి ఆలోచించనవసరం లేదని చెప్పాడు వ్యాసమహర్షి. పాండువులను విజయం వరించేటట్లు చేశాడు. ధర్మం ఎక్కడ ఉంటుందో, జయం అక్కడ ఉంటుందని, నారాయణాంశీభూతుడైన వ్యాసమహర్షి రుజువు చేశాడు.
భారత యుద్ధ విశేషాలను ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రునికి సంజయుడు చెపుతూ ఉండేటట్లు ఏర్పాటు చేశాడు వ్యాస మహర్షి. శీఘ్రగమనం, శస్త్రాస్తమ్రుల వలన ఏ బాధా లేకుండుట వంటి సౌలభ్యాన్ని కూడా సంజయునికి ఇచ్చాడు. అందుకే, ధృతరాష్ట్రునికి స్పష్టంగా యుద్ధ విశేషాల్ని చెప్పగలిగాడు, సంజయుడు.
ఒకసారి ధృతరాష్ట్రుడు, సంజయుణ్ణి యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అసలు యుద్ధం తప్పదంటావా? అని అమాయకంగా ఆత్రుతతో అడిగాడు. యుద్ధంలో ఎవరు గెలుస్తారని నీవనుకుంటున్నావు? అని అడిగాడు ధృతరాష్ట్రుడు, సంజయుణ్ణి. దానికి సమాధానం సంజయుడు ‘వ్యాస భగవానుణ్ణి’ తలచుకోమన్నాడు, ధృతరాష్ట్రుణ్ణి. వ్యాసుడు వచ్చి పాండవులే గెలుస్తారు. నీ కుమారులు పోతారు’ అని చెప్పాడు. కాని, ధృతరాష్ట్రునిలో ఏ మార్పూ లేదు. కొంచెంసేపు ఆలోచించి ‘నా తమ్ముడి కొడుకులు పాండవులు, నా కొడుకులు ఇద్దరూ క్షేమంగా ఉండాలి. దానికేదైనా ఉపాయం చెప్పమ’ని అడిగాడు, ధృతరాష్ట్రుడు. ‘నిజంగానే నీకా మంచి సంకల్పం ఉంటే, త్రికరణశుద్ధిగా నీవు ఆ మాటలు మాట్లాడితే, అది నెరవేరటానికి శ్రీకృష్ణ పరమాత్మను, ఆశ్రయించమన్నాడు, వ్యాసుడు. ఆ పని మాత్రం చేయలేదు ధృతరాష్ట్రుడు. వ్యాస భగవానుని హితవు వాక్యాల్ని కూడా పెడచెవిని పెట్టాడు ధృతరాష్ట్రుడు. అనుభవించాడు. మహనీయులు మహాత్ములు త్రికాలజ్ఞులు, స్వార్థరహితులు, లోకహితులు అయిన వారి బోధలు, హితోక్తులను, మన నిత్య జీవితంలో అమలుపరిస్తే, జీవితం సుగమమం, సుఖమయం అవుతుంది. జీవిత లక్ష్యం నెరవేరుతుంది. ఇదే వ్యాస భగవానుని సందేశం.
గురుపౌర్ణమి నాడు జ్ఞప్తి చేసికోవలసిన జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు. మానవ జాతి బహుజన్మల నోము ఫలం. ఆదిశంకరుల అవతారం. జీవిత పరమార్థమేమిటో, దాన్ని ఎలా అందుకుని తరించాలో ఎవరి స్థాయికి తగినట్లుగా వారికి బోధించి, పంచాయతన పూజా విధానాన్ని అందించి, శివకేశవులకు అభేదముగా అనేక స్తోత్రాల్ని రచించి, ప్రకటన గ్రంథాన్ని వెలయించి, విష్ణు సహస్ర నామ, లలితా సహస్ర నామములకు, బ్రహ్మ సూత్రములకు భాష్య గ్రంథాల్ని అనుగ్రహించిన వారు దేశం నలుమూలలా చతురామ్నాయ పీఠాల్ని స్థాపించి, వేదోద్ధరణ ధర్మసంస్థాపన చేసిన జగద్గురువు - జగద్గురు శంకరాచార్య.
‘తామిచ్ఛా విగ్రహం దేవీం గురు రూపాం విచింతయేత్’ తను కోరుకున్న రూపాన్ని జగన్మాత ధరించగలదు. జగదంబయే, గురు రూపమును ధరించింది. కనుక, జగన్మాతా రూపుడైన వాడు - గురుడు. జగన్మాతే గురువు. ‘గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహ జన్మభూః’ ‘గణాంబా గుహ్యకా రాధ్యా కోమలాంగే గురుప్రియా’ అన్న లలితా సహస్ర నామ స్తోత్రంలోనివి కూడా గురుపూర్ణిమకు స్ఫూర్తినిస్తాయి.
వశిష్ఠ మహర్షి, రఘువంశ రాజులకు గురు స్థానంలో ఉండి వారిచే ధర్మరక్షణ చేయించాడు. శాపగ్రస్థుడై, సంతానం కలగని దిలీప మహారాజుకి, శాపాన్ని ఉపశమనం గావించే మార్గాల్ని బోధించి, సంతానవంతుణ్ణి చేసిన గురువు వశిష్ఠ మహర్షి. శ్రీరామచంద్రునికి విద్యాబుద్ధులు నేర్పి, సత్వగుణ సంపన్నునిగా తీర్చిదిద్దిన మహనీయుడు వశిష్ఠుడైతే, అస్త్ర శస్త్ర విద్యలిచ్చి, సీతారాముల కళ్యాణాన్ని లోకహితంగా, గావించిన వాడు - విశ్వామిత్రుడు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని బోధించి, ప్రాణశక్తి ప్రదాత సూర్యభగవానుని అనుగ్రహంతో రామునిచే రావణ సంహారము చేయించిన మహోదాత్తుడు - అగస్త్య మహర్షి.
‘ఆచార్యవాన్ పురుషోవేద’ గురువు కలవాడే, తత్త్వాన్ని తెలియ కలుగుతాడు. గురువు భగవద్రూపుడు. ఎంతటి గుణ సంపన్నుడైనా విద్యావంతుడైనా కామక్రోదాదులనే రోగముల కూటమిని స్వయం ప్రజ్ఞ చేత పోగొట్టుకోలేడు. అపరోక్ష సాక్షాత్కారము గలవాడే గురువు. అటువంటి సద్గురువుల వలననే పోగొట్టుకోగలుగుతాడు.
మన జీవితంలో మనకు ఇష్టమైనవి వస్తు వియోగం, అప్రియ వస్తు సంయోగం, శరీరం ఉన్నంతవరకు సంప్రాప్తమవుతూనే ఉంటాయి. మనకు అత్యంత ప్రియమైన మన శరీరం, భార్యా బిడ్డలు, మన దాయాదులు, బంధువులు, మన గృహములు, మన వస్తు సంపద, వీటికి భంగం కలిగినా మనస్సుకు ఖేదం కలుగుతుంది. కానీ ఇవన్నీ కాల పరిణామంలో పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. తిరిగి తిరిగి పుడుతూ ఉంటాయి. జనించి చెదిరిపోయేవే. వీటి మార్పులో, మోహము వలన మనకు హర్ష శోకములు సుఖ దుఃఖములు కలుగుతాయి. సంసారంలోనే మునిగి, అజ్ఞానంలో స్వయం రక్షణ పొందలేడు. సుఖాన్ని కోరుకోవటం, చిత్తం యొక్క నైజం. ఇంతవరకూ అనుభవించిన వాటిలో, నిజమైన సుఖం దొరకక, మన చిత్తం నిర్వేదంలో, విచారంతో ఉంటుంది. ఇదుగో ఈ సందర్భంలో సద్గురు మూర్తిని ఆశ్రయిస్తే, ఆయన అనుగ్రహంతో పొరపాటును సరిదిద్దుకొని, అసలైన సుఖమేమిటో తెలియపరుస్తాడు. ఆత్మతత్త్వంతో చిత్తానికి శాంతి లభిస్తుంది. ఇంతటి ఆధ్యాత్మిక విషయాల్ని, గురువు విశిష్టతను ‘గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు..’ అన్న, గౌరీ మనోహరి రాగకీర్తనలో అద్భుతంగా అందించారు - నాదయోగి సద్గురు త్యాగరాజ స్వామి.
వాగ్గేయకార త్రయం - శ్యామశాస్ర్తీకి, సంగీతస్వామి గురువు; ముత్తుస్వామి దీక్షితులకు - శ్రీ చిదంబరనాథ స్వామి గురువు; త్యాగరాజస్వామికి - శ్రీరామకృష్ణానంద స్వామి గురువు. ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్యునికి కడుపునొప్పి వస్తే, ‘సూర్యమూర్తే నమోస్తుతే’ అని సూర్యుని మీద, మిగిలిన గ్రహముల మీద, నవగ్రహ కీర్తనలను ఆశువుగా ఆర్తితో గానం చేసి, శిష్యుని కడుపునొప్పిని పోగొట్టిన సద్గురువు, దీక్షితుల వారు.
దేహమనే పరుపులోపల చింతనలనే నల్లుల్ని పెంచుకుంటారు. అహంకారం, అసూయ, కోపం, మోహం, స్వార్థం, దూరం చేసికొంటే, జీవితం ఆనందమయ మవుతుంది. చిన్నవయసు నుండి సన్మార్గం వైపు నడవాలి. ప్రతి విషయాన్నీ ఆకళింపు చేసికోవాలి. దీన్ని అనుగ్రహించేవాడు గురువు అని బోధించిన కార్తికేయ అంశీభూతుడు, సద్గురు భగవాన్ రమణమహర్షి.
‘గురువు చిల్లగింజ గురువే భ్రమరము గురుడే భాస్కరుడు గురువే భద్రుడగు, గురువు నీవనుకొంటి..’ అని ధన్యాసి రాగం, చాపుతాళ కీర్తనలో గురువు విశిష్టతను హృద్యంగా వివరించారు, సద్గురు త్యాగరాజస్వామి. భ్రమరం, ఒక కీటకాన్ని తీసికొచ్చి, తను తయారుచేసికొన్న మట్టిగూటి రంధ్రంలో ఉంచుతుంది. ఆ తరువాత, ప్రతిరోజూ ఝంకారం చేస్తూ, ఆ మట్టిగూటి చుట్టూ తిరుగుతుంది. లోపల ఉండే కీటకం, పదేపదే ఆ నాదం విన్నందుకు తన రూపాన్ని కోల్పోయి, భ్రమర రూపం ధరిస్తుంది. ఆ ప్రకారమే శిష్యుడు, గురువు చెప్పిన భావం విని, నిరంతరం మాటిమాటికి స్మరించుకోవటం వల్ల, వింటూ ఉండటం వలన జీవన్ముక్తిని పొందుతాడు.
మనసులోని భావాల్ని, వాక్కులోని సూచన, క్రియలోని ఆచరణ, మూడింటి ఏకత్వమే - మానవత్వం. మానవత్వాన్ని కటాక్షించి దైవ తత్త్వాన్ని ప్రజ్వలింపచేసే మహనీయుడు - గురువు.
త్యాగం, యోగం, పవిత్రత మూర్త్భీవించిన ఉన్నత వ్యక్తిత్వం - గురుడు. శీల సంపదలేని విద్య, మానవత్వం లేని విజ్ఞానం, ధర్మనిరతి లేని వాణిజ్యం, దానశీలత లేని ధనం, అక్కరకు రాని చుట్టాలే. అసలైన సంపదల్ని కటాక్షించేవాడు - గురుడు.
సర్వుల యందు ఉన్నది ఒకే చైతన్యం అని తెలిపి, అహింస ప్రేమ తత్త్వాలతో సత్యానే్వషణ చేసి, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షింపచేసే జ్ఞాన స్వరూపుడు, గురువని చెప్తోంది, గురుపూర్ణిమ.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464