S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టేషన్ మాస్టర్

రాత్రి ఎనిమిది గంటలు అయింది. రైల్వేస్టేషన్‌లో స్టేషన్ మాస్టర్ పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. స్టేషన్ చుట్టూ చెట్లు, ముళ్లపొదలు ఉన్నాయి. కీచురాళ్ల ధ్వనులు, కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. పేరుకు స్టేషనే గానీ ఒకే ఒక్క గది, ఒకే ప్లాట్‌ఫాం. ఎప్పుడో ఒకసారి రైలు వెళ్లడం తప్ప ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అది అటవీ ప్రాంతం కావటంవల్ల చుట్టుపక్కల అన్నీ చిన్నచిన్న పల్లెటూళ్లు.
పుస్తకం చదువుకుంటున్న స్టేషన్ మాస్టర్ రాజారావు ఎందుకో తలెత్తి చూసేసరికి ప్లాట్‌ఫాం మీద ఒక యువకుడు వొంటరిగా సిమెంట్ బెంచీ మీద కూర్చుని కనిపించాడు. అతనికి ఇరవై రెండు, ఇరవై మూడేళ్లు ఉండవచ్చు. ఉదయం కూడా అతను కనిపించాడు.
‘ఎవరు బాబూ నువ్వు? పాసింజర్ రైలు వెళ్లిపోయింది. అడపాదడపా గూడ్సు రైళ్లు తప్ప ఏవీ ఇటుగా రావు. ఎవరి కోసం కూర్చున్నావ్?’ అని అడిగాడు తను. అతను చాలాసేపు అటూ ఇటూ తచ్చాడి వెళ్లిపోయాడు. ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ఎందుకో! కిటికీలో నుంచీ అటువైపే చూస్తూ అనుకున్నాడు రాజారావు.
ఇంకో అరగంటకి గూడ్సు రైలు వస్తుంది. అది వెళ్లిపోతే తన డ్యూటీ అయిపోయినట్లే! మళ్లీ రేపు ఉదయం దాకా రైళ్లేమీ లేవు. మళ్లీ కిటికీలో నుంచీ దృష్టి సారించాడు రాజారావు. ఆ యువకుడు జుట్టు పీక్కున్నాడు. అస్థిమితంగా సిమెంట్ బెంచీ మీద వెనక్కు వాలాడు. దోసిట్లో ముఖం దాచుకున్నాడు. అతని హావభావాలు దూరం నుంచీ కూడా కనిపిస్తున్నాయి.
ఒక పావుగంట తర్వాత పక్క స్టేషన్ నుంచీ ఫోన్ వచ్చింది. గూడ్సు రైలు బయలుదేరిందని చెప్పారు. రాజారావు సిగ్నల్ ఇచ్చాడు. సిగ్నల్ మారటం చూసి ఆ యువకుడు లేచి నిలబడ్డాడు. ప్లాట్‌ఫాం అంచున నిలబడి రైలు వచ్చేవైపు చూస్తున్నాడు. గూడ్సు రైలు దూరం నుంచీ కూత పెట్టుకుంటూ స్పీడ్‌గా వస్తోంది. సరిగ్గా దగ్గరకు వచ్చే సమయానికి కిందకు దూకేయబోయాడు. వెంటనే వెనక నుంచీ ఎవరో బలంగా లాగారు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి రాజారావు. రాజారావు అతన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. రైలు ఢమఢమ శబ్దం చేస్తూ వేగంగా దాటిపోయింది.
‘ననె్నందుకు కాపాడారు? వదలండి. నేను చచ్చిపోవాలి’ అతను ఏడుస్తూ గింజుకున్నాడు. రాజారావు అతన్ని సిమెంట్ బెంచీ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చున్నాడు. ఒక అయిదు నిమిషాలు అలా ఏడవనివ్వడమే మంచిదనిపించింది. తర్వాత ‘ఎవరు నువ్వు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగాడు. అతను సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. రాజారావు అతని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని ‘చెప్పు బాబూ! ఫర్వాలేదు’ అన్నాడు. ఆ అనునయానికి మెత్తబడ్డాడు అతను.
‘ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని పల్లెటూరు మాది. మా అమ్మానాన్నలు అడవిలో నుంచీ ఈత ఆకులు కొట్టుకొచ్చి ఈతచాపలు, చీపుళ్లు, సువ్వలు చీల్చి తట్టలు తయారుచేసి అమ్ముతారు. నన్ను కష్టపడి చదివించారు. బి.ఏ. పాసయ్యాను. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నేను వాళ్లకి పనిలో సహాయం చేస్తూ ఉంటాను. ఏదో సహాయం కోసం చేస్తూ ఉన్నాను గానీ, ఆ బుట్టలు తట్టలు అల్లటం అసలు ఇష్టమే లేదు. పెద్ద ఉద్యోగం తెచ్చుకుని మా వాళ్లని బాగా చూసుకోవాలని నా కోరిక. మూడేళ్ల నుంచీ పెద్ద ఉద్యోగం కాదు గదా, చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. నాకు ఏదీ కలిసి రావటం లేదు. ఇలాగే సంవత్సరాలు గడిచిపోతాయేమో అనిపిస్తుంది. ఇక నేను బ్రతకటం వల్ల ఏం ఉపయోగం ఉంది? చెప్పండి?’ అన్నాడు కన్నీళ్లతో.
‘పోనీ నువ్వు చనిపోవటం వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నావా?’ సూటిగా చూస్తూ అడిగాడు రాజారావు.
‘నేను లేకపోతే కనీసం నా భారం మా వాళ్లకు తగ్గుతుంది కదా!’
‘పిచ్చివాడా! నువ్వు భారం అనుకునేట్లయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెంచి పెద్ద చేస్తారు? అష్టకష్టాలు పడి ఎందుకు చదువు చెప్పిస్తారు? వాస్తవం ఆలోచించు.. నువ్వు లేకపోతే మీ వాళ్లు కుంగిపోతారు. పదేళ్లు బ్రతకవలసిన వాళ్లు నిరాశతో నాలుగేళ్లకే పోవచ్చు. నీ చెల్లెల్లు అనాధలవుతారు. కుటుంబంలో ఒక వ్యక్తి హఠాత్తుగా మాయమైతే ఆ కుటుంబంలో ఎంత కల్లోలం చెలరేగుతుందో నీకు తెలియదు. అనుభవజ్ఞుడైన నాకు తెలుసు’
‘అయితే నన్ను ఎంతకాలం ఇలా బ్రతకమంటారు?’
‘నీకు కావలసింది ఉద్యోగమే కదా... నేనిస్తాను’
‘మీరా?!’ తలెత్తి విస్మయంగా చూశాడు. ‘ఈ అడవిలో మీరేం సాయం చేయగలరు?’
‘అదంతా తర్వాత చెబుతాను. ముందు మా ఇంటికి వెళదాం పద!’ అంటూ లేచాడు రాజారావు. అతను కూడా లేచి నిలబడ్డాడు. స్టేషన్‌కి తాళం వేసి టార్చ్‌లైట్ తీసుకున్నాడు. అక్కడి నుంచీ సుమారు నాలుగు ఫర్లాంగుల దూరంలో రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి. సన్నటి కాలిబాట వెంట టార్చ్‌లైట్ వేస్తూ నడుస్తున్నారు. బాట కిరుపక్కలా ముళ్ల తుప్పలు. ఒక పది నిమిషాల్లో క్వార్టర్స్ దగ్గరికి వచ్చారు. ప్రక్కప్రక్కనే మూడు క్వార్టర్స్ ఉన్నాయి. రెండింటిలో లైట్లు వెలుగుతున్నాయి. మూడవది శిథిలావస్థలో ఉన్నది. క్వార్టర్ చుట్టూ చెక్కలతో వేసిన ఫెన్సింగ్ ఉన్నది. గేటు తెరచుకుని ఇద్దరూ లోపలకి వచ్చారు.
తలుపు కొట్టగానే ఆయన భార్య వచ్చి తలుపు తీసింది. ‘రుక్మిణీ! ఇతను ప్రస్తుతం మన ఇంట్లోనే ఉంటాడు. స్నానం, భోజనం ఏర్పాట్లు చూడు’ అన్నాడు రాజారావు.
‘బక్కెట్, చెంబు, సబ్బు బావి దగ్గరే ఉన్నాయండీ! ఇదిగో టవలు’ అందించింది. బావి వైపు లైట్ స్విచ్ వేసింది. వెనుక వైపు బల్బు వెలిగింది.
‘అన్నట్లు నీ పేరు ఏమిటో చెప్పలేదు’ అడిగాడు రాజారావు ఆ యువకుడి వంక చూస్తూ.. ‘మధుబాబు. అందరూ ‘మధూ’ అని పిలుస్తారు’ చెప్పాడు. ‘నేను మాత్రం ‘బాబూ’ అని పిలుస్తాను’ అన్నాడు రాజారావు.
‘సరే!’ టవల్ భుజాన వేసుకుని బావి దగ్గరకు వెళ్లాడు.
మధుబాబు స్నానం చేసి, రాజారావు పంచెనే లుంగీలాగా కట్టుకుని, టవల్ భుజం చుట్టూ కప్పుకున్నాడు. రాజారావు అతని వంక పరిశీలనగా చూశాడు. వంకీలు తిరిగి తడిసిన జుట్టు నుదుటి మీద పడుతోంది. గడ్డం, మీసం పెరిగినా కనుముక్కు తీరుగా ఉంది. ‘అందగాడే!’ అనుకున్నాడు.
ఇద్దరి భోజనాలు అయిన తర్వాత హాలులో నవారు మంచాలు వేసి దిండు, దుప్పటి ఇచ్చి బెడ్‌రూంలోకి వెళ్లింది రుక్మిణి. స్నానం చేసి వచ్చిన మధుబాబుకి దిగులు, బెంగ కొంత తగ్గినట్లయింది. కడుపు నిండిన తర్వాత స్థిమితం చిక్కినట్లయింది. రాజారావు, మధుబాబు ఎవరి సంగతులు వాళ్లు చెప్పుకున్నారు. మధుబాబు ఇంటికి పెద్దకొడుకట. తర్వాత ఇద్దరు చెల్లెళ్లున్నారు. పెద్ద చెల్లెలు ఏడవ తరగతి వరకు చదివి బడి మానేసింది. తల్లిదండ్రులకి ఇంటి పనుల్లో సాయం చేస్తుందట. చిన్న చెల్లెలు ఐదవ తరగతి చదువుతూ ఉంది.
రాజారావు కూడా తన విషయాలు చెప్పాడు. ఒక్కతే కూతురు. పెళ్లై అత్తవారింటికి వెళ్లింది. పక్క క్వార్టర్స్‌లో గార్డు మాణిక్యం ఉంటున్నాడు. అతను పని మీద ఊరు వెళ్లాడు. ఇంట్లో భార్య, పిల్లలు మాత్రమే ఉన్నారు.
‘నిద్ర వస్తూంది. ఇక పడుకో! రేపు మాట్లాడుకుందాం!’ ఆవలిస్తూ అన్నాడు రాజారావు. ఆయన పక్కనే ఉండటంతో మధుబాబుకి గుండెల నిండా ధైర్యంగా, నిశ్చింతగా ఉంది. కళ్లు మూసుకున్నాడు.
ఆ మర్నాడు రాజారావు డ్యూటీకి వెళ్లబోతూ, ‘చూడు బాబూ! ఇక్కడ మంచినీళ్లు దొరకవు. బావిలో నీళ్లు వాడుకోవటానికి ఉపయోగించుకుంటాం. త్రాగటానికి ఇక్కడ నుంచీ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్లోకి వెళ్లి, పంచాయితీ ఆఫీస్ దగ్గర ఉన్న పంపు నుండీ రెండు బిందెల నీళ్లు తీసుకురావాలి. రోజూ ఈ పని చేసేట్లయితే నీకు నేను నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను. ఇదే నేనిచ్చే ఉద్యోగం’ అన్నాడు.
‘వెయ్యి రూపాయలా?’ నోరెళ్లబెట్టాడు మధుబాబు.
‘మాది లంకంత కొంప. ఆ పక్క గదిలో నువ్వు ఉండేట్లయితే నాకేమీ అభ్యంతరం లేదు. భోజనానికి ఈ చుట్టుపక్కల హోటళ్లు ఏమీ లేవు. నా భార్య నాతోపాటు నీకు కూడా ఒక ముద్ద వండి పెడుతుంది. దీనికి నువ్వేమీ డబ్బు ఇవ్వనవసరం లేదు’
ఆ దేవుడే దిగివచ్చి వరాలు ఇస్తున్నట్లుగా ఉంది మధుబాబుకి. వెంటనే ఒప్పేసుకున్నాడు.
‘ఇప్పుడే నీ పని మొదలుపెట్టు. అదిగో! ఆ సైకిల్‌కి బిందెలు వేలాడదీసి నీళ్లు తీసుకురా! నాకు టైం అయింది’ అని చెప్పి వెళ్లిపోయాడు రాజారావు.
* * *
నెలరోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజులు గిర్రున తిరిగినట్లనిపించింది మధుబాబుకి. తినటానికి, ఉండటానికీ ఖర్చేమీ లేదు. రాజారావు ఇచ్చిన వెయ్యి రూపాయలు అలాగే తల్లిదండ్రులకు మనియార్డర్ చేశాడు. అతనికి చాలా ఆనందంగా అనిపించింది.
రోజూ సైకిల్ మీద రెండు బిందెలతో నీళ్లు తీసుకుని వస్తాడు. ఆ పని ఒక గంటలో అయిపోతుంది. ఇక రోజంతా ఖాళీనే! రాజారావు వాళ్లు అంత అభిమానంగా చూస్తున్నప్పుడు తను ఊరికే కూర్చోవటం భావ్యం కాదు అనుకుని, ఇంటి ఆవరణలో ఉన్న కూరగాయల మొక్కలకూ, పూల మొక్కలకూ బావిలో నీళ్లు తోడి పోసేవాడు. కొద్ది రోజులకే మొక్కలు నేవళంగా కళకళలాడుతూ, పువ్వులతో కాయలతో నిండిపోయాయి. మంచి తాజాగా కూరగాయలు లభించేవి. రుక్మిణి పూజ చేసుకోవటానికి పూలు కోసి ఉంచేవాడు మధుబాబు.
రాజారావు, రుక్మిణి చూపించే అభిమానానికి కరిగిపోయి వాళ్లని ‘బాబాయ్, పిన్నీ’ అని పిలిచేవాడు మధుబాబు. ఆ పల్లెటూరిలో టీవీలు ఉండవు. సినిమా హాళ్లు ఉండవు. రాజారావుకి, రుక్మిణికి పుస్తకాలు చదివే అలవాటుంది. గోడకున్న అలమర నిండా రకరకాల పుస్తకాలు అమర్చి ఉన్నాయి. రామాయణ, భారత, భాగవతం లాంటి పురాణాలే కాక శ్రీశ్రీ, దేవులపల్లి, సి.నారాయణరెడ్డి, జాషువా వంటి వారి కావ్యాలు, బుచ్చిబాబు, గోపీచంద్, కొడవటిగంటి, యద్దనపూడి వంటి వారి నవలలు ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.
మధుబాబు మొదట్లో కాలక్షేపానికి అన్నట్లు మొదలుపెట్టి క్రమక్రమంగా అవన్నీ చదవటంలో మునిగిపోయాడు. త్వరగా పనంతా ముగించుకుని పుస్తకం పట్టుకుని కూర్చునేవాడు. అసలే పల్లెటూరు. నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం అతని ఏకాగ్రతను రెట్టింపు చేసింది. ఒకదాని తర్వాత ఒకటి ఆ పుస్తకాలన్నీ చదువుతూంటే అమృతం గ్రోలుతున్నట్లు ఉండేది అతనికి.
మధుబాబులో వచ్చిన మార్పును గమనిస్తూ ఉన్నాడు రాజారావు. అతనికి సోమరిగా కూర్చోవటం అలవాటు లేదు. తను చెప్పకపోయినా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా పుస్తక పఠనం అలవాటు ఆయన్ని ముగ్ధుడిని చేసింది. అతనిలో నిరాశా నిస్పృహలు మాయమైనాయి. ఏదో ఉత్సాహం ఉరకలు వేస్తోంది మధుబాబులో. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వినయంగా ఉంటాడు.
రాజారావు అతని కోసం పట్నం నుంచీ నాలుగు జతల రెడీమేడ్ బట్టలు తెప్పిచాడు. చక్కగా తయారైన అతన్ని చూసి, ‘బట్టలు మనిషిలో ఇంత మార్పు తెస్తాయి’ అన్పించింది. మధుబాబు ఆయన్ని ‘బాబాయ్!’ అని పిలుస్తూంటే ఏదో తెలియని వాత్సల్యం కలగసాగింది.
రోజూ పదకొండు గంటలకు టౌన్ నుంచీ బస్ వస్తుంది. ఆ బస్‌లో న్యూస్‌పేపర్ వస్తుంది. పంచాయతీ ఆఫీస్‌లో, స్టేషన్ మాస్టర్ దగ్గర తప్ప ఆ ఊరిలో పేపర్ దొరకదు. ఉద్యోగాలు పడతాయేమో రోజూ పేపర్ చూడమని మధుబాబుతో చెప్పాడు రాజారావు.
ఒకరోజు రాజారావు మధుబాబుతో ‘గ్రూప్-టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది బాబూ! అప్లై చెయ్యి. అందులో సెలక్ట్ అయితే నీ జీవితం ఒక దారిన పడుతుంది. నీకు కావాల్సిన పుస్తకాలు చెబితే టౌన్ నుంచీ తెప్పిస్తాను’ అన్నాడు.
‘నోటిఫికేషన్ చూశాను బాబాయ్! రేపు నేనే టౌన్‌కి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుంటాను. అటు నుంచీ అటు మా అమ్మానాన్నలను కూడా చూసి రావాలనుకుంటున్నాను’ అన్నాడు.
‘తప్పకుండా వెళ్లు!’ అని రెండు అయిదు వందల నోట్లు జేబులో పెట్టాడు.
‘ఎందుకు బాబాయ్! జీతం ఇచ్చారుగా’
‘్ఫర్వాలేదు. ఫీజు కట్టటానికీ, పుస్తకాలు కొనుక్కోవటానికీ ఖర్చు పెట్టుకో!’ అన్నాడు.

ఇంటి చుట్టూ అరటి చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. రుక్మిణి పళ్లు కోసం ఒక సంచి నిండా పెట్టి అందించింది, అతను వెళ్లే రోజున.
చాలా కాలం తర్వాత వచ్చిన కొడుకుని చూసి మధుబాబు తల్లిదండ్రులు సంతోషించారు. ఈ మూడు నెలల్లో అతను ఒళ్లు చేశాడు. రంగు తేలాడు. అతను వేసుకున్న బట్టలతో మరింత ఆరోగ్యంతో మెరిసిపోతున్నాడు. మధుబాబు ఆ నెల జీతం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. తల్లికి, చెల్లెళ్లకి తను తెచ్చిన పళ్లు ఇచ్చాడు. రెండు రోజులు ఆనందంగా గడిపి తిరిగి రాజారావు దగ్గరకు వచ్చాడు.
మధ్యాహ్నం పూట భోజనానికి వచ్చిన రాజారావుకి వరండాలో చాప వేసుకుని, చుట్టూ పుస్తకాలు పెట్టుకుని చదువులో లీనమై పోయిన మధుబాబుని చూస్తూంటే ముచ్చటగా ఉండేది. మధు ఆప్షనల్ సబ్జెక్ట్‌గా తెలుగు తీసుకున్నాడు. ఇంట్లో ఉన్న గ్రంథాలు అతనికి ఎంతో ఉపయోగపడ్డాయి.
* * *
గ్రూప్-2 పరీక్షా ఫలితాలు వచ్చాయి. మధుబాబు డిప్యూటీ తహసీల్దారుగా సెలెక్ట్ అయ్యాడు. పక్క జిల్లాలోనే పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఊరు వెళ్లటానికి సిద్ధం అయ్యాడు. వెళ్లే రోజు రాజారావు, రుక్మిణి పాదాలకు నమస్కారం చేశాడు.
‘బాబాయ్! సంవత్సరం క్రితం నేను ఏ పరిస్థితులలో ఈ ఊరు వచ్చానో ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. మీ ఆదరణ, ఆప్యాయత నన్ను పూర్తిగా మార్చేశాయి. ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా ఆత్మహత్య గురించిన ఆలోచన రాలేదు. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే అంతా మీ చలవే’ అన్నాడు చెమర్చిన కళ్లతో.
‘నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యకు పాల్పడే వారికి ఏవో నాలుగు నీతివాక్యాలు చెబితే చాలదు. అతను కోరుకున్నది కొంచెమైనా జరిగేటట్లు చేయగలిగితే ఆ ఆలోచన నుండి బయటకు రాగలుగుతాడు. అందుకే నీకు నా దగ్గర పని ఇచ్చాను. నీకు పైకి రావాలనే తపన ఉంది. కానీ ఎలా రావాలో తెలియలేదు. బావిలో పడిపోయిన వ్యక్తికి చేయి అందిస్తే పైకి రాగలుగుతాడు. నేను చేసింది అదే! అందుకు తగిన వాతావరణం కల్పించాను. ప్రోత్సహించాను. మిగిలిన శ్రమ, పట్టుదల కృషి అంతా నీదే! నీ కృషి ఫలితమే ఈ రోజు నువ్వు సాధించిన విజయం’ భుజం తడుతూ అన్నాడు రాజారావు.
‘చీకటిలో కొట్టుమిట్టాడుతున్న వాడికి వెలుగు దారి వైపు నడిపించారు. పిన్ని కూడా కన్నతల్లిలాగే చూసింది. ఏం చేస్తే మీ రుణం తీరుతుంది?’ అన్నాడు గద్గద స్వరంతో.
‘మాకేమీ చేయనవసరం లేదు. నువ్వు పిల్లా పాపలతో సుఖంగా, సంతోషంగా ఉంటే చాలు’ అన్నది రుక్మిణి.
‘నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరచుకునే ఉంటాయి. ఇక సంతోషంగా వెళ్లి రా!’ అన్నాడు రాజారావు.
మధుబాబు వారిద్దరికీ వీడ్కోలు చెప్పి, బ్యాగ్ భుజాన తగిలించుకుని వెనుదిరిగాడు.
=====================================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-గోనుగుంట మురళీకృష్ణ.. 9701260448