S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పూల కూరలు-4

దానిమ్మ పూలతో కూర, పప్పు, పచ్చడి
దానిమ్మ గింజలకు ఏయే గుణాలున్నాయో ఇంచుమించుగా అన్నీ దానిమ్మ పూలకూ ఉన్నాయి. అవి లోపలికి తీసుకోదగినవే! యుక్తితో ఒక కమ్మని వంటకంగా ఎలా చేసుకోవాలో ప్రయత్నించండి. కూరల ధరలు మండిపోతున్నాయని బాధపడ్తున్నామే గానీ, మన చుట్టూ మన పెరట్లో మన పొలాల్లో గట్ల మీద, కాలువ గట్ల మీద బాటల పక్కనా ఇలాంటి ఆహార ద్రవ్యాలు ఎన్నో ఉచితంగా దొరికేవి ఉన్నాయి. వాటిని మనం పట్టించుకోకపోవటం మన దురదృష్టమే. మార్కెట్లో మనం కొనుక్కునే చాలా కూరగాయలకన్నా ఆరోగ్యవంతమైన ఎక్కువ ఔషధ గుణాలు కలిగిన ఆహార ద్రవ్యాల గురించి ఈ శీర్షికలో పాఠకులకు విలువైన సమాచారం అందిస్తున్నాం. ఇవన్నీ మనకు అందుబాటులో లేవని నిరాశగా వదిలేయకండి. పల్లె బాట పట్టండి. అందుబాటులో ఉన్నవారు కూడా వాటి విలువ తెలియకపోవటం వలన నిర్లక్ష్యంగా వాటిని పారేస్తున్నారు. అందుకే ఇంత గట్టిగా నొక్కి చెప్పవలసి వస్తోంది.
దానిమ్మ పూలను నేతితో వేయించి హల్వా చేసుకోవటం అన్నింటికన్నా తేలికైన ఉపాయం. తరిగి కూరగానో, పప్పుగానో, పచ్చడిగానో చేసుకోవచ్చు. పెరుగుపచ్చడిగా చేసుకోవటం వలన ఎక్కువ ఉపయోగపడ్తుంది. ఎందుకంటే ఇది పేగులలో వచ్చే అన్ని జబ్బుల మీద ఔషధంగా పని చేస్తుంది. ముఖ్యంగా అమీబియాసిస్ వ్యాధికి ఇది తిరుగులేని ఔషధం. జిగురు విరేచనాలు, రక్త విరేచనాలు తగ్గుతాయి. జ్యూస్ తీసి తీపి కలుపుకుని తాగితే పేగుపూత, ఎసిడిటీలు తగ్గుతాయి.
మరాటీ మొగ్గలతో...
ఇవి పచారీ షాపుల్లో దొరుకుతాయి. ఇవి కూడా ఆ చెట్టు పూలే! లవంగం మొగ్గలాగానే ఉంటాయి కానీ, వాటికన్నా లావుగా పెద్దవిగా ఉంటాయి. వీటిని పొన్నీ రాయల్ అంటారు. తులసి చెట్టులాగానే పెరుగుతుంది ఈ చెట్టు కూడా! ఈ చెట్టు పేరు మహారాష్ట్రీ. బహుశా ఒక ప్రాంతం పేరుతో పిలిచే మొక్క ఇదొక్కటే ననుకుంటాను. అందుకే మరాఠీ మొగ్గలనే పేరు తెలుగులో ఏర్పడింది. మహారాష్ట్రీ కటు స్తీక్ష్ణా సోష్ణా వాతకఫార్తినుత్ అంటే మరాఠీ మొగ్గలు చేదు, కారం రుచుల తీరు కూడుకుని ఉంటుంది. వాత వ్యాధుల్లో ఔషధంలా పని చేస్తుంది. కొద్దిగా వేడి చేస్తుంది. కఫాన్ని పోగొడుతుంది. అంతేకాదు, దీనికి నిద్ర పట్టించే గుణం ఉంది. జాజికాయ, జాపత్రి, మరాటీ మొగ్గలూ ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా దంచి, ఓ సీసాలో భద్రపరచుకుని, రోజూ పావుచెంచా మోతాదులో తీసుకుని ఓ చిన్న గ్లాసు వేడి పాలలో కలిపి రాత్రి పడుకోబోయే ముందు తాగితే చక్కగా నిద్ర వస్తుంది. లైంగిక సమర్థత పెరుగుతుంది. శీఘ్రస్కలనాన్ని ఆపుతుంది. రోజుకు అరమొగ్గ కన్నా ఎక్కువ కాకుండా పుచ్చుకోవచ్చు. మసాలా ద్రవ్యాల్లో బిర్యానీ ఆకుతోపాటు దీన్ని కూడా కలిపి వంటకాలు చేసుకుంటూ ఉంటారు.
నువ్వు పూలతో కూర
నువ్వుల చెట్టు పూలు తినదగిన ఆహార ద్రవ్యమే! కూరగా వండుకుని తింటారు. నువ్వులకన్నా సౌమ్యంగా పని చేస్తాయి. వాత వ్యాధుల్లో మంచి చేస్తాయి. పురుషుల వీర్యంలో బీజ కణాలను పెంపు చేస్తాయి. నేతితో దోరగా వేయించి మెత్తగా గుజ్జు చేసి పాకం పట్టి హల్వా తయారు చేసుకొని రోజూ తినవచ్చు. వాత వ్యాధులకు వేడి చేయకుండా వాతాన్ని తగ్గించటంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. కారప్పొడిగా కూడా ఉపయోగించుకోవచ్చు. దానికదే బట్టలో తెలియకుండా మూత్రం అయిపోతున్న వారికి నువ్వులు, నువ్వు పువ్వు కలిపి ఏదైనా వంటకంగా చేసి రోజూ పెట్టవచ్చు. అతిమూత్రం, అత్యవసర మూత్రం, ఆగి ఆగి వచ్చే మూత్రం ఇవి తగ్గుతాయి.
పారిజాత పూలతో హల్వా
కీళ్లవాతం తగ్గించటంలో పారిజాతం ఆకులు, బెరడు, పూలు సమానంగానే పిన చేస్తాయి. ఈ పూలను కొద్దిగా నెయ్యి వేసి వేయించి మిక్సీలో గుజ్జుగా చేసి పాకం పట్టి తయారుచేసిన హల్వా వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని కూడా తగ్గిస్తుంది. బాగా చలవ చేస్తుంది. యాలకులు వగైరా చేర్చుకుంటే వెగటు వాసన లేకుండా ఉంటుంది.
పైడిపత్తి పూలతో...
పత్తిచెట్టు లేని తెలుగిళ్లు ఉండేవి కాదు పూర్వం. ఇప్పుడంటే పగిలిపోయిన బక్కెట్లలో మొక్కలు పెంచటం హాబీ. ఒకప్పుడు అది ధర్మం. పుణ్యప్రదం అనే నమ్మకం ఉండేది. మొక్కల్ని కన్నబిడ్డల్లా సాకేవాళ్లు. కూరలు పండించుకోవటమే గానీ కూరగాయల మార్కెట్‌లో కొనటం ఉండేది కాదు. ఇప్పుడు మారుమూల పల్లెల్లో కూడా రైతుబజార్లు అవసరం అవుతున్నాయి. ఏరకూడదు. తాకకూడదు. ఇష్టం అయితే కొను లేకపోతే పో.. అనే వాళ్లు రైతుబజార్లలో కూర్చుని కూరగాయలు అమ్ముతుంటే రైతులు కూడా వచ్చి కూరల ధరలు మండిపోతున్నాయి అనుకుంటూ కొనుక్కు వెళుతున్నారు. తమ పొలం గట్ల మీద ఉచితంగా గలిజేరు, గంగపావిలి లాంటి మొక్కలు పెరుగుతుంటాయి. వాటితో కమ్మని కూరలు వండుకుందాం అని ఎవ్వరూ ఆలోచించట్లేదు.
పైడిపత్తి, ఊరపత్తి ఇంక అన్ని రకాల పత్తి పూలకూ ఒకే ఔషధ గుణాలున్నాయి. పూలను కడిగి శుభ్రం చేసుకుని తరిగి కూరలా వండుకోవచ్చు. తలతిరుగుడు, పైత్య వికారాలు, ఎసిడిటీ, మైగ్రేన్ తలనొప్పి ఇలాంటి బాధల్ని తగ్గించే గుణం వీటికుంది. షుగరు వ్యాధి మీద కూడా ఇవి పని చేస్తాయి. స్ర్తిల సమస్యలు నివారించే వైద్య గుణం ఈ పూలకుంది. తెల్లబట్ట వ్యాధిలోనూ, నెలసరి సమయంలో అతి రక్తస్రావంలోనూ వీటికి ప్రయోగం ఉంది. అమీబియాసిస్ వ్యాధితో బాధపడేవారికి దీన్ని పెరుగుతో తినిపిస్తుంటే త్వరగా వ్యాధి తగ్గుతుంది.
పొద్దుతిరుగుడు పూలతో..
పొద్దుతిరుగుడు పూలు తెలుగు నేల మీద బాగానే పండుతున్నాయి. అవకాశం దొరికినప్పుడు వాటిని సేకరించి అట్టిపెట్టుకుని ఎండించి పైపైన దంచిన పొడిని ఓ సీసాలో భద్రపరచుకోండి. ప్రతీరోజూ రెండు పూటలా ఓ చెంచా పొడిని నీళ్లలో వేసి టీలాగా కాచి తాగుతూ ఉంటే చర్మవ్యాధులు తగ్గుతాయి. క్షయ వ్యాధిలో ఉత్తమ ఔషధంలా పని చేస్తుంది. దగ్గు తగ్గుతుంది. ముఖ్యంగా పొడి దగ్గు బాగా తగ్గుతుంది. కడుపులో నొప్పి కూడా తగ్గుతుంది.
మామిడి పూలతో..
ఒకప్పుడు మన పూర్వులు ఆనవాయితీగా పాటిస్తూ వచ్చిన అనేక ఆరోగ్య సంప్రదాయాలు మన తరం దాకా రాకుండా ఏ కారణం చేత అంతరిచిపోయాయో అర్థం కాదు. ఉగాది నాడు లేత మామిడి పిందెలనే (వడ పిందెలు) కాదు, ఉగాది పచ్చడిలో మామిడి పూలను తప్పనిసరిగా కలిపి తినేవారు. మామిడి పూలను ‘చూతకళిక’ అంటారు. ఉగాది నాడు మామిడి పూలను తినటాన్ని ‘చూతకళికాప్రాసన’ అని పిలుస్తారు. ఉగాది పచ్చడి తినటాన్ని ఒక భక్త్భివంతో కాక ఒక ఫ్యాషన్‌గా పాటించటం వలన కొన్ని ముఖ్యమైన విషయాలు మరుగున పడిపోయా యనిపిస్తుంది.
‘ఆమ్రపుష్ప మతీసార కఫపిత్త ప్రమేహనుత్/ అసృగ్దుష్టి హరం, శితం రుచికృద్గ్రాహి వాతలమ్’ అని ఆయుర్వేద సూత్రం. మామిడి పూలు వగరు, తీపి రుచులు కలిగి ఉంటాయి. నీళ్ల విరేచనాలు, జిగట విరేచనాలు దీనివలన తగ్గుతాయి. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తాయి. పైత్యాన్ని పోగొడతాయి. మూత్ర వ్యాధుల్లో ఔషధంలా పని చేస్తాయి. షుగరు వ్యాధి ఉన్న వారు దీన్ని కారప్పొడిలా చేసుకుని తినవచ్చు. అధికంగా రక్తస్రావం అవుతున్న వ్యాధుల్లో ఈ పూలు రక్తస్రావాన్ని తగ్గించగలుగుతాయి. శరీరంలో వేడిని బాగా తగ్గిస్తాయి. చలవ నిస్తాయి. ఎక్కువగా తింటే మలబద్ధతని కలిగిస్తాయి. చిగుళ్లలోంచి రక్తం కారే వ్యాధిని తగ్గించటం, గొంతుని శుద్ధిచేసి గాత్రం బాగా వచ్చేలా చేసే గుణాలు వీటికున్నాయి. ఈ పూలను, కొద్దిగా ఉప్పు నీళ్లలో వేసి కషాయం కాచి ఆ నీళ్లతో పుక్కిలిస్తే పంటిపోటు, చిగుళ్ల వాపు, నోటి పూత తగ్గుతాయి.

(మిగతా వఛ్చే సంచికలో)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com