S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డబ్బు వ్రతం!

మన దేశం వ్రతాలకు పెట్టింది పేరు. ఉత్తరాదిలో కరువా చౌత్ ప్రఖ్యాతి. సాంప్రదాయ కుటుంబాలు వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటారు. నిజానికి ఇలాంటి నమ్మకాల వెనుక శాస్ర్తియ కారణాలు ఉన్నా, కొందరు వీటిని మూఢనమ్మకాలుగానే చూస్తారు. అన్నం తినకపోతే బూచాడు వచ్చి తీసుకు వెళతాడు అని పిల్లలను బెదిరించినట్టుగా ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక అంశాలను వ్రతాలుగా అలవాటు చేశారు. ఇలాంటి నమ్మకాలను పాటించే వారు శుక్రవారం పూట డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు. డబ్బును ఇవ్వడం అంటే శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఇంటి నుంచి బయటకు పంపడం లాంటిదే అని భావించి చాలా మంది శుక్రవారం రోజున డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడరు. ఇది కూడా చాలా మందికి మూఢనమ్మకంగానే కనిపించవచ్చు. ఒక రకంగా వాదిస్తే అది మూఢనమ్మకమే. శుక్రవారం ఐతే ఏంటి? శనివారం ఐతే ఏంటి డబ్బులు ఇవ్వక తప్పదు కదా? అనుకోవచ్చు. నిజమే...
పాశ్చాత్య దేశాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి నమ్మకమే ఒకటి ప్రచారంలోకి వచ్చింది.
నెలలో ఒక రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు. అంటే ఖర్చు రహిత రోజు అన్నమాట. నెలకు ఒక రోజో, వారానికి ఒక రోజో భోజనం చేయకుండా ఉన్నట్టుగానే ఒక రోజు అస్సలు ఖర్చు చేయకుండా ఉండాలి. ఇదేదో దైవానికి సంబంధించిన వ్రతం కాదు. జీవితానికి ఉపయోగపడే వ్రతం.
ఖర్చు లేని దీక్ష
నిజమే ఖర్చు లేని దీక్ష. ఏ మతంలోనైనా, ఎలాంటి దీక్షకైనా ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఖర్చు పెట్టక పోవడమే ఈ దీక్ష లక్షణం. వారంలో ఒక రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదు అని నిర్ణయించుకోండి. సాధ్యం కాదు అనుకుంటే ముందుగా నెలకు ఒక రోజు ఎలాంటి ఖర్చు చేయకూడదు అనే దీక్ష తీసుకోండి. మనం సెల్‌ఫోన్‌కు బాగా అలవాటు పడ్డాం. కొన్ని దేశాల్లో నో సెల్‌ఫోన్ డే అంటూ ఒక రోజు సెల్‌ఫోన్‌కు పూర్తిగా దూరంగా ఉండడాన్ని ఒక ఉద్యమంగా అమలు చేస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్ లేనిదే క్షణం కూడా గడపలేం అనుకుంటాం. మరి అసలు సెల్‌ఫోనే్ల లేని కాలంలో మనం ఎలా ఉండగలిగాం. ఏదైనా అంతే అలవాటు కావడం కష్టం అలవాటు ఐతే అంతే. ఇది కూడా అంతే సెల్‌ఫోన్ ఉపయోగించకుండా ఉండడం కూడా ఒక అలవాటుగా మారుతుంది. మొదట్లో కష్టం అనిపించవచ్చు కానీ క్రమంగా అదే అలవాటు అవుతుంది. అలానే వారికి ఒకరోజు ఉపవాసం తరహాలోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల మీ ఖర్చుపై మీకు అదుపు ఏర్పడుతుంది. ఒక రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోతే మన డబ్బు ఎలా ఖర్చవుతుంది. దేనికి ఎంత ఖర్చవుతుంది అనే దానిపై స్పష్టత వస్తుంది. అనవసర ఖర్చు ఏమిటో తెలుస్తుంది. ఖర్చు పెట్టకుండా కూడా ఉండగలం అనే విశ్వాసం ఏర్పడుంది. మొదట్లో నెలకు ఒక రోజు ఖర్చు రహిత రోజుగా పాటించండి. అది క్రమంగా అలవాటు అయిన తరువాత వారానికి ఒక రోజు ఖర్చు పెట్టకుండా గడపండి. అదో రకమైన అనుభవంగా మిగులుతుంది. చాలా మంది వారానికి ఒక రోజు వౌనాన్ని పాటిస్తారు. ఆలయాలకు వెళతారు. ఇదే విధంగా ఖర్చు రహిత రోజుగా గడపండి. డబ్బుకు సంబంధించి మన మీద మనకు కంట్రోల్ ఉండాలంటే ఇలాంటిది అవసరం. ఖర్చు రహిత రోజు అంటే ఆ రోజు భోజనం కూడా చేయకుండా ఉండడం కాదు. బయట ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉండడం. హోటల్‌లో తిండి కావచ్చు, బండి మీద టీ కావచ్చు, సిగరేట్ కావచ్చు, సినిమాకు వెళ్లడం కావచ్చు. ఎలాంటి వాటికి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉండాలి.
ఖర్చు రహిత రోజును పాటించడం వల్ల క్రమంగా మన ఖర్చులపై అదుపు లభిస్తుంది. అదే విధంగా క్రమంగా అనవసరమైన ఖర్చులపై కోత విధించాలి. సినిమాలు, హోటల్స్, షాపింగ్‌ల పేరుతో అనవసరంగా చేస్తున్న ఖర్చుపై అదుపు సాధించండి. అలా ఖర్చుపై అదుపు సాధించినప్పుడు మీ పొదుపు ఖాతా పెరుగుతుంది. పొదుపును క్రమంగా ఇనె్వస్ట్‌మెంట్‌గా మార్చుకోండి. వారానికి ఒక రోజు ఉపవాసం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా నెలకు లేదా వారానికి ఒక రోజు ఖర్చు రహిత దినంగా గడపడం వల్ల ఆర్థిక ఆరోగ్యం మెరుగు పడుతంది. డబ్బుపై కంట్రోల్ లేదు, డబ్బు ఎలా వస్తుందో ఎలా పోతుందో అర్థం కావడం లేదు అనే మాటలు వినిపించకుండా పోతాయి. మీ డబ్బు అది మీ వద్దకు ఎలా వస్తుందో మీకు తెలుసు. అదే విధంగా అది మీ వద్ద నుంచి ఎటు పోవాలి? ఎలా పోవాలి? అనేది అంతా మీ అదుపాజ్ఞలోనే ఉండాలి. ఈ దీక్ష వల్ల కచ్చితంగా మీకు డబ్బుపైన, ఖర్చుపైన అదుపు వస్తుంది. ఈ దీక్ష తరువాత అనవసర ఖర్చు అని మీరు భావిస్తున్న వాటి జాబితా తయారు చేయండి. క్రమంగా ఒక్కోదాన్ని తగ్గించండి. నూతన సంవత్సరం సందర్భంగా రేపటి నుంచి తెల్లవారు జామునే లేవాలి, వాకింగ్ చేయాలి, సిగరేట్ మానేయాలి అనే తీర్మానాలు చేసుకుని, రెండవ రోజునే వాటిని మరిచిపోవడం చాలా మందికి అలవాటు. అలా తీర్మానాలు చేయకండి నిర్ణయాలను అమలు చేయండి. మీపై మీకు నమ్మకం ఉండాలి. మీ నిర్ణయంపై మీకు నమ్మకం ఉండాలి. మీపై మీకు పట్టు ఉండాలి.
మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడు ఖర్చు రహిత రోజును ఆచరించడం కష్టమేమీ కాదు. పైగా ఇలాంటి వ్రతాలు జీవితంలో కొత్త అనుభూతిని ఇస్తాయి. ఐస్ చాలెంజ్, రైస్ చాలెంజ్ అంటూ చాలెంజ్‌లు విసురుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. జీవితానికి ఉపయోగపడే నో స్పెండ్ డే చాలెంజ్‌ను మీకు మీరే విసురుకోండి.

-బి.మురళి