S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనుషులు.. మమతలు

శేషయ్యకి పిల్లలు లేరు. పిల్లల కోసం మొక్కని చెట్టు, పుట్ట, దైవం లేదు. అందరూ అతన్ని షావుకారు శేషయ్య అనేవారు. శేషయ్యంటే ఎవరో కాదు, మా ఇంటి ఎదురు డాబా ఇల్లే అతనిది. నా చిన్నప్పటి నుంచీ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నేనంటే ఇష్టంగా ఉండేది ఆ దంపతులకి. ఇల్లు దుకాణంకి ఉపయోగించేలా ఇంటి ముందు గదిని పెద్ద హాలుగా కట్టుకున్నాడు శేషయ్య. హాలుకి ఆ రోజుల్లో ఉండే మడతల తలుపులు పూర్తిగా తెరిస్తే దానిలో ఉన్న సరుకులతో సహా హాలంతా కనపడేది. ఆ రోజుల్లో ఆ దుకాణాన్ని కిరాణా దుకాణం అనే వాళ్లు. ఉప్పు, పప్పులు, బియ్యం తప్ప మిగతావన్నీ కొద్ది రాసుల్లోనే ఉండేవి. ముందు త్రాసు, దాని క్రిందే గల్లా పెట్టె ఉంచుకొని శేషయ్య ఒక ఎతె్తైన పీట మీద కూర్చునేవాడు. త్రాసు ప్రక్కనే ఒక గమేళా లాంటి దానిలో బెల్లం అచ్చులుండేవి. మా వీధిలో వాళ్లంతా దాదాపుగా అతని దుకాణంలోనే సరుకులు కొనేవాళ్లు. చుట్టుపక్కల పాకల్లో ఉండే వాళ్ల పిల్లలు వచ్చినప్పుడల్లా బెల్లం ముక్క పెట్టమనేవాళ్లు. పాపం శేషయ్య వాళ్ల కోరిక తప్పకుండా తీర్చేవాడు. పిల్లల మీద ప్రేమో లేక బెల్లం ఆ రోజుల్లో కారుచౌకో నాకు తెలియదు కానీ, బెల్లం ముక్కలు పంచటానికి అతను ఏ మాత్రం విసుక్కునేవాడు కాదు.
నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయినా, నన్ను వాళ్లు ‘రాజు బాబు’ అని ముద్దుగా పిలుచుకునే వాళ్లు. చిన్నతనంలో నేను శేషయ్య పక్కనే కూర్చొని అతని వ్యాపార సరళి చూస్తూండేవాణ్ణి. కానీ నేనెప్పుడూ అతన్ని బెల్లం ముక్క ఇవ్వమని అడగలేదు. అందుకేనేమో, మా అమ్మ నన్ను ఏవైనా సరుకులు తెమ్మన్నప్పుడు బెల్లం కాకుండా చిన్న సీసాల్లో ఉన్న ఎండు కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష ఇచ్చేవాడు. వాటిని, ఏలక్కాయలు, లవంగాలు తూచేందుకు వేరే చిన్న స్టీలు త్రాసు ఉండేది. పప్పులు, ఉప్పు శేర్లల్లో కొలిచేవాడు. చింతపండు, బెల్లం, నూనెలు వీశ, అరవీశ, సవాసేరులలో తూచేవాడు. సంవత్సరాని కొకసారి నాకు జ్వరం వచ్చినప్పుడు, శేషయ్య, అతని భార్య పనిగట్టుకొని నన్ను చూడటానికి వచ్చేవాళ్లు. అప్పుడు శేషయ్య తన దుకాణంలోని ఎండు ఆల్బకర తెచ్చి ‘రాజు బాబూ, ఇవి చప్పరించు, నోరు బాగుంటుంది’ అనేవాడు. దీపావళికి తను తెచ్చుకున్న మందు గుండు సామానులు నా చేతే కాల్పించేవాడు. అది వాళ్లకి నా మీద ఉన్న ప్రేమ.
ఇక అతని వేష భాషల్లోకి వస్తే, మనిషెప్పుడూ గోచీ పోసిన పంచెకట్టుతో, పెద్ద జేబుతో మోకాళ్ల వరకూ ఉండే తెల్లని ఇస్ర్తి చొక్కా వేసుకునేవాడు. పొట్టిగా ఉన్నా భారీ శరీరం మాత్రం కాదు. డైనమో అమర్చిన హంబర్ సైకిల్ ఉండేది. రోజూ దాన్ని శ్రద్ధగా తుడుచుకునేవాడు. పెద్ద మూటలు కాకపోతే మిగతా సరుకులన్నీ ఆ సైకిల్ మీదే వన్‌టౌన్ వెళ్లి సంచులతో తెచ్చుకునేవాడు. అయిదవ తరగతి వరకూ నా చదువు ఇంట్లోనే కనుక ఎక్కువ కాలం వాళ్లింట్లోనే ఉండేవాణ్ణి. ఆ వీధిలోనే ఉన్న అతని తమ్ముడు పిల్లలు వీళ్లింటికి వచ్చారంటే వాళ్ల అల్లరి భరించలేక, ‘చూడండి, రాజుబాబు ఎంత నెమ్మదిగా ఉంటాడో. అతన్ని చూసి నేర్చుకోండి’ అంటూ వాళ్లని కసిరేవాడు. ప్రతి సంవత్సరం నా స్కూలు పరీక్షా ఫలితాలు వచ్చిన రోజున తప్పనిసరిగా అడిగేవాడు. ‘నాకు పార్టీ ఏమిస్తావు?’ అని. ఆ రోజుల్లో అలా మాటలు చెప్పుకోవటమే కానీ, పార్టీలన్నవి నాకు గుర్తున్నంత వరకూ లేవు. ఎవరో కాస్త బాగా స్థితిపరులు పిల్లలకి పార్టీ చేసుకోమని డబ్బులిచ్చేవారు. అలా నా అయిదవ తరగతి క్లాసులో ఒకసారి మాత్రమే ఒక పార్టీకి వెళ్లాను. శేషయ్య, ఆయన భార్య సినిమాకి వెడితే, దుకాణం కట్టేశాక రెండవ ఆటకి మాత్రమే వెళ్లేవాళ్లు. అది ఎంత దూరమైనా నడుస్తూనే వాళ్లతో పాటు నన్ను కూడా తీసుకెళ్లారు. అలా వాళ్లతో చాలా సినిమాలే చూశాను. నవరాత్రులకి కనకదుర్గ కొండ మీద జరిగే హరికథలకి కూడా వెంట తీసుకెళ్లారు.
వాళ్లింటికి వెనుక పక్క ప్రత్యేకంగా ఇంకొక వాటా నిర్మించాడు శేషయ్య. దాన్ని మంచి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే అద్దెకిచ్చేవాడు. కచ్చితంగా అద్దె వస్తుందనేమో. అతను గానీ, భార్యగానీ ఎవరితోనూ అద్దె విషయంలో గొడవ పడటం చూడలేదు. భార్యాభర్తలిద్దరూ కూడా పేచీకోరులు కాదని నాకు గుర్తున్నంతవరకూ తెలుసు. ఒకసారి శేషయ్య నాతో అన్నాడు కూడా. ‘మా వెనుక భాగంలోకి మారమని మీ నాన్నగారికి చెప్పు. అప్పుడు నువ్వెప్పుడూ మా ఇంట్లోనే ఉండొచ్చు’ నేను కాలేజీలోకి ప్రవేశించాక చదువుకోవలసినది బారెడు. కాబట్టి వాళ్లింట్లోకి, దుకాణంలోకి వెళ్లి కూర్చోవటం తగ్గించాను. అప్పటి నుంచీ నేను పెద్దవాడినయ్యాననేమో శేషయ్య భార్య నన్ను ‘రాజు బాబుగారూ’ అంటూ సంబోధించేది.
ఆ రోజుల్లోనే శేషయ్య ఇంటి వెనుక భాగంలోకి ఒక బ్యాంకు ఆఫీసరుగారు వచ్చారు. ఆయన ముస్లిం. అయినా ఆయన ఒక బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం చేత, అప్పటి నుంచీ ఇంట్లో వంట శాకాహారమేనని అందుచేత ఇంకే ఆలోచన లేకుండా ఆయనకి అద్దెకివ్వటానికి ఒప్పుకున్నానని శేషయ్య చెప్పాడు. వాళ్లకి ఒకే ఒక పుత్రికా రత్నం ఉండేది. ఆమె మల్లెపూవు వంటి ఛాయ కలిగి అందంగా ఉండేది. రోజూ ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక, భార్యని, ఆ అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్లేవాడు. ఆ సమయానికి నేను మా వాకిట్లో ఉంటే నా వైపు చూసి చిన్న నవ్వు నవ్వేది. అందుకు నాకు సిగ్గేసేది. అమ్మాయికి నా వయస్సే ఉండి ఉంటుందని అనుకున్నాను. శేషయ్య ఇంటికి వెళ్లినప్పుడు ఒకసారి నన్ను ఆ కుటుంబానికి పరిచయం చేశాడు. రజియా అనే వాళ్ల అమ్మాయిని కూడా పరిచయం చేస్తూ వాళ్లతో నా గురించి ఎంతో మంచిగా చెప్పాడు. అప్పుడూ సిగ్గుపడ్డాను. తల వంచుకునే నిలుచున్నాను.
సాధారణంగా నేను మా వరండాలో గేటు కెదురుగా కుర్చీలో కూర్చొని రోడ్డు మీద వచ్చేపోయే వాళ్లను చూస్తూ పుస్తకాలు చదువుకునేవాణ్ణి. ఒకరోజు దూరంగా ఎక్కడో పెళ్లి పందిట్లో నుంచి నాకెంతో ఇష్టమైన ‘్భయ్యా మేరే రాఖీకే బంధన్ కో నిభానా..’ పాట వినిపిస్తోంది. ఆ పాట నాకు చిన్నతనం నుంచీ ఎన్నిసార్లు విన్నా ‘నందా’తో సహా ఆ సన్నివేశం గుర్తుకొచ్చేది. పాటను వింటూ పుస్తకంలోంచి తల పైకెత్తాను. రజియా వాళ్ల ఇంటి సందు తలుపులోంచి ననే్న చూస్తూ నిలుచుంది. నేను తల పైకెత్తాక ఒక్క నిమిషం అలానే నిలుచొని తలుపేసుకుని వెళ్లిపోయింది. ఇంకొకసారి కూడా నేను చదువుకుంటున్న సమయంలో అలానే తలుపు దగ్గర నిలుచొని కాస్సేపు నన్ను చూసింది. ముస్లిం అయినా ఆమె దుస్తులు ఇంగ్లీషు దొరసానివిలా ఉండేవి. కేశాలను కూడా పొట్టిగా కత్తిరించుకుంది. తలుపు దగ్గర నిలుచొని నన్ను అలా చూసినందుకు బిడియపడ్డాను. కానీ అప్పటి నుంచీ ఎందుకో ఆమెని చూసినప్పుడల్లా ఆ పాటే గుర్తుకొచ్చేది. గుర్తే కాదు ఏదో తెలియని అనుభూతి కూడా ఏర్పడేది. ఆ అనుభూమి ఏమిటో కూడా నా మనసు వివరించలేక పోయేది.
ఒకసారి మా అమ్మని రజియా గురించి అడిగాను. ‘అమ్మా! నాకో చెల్లి ఉంటే రజియా లాగుండేదా?’ అని.
‘రజియా మంచి పిల్లరా.. నాకో కూతురు ఉంటే అల్లాగే వుండాలనిపిస్తుంది’ అన్నది. దానితో నాకు ఆమె అంటే ఇంకా వాత్సల్యం ఏర్పడింది.
కానీ, వాళ్ల అమ్మ? మన మతం కాదుగా? అనుకున్నాను. అయితేనేమి - నాకు ఆమె మీద ఉన్నది సోదరి భావమేగా. కానీ రోజులు దొర్లిపోయి రజియా ఒకటి రెండుసార్లు మా అమ్మ కోసం ఆమె రాంగానే నవ్వేసి - ‘అమ్మా!’ అని అమ్మని కేకవేసి అక్కణ్ణుంచి వెళ్లిపోయాను.
ఆ సంవత్సరమే డిగ్రీ పూర్తి చేసిన నేను పై చదువులకి విశాఖపట్నం వెళ్లే ముందు శేషయ్య దుకాణానికి వెళ్లి ఆ సంగతి చెప్పాను. అప్పుడే రజియా గురించి కూడా నోరు విప్పి మొదటిసారి శేషయ్యని అడిగాను. ‘మీ ఇంట్లో అద్దెకున్న అమ్మాయి రజియా చదువుకోవటానికి ఎక్కడికీ వెళ్లటం చూడలేదు, ఎందుకని?’
దానికి శేషయ్య అన్నాడు. ‘రాజు బాబు, క్రిందటేడాది మా ఇంట్లో అద్దెకి చేరే ముందే ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసిందట. మంచి తెలివి గలది కూడా. రజియాకి బ్యాంకు ఉద్యోగం ఇప్పించాలని చూస్తున్నారు’ అంతవరకూ నా వయస్సే ఉండచ్చు అనుకున్న ఆ అమ్మాయి సుమారు రెండేళ్లు నాకన్నా పెద్దదని తెలియటంతో నాకు ఆశ్చర్యం వేసింది. ‘అయితే.. నిన్ను మళ్లీ ఎప్పుడో చూడటం’ అన్నాడు విచారంగా. శేషయ్య నేను విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పినందుకు జవాబుగా. ‘ఇంకా కాలేజీ చదువే కదా? సెలవులు ఇచ్చినప్పుడు వస్తానుగా!’ అన్నాను.
ఆ పై వారమే విశాఖపట్నం వెళ్లిపోయాను. సెలవలకి వచ్చిపోతూ ఉన్నాను. వచ్చినప్పుడల్లా నన్ను చూడంగానే శేషయ్యలో, అతని భార్యలో ఆనందం తొణికిసలాడటం గమనించాను. ఒకసారి శేషయ్యతో అన్నాను. ‘రజియా ఇంకా పై చదువులేమన్నా చదువుతోందా’ అని. లేదని జవాబిచ్చాడు శేషయ్య. రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. నా చదువు పూర్తి అయిపోయింది. యూనివర్సిటీ వదిలేస్తున్నానని దిగులుగా ఉన్నా, రజియాని చూడబోతున్నాననే ఆనందం దాన్ని పోగొట్టింది. ఇంటికి తిరిగి వచ్చిన రోజే స్నానం చెయ్యగానే నేనే పని పనికట్టుకొని శేషయ్య ఇంటికి వెళ్లాను. ఎప్పుడూ నన్ను చూడగానే శేషయ్యలో కనిపించే మునుపటి ఆనందం నేను ఆ రోజు చూడలేదు.
‘ఏం, అలా వున్నావు?’ అడిగాను.
‘ఏమని చెప్పను రాజు బాబు. ఇంటి వెనుక ఆఫీసరుగారు ఈ మధ్యనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆయనకి హైదరాబాద్ బదిలీ అయింది’ ఆ మాటకి నేను కూడా ఉలిక్కిపడ్డాను. శేషయ్య ఇంకా అన్నాడు, ‘వాళ్లు ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ మేమిద్దరం రజియాని మా అమ్మాయిగానే చూసుకున్నాము. ఇప్పుడు ఆ అమ్మాయి లేకుండా రోజు గడపటం కష్టంగా ఉంది. దానికి తోడు నీ చదువూ అయిపోయింది. నువ్వూ ఇవ్వాళ కాకపోతే, రేపు ఉద్యోగానికి వెళ్లిపోతావు. ఆ అమ్మాయి మా ఇంట్లోకి వచ్చే వరకూ నిన్ను మా అబ్బాయిలా ఊహించుకున్నాము. ఇప్పుడు రజియాని కూతురిగా భావించాము. ఇప్పుడు మీ ఇద్దరినీ మేము విడువక తప్పటంలేదు. అందుకే బాధగా ఉంది’ బాధపడుతూ అన్నాడు శేషయ్య. అతని కళ్లలో నీరు చూశాను. ఇంతలో శేషయ్యకి ఏదో గుర్తుకు వచ్చి, ‘రాజు బాబు రజియా వెళ్తూ ఏదో నీకిమ్మని చెప్పి ఇచ్చింది. తెస్తాను ఉండు’ అని లోపలికి వెళ్లి గిఫ్ట్ ప్యాక్ చేసిన పుస్తకం లాంటి దాన్ని తెచ్చి ఇచ్చాడు. వెంటనే ఆత్రంగా ప్యాక్ చించి చూస్తే అది ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ నవల. దాని లోపలి పేజీలో ముత్యాల లాంటి దస్తూరితో ఇలా వ్రాసి ఉంది.
‘ప్రియమైన తమ్ముడు రాజుకి ఆశీర్వచనాలతో - సోదరి రజియా’ కాస్సేపు నా నోటి నుంచి మాట రాలేదు. రజియా అనుకోకుండా అందజేసిన గిఫ్ట్‌తోపాటు, నన్ను తమ్ముడని సంబోధించటంతో, ఇది వరలో రజియా నన్ను రెండుసార్లు అదే పనిగా చూసినప్పుడు నాలో కలిగిన అనుభూతికి అర్థం పూర్తిగా తెలిసొచ్చింది.
‘శేషయ్యా! నీకే కాదు, నాకూ బాధగానే ఉంది. నువ్వు రజియాని మీ కూతురిలా ఊహించుకుంటే, నేను నాకూ అలాంటి అక్కయ్యో, చెల్లెలో ఉంటే ఎంతో బాగుండేదనిపించింది. మనిద్దరి ఆలోచనలకి తగ్గట్టుగానే రజియా కూడా మన మధ్య ఒక గట్టి సంబంధం స్థిరపరచుకొని మరీ వెళ్లింది. రజియా మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్లినందుకు నీలాగే నేనూ బాధపడుతున్నాను. జీవితాల్లోని మమతానురాగాలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని నేను నీకు చెప్పేంత వాడిని కాను. ఎవరి మనసుల్లో ఎలాంటి మమతలు దాగి ఉంటాయో నాకిప్పుడే అర్థమయింది..’ అన్నాను.
నా మాటలకి ఆశ్చర్యపోతూ శేషయ్య నిలుచుండిపోయాడు నా ముఖంలోకి చూస్తూ. ఇంకా అన్నాను. ‘నీకు పిల్లలు లేరని బాధ పడుతుండేవాడివి. ఉన్నారే అనుకో, వాళ్లు కూడా ఇంతేగా. ఒక వయసొచ్చిన తరువాత తల్లిదండ్రులని విడిచి వాళ్ల జీవితాలు నడిపించే విధంగా వెళ్లిపోవలసిందే కదా!’ ఆ వయసులో నేనన్న తాత్వికతతో కూడిన మాటలకి నాకే ఆశ్చర్యమేసింది.
‘ఎంత బాగా చెప్పావు, రాజు బాబు! నిజమే, నీ మాటలు విన్నాక నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. నిజమే, మాకు తోడుగా మీ అమ్మా, నాన్నలకి కూడా ఇదే సమస్య ఎదురవబోతోంది కదా!’ అని శేషయ్య అంటుంటే, వెళ్లొస్తానని చెప్పి, అక్క చూపే మమతని మొదటిసారిగా అందించిన రజియాని కూడా చూడటం ఇక ముందు వీలు కాదు అనే బాధతో వెనుదిరిగాను.
... నిజమే.. మతం వేరవుతేనేమోయ్.. మనసులొకటై మనుషులుంటే.. ‘అక్కా’ అని రజియాని నేను.. ‘అరే.. ఛోటా బాయ్’ అని రజియా నన్ను పిలుచుకుంటూ మళ్లీ మమతలెరిగిన బాల్యం అంచులు చూసేవాళ్లం కదా!.. మమతానురాగాలు మనసుల్ని దగ్గర చేస్తాయి. మమతల మంజుల గీతం వెంటాడుతూనే ఉన్నది.
=====================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

- భీమేశ్వరరావు వేమవరపు