నేను స్నేహాన్ని...
Published Saturday, 10 August 2019-1-
నేను స్నేహాన్ని
నిన్నటి వాస్తవాన్ని
వర్తమాన ఇజాన్ని
రేపటి సత్యాన్ని.
-2-
నేను స్నేహాన్ని
ఏకవచన బంధాన్ని
వీడని నీడను
నీ-నా ల పిలుపును.
-3-
నేను స్నేహాన్ని
జీవిత సింహాసనాన్ని
మనసెరిగిన వౌనాన్ని
మరపురాని గమనాన్ని
-4-
నేను స్నేహాన్ని
కంటిపాప దృశ్యాన్ని
కనుదోయి ఆనందాన్ని
కనురెప్పల అనురాగాన్ని
-5-
నేను స్నేహాన్ని
చీకటి వెలుగుల చెలిమిని
సూర్యచంద్రుల వెలుగును
నిన్న రేపుల మెరుగును
-6-
నేను స్నేహాన్ని
అక్షర అక్షర బంధాన్ని
పద పద ప్రబంధాన్ని
భాష యాసల అనుబంధాన్ని
-7-
నేను స్నేహాన్ని
నింగీ నేలల చెలిమిని
ఉరుము మెరుపుల సఖ్యాన్ని
ద్వితీయం కాని అద్వితీయాన్ని
-8-
నేను స్నేహాన్ని
జీవ నదిని
జీవన నాడిని
జీవిత ఉరవడిని
-9-
నేను స్నేహాన్ని
హృదయ లయని
శుద్ధత్వ చలమని
సిరా ధమనుల చెలిమిని
-10-
నేను స్నేహాన్ని
అమ్మ స్నేహాన్ని
అమ్మ స్నేహం
అమూల్యం.
-11-
నేను స్నేహాన్ని
నాన్న స్నేహాన్ని
నాన్న స్నేహం
అనితరం
-12-
నేను స్నేహాన్ని
అమ్మా నాన్నల స్నేహాన్ని
అమ్మా నాన్నల స్నేహం
అమృతం
-13-
నేను స్నేహాన్ని
ఆలుమగల స్నేహాన్ని
ఆలుమగల స్నేహం
అద్వితీయం.
-14-
నేను స్నేహాన్ని
కష్టనష్టాల ఓర్మిని
పుటక మాధుర్యాన్ని
-15-
నేను స్నేహాన్ని
లాభ నష్టాల ధర్మాన్ని
జీవన గరిమని.
-16-
నేను స్నేహాన్ని
సంసార బంధాన్ని
అర్ధనారీశ్వర తత్వాన్ని
-17-
నేను స్నేహాన్ని
మనసు హృదయ వారధిని
సజీవ తత్వాన్ని.
-18-
నేను స్నేహాన్ని
బడి ఒడిని
జీవిత పాఠాన్ని.
-19-
నేను స్నేహాన్ని
చిన్ననాటి స్నేహాన్ని
చెలిమి విలువని.
*
-20-
నేను స్నేహాన్ని
అమ్మాయి అబ్బాయి పిలుపుని
చెరగని సంతకాన్ని.
-21-
నేను స్నేహాన్ని
గురువు పాఠాన్ని
గురు వందనాన్ని.
-22-
నేను స్నేహాన్ని
వయసు బంధాన్ని
మనసు సంస్కారాన్ని.
-23-
నేను స్నేహాన్ని
అణుకణ సంయోగాన్ని
రూప జగతిని.
-24-
నేను స్నేహాన్ని
పసి హృదయ పసిమిని
వసివాడని పసిడిని
-25-
నేను స్నేహాన్ని.. అభేద చెలిమిని
అసమాన శక్తిని.