S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆశ్రమం

సెల్ మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కల్యాణికి వినబడింది. ఇప్పుడింకా ఉసూరుమంటూ ఆఫీసు నుండి వచ్చింది. ఎక్కడివక్కడే పడేసి ఉదయం హడావిడిగా బయలుదేరింది. అవి సర్దుకుంటూ రాత్రి వంటకు మొదలుపెట్టబోతూ ఉండగా ఈ ఫోనొకటి. వదిలించుకోటానికి పదిహేను నిమిషాలయినా అవుతుంది అని విసుక్కుంటూ నంబరు చూసి ఇంటికి రాబోతూ ఫోనెందుకు చేశారు అనుకుంటూ ‘ఏమిటండీ అంత అర్జంటు?’ అంది విసుగును దాచుకుంటూ. ‘మరేం లేదు. మనిద్దరికీ నచ్చిన ఏరియాలో మంచి ఫ్లాట్ అమ్మకానికి ఉందట. చూసి వద్దామని మన చలపతి అన్నాడు. రావటం ఆలస్యం అయితే కంగారు పడతావని చేశాను’ అన్నాడు శ్రీహరి.
మొదట విసుగనిపించినా ఫ్లాట్ కొనడానికి సిద్ధమవుతున్న శుభవార్తకు పొంగి పోయినా పొంగు మీద నీళ్లు చిలకరించినట్లు అంతే త్వరగా కుంగిపోయింది. ఎంత తక్కువ అనుకున్నా ఫ్లాట్‌లో అడుగుపెట్టేసరికి కోటి రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. బాబుకు ఖరగ్‌పూర్‌లో సీటొచ్చిందని చేర్పించారు. అమ్మాయి ఇంటర్ సెకండియర్. కోచింగ్ ఖర్చులు ప్లస్ పెళ్లి ఖర్చులు అబ్బో! ఉగాది ఫలితాల్లో చెప్పినట్టు ఆదాయం రెండు ఖర్చులు పనె్నండు తప్పదేమో! ఇలా ఆలోచిస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది.
అప్పుడే లావణ్య వచ్చే సమయమయిందా అనుకుంటూ తలుపు తీసి అనాలోచితంగా ‘ఇంత త్వరగా వచ్చావేం చిన్నూ’ అంది. ‘అదేమిటమ్మా అలాగంటున్నావ్? రోజూ కంటే అరగంట ఆలస్యం అయింది. ఎక్స్‌ట్రా క్లాసా అని అడుగుతావనుకుంటే త్వరగా వచ్చానంటున్నావ్’ అంది ఆశ్చర్యం.
అంతలోనే ‘నాన్న ఇంకా రాలేదా?’ అంది. లేదని చెబుతూ ఫోను వివరాలన్నీ చెప్పింది.
‘అందుకన్నమాట టైం తెలియనిది. సరే నాకు ఆకలవుతోంది. అన్నం పెట్టేయ్యమ్మా’ అంటూ బాత్రూంలోనికి వెళ్లింది.
అమ్మాయికి వడ్డించి భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. దాదాపు పదకొండు గంటలవేళ శ్రీహరి వచ్చాడు. భోజనం చేస్తూ కొనబోయే ఫ్లాట్ వివరాలను చెబుతూ ‘అయితే మన అంచనాలకు మించి పోతుందేమో’ అంటూ ఇంకా ఏదో చెబుతూ ఉండగా ‘రేపెలాగూ ఆదివారమే కదా’ అంటూ పడకటింటి వైపు దారితీసింది కళ్యాణి.
తీరికలేని పనులతో అలసిపోయిన ఆమెకు వెంటనే నిద్ర పట్టింది.
అయితే శ్రీహరికి మాత్రం నిద్ర పట్టలేదు. ఇల్లు చూసినంత సేపు గాలిలో తేలిపోయినట్లనిపించింది. తీరా ఖరీదు విన్నాక గుండెల్లో రాయిపడ్డా ఎలాగయినా కొని తీరాలన్న ఆలోచన మాత్రం పోలేదు. పోనీ లోన్ తీసుకుందామంటే కుదిరే పని కాదు. మళ్లీ కల్యాణి ఆలోచనలే తనకూ వచ్చాయి. ఎక్కడా డబ్బు పుట్టే మార్గమే దొరకటంలేదు. ఔను అలా చేస్తే.. ఎందుకో ఆ తలంపునకే తలకొట్టేసినట్లయింది. అలా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే ఎప్పుడో నిద్ర పట్టింది. ఆదివారమయినా పనులు ఎప్పటల్లే చేసుకుంటే విశ్రాంతిగా ఉండొచ్చని కల్యాణి భావన. ఫిల్టర్ వేసేసరికే లేచే భర్త ఇంకా లేవకపోవటంతో తనకు మాత్రమే కాపీ తెచ్చుకొని తాగుతూ రాత్రి సంగతులే మననం చేసుకుంటూ ఉండగా శ్రీహరి లావణ్య ఇద్దరూ లేచారు. వారికి కాఫీలందించింది.
‘నాకయితే ఆ ఇల్లు వదులుకోవటం ఇష్టం లేదు. లోన్ తీసుకుంటే పిల్లల చదువుకు సిబ్బంది. అందుకే రాత్రంతా బాగా ఆలోచించి..’ అంటూ సగంలో ఆగిపోయాడు.
‘ఊ..! కొనడం మానేద్దామా?’ అన్నది కల్యాణి.
‘కాదనుకో! ఓ మూడు నెలల గడువివ్వమని.. ఊళ్లో ఇల్లమ్మి డబ్బు తెస్తానని చెప్పాను’ అన్నాడు.
‘అంతే అత్తమామల్ని..’
‘ఆ ఇల్లు అమ్మమని అడుగుదామనుకుంటున్నా’ అన్నాడు.
‘వాళ్లకు మనం పైసా పంపటం లేదు. వాళ్ల స్వార్జితాన్ని అమ్మమని అనటం నాకు నచ్చలేదండీ’
‘అదే నేనూ అనుకుంటూ ఉన్నాను’
ఇంకా ఇలా ఏవేవో పొడిపొడి మాటలతో సంభాషణ ముగిసింది.
రోజులు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదు.
అయితే అనుకున్న కుదుపు తమ్ముడు శ్రీ్ధర్ నుండి వచ్చింది. తన సమస్యే అతడిది. పోతే తామిద్దరూ ఉద్యోగులే కనుక అష్టకష్టాలు పడి కొనే సాహసం చేయొచ్చు. తమ్ముడొక్కడే ఉద్యోగి. అందుకే ఇంటి ప్రస్తావన తెచ్చి నాన్నగారికి ఆ ఇల్లు అమ్మమని అడుగుదామా’ అన్నాడు తనను కలుపుకుంటూ.
ఇక్కడ వాళ్ల అమ్మానాన్నలయిన సుబ్బావధాని, సుమిత్రమ్మల గురించి కొద్దిగా తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఇద్దరూ డెబ్బై ఏళ్లు దాటినవారే. సుబ్బావధానికి కొంచెం చదువు వొంటబట్టింది. అందుకే యస్‌యస్‌యల్‌సి అయిపోగానే టీచర్ ట్రైనింగ్ అయి సమీప గ్రామంలోనే టీచర్‌గా చేరాడు. వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యాన్ని గుడి అర్చకత్వాన్ని తమ్ముడికి వదిలాడు. సుమిత్రమ్మ నేపథ్యం కూడా దాదాపు అలాటిదే. అర్థాంతరంగా తండ్రి చనిపోతే ఒక చెల్లి, తమ్ముడు, తల్లిని చూసుకోవాల్సిన భారం ఆమె మీదే పడింది. ఆనాటి కాలంలోని ఎయిత్ స్టాండర్డ్ అన్న బోర్డు సర్ట్ఫికెట్ ఉన్న సుమిత్రమ్మను ట్రైనింగ్ అయి టీచర్‌గా చేరొచ్చని సలహా ఇవ్వటమే కాకుండా ఆ పరోపకారి అదే ఊళ్లో ఆమెకు పోస్టింగ్స్ ఇప్పించాడు. ఆ కాలానికే అలా హయ్యర్ గ్రేడ్ టీచరయింది. అలా ఇద్దరూ ఒకే బడిలో టీచర్లు. రెండు మూడేళ్లలో చెల్లి తమ్ముడి బాధ్యతలు కూడా తీరిపోయాయి. అప్పటి పెద్దలడిగే అన్ని అర్హలతోపాటు పాడిగేదె లాంటి నెల జీతం తెచ్చుకునే అదనపు అర్హతను చూచి పెద్దలే పెళ్లి ఆలోచన తెచ్చి పెళ్లి చేశారు.
ఇద్దరూ పేదరికపు రుచి ఎరిగిన వారే కనుక తమ పిల్లలకు లోటు లేకుండా జీతాలు పెరిగినప్పుడల్లా అంతో ఇంతో వెనకేసుకొని జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కొన్నారు. మేడ కట్టించారు. ఇద్దరి కొడుకులకు చెరో వాటా అని వాళ్ల ఉద్దేశం. అమ్మాయిని తమలాగే టీచర్‌ని చేసి ఓ అయ్య చేతిలో పెట్టి నిశ్చింతగా రిటైర్ అయ్యారు. వందల జీతానికి రిటైర్ అయినా వేల పెన్షన్ అందుకుంటున్నారు. నిమ్మళమైన జీవితం వలననో వారసత్వం వల్లనో ఈనాటికీ ఈనాటి వారిని వేధించే బి.పి. షుగర్లు వారి దరి చేరలేదు. లేని రోజు చేయి చాచలేదు. ఉన్ననాడు మిసిడిసిపడటం లేదు. ఇదీ క్లుప్తంగా శ్రీహరి అమ్మా నాన్నల స్థితిగతులు.
ప్రస్తుతం శ్రీహరికి అమ్మానాన్నలు కొన్న ఇల్లు అమ్మితే తప్ప డబ్బు సమకూరే అవకాశం లేదు. అయితే మొదటి నుంచి అమ్మానాన్నల శ్రమను గుర్తించటం చేత ఇల్లు అమ్మి మాకు డబ్బు సమకూర్చమని అడిగే సాహసం చేయటానికి సతమతమవుతూ ఉండగా తమ్ముడే ఆ ప్రసక్తి తెచ్చాడు. అయితే ఇప్పటి పరిస్థితి మరీ బిగుసుకు పోయింది.
తను అడగలేడు. తమ్ముడిని వద్దని వారించలేడు. పొరబాటున వారించినా ఇద్దరు జీతగాళ్లకు ఒంటి జీతగాళ్ల ఇబ్బందులేం తెలుస్తాయి అని సాధిస్తాడు. ఈ ఆలోచనలతోనే మరో వారం గడిచిపోయింది. గడువు దగ్గర పడుతూ ఉంది.
ఈలోగా అమ్మానాన్నల నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అక్కయ్యకు సెలవులు కదా. ఓ పది రోజులుండి పొమ్మని కబురు పెట్టాను’ అన్నాడు సుబ్బావధాని.
‘అదేమిటి నాన్నా దానికి నా అనుమతి కావాలా?’
‘అది కాదురా. శ్రీ్ధర్‌ను రమ్మని చెబితే వాడి పిల్లలకు పరీక్షలున్నాయి అవి ముగిశాక వీలు చూసుకొని వస్తానని అన్నాడు. మరి నీ పిల్లలు అదే సుబ్బడు లావణ్యలకు వచ్చే వీలుంటుందా?’
‘సుబ్బడి సంగతి తెలియదు కానీ లావణ్య రాగలదు. ఔనూ ఎందుకు నాన్నా అందరినీ రమ్మని అంటున్నావు? అమ్మకు బాగాలేదా?’
‘అదేంట్రోయ్ ఇద్దరం పిడిరాళ్లల్లే ఉన్నాం. సరే కానీ మీరు ఎప్పుడొచ్చేది చెబితే వాళ్లిద్దర్నీ అదే వేళకు రమ్మని చెబుదామని ఫోను చేశాను’ అన్నాడు.
శ్రీహరి కెందుకో ‘మా అంత్యకాలం సమీపించింది రండి’ అన్నట్లనిపించింది.
కళ్యాణి, శ్రీ్ధర్‌లను సంప్రదించుకొని మరో వారానికల్లా అందరూ అమ్మా నాన్నల వద్దకు చేరారు. అనుకున్నట్లే అక్కయ్య సకుటుంబ సపరివార సమేతంగా వచ్చింది. ఇల్లంతా సందడి సందడిగా ఉన్నా మనసులో మాత్రం శూన్యం ఆవహించింది శ్రీహరికి.
కళ్యాణి, శ్రీ్ధర్ భార్య సురేఖ అక్క పిల్లలు అందరినీ కూచోబెట్టి వెనుకటి పెళ్లి రోజుల్లోని పంక్తి భోజనాలు మాదిరి వడ్డించారు. ఏకకాలంలో పాతికమంది కూచుని తినే ఈ హాలొక్కటే చాలు తను కొనబోయే ఫ్లాట్‌కు అనుకున్నాడు శ్రీహరి.
‘్భజనాలయ్యాక మీ అందరితో ఓ మాట చెప్పాలని పిలిపించానర్రా’ అన్నాడు సుబ్బావధాని.
శ్రీ్ధర్ అన్న వంక చూశాడు.
‘కొంపదీసి ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చాడా ఇంటిని?’ అన్నట్లనిపించింది శ్రీహరికి.
అన్న చూపులు చూసి ‘ఆయన స్వార్జితం. ఆయనిష్టం’ అన్నట్లనిపించింది శ్రీ్ధర్‌కు.
‘మా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు అమ్మా నాన్నలు. వారిచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే నాకు’ అన్నట్లున్నాయి అక్క చూపులు.
‘మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియకుండా పోతోందండి. పిల్లలూ మీరేం కంగారు పడకండి. అన్నీ మీకందరికి ఇష్టమైనవే చేశాను. నెమ్మదిగా తినండి. బాగా విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు’ అంటూ భర్త నోరు మూయించింది సావిత్రమ్మ.
‘శ్రీహరీ నీ కొడుకు ఇప్పుడు నీ దగ్గర లేడు కదరా’ అన్నాడు సుబ్బావధాని ఏమీ తోచనట్లు.
‘ఔను నాన్నా! ఖరగ్‌పూర్ ఐఐటిలో సీటొచ్చింది. వదులుకోవటమెందుకని ఖర్చులు కాస్త ఎక్కువయినా సర్దుకొని చేర్పించాము’ అన్నాడు.
ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే శ్రీ్ధర్ అందుకొని ‘ఆ మధ్య ఫ్లాట్ కొనాలనుకున్నావు కదా అన్నయ్యా! మరి దాని గురించేం చెప్పలేదేం మళ్లీ’ అన్నాడు.
శ్రీహరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి తమ్ముడెదురుగా బయటపడటం ఇష్టంలేక ‘నాకు మీ వదినకు దగ్గరలో ఓ ఫ్లాటుందట. ధరలు మాకు అందుబాటులో ఉందో లేదో తెలిశాకే చూద్దామని అనుకుంటున్నాను’ అని చిన్న అబద్ధం ఆడాడు.
‘్ఫ్లట్ కొనబోతూ ఉన్నాను. ఇక్కడి ఇల్లు అమ్మకానికి పెట్టండి’ అని అంటాడేమో అని ఎదురుచూస్తున్న శ్రీ్ధర్‌కు ఒళ్లు మండిపోయింది. తానేమో శ్రీరామచంద్రుడిలాగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకోవాలన్న కీర్తికండూతి కనపడింది అన్నలో శ్రీ్ధర్‌కు.
అయినా దూకుడు తగ్గించుకొని ‘అదేంటన్నయ్యా అలా అంటావ్? నాన్న దగ్గర మొహమాటాలేమిటి? అడిగితే సాయం చెయ్యరా?’ అన్నాడు.
‘ఒరే శ్రీ్ధర్! నీకింకా చిన్నతనం దూకుడు పోలేదురా తండ్రి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కొడుకులు తండ్రి దగ్గర చేయి చాచుతాడటరా?’ అన్నది సుమిత్రమ్మ.
అన్నదమ్ములిద్దరి గుండెల్లోనూ రాయి పడింది. తల్లిదండ్రులిద్దరి నుంచి పైసా రాలదని అర్థమయ్యాక పెట్టే బేడా సర్దుకోవటమే మేలన్న ధోరణిలో సంభాషణ దారి మళ్లిస్తూ ‘నీకు తిరిగి వెళ్లటానికి ఎప్పటికి రిజర్వేషన్ అయింది?’ అన్నాడు శ్రీహరి.
‘ఇప్పటికే నాలుగు రోజులయింది కదా బావగారూ మళ్లీ అవసరానికి సెలవులుండాలి కదా! అందుకే ఎల్లుండి రాత్రికే రిజర్వు చేశారు’ అన్నది శ్రీ్ధర్ తరఫున సురేఖ.
‘దమ్మిడీ ఆదాయం లేని చోట చాకిరి చేయలేను బాబూ’ అన్న ధ్వని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది.
‘సరేగానీ అమ్మాయ్. మా ఇద్దరి విషయాలు శ్రద్ధగా విని మీరనుకున్నట్లుగానే వెళ్లిపోవచ్చు. ఇప్పటికి రెండు ఆశ్రమాలు చూశాను. ఇక మూడో...’ సుబ్బావధాని మాటలు పూర్తి కాకముందే ‘ఆశ్రమంలో ఉంటున్నారా?’ అన్నారందరూ కోరస్‌గా.
సుబ్బావధాని పకపక నవ్వటం మొదలుపెట్టాడు.
ఎవ్వరికీ ఏమీ అర్థంకాక కంగారుగా ‘అదేమిటమ్మా నాన్న అలా నవ్వుతున్నారు? ఆరోగ్యం బాగా లేదా ఏమిటి?’ అన్నారు.
‘మీ మొహం. ఆయనకేమయిందిరా నిక్షేపంగా ఉన్నారు. మీ వెర్రిబాగులతనానికి నవ్వుతున్నారు. మీ బతుకులకు ఆశ్రమాలంటే ఓల్డేజ్ హోంలే గుర్తుకు వస్తాయి మరి. అది మీ తప్పు కాదులే!’ అన్నది సుమిత్రమ్మ.
‘మరేమిటత్తయ్యా!’ అన్నారిద్దరు కోడళ్ళు.
‘చూడండమ్మా మన హైందవ ధర్మంలో నాలుగు ఆశ్రమాలున్నాయి.

మొదటిది..’ అని సుబ్బావధాని చెప్పేలోగానే సుమిత్రమ్మ అందుకొని ‘బ్రహ్మచర్యం. అంటే మీ మా మామగారు తాళి కట్టక ముందుదన్నమాట. నన్ను కట్టుకున్న తర్వాత గృహస్థాశ్రమం. మూడవది వానప్రస్థము. అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక గడపవలసిన జీవనం. నాలుగవది సస్యాసాశ్రమం. చివరిది అందరికీ తెలిసినదే. మూడవదయిన వానప్రస్థం. అంటే నారచీరలు ధరించి అడవిలో రాలిపడిన కాయో, పండో తిని జీవించటమన్న మాట’ అంటూ మళ్లీ మొదలుపెట్టింది.
‘అది మేమెలాగూ చేయలేం. ప్రతి తరానికి అంతరం నిరంతరం సాగే ఒక ప్రక్రియ. అందులో మార్పులు సహజమే. ఆ మార్పుల కనుగుణంగా మనమూ మారితే ఘర్షణలకు చోటుండదు. అలాటి మార్పులను అంగీకరించలేని తల్లిదండ్రులు తాము కన్న బిడ్డలనే కర్కోటకులుగా చూపుతున్నారు. తల్లిదండ్రులు హీరోలు. పిల్లలు విలన్లుగా మారిపోతూన్నారు చూసే వారి దృష్టిలో. అందుకే...’ అని ఇంకా ఏదో చెప్పబోతున్న సుమిత్రమ్మతో ‘నాకొ కొంచెం మైక్ ఇవ్వవే’ అన్నాడు సుబ్బావధాని.
‘కొంచెమేం ఖర్మ. అంతా మీరే తీసుకోండి’ అంది నవ్వుతూ.
‘ఉదర పోషణకు పెన్షన్ మాత్రమే కాక అంత్యేష్ఠికి కావలసిన సొమ్మూ ప్రభుత్వమే ఇస్తూ ఉంది. అందుకే ఇక నుంచి మీ అమ్మ నేను ఆధ్యాత్మిక జీవనం గడపటానికి కాశీని ఎంచుకున్నాం. మీతో మాట మాత్రమైనా సంప్రదించకుండా ఇంటిని అమ్మి ఆ డబ్బు మీ ముగ్గురికి సమాన వాటాలు వేశాను. అలాగే మీ అమ్మ కూడా తన వెండి బంగారం నగదు కూతురికే కాకుండా కోడళ్లూ మరో అమ్మ కన్నకూతుళ్లేనని ముగ్గురికీ సమానంగా పంచింది. మరో పది రోజుల్లో కాశీకి వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాము. మీకు వీలుంటే వీడ్కోలు చెప్పటానికి రండి. మీకింకా ఏమైనా సందేహాలుంటే ఈ పది రోజుల్లోగా ఫోన్ చేసి కనుక్కోండి. ఇది మాకై మేమే ఎంచుకున్న వానప్రస్థం’ సుబ్బావధాని మాటలు పూర్తి అయ్యేసరికి అందరూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు.
కాసేపయ్యాక శ్రీహరి అందరి తరఫునా ‘నాన్నా మీ ప్రయాణం మరో పది రోజులు వాయిదా వేసుకోగలరా?’
‘ఎందుకురా?’ అన్నారిద్దరూ.
‘మేం మరో ఇరవై రోజులు ఇక్కడే ఉంటాం. సుబ్బడిని రమ్మంటాను’
‘మరి మీకు సెలవులు? జీతం నష్టం కాదూ!’
‘ఆ జీతం నష్టం కావచ్చు నాన్నా! ఇంత మంచి జీవితాన్ని నష్టం చేసుకోదలచుకోలేదు నాన్నా’ అంటూ ‘మీ అందరూ ఏమంటారు?’ అన్నట్లు చూశాడు శ్రీహరి. అందరి కన్నులలోనూ ఒకే భావం.
===========================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఆయి కమలమ్మ.. 9912 333312