నేను విశ్వ రచనను...
Published Saturday, 17 August 2019-1-
నేను విశ్వ రచనను
*
కృష్ణబిల గర్భకోశ
చీకటి అణువున
స్వపరిణామంగా కాంతికణం
శూన్యతన పుట్టుకొచ్చిన కాంతి కిరణం.
చీకటి వెలుగుల సంయోగాన
ఆద్యంత రహితంగా
విస్తరిల్లిన వాయు గగనం
ఆకాశిక ప్రకృతిగా వాయు వలయం
ఘనీభవించిన వాయుసాంద్రతన
ఇబ్బడిముబ్బడైన కాంతికణాలు
పాలపుంతలైన నక్షత్ర వెలుగులు
సృష్టి ప్రవృత్తికి సందడించిన తారాతోరణం.
గ్రహమండలాలుగా సౌర కుటుంబం
ఆదాన ప్రదాన సంబరంలో గ్రహశక్తులు
సమీకరణల మార్పులో గ్రహప్రకృతులు
విస్తరణకు సిద్ధమైన వాయుగగనం
ఖగోళ ధూళిధూసరిత సాంద్రతలంగా
రూపుదాల్చిన భూగ్రహ గోళం
వాయుసాంద్రత నుండి సరళీకృతమైన గాలి
కాంతి నుండి ఉద్భవించిన అగ్ని
జీవానికి ఆలవాలమైన పృథ్వీప్రకృతి.
*
పంచభూతాల సమీకృతంగా ఇహం
పాంచభౌతికంగా మానవ మనుగడ
నేలను పొదువుకుని పాదచారిగా మనిషి
ఇరు నయనాలతో భ్రాంతిమంత జీవితం
తాపం తపన తపస్సుల ఇహ పర ప్రయాణం
నిలువెత్తు ప్రతీకగా ఫాలనేత్ర ఆజ్ఞావర్తనం
సహస్రార వికసిత పూర్ణేందు గురుజీవనం
సచేష్టిత పతనతో సుచేష్టిత సాధనా జీవితం
తపస్సు మహస్సంపన్నం కావటం
మానవ ఆత్మ పరిణామ రహస్యం.
-2-
నేను సౌందర్య లహరిని
*
శంకర నేత్ర సౌందర్య లహరిని
భువిన ప్రభవించిన స్వరాన్ని
ఆసక్త శక్తి సమీకరణాన్ని.
*
ప్రకృతి సృజించిన భౌగోళికాన్ని
పదమూడు లోకాల ఖగోళ ధూళిని
రతి కర్మ జన్మ జలధిని.
*
పంచేంద్రియ ప్రాణాన్ని
షట్పాద వర్ణభ్రమరాన్ని
మూలాధార మహిమాన్వితాన్ని
మణిపూర జలవాసాన్ని
స్వాధిష్టాన అగ్ని నిలయాన్ని
వాయువాసర అనాహతాన్ని
ప్రవిమలాకాశిక విశుద్ధాన్ని
భ్రూమధ్య స్థిత మానసాజ్ఞను
అద్వితీయ సహస్రార శక్తిక్షేత్రాన్ని.
*
కులకుండ కుహర జీవశక్తిని
నవకోణ మూల ప్రకృతిని
త్రిరేఖల ప్రకృతి తత్వాన్ని
పంచచక్ర వలయ శ్రీచక్రాన్ని.
*
అయిదు ఆరుల భూతల తత్వాన్ని
రెండు కూడిన యాభైల జలతత్వాన్ని
అరవైరెండుల అనలతత్వాన్ని
యాభై నాలుగుల ఆకాశతత్వాన్ని
డెబ్బయిరెండుల హృదయ తత్వాన్ని.
*
చతుషష్ట్య తంత్రసిద్ధిని
ద్వాదశార్కుల కిరణద్యుతిని
సవ్యనయన సూర్యజగతిని
వామనేత్ర చంద్రకాంతిని
ఫాలభాగ సంధ్యారుణిమను.
-3-
నేను
సంకల్పాన్ని
నా జన్మ నా సంకల్పం
నా మరణం నా సంకల్పం
*
నేను
సన్యసించిన నయనాన్ని
నా లోచనే స్వర్గం
నా ఆలోచనే నరకం
నా ప్రయాణమే మోక్షం
*
నేను
నడిచొచ్చిన నగ్నత్వాన్ని
కాను, ధరించిన కాషాయాన్ని
కాను, కరుణించిన జీవితాన్ని.
*
నేను
నిత్యక్రియల అతీతప్రజ్ఞను
నిన్నటిన కర్మను
నేటిన కర్తను
రేపటిన క్రియను
*
నేను
మార్మిక వౌనాన్ని
సమరస సహస్రారాన్ని
నర నర గురుత్వాన్ని
నవ నాడుల అమరత్వాన్ని
*
నేను
ద్విజుడను
మాటలేనివాడను
మరలిరానివాడను.