S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనసా! మన సామర్థ్యమేమి?

నేను ప్రవృత్తిరీత్యా కవినీగాను, పెద్ద రచయితనూ గాను. రేడియోలో పనిచేసే కాలంలో నాకు తెలిసిన రాగాలను గురించి పాటలను గురించీ కొనే్నళ్లపాటు ‘రాగరంజని’ ‘రాగరాగిణి’ పేర్లతో ప్రతి వారం ఓ అరగంటసేపు కార్యక్రమాలు సమర్పించేవాణ్ణి. అది కొన్ని దశాబ్దాలపాటు సాగింది. సంగీతం మీద వున్న మక్కువ కొద్దీ కష్టమైనా, ఇష్టపడి చేసేవాణ్ణి. మరొకరిని ఉద్ధరిస్తున్నాననే భావం కంటే ‘నన్ను నేను’ తెలుసుకుంటున్నాననే భావమే ఎక్కువగా ఉండేది. శ్రోతలు బాగా వినేవారు. అసంఖ్యాకంగా ఉత్తరాలు వచ్చి పడేవి. నాకంతా తెలుసనే దానికంటే నాకెంత తెలుసు? అనుకుంటూండేవాణ్ణి. దీనివల్ల సంగీత సాగరంలో ఆణిముత్యాల్లాంటి, గానం ఆ విద్వాంసుల సమర్థత, వారి గానవైభవం దీనివల్ల రికార్డుల ద్వారా వినే అవకాశం కలిగింది. వారితో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదనే భావమే బలంగా ఉండేది.
సముద్రంలో దిగేవారు, దాని లోతు, పొడవు, వెడల్పులు కొలవటానికి దిగరు. అది కష్టసాధ్యం కూడా. అలాగే నాద సముద్రంలో దిగటం కూడా. వాటిలో ఈదటం వారికో హాబీ. సంగీతమైనా అంతే.
నాదానందాన్ని వెతుక్కుంటూ పయనించటం ఒక్కటే నాకు తెలుసు.
ప్రపంచంలో ఎవరికైనా గౌరవం ఎందువల్ల లభిస్తోంది? అంటే సవాలక్ష కారణాలు. సమాజంలో మిగిలిన వారికంటే గుణంలోనో, ధనంలోనో, అధికారంలోనో, విద్యలోనో ఆధిక్యత కారణంగానే చెప్పుకోవాలి. ఒక్కోసారి అందం కూడా ఒక కారణం కావచ్చు. బలంగా లక్ష్యముంటే గుర్తింపు అప్రయత్నంగానే సిద్ధిస్తుంది.
మనిషికి సమస్యలెందుకొస్తున్నాయి? అని అడిగాడు ఒక పెద్దమనిషి.
తనను ఎవరూ గుర్తించటం లేదని ఏడవటం వల్లే ఈ సమస్యలన్నీ.. అని అలా అడిగిన వాడికి సమాధానం వచ్చింది. ఎక్కడో కర్నూలులో సంగీత రసికులంటూ లేని ఎడారిలో ఒంటరిగా సంగీత యాత్ర వందేళ్లు వచ్చేవరకూ సాగించిన సంగీత కళానిధి డా.శ్రీపాద పినాకపాణిగారితో నాకున్న రెండున్నర దశాబ్దాల పరిచయంలో ఆయన విన్న సంగీత విద్వాంసులు, వారి గానం, వారు పాడిన విధానం, వారి సంగీత నేపథ్యం, సంగీత సాధనలో వారు ఎదుర్కొన్న సాధక బాధకాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతోంటే ఆసక్తిగా వినటమే నాకు దక్కిన వరం. ప్రతి కీర్తనకూ ఓ చరిత్ర ఉంది. ఆ విషయాలు అనంతం.
ఆయన జీవితంలో ఎవార్డులు, రివార్డుల కోసం అర్రులు చాచేవారు కాదు. సన్మానాలు, సత్కారాలంటే సోత్కర్ష ఎరగరు. పరనింద తెలియదు. యితర విద్వాంసులలోని మంచి గుణాలను ఒకచోట రాసుకుని బుర్రలో నిక్షిప్తం చేసుకున్న మహామేథావి. స్వరం రాసుకుని సేకరించిన అపురూపమైన సంగీత మర్మాలన్నీ ఇప్పటికీ ఇంట్లో పుస్తకాల్లో ఇంకా ఉన్నాయి. వెళ్లి కూర్చోగానే వరుసగా అన్నీ చెప్పేసేవారు. అన్నీ తెలిసిన ఆ విద్వాంసుడికి ‘గర్వం’ అంటే తెలియదు. అహంకారం లేదు. మహా విద్వాంసుల్ని తయారుచేసిన ఆ పరమ గురువు చెప్పిన విషయాలు మీతో పంచుకోవటమే భాగ్యంగా భావించి రాస్తున్నాను తప్ప నా పాండిత్య మహిమ కాదు. సంగీతాసక్తి కలిగిన వారు ఆదరిస్తారనే ఆశ మాత్రమే.
సాధారణంగా మనస్సు మరీ పాపిష్టిది. గోరంత విజయానికి కొండంత గౌరవ భ్రాంతి కల్పిస్తుంది.
ఎదుటి వాళ్లంతా ఎందుకూ పనికిరారనీ,. నేనే వీరుణ్ణీ, మహా పండితుణ్ణనీ భావించే వారెవరైనా ఏదో ఒకరోజు ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఎవరితో చెప్పుకోవాలో తెలియని దుస్థితి ఏర్పడుతుంది. మనసులోని ఆ తెర తొలిగితే గానీ ‘నేను’ వ్యాధి నయం కాదు. వినయం రాదు. ఈ మాట ఇంట్లో వారు చెబితే బుర్రకెక్కదు. వినబుద్ధి కాదు. ఆచరించగలిగిన వారు చెపితేనే విలువ. అదే అనుసరణీయవౌతుంది. అప్పుడే చెప్పిన వాళ్లపై గౌరవం, సహజంగానే ఏర్పడుతుంది. పినాకపాణి అలాంటి అంకితభావం కలిగిన సంగీత ఋషి.
వర్థని - రూపకం
ప॥ మనసా మన సామర్థ్యమేమి?
అ॥ విను సాకేత రాజు విశ్వమనే రథమెక్కి
తన సామర్థ్యముచే తానే నడిపించెనే॥
చ॥ అలనాడు వశిష్టాదులు పట్టముగట్టే పలు
కుల విని వేగమే భూషణముల నొసగిన కైకను
పలుమారు జగమ్ములు కల్లలనిన రవిజుని మాయ
వలవేసి త్యాగరాజ వరదుడు తా చనగలేదా ॥

సర్వకాలాల్లోనూ, సర్వవిధాలా, అన్నీ ఇచ్చే సూర్యుణ్ణి ఏమని భావిస్తాం? దేవుడనా? బంధువనా? ఆచార్యుడనా? ప్రభువనా? జన్మకారణమనా? నిజానికి వర్ణించలేం. నమస్కారం ఒకటే మనకు చేతనైనదీ, చేయతగినదీ. సర్వ దేవతా రూపంలో, బాంధవాది రూపంలో లోకానికి మహోపకారం చేసే సూర్యుడే మనకు దిక్కు. మనకు రక్షకుడాయనే. మూర్ఖులు తప్ప రోజూ కనిపిస్తోంటే నమ్మని వారెవరుంటారు? సూర్యుచంద్రులిద్దరూ ఒక్కసారి బద్ధకించి కనపడకపోతే మన బ్రతుకులు తెల్లారినట్లే.
నా అంతట వాడు లేడనే ‘ఇగో’ను పక్కనబెట్టి, బ్రతకమనిచ్చే సందేశ సారమే ఈ త్యాగరాజ కీర్తన. రామాయణంలో ప్రతి పాత్రకూ అర్థముంది. ఒక ఔచిత్యముంది. తన కొడుకు భరతుని కంటే కైక శ్రీరాముణ్ణి ఎక్కువగా ప్రేమించేది. తెల్లవారితే యువరాజ పట్ట్భాషేకమనే వార్త కైక చెవిని వేసిన మంథరను ఆకాశానికి ఎత్తేసి వరాలు కోరుకోమంది. లోకంలో చాలా తేలికైనది మరొకరికి ఉచిత సలహాలివ్వటమే. మంధర ఇచిచ్న సలహాతో మతిపోయిన అంతటి కైక, రాతిగుండెతో రాముణ్ణి వనవాసం పంపటానికి సిద్ధపడింది. అనుకున్నదొక్కటి. అయినది మరోటి. త్యాగయ్య మనకు మొట్టికాయలు వేయాలనుకున్నప్పుడు, తన మనసును పిలుస్తాడు. మనకు ఉచిత సలహాలివ్వడు. మనకదే గుణపాఠం. అంతా నా గొప్పే అనుకుని విర్రవీగుతాం. సంకల్పం మనకుంటే సరిపోదు. పైవాడికీ ఉండాలి. ‘తనే్మ మన శ్శివ సంకల్పమస్తు’ అనుకుని చేయాలేగానీ, అంతా తన స్వయం ప్రకాశమనుకుని మురిసిపోతే ఏం కొంప ములగదు అనుకోకూడదు. వశిష్టుడంతటి వాడు శ్రీరాముడి పట్ట్భాషేకానికి ముహూర్తం పెడ్తే, ఎందుకు వికటించింది? తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యం పరమాత్మకే చెల్లు అని త్యాగరాజు తన మనసుకు చెప్పుకుని పాడుకున్నాడు.

- మల్లాది సూరిబాబు 90527 65490