S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిజాంపై గెలిచిన నిజం

మంచి వ్యవస్థ కోసం సమాజాలు జరిపే కృషి చిరంతనం.. సమాజంలో వెలుగు తేవాలనే సంకల్పంతో ప్రాణాలను తృణంగా భావించి, సర్వస్వాన్ని పణంగా పెట్టి పోరాడే ప్రవృత్తి జనంలోంచి పెల్లుబికి వస్తుంది. ఎన్నో అత్యాచార పర్వాలను ఎదిరించి సాగే ఆ ప్రజాపోరాటం చివరకు ‘జన విజయం’గా మారుతుంది. ఈ విజయం వెనుక ఎన్నో త్యాగాలు, బలిదానాలు ఉంటాయి. రక్తాక్షరాలతోనో, సువర్ణాక్షరాలతోనో అవన్నీ చరిత్ర పుటలకెక్కడం అనుభవం. అలాంటిదే తెలంగాణా పోరాటం కూడా.. తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని (సెప్టెంబర్-17) పురస్కరించుకుని అప్పటి నిజాం దురాగతాలు, ప్రజల వీరోచిత పోరాటాలలో కొన్ని మీకోసం..
* ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ యన్న దాశరథి రణ నినాదం బూజు పట్టినదేనా..?
* నిజాం అరాచక పాలన ఉత్తిదేనా...?
* నిజాం విముక్తికి అసువులు బాసిన ఎందరో త్యాగధనులవి వెర్రి పోరాటాలేనా..?
* నిజాంను తరిమికొట్టకపోతే.. తెలంగాణ స్వతంత్రమయ్యేనా..?
‘యథారాజ తథా ప్రజ’ అన్నది రాజుల కాలంనాటి మాట. రాజు ఎలా వుంటే ప్రజలు అలా వుంటారన్నది ఆనాటి రీతి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయో పాలకులు ఆ విధంగా మెదలాలి. కానీ తామేది మాట్లాడినా.. చేసినా, ప్రజలు ఒప్పుకొని తీరుతారు అన్న భావన ప్రస్తుత పాలకుడిలో కనిపిస్తోంది. పాలకుల సొంత అభిప్రాయాలు తమ మనసులను గాయపరిచేదిగా వుంటే.. వాటిని నిర్ద్వంద్వంగా ఖండిస్తారు, నిరసిస్తారు అన్నది తెలుసుకోవాలి.
చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఆచంద్ర తారార్కం గుర్తుంచుకుంటారు. సినిమాల్లో రావణాసురుడు, దుర్యోధనాధులను గొప్పవాళ్లుగా చూపినా ప్రజలకు వారు దుర్మార్గులుగా నాటుకుపోయిన భావనలు చెరిగిపోవు. ఇప్పుడు తెలంగాణాలో అదే జరుగుతోంది. సి.ఎం. కేసీఆర్ నిజాం గొప్ప ప్రభువు, నిజాం మంచి పనులు చేశాడని కొనియాడారు. కొమురం భీమ్ ఉద్యమించినప్పుడు లక్ష ఎకరాల్ని పేదలకు పంచాడు. ఎన్నో మంచి పనులు చేసినా నిజాం రాజును మునుపటి పాలకులు తొక్కేసి అతడి మంచిని చెరిపేశారు. అప్పట్లోనే సర్వ స్వతంత్ర హైకోర్టును ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి నిజాం రాజు సమైక్య పాలనలో నిజాం చరిత్రను వక్రీకరించారు. తెలంగాణ చరిత్రను కొత్తగా రాయిస్తాం. నిజాం చేసిన మంచి పనులను గుర్తించాలి. నిజాం సాగర్‌ను నిజాం ప్రభువు నిర్మించారు. అలాగే విలీనం తర్వాత కూడా నిజాం ఆర్థోపెడిక్ ఆస్పత్రికి స్థలం ఇచ్చి సొంత నిధులతో నిర్మించారు. చైనా యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీకి ఆరు టన్నుల బంగారాన్ని దేశం కోసం ఇచ్చారని పేర్కొన్నారు. ఇందుకు నిజాం మంచితనం గురించి చర్చిస్తే తప్పేంటని సి.ఎం. కేసీఆర్ ప్రశ్నించారు. దీనిపై తెలంగాణాలోని నిజాం చరిత్ర తెలిసిన వారి మనసులు గాయపడ్డాయి.
నిజాం దుర్మార్గ పాలనలో తెలంగాణ ప్రజలు నిత్యం నరకయాతనలు అనుభవించడాన్ని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా.. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి ఎందరో జైళ్ల పాలయ్యారు. ఈ క్రమంలో...
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన
రాజు మాకెన్నడేని.. తీగెలను తెంపి అగ్గిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ నిజామాబాద్ జైలు నుంచి మహాకవి కీ.శే. దాశరథి రణ నినాదం చేస్తూ జైలుగోడలపై రాశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులూ, తెలంగాణ సాయుధ పోరాట నాయకులు, మాజీ ఎమ్మెల్యే కీ.శే. చెన్నమనేని రాజేశ్వరరావు నిజాం దుర్మార్గ పాలనపై రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు.
నిజాం పాలనకు ఆనాటి భవనాలనే గీటురాళ్లుగా తీసుకుంటే అది అవివేకమే అవుతుంది. హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చే చార్మినార్.. నిజాం పాలనలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందనడం సరైంది కాదు. చరిత్ర గురించి అవగాహన లేనివారే ఇలాంటి అభిప్రాయానికి వస్తారు. ప్రజల జీవన ప్రమాణాలూ, సామాజిక అభివృద్ధి, రోడ్లు, రవాణా, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాథి, విద్య, ఆరోగ్యం, తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలు అనేక ఈతిబాధలకు గురయ్యారు. నిజాం అండతో గ్రామాల్లో జాగీర్దార్లూ, దొరలు ప్రజలను పీడించేవారు. గ్రామాలకు గ్రామాలే భూస్వాములూ, పెత్తందార్ల కనుసన్నల్లో వుండేవి. నిజాం నవాబు 150 మందికి పైగా మహిళలను భార్యలుగా తెచ్చుకున్నాడు. ఏ జమీందార్ ఇంటికి వెళ్లినా అందమైన అమ్మాయిలు కనిపిస్తే బలవంతంగా సొంతం చేసుకునే పైశాచిక మనస్తత్వం ఉన్న వాడు. అలాంటి వాడి పాలన చక్కగా సాగిందని చెబితే తెలివిలేనితనవౌతుంది.
నిజాం నవాబు ప్రజలను పీడించాడు. ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యారు. మాతృభాష పరిరక్షణ కోసం, మాతృభాషలో విద్యా బోధన కోసం, తెలుగువారు చాలా కష్టపడాల్సి వచ్చేది. నిజాం పాలనను ఎదిరించిన వారిని నిజాం ప్రభువు నిర్దాక్షిణ్యంగా అణచివేసేవారు. నిజాం పాలకులు ఆయన స్థానంలో పనిచేసే వారి కోసం హైదరాబాద్‌లో కొన్ని భవనాలు నిర్మించిన మాట వాస్తవమే. అంతటితోనే హైదరాబాద్ అంతా అభివృద్ధి చెందిందని అంటే ఎలా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్డు సౌకర్యం, చదువుకునే అవకాశం ఉండేది కాదు. అనారోగ్యానికి గురైతే చికిత్సకు అవకాశం లేదు. రైతులు జమీందార్లకు, సంస్థానాలకు తాము కష్టపడి పండించిన పంటలో చాలా భాగం కప్పంగా చెల్లించాల్సి వచ్చేది. నిజాం రాజ్యంలో గ్రామీణ ప్రజలు ఎవరూ సంతోషంగా ఉండేవారు కాదు. నిజాం పాలన చివర్లో ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు అనేక దారుణాలకు ఒడిగట్టారు. హిందువులను, మరీ ముఖ్యంగా దళితులనూ ముస్లింలుగా బలవంతంగా మతం మార్పిడి చేశారు. దీనే్న ‘తబ్లీగ్’ అనేవారు.
మాజీ ఎంఎల్‌సి (సిపిఎం) సిహెచ్. సీతారాములు తన చిరు వ్యాసంలో నిజాం పాలనపై ఇలా పేర్కొన్నారు. జాగీర్‌దారులూ, భూస్వాములూ, దేశ్‌ముఖ్‌లూ, దేశ్‌పాండేలు నిజాం అండదండలతో పేట్రేగిపోయారు. కనుకనే తెలంగాణా సాయుధ పోరాటం వచ్చింది. ప్రజల బాధల్లోంచీ, వ్యథల్లోంచి తిరుగుబాటు మొదలైంది. భూస్వామ్య వ్యవస్థకూ, ఫ్యూడల్ వ్యవస్థకూ, వెట్టిచాకిరికి వ్యతిరేకగా, కులాలూ, ప్రాంతాలకూ అతీతంగా నిజాంకు వ్యతిరేకంగా పెద్ద పోరు సాగింది. నిజాం పాలనలో అనేక దుర్మార్గాలు జరిగాయి. తానే స్వయంగా దుర్మార్గాలు చేశాడు. మరికొన్ని చేయించాడు. దాంతో వేలాదిమంది అమరులయ్యారు. ధిక్కారాన్ని సహించని నిజాం ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లను ఊళ్లపైకి పంపి ఉసిగొల్పడంతో బైరాన్‌పల్లి, పరకాల, గాలిపెల్లి తదితర ప్రాంతాలలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నేతల గ్రామాలపై దాడులకు పూనుకున్నారు. పల్లెల్లో పట్వారీలు, పటేండ్ల ఆగడాలు, అకృత్యాలకు లెక్కలేకుండా పోయింది. సామాన్య జనం సాయుధ పోరుతో నిప్పు కణికలు కురిపించారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశత్వం, గ్రామాల్లోని గడీల పెత్తనం కింద దయావత్ తెలంగాణ బానిస సంకెళ్లతో ముడిపడి వుంది. అప్పుడే చీకట్లో వెలుగు రేఖలా ఓ విప్లవ కణిక రాజుకుంది. అది తెలంగాణ సాయుధ పోరాటమనే మహాజ్వాలగా మారి గడి పునాదులను కదిలించడమే కాదు, నిజాం నిరంకుశత్వాన్నీ కాల్చి బూడిద చేసింది. చివరకు స్వాతంత్య్రం సిద్ధించింది.
పలువురు స్వాతంత్య్ర పోరాట యోధులు చెప్పింది - ఖాసీం రజ్వీ నేతృత్వంలో రజాకారుల దురాగతాలకు అంతులేకుండా పోయింది. ఉద్యమకారులను చిత్రహింసలు పెట్టేవారు. గోళ్ల కింద సూదులతో గుచ్చేవారు. బ్లేడ్లతో కోసి కారం పోసేవారు. మహిళలను మానభంగాలు చేసేవారు. ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు పండించిన పంటలను దోచుకునేవారు. దీన్ని ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు. నిర్మల్‌లో 100 మందిని ఉరి తీశారు. గాలిపెల్లిని తగులబెట్టారు. పరకాలలో సుమారు 20 మందిని కాల్చి చంపారు. 1942లో షేక్ బందగీని విసునూరు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్య చేశారు. 1944లో దొడ్డికొంరయ్యను హత్య చేశారు. నిజాం పాలనపై, అతని దాష్టీకాలపై పత్రికలో వార్తా కథనాలు ప్రచురించిన జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్‌ను హత్య చేయించింది. దీంతో తారాస్థాయికి చేరిన నిజాం రాక్షస పాలనను తుదముట్టించడానికి తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. రామానంద తీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలూ, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు జరిగాయి. నల్లగొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం,
మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డిలతో కూడిన మరెందరో తెలంగాణ సాయుధ పోరాట యోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులూ, రచయితలతో ఉద్యమం ఉధృత రూపం దాల్చి నిజాంను గద్దె దించి హైద్రాబాద్ రాజ్య ప్రజలకు విముక్తి కలిగించింది.
కాగా నిజాం అరాచకాలను నిర్మూలించి అతడిని గద్దె దించి ప్రజలకు స్వాతంత్య్రం ఇవ్వడానికి కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ సెప్టెంబర్ 17 (1948)న హైద్రాబాద్‌లో కేంద్ర పోలీస్ యాక్షన్ నిర్వహించారు. దాంతో నిజాం తలదించుకున్నాడు. తాను లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీంతో హైద్రాబాద్ రాజ్య ప్రజలకు విముక్తి కలిగింది. ప్రజలపై రాక్షస చర్యలకు పాల్పడిన 1373 మంది రజాకార్లను భారత సైన్యం హతమార్చింది. మరో 1911 మందిని బందీలుగా పట్టుకుంది. నిజాం ప్రధాన మంత్రి మీర్ లాయిక్ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. (ఖాసిం రజ్వీ పాకిస్తాన్‌కు పారిపోయాడు)
చరిత్ర చెబుతున్నది.. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ 191లో మరణించిన అనంతరం, ఆయన కుమారుడు ఏడో నిజాంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యానికి వచ్చాడు. 1949లో భారత సైన్యం చేతిలో ఓడిపోయి సింహాసనం వదిలిపెట్టాడు. సుమారు 38 ఏళ్ల పాలన చేశాడు. 20 ఏఆళ్లు సంస్కరణలు చేసి ప్రాజెక్టులు కట్టి కొన్ని మంచి పనులు చేశాడు. తనకు 45 ఏళ్లు వచ్చేసరికి అంటే 1930 నాటికి అతనిలో మార్పు వచ్చింది. సంస్కరణలు వెనుకబడ్డాయి. తర్వాతి కాలంలో పెడదారి పట్టాడు. పరిపాలనలో ఆఖరి పుష్కర కాలం అధ్వాన్నంగా నడిచింది. నిజాం హైద్రాబాద్‌ను తప్పించి తక్కిన ప్రాంతాలను పట్టించుకోలేదు. నీటి సౌకర్యం కోసం ప్రాజెక్టులు కట్టాడు తప్ప పట్టణాల్లో, గ్రామాల్లో నివాస సౌకర్యాలు ఉండేవి కావు. దీంతో డబ్బున్న వాళ్లందరూ గ్రామాల్లో భూములున్నా హైద్రాబాద్‌లో నివాసం ఉండేవారు.
జిల్లాల్లో చాలా పట్టణాలకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. ఇక గ్రామీణ ప్రాంతాల మాట చెప్పనక్కరలేదు. నిజాంలు తమ కోసం తమ బంధువుల కోసం హైద్రాబాదులో భవంతులు కట్టుకుంటే ఆ నగరానికి డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేస్తే, చెరువులు తవ్విస్తే వాటిని చూసి అభివృద్ధి అనుకోమంటారు కొందరు. దేశంలోని నగరాల్లో ఐదో స్థానంలో రాజధాని వుండి అధమ స్థానంలో తక్కిన ఊళ్లు ఉంటే అదేం గొప్ప? పాలన ఎలా ఉందో తెలుసుకోవాలంటే తలసరి ఆదాయం ఎలా ఉందో, రాజ్యం మొత్తం మీద వైద్య, విద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయో, శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో, ప్రజల హక్కులు ఏమేరకు కాపాడబడ్డాయో, అధికారుల దాష్టీకంపై నియంత్రణ ఎలా ఉందో.. ఇలాంటివి చూసి అంచనా వేయాలి. ఆ విధంగా చూస్తే పాలకుడిగా నిజాంకు చాలా తక్కువ మార్కులు పడతాయి. 1914లో నిజాం రాజ్యంలో అక్షరాస్యత 2.8 శాతం. చదువుకున్న వాళ్లు తనకు ఎదురు తిరుగుతారనీ, భయంకొద్దీ నగరంలో తప్ప వేరెక్కడా కాలేజీలు, హైస్కూళ్లు లేకుండా చేశాడు. గ్రామాల్లో బళ్లు ఉండేవికావు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజాధనాన్ని బ్రిటిష్ వారికి సమర్పించి నిజాం పెద్ద బిరుదులు పొందాడు. వారి నుండి అమితమైన అధికారాలు పొంది పోనుపోను నియంతగా మారిపోయాడు. పన్నులపై వచ్చే ఆదాయంలో ఎంత భాగం నిజాం తీసుకోవచ్చు... అనే దానిపై ఆంగ్లేయుల నియంత్రణ ఉండేది. వారిని ఖుషామత్తు చేసి తన రాజభరణాన్ని 50 లక్షల రూపాయలకు పెంచుకున్నాడు నిజాం. అంతేకాదు. నజరానాల రూపంలో పదవులు ఆశించే జమీందార్ల నుండి, ఉద్యోగార్తుల నుండి బోలెడంత డబ్బు, కానుకలు వసూలు చేసేవాడు. నజరానాలు చెల్లించినవారు అసమర్థులైనా, అవినీతిపరులైనా సరే పదవులు ఇచ్చేవాడు. ప్రజల సమస్యలను తెలుసుకోడానికి తొలినాళ్లలో రాజ్యంలో పర్యటనలు చేసిన నిజాం.. తర్వాతి రోజుల్లో కానుకలు వసూలు చేసుకోడానికి మాత్రం వెళ్లేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ పెట్టాడు. కానీ దానిలో బోధనా భాష ఏదీ? జనాభాలో 14 శాతం మాట్లాడే ఉర్దూ, 48 శాతం మాట్లాడే తెలుగు, 26 శాతం మాట్లాడే మరాఠీ, 12 శాతం మాట్లాడే కన్న భాషలకు దానిలో చోటు లేదు. ప్రజల్లో 85 శాతం మంది హిందువులు, 12 శాతం మంది ముస్లింలు ఉంటే ఉద్యోగులలో అధిక శాతం ముస్లింలే. వారు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే.
సిద్దిక్ దీన్‌దార్ అనే వ్యక్తి మత మార్పిడులను ప్రోత్సహిస్తూ ఉద్యమం నడిపాడు. సిద్దిక్ చర్యలకు తనకు సంబంధం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ హిందువులు నమ్మలేదు. ఈ వివక్షతకూ, మత మార్పిడికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ 1937 నుండి పోరాడసాగింది. అంతకుముందే 1926లో మజ్లిస్ ఏర్పడింది. నిజాం రాజ్యంలో స్థానిక మస్లింల దుస్థితి బాపడానికి సంస్కరణవాదంతో ప్రారంభమైంది. కానీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎదుగుతున్న ముస్లిం లీగ్‌తో కలిసి పనిచేయసాగింది ఇది. కాక కాంగ్రెస్ కూడా ఇక్కడ శాఖ ప్రారంభించింది. సివిల్ లిబర్టీస్ వారు కూడా పోరాడేవారు. నిజాం వీళ్ళందరినీ అణచివేయడానికి చూశాడు. ఎలాంటి ఉద్యమకారులైనా సరే అంతిమంగా తన అధికారానికి ముప్పుగా తయారవుతారనీ అతని భయం. వీళ్ళని జైల్లో పెట్టాడు. పత్రికలు పెట్టనిచ్చేవాడు కాడు. జమీందార్ల ద్వారా ప్రజలను అణచేవాడు. వారి స్వేచ్చను హరించాడు.
రాజ్యంలో మూడోవంతు జాగీర్ల రూపంలో వుంది. రాజ్యం యొక్క మొత్తం ఆదాయం 8 కోట్ల రూపాయలుంటే దానిలో 70 శాతం ఆదాయం 19 మంది జాగీర్దార్లకు వచ్చేది. జాగీర్దార్లు తమ సొంత ప్రాంతాలలో ప్రభుత్వ ప్రాంతాలలో పోలిస్తే పది రెట్లు పన్నులు వసూలు చేసేవాళ్ళు. ప్రజలను పీడించేవారు. వెట్టిచాకిరీ మళ్లీ వచ్చేసింది. నజరానాలు ముడుతున్నందున నిజాం నోరెత్తేవాడు కాదు. 1940 నుండి నిజాం ప్రజల్లోకి రావడం మానేశాడు. నల్లమందుకు అలవాటుపడ్డాడు. ఏ దివాన్‌ను సవ్యంగా పాలించనివ్వలేదు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. బ్రిటన్‌కు విపరీతంగా సహాయం చేసి వాళ్ళ ఆదరాన్ని మరింతగా పొందాడు. భారతదేశంనుండి విడిచి పెట్టే రోజులు వస్తే తన రాజ్యం తనకు అప్పగించి వెళతారని నమ్మాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం వస్తుందనీ, అది నిజాం రాజ్యం పొలిమేరల్లోకి రాకుండా ఉండాలని మజ్లిస్, నిజాం కోరుకున్నారు. తన రాజరికం కొనసాగడానికి నిజాం మజ్లిస్ చెప్పినట్లు ఆడసాగాడు. 1947లో బ్రిటీష్ వాళ్ళు వెళ్లిపోయారు. తన రాజ్యం నెలకొల్పడానికి ఇదే అదును అనుకున్నాడు నిజాం. పూర్వం తన ఏలుబడిలో వున్న మచిలీపట్నం, బీరారు అన్నిటినీ మళ్ళీ సంపాదించాలనుకున్నాడు. దివాన్ సి.పి.రామస్వామి అయ్యర్ ప్రోద్బలంతో ట్రావన్‌కూర్ సంస్థానం తాము స్వతంత్ర రాజ్యమని 1947 మే 9న ప్రకటించుకుంది. నిజాంకు ఇది ఆదర్శమైంది. జూన్ 6న ఆయన ఒక ఫర్మాన్ విడుదల చేశాడు. బ్రిటిష్ పాలన అంతరించడంతో తన స్వతంత్రం తనకు తిరిగి వచ్చిందనీ ఆయన ప్రకటించుకున్నాడు. ‘ఆజాద్ హైద్రాబాద్ జిందాబాద్ - ఆల్ హజ్రత్ పాయింబాద్’ అనే నినాదాల మధ్య చార్మినార్‌పై ‘అసఫ్‌జాహి’ పతాకం ఆవిష్కరించబడింది. నిజాంను ఎగదోసినది కాశీం రజ్వి నాయకత్వాన రజాకార్లు. రజాకార్లు చేసిన దోపిడీలు, ఘాతుకాలు అన్నీ ఇన్నీ కావు. నిజాం వాళ్ళను ఏమీ అనలేదు. రజ్వీ బంగాళాఖాతం దాకా తన రాజ్యాన్ని విస్తరింపజేస్తాడనీ ఆశపెట్టుకొని అతని చేతిలో కీలుబొమ్మగా మారాడు. జాగీర్దార్లకూ, రజాకార్లకూ, కాంగ్రెస్ వారికీ కమ్యూనిస్టులకు మధ్య తన రాజ్యంలో అంతర్యుద్ధం జరిగినా పట్టించుకోలేదు. తాను స్వతంత్ర రాజుగా వెలగాలి. భారత్‌తో కుదరకపోతే పాకిస్తాన్‌లో విలీనమవ్వాలి. తన రాష్ట్రంలో 85 శాతం మంది హిందువుల మనోభావాలు ఎలా వున్నా తనకు అనవసరం. ఈ స్వార్థ, నిరంకుశ బుద్ధే నిజాం కొంపముంచింది. 1948లో పోలీసు చర్యతో సర్దార్‌పటేల్ నిజాం ఆశలు అడుగంటించాడు. ఇది చరిత్ర. 38 ఏళ్ళ పాలనలో నిజాం కొన్ని ప్రయోజపయోగ పనులు చేస్తే హైదరాబాదును సుందరంగా తీర్చిదిద్దితే, సొంత ఖజానాలో కోట్లాది రూపాయలు పోగేసుకుంటే అది గొప్ప కాదు. తన పాలనలో జమీందార్లు బాగుపడ్డారు. ప్రజలను పీడించారు. వారందరినీ బానిసత్వంలో ఉంచి వారి జీవితాల్లో చీకట్లు నింపి, వారికి నిత్యం నరకం చూపించిన నిజాం మంచి పాలకుడు ఎన్నటికీ కానేరడు. ‘‘మా నిజాం రాజు తరతరాల బూజు’’ అని మహాకవి దాశరథీ ఎలుగెత్తి చాటిన కవితా గర్జన నిజాం రాజు దాష్టీకాన్ని ఎప్పటికీ వెల్లడి చేస్తూ వుంటుంది. దీన్ని చెరిపి.. నిజాంపై కొత్త చరిత్ర రాయిస్తానంటే ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు? ఇదంతా ప్రజలకన్నా.. వాస్తవాలకన్నా తామే గొప్పవారం. తామేది చెబితే అది ప్రజలు వినాలి. దానికి తిరుగులేదు అనుకునే మన పాలకుల నియంతృత్వ రీతి నుంచి... నిజాం లక్షణాలు వున్న వారి నుంచి వస్తాయి.
ఇలావుండగా రాష్ట్రంలోని 28కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు నిర్ణాయకశక్తిగా ఉండగా, మెజారిటీ మస్లింలు కాంగ్రెస్ వైపు ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందట. దీంతో కాంగ్రెస్‌కు బలం పెరుగుతందనీ, ఎన్నికల్లో ముస్లింలను అక్కున చేర్చుకుంటే మళ్లీ అధికారానికి రావడానికి సులభవౌతుందనీ, ఇందుకు ముస్లింల మెజారిటీ ఓట్లు కొల్లగొట్టడానికి ముస్లింలకు వరాలజల్లు కురిపించడం, చరిత్రను వక్రీకరించి నిజాంను కీర్తించడం, తెలంగాణ కొత్త చరిత్ర రాయిస్తానని అనడంపై మేధావులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా వుండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ ఇలా విమర్శించారు. కెసిఆర్ ఓట్ల రాజకీయం కోసమే తెలంగాణ చరిత్రను కొత్తగా రాయిస్తాననీ అంటున్నారనీ, టిఆర్‌ఎస్ సర్కారు మజ్లిస్ ఎజెండాను అమలుపరుస్తోందనీ అన్నారు. అరాచక పాలనతో ప్రజలను బెంబేలెత్తించి ఊచకోతకు కారణమైన నిజాం తెలంగాణకు ఎలా రాజు అవుతాడన్న విషయాన్ని సిఎం కెసిఆర్ ప్రజలకు వివరించాలని అంటున్నారు. మహిళల్ని వివస్తల్రను చేసి బతుకమ్మలను ఆడించింనందుకా? పాలనలో అరాచకాలను ప్రశ్నించినవారిని ఊచకోత కోసినందుకా? బొట్టుకు, భాషకు, పాటకూ, ఆటకూ పన్నులు వేసినందుకు ఈ నిజాం రాజు అవుతాడా స్పష్టం చేయాలనీ డా.లక్ష్మణ్ డిమాండ్ చేయడం సబబుగా వుంది.
కాగా ఆదిలాబాద్ అటవీ ప్రాంతం గిరిజనుల భూమికోసం, భుక్తికోసం, ఆ జాతి విముక్తికోసం నిజాంను ఎదురొడ్డి పోరాడిన వీరుడు కొమురం భీమ్‌ను హత్య చేయించిన నిజాం, లక్ష ఎకరాల భూములు గిరిజనులకు పంచాడంటూ కీర్తించారు కెసిఆర్. అలాగే హైదరాబాద్‌లో సర్వస్వతంత్ర హైకోర్టును ఏర్పాటుచేసిన ప్రపంచంలోని మొదటి వ్యక్తి నిజాం అంటూ పొగిడారు. కొమురం భీమ్‌ను నిజాం కాల్చి చంపించింది ఎలాగైతే పరిగణలోకి తీసుకోకుండా ఆదిలాబాద్ జిల్లాలో నేలవాలిన ఆతడి రక్తంతో తడిసిన లక్ష ఎకరాల భూమిని భీమ్‌ను హత్యచేశాక పంపిణీ చేయడాన్ని ఎలాగైతే పరిగణలోకి తీసుకున్నాడో.. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అసువులు బాయడాన్ని పరిగణనకు తీసుకోకుండా యుపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తెలంగాణా ఇవ్వడాన్ని కూడా కూడా కెసిఆర్ ఒప్పుకుని తీరాలి. అది తన ఉద్యమం గొప్పతనంగా చెప్పకూడదు మరి. అలాగే బ్రిటీష్ వారి కనుసన్నల్లో పాలన నడిపిన నిజాం హైదరాబాద్ రాజ్య ప్రాధాన్యతను బట్టి వారి సలహాతోనే హైదరాబాద్‌లో హైకోర్టు నిర్మాణం చేయించాడన్నది గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే నిజాం తాను ప్రజల్ని దోచి కూడబెట్టుకున్న అపరిమితమైన ఆస్తలు, బంగారంపై కేంద్ర ప్రభుత్వం కనే్నసి వుంచినందున దాడులు, లీగల్ సమస్యలు వస్తాయనీ, న్యాయ నిపుణుల సలహాలతో చైనాయుద్ధం పరిణామాలను వినియోగించుకుంటూ అప్పటి భారత ప్రధాని లాల్‌బహద్దూర్ శాస్ర్తీకి ఆరు టన్నుల బంగారం ఇచ్చి దేశభక్తుడిగా నిజాం అనిపించుకున్నాడు. ఈ విధంగా నిజాం దుష్ట చరిత్రనూ పరిశీలించినవారెవరూ నిజాంను గొప్ప ప్రభువుగా అంగీకరించరు. నిజాం రాజ్యం తొలగిపోయి తెలంగాణ సర్వస్వతంత్రంగా ఏర్పడకపోతే తెలంగాణ సిఎం ఎలా అయి ఉండేవారని ప్రజలనుంచి ప్రశ్నలు వస్తున్నాయి. *

- తాళ్లపల్లి యాదగిరి గౌడ్ 9949789939