S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకృతి ఒడిలో పూల పండుగ

సమైక్య జీవన విధానానికి, సామాజిక ఏకత్వానికి ప్రతీకలు మన పండుగలు. భారతదేశ చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు పండుగలే ప్రధానం. జాతి క్రమశిక్షణకు, ఆధ్యాత్మిక సరళికి ఆధారం పండుగలే.. అలాంటి పండుగల్లో ముఖ్యమైనది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు.. అమ్మవారితో పాటు ప్రకృతి స్వరూపిణిని కూడా అమ్మతల్లిగా భావించి బతుకమ్మగా ఆరాధిస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఆటపాటలతో, అందమైన ముగ్గులతో, కనువిందైన పూలతో ‘బతుకమ్మ’ను పేర్చి పూజ చేస్తారు. ప్రపంచంలో పూలతో దేవుడిని పూజించడం సర్వసాధారణమైన అంశం. కానీ ఆ పూలనే పరమ పవిత్రంగా పూజించడం అనేది తెలంగాణ ప్రత్యేకత. ప్రకృతిని ప్రేమించడమనేది అనాది జీవన సంప్రదాయం. ‘బతుకును బతుకమ్మా’ అని వేడుకోవడం తెలంగాణ మట్టికున్న మహిమాన్విత ఆచారం. ఆధునికత ఎన్ని హొయలొలికినా మనిషి మనాది నుంచి అనాదిగా వస్తున్న సంప్రదాయాలను అనేకం వదులుకున్నా పూలతో తన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.
పూలుగుడులు, గోపురాలు, మఠాలు, మర్యాదలు లేకపోయినా తెలంగాణ మనిషి గుండెల్లో ఎన్ని తరాలు మారినా ఎన్ని తంతెలు ఎదిగినా వాటికి ప్రత్యేకమైన గౌరవస్థానం ఆదానప్రదానాలుగా వస్తున్నది. అలా రావడానికి బతుకమ్మ ఒక స్ఫూర్తి. తెలంగాణ ఇల్లిల్లూ పూలవనమై మెరిసి మురిసిపోవడానికి ఇక్కడి జనజీవం శిఖరాయమానం. సహజంగా పండుగలు పౌరాణిక గాథల ఆధారంగా ఆవిర్భవిస్తాయి. కానీ బతుకమ్మ పండుగ పుట్టుకకు అలాంటి కారణాలు, ఆధారాలు కనిపించవు. ప్రకృతిని స్ర్తిగా పూజించే విధానమే బతుకమ్మ. అంతేకాదు, బతుకమ్మ పాటలు ఎక్కువగా రామాయణ, భారత, భాగవతం మొదలైన పౌరాణిక కథావస్తువుతో ఉంటాయి. తెలంగాణకే ప్రత్యేకమైన అపురూపమైన కానుక బతుకమ్మ. ప్రకృతిని ప్రేమించడం తెలంగాణ సంస్కృతికి ఉన్న మహోన్నత లక్షణం. ప్రకృతి ప్రసాదిత పూలను పేర్చి బతుకునీయవమ్మా... అంటూ బతుకమ్మను కొలిచే అరుదైన పండుగ బతుకమ్మ. తెలంగాణలో ఎక్కడ చూసినా తొమ్మిది రోజులూ పూలజాతరే.. ఊరూరా పూలవనమే..
ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే.. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంత ప్రాముఖ్యత అంటే.. రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత.. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరీ పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో పిలుస్తారు.
మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది. ఇక్కడ గడపగడపలో బతుకమ్మ తొమ్మిదిరోజులపాటు కనువిందు చేస్తుంది. తొమ్మిది పూర్ణత్వానికి ప్రతీక. నవ విధులకు, నవావరణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, సీతమ్మజడ, గోరింట, గుమ్మడి, బంతి, మందార, గనే్నరు, బీర, నిత్యమల్లె పుష్పాలను క్రమపద్ధతిలో అమర్చుతారు. మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈమె ఈ తొమ్మిదిరోజులు పుట్టింటికి వచ్చినట్లుగా భావించి ..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తంగేడు పువ్వై తరలిరావే తల్లి..
మందార పువ్వై మురిపెంగరా.. కల్పవల్లీ..
పారిజాతమై పరిమళించగరావే..
పున్నాగ పువ్వై పులకించగరావే..
బంగారు బతుకమ్మా..
సింగారాల మాయమ్మా..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..
-అంటూ తమ మమకారాన్ని చాటుకుంటారు పుట్టింటివారు.
సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలం కనిపిస్తుంది. అన్ని పండుగల్లో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం ఉందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇది మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగిసిపోయి, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో వాతావరణం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది. రకరకాల పూలతో చెట్లన్నీ విరబూస్తాయి. ముఖ్యంగా గునుగు, తంగేడు పూలు విరగకాసి ప్రకృతి మాతకు మరింత అందాన్ని అద్దుతాయి. చెరువులన్నీ కొత్త నీటితో కళకళలాడుతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్నంతా ‘బతుకమ్మ’లో పేర్చి వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.
బతుకమ్మ కథ..
బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కథలు రెండున్నాయి. మొదటి కథ..
మహిషాసురుడితో యుద్ధం చేసిన దుర్గాదేవి అలసటతో సొమ్మసిల్లి, పడిపోయింది. తో టి మహిళలు ఆమెకు సేవ లు చేసి పాటలను ఆలపిస్తూ, ఆమెలో తిరిగి చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సపర్యలు చేసి సేదతీర్చారు. తొమ్మిదోనాడు ఆది పరాశక్తి అలసట పూర్తిగా తీరిపోయింది. వెంటనే దుర్గాదేవి విశ్వ చైతన్యమూర్తిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించింది. లోకంలోని చీకట్లను, చెడులను పారద్రోలి కొత్త వెలుగును ప్రసరింపచేసింది. అందరికీ బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను ‘బతుకమ్మ’గా వ్యవహరించి పూజిస్తారు ఆడపడుచులు. ఇక రెండో కథ.. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందట. అప్పు డు ఆ ఊరి ప్రజలందరూ ‘నువ్వు చనిపోయినా అం దరి మనస్సులో కలకాలం ‘బతుకమ్మా..’’ అని దీవించారట.. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, ఆమెనే గౌరమ్మగా పూ జిస్తూ ‘బతుకమ్మ’ పండుగ చేసుకుంటారు. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్ర్తిలందరూ తమ కు ఎలాంటి ఆపదలూ రాకూడదని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టారు. అప్పటి నుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను పూజించడం ఆనవాయితీ అయిందట.
బతుకమ్మ పండుగకు వారం ముందు నుంచే ఇళ్ళలో హడావుడి మొదలవుతుంది. ఈ పండుగ కోసం ఎదురుచూసే తెలంగాణ ఆడపడుచులు పండుగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలను తయారుచేసి ప్రతిరోజూ సాయంత్రం ఆ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ శ్రావ్యంగా పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. నయన మనోహరంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఆ రోజున పురుషులంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగ, కలువ పూలను కోసుకుని వస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగ, తంగేడు, కలువ పువ్వుల్ని, మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మను తయారుచేస్తారు. బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు ఉన్నా గునుగ పూలు, తంగేడు పూలదే ఆధిపత్యం ఉంటుంది.
ఒక రాగి పళ్ళెంలో గునుగు, తంగేడు పూలతో పాటు ఇతర పూలను కలిపి వలయాకారంలో పేరుస్తారు. ఇలా పై వరకు ఒక రంగు పుష్పం తరువాత మరో రంగు పుష్పాన్ని పెడుతూ ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ఆ తర్వాత తంగేడు పూలను కట్టగా కట్టి వాటిపై పేరుస్తారు. మధ్యలో కూడా రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత పైన పసుపుతో తయారుచేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారుచేసిన బతుకమ్మను పూజ గదిలో అమర్చి పూజిస్తారు. తరువాత బతుకమ్మను బయటకు తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలతో గౌరీదేవిని కీర్తిస్తారు. ఆడపడుచులు కొత్త బట్టలను కట్టుకుని, ఆభరణాలను ధరించి చాలాసేపు ఆటపాటలతో గడిపాక ఆడవారు, మగవారు కలిసి చెరువులో నిమజ్జనం చేస్తారు. తరువాత పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం.. అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. వేరుశెనగ లేదా పెసలను దోరగా వేయించి పిండి చేసి బెల్లంతో కలిపి సత్తుపిండిని తయారుచేస్తారు. దీంతో పాటు పెరుగన్నాన్ని కూడా బతుకమ్మ ఆడేచోటుకు తీసుకువచ్చి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ప్రసాదంలా తింటారు.
బతుకమ్మ వేడుకల చివరిరోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదేవిధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటిపడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని పెద్ద చెరువుకుగానీ, తటాకం వైపుగానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలకరించుకున్న స్ర్తిలు, బతుకమ్మలు, వాయిద్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జార విడుస్తారు. ఆ తరువాత పంచదార, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచి పెడతారు.
గర్భపూజ..
మనిషి పుట్టుకకు ఆధారమైన (మిగతా 10వ పేజీలో)

గర్భాన్ని పూజించడం, గౌరవించడం.. జానపదుల సంస్కృతి. ‘బతుకమ్మ’ను గర్భానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి.. గర్భపూజను, మాతృమూర్తిని పూజించడమే- ‘బతుకమ్మ’ అంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగను నవమాసాలకు ప్రతీకగా చెప్పవచ్చు. ఈ కారణంగానే బతుకమ్మ పండుగ మహిళల సంతాన సాఫల్యతకు సంబంధించిన పండుగ అని అంటుంటారు. బతుకమ్మ వేడుకల్లో పాడే పాటల్లోనూ గర్భవతులైనరవారు ఏ మాసంలో ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?? అనే విషయాలు తెలుస్తాయ. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను చూస్తే.. లింగం, భూమి, గర్భం, ధాన్యరాశి ఆకారాల్లో కనిపిస్తుంటాయి. అంటే పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి ఆడి, పాడి, పూజించి పునఃసృష్టికి స్వాగతం పలకడం ఈ పండుగ అంతరార్థం. మహిళలకు ప్రకృతితో ఉన్న అనుబంధానికి ఈ ‘బతుకమ్మ పండుగ’ అద్దం పడుతోంది. బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగగా, భూదేవి పండుగగా చెప్పవచ్చు. ప్రకృతి, భూదేవి అనేవి రెండూ పునరుత్పత్తి రూపాలే.. అందుకే బతుకమ్మ పాటల్లో వైద్యం, సేద్యం రెండూ కనిపిస్తాయి. బొడ్డెమ్మ, బతుకమ్మలు కడుపు పంటకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అందులో భాగంగానే రెండు దశల్లో ఈ బతుకమ్మ పండుగ జరుగుతుంది. బొడ్డెమ్మ పండుగలో గద్దెకు, వెంపలి చెట్టుకు.. బతుకమ్మ పండుగలో పూలకు ప్రాధాన్యం ఇస్తారు. బొడ్డెమ్మ పండుగలో బాలికలకు, బతుకమ్మ పండుగలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.
బతుకమ్మ పండుగను మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా కూడా చెప్పవచ్చు. ఇది తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నం. అందుకే బతుకమ్మ పండుగలో పురుషులకు స్థానం కనిపించదు. బతుకమ్మ ఆడే సమయంలో పురుషులు ఉండకూడదు. బాలికలు బొడ్డెమ్మలు ఆడుకునేటప్పుడు అన్నదమ్ములు రాకూడదు. తెలంగాణలో ఇప్పుడు పూజిస్తున్న ఎల్లమ్మ, సమ్మక్క సారలమ్మ, ముత్యాలమ్మ, బతుకమ్మ అందరూ ఒకప్పటి పురుషాధిక్యతను ఎదిరించి పోరాడిన రూపాలే.. ఈ పండుగలన్నీ మహిళను విముక్తి చేసుకోవడానికి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న పండుగలే.. ఇలా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపమైన ‘అమ్మ’ను పూజిస్తారు మహిళలు. దీంతో పాటు ప్రేమ, శాంతి, సత్యం, క్షమ, ధ్యానం, అహింస, నిగ్రహం, భూతదయ అనే అష్టపుష్పాలతో, మన మనోపుష్పమైన తొమ్మిదో పుష్పాన్ని కూడా జతచేసి అమ్మను పూజించడమే బతుకమ్మ వేడుక.
పండుగ - ఇతిహాసాలు
తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై, ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు పాకిన ఈ పండుగ ప్రాశస్త్యం, పుట్టుక వెనుక ఆసక్తికర కథనాలెన్నో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలంలో అంటే సుమారు 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఆ కాలంలో పూలను బతుకుగా భావించి సుకుమార భావన కల స్ర్తిలు ఆడే ఆటగా బొడ్డెను గౌరమ్మగా పూజించడం వల్ల బతుకమ్మగా మారిందనే భావన ఉంది. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షస సంహారం చేయడంలో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం. గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతి అసూయ చెంది గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పుడు తల్లి ఓదార్చి గంగపై... నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతరం చెందినదని కూడా చెబుతారు.
పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుంటే పెద్ద వదిన పాలలో విషయం కలిపి మరదలికి తాగించి చంపి వేసి ఆ తర్వాత ఊరి బయట పాతి పెట్టింది. అక్కడ అడవి తంగేడు చెట్టు పుట్టి విరగబూసింది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు పూలిద్దామని దెంపబోతే ఆమె ఆత్మ తన మరణం గురించి చెబుతుంది. అప్పుడు అన్నలు- నీకు ఏం కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలల్లో తనను చూసుకొమ్మని, ఏటా తన పేరిట పండుగ చేయండని అనడంతో ఈ పండుగ ఏర్పడినట్లు మరో కథ ప్రాచుర్యంలో ఉంది. చాలాకాలం కిందట సంతానం లేక పరితపిస్తున్న దంపతులకు ఓ అమ్మాయి దొరకగా, వారు అమ్మవారి ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. ఆమె పలు మహిమలు చూపుతూ లోకహిత కార్యాలు చేయడంతో ఆమె చుట్టూ చేరి దైవ స్వరూపంగా మహిళలు కొలువగా ఈ పండుగ వచ్చిందని ఓ కథ. ఒక జంటకు కలిగిన పిల్లలు మరణిస్తుంటే పార్వతిని ప్రార్థించారట. ఆమె దయతో ఒక కూతురు జన్మించగా బతుకుతుందట. ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేయడంతో ఈ పండుగ వచ్చిందని చెబుతారు. చోళరాజైన జైన ధర్మాంగదుడు, అతని భార్య సత్యవతికి కలిగిన వంద మంది కుమారులు యుద్ధ రంగంలో చనిపోగా లక్ష్మీదేవిని తమ కుమార్తెగా జన్మించమని ప్రార్థించగా ఆమె తమ కూతురై జన్మించిన సందర్భంలో సమస్త మునులు రాజు ఇంటికి వచ్చి చిరకాలం బతుకమ్మా.. అని ఆశీర్వదించగా ఈ పండుగ ఏర్పడినట్లు కూడా పెద్దలు చెబుతారు.
*
తొమ్మిది రోజుల వేడుక

ఒక్కోరోజు ఒక్కో రూపంలో బతుకమ్మను పూజిస్తారు.
మొదటి రోజు: ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు: అటుకుల బతుకమ్మ
మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నాలుగో రోజు: నానే బియ్యం బతుకమ్మ
ఐదో రోజు: అట్ల బతుకమ్మ
ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
ఏడో రోజు: సకినాల లేదా వేపకాయల బతుకమ్మ
ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ

ఎంగిలి పువ్వుల బతుకమ్మ
బతుకమ్మ నవరాత్రుల్లో మొదటిరోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పూలను ఒకరోజు ఉమదే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటిరోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చుకుంటారు.
అటుకుల బతుకమ్మ
రెండోరోజునాడు ఉదయానే్న అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డిపూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలిసి ఆడుకొని సాయంత్రం చెరువల్లో వేస్తారు. రెండోరోజు అటుకులు వాయనంగా పెడతారు.
ముద్దపప్పు బతుకమ్మ
మూడోరోజు బతుకమ్మను మూడంతరాల్లో చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రల్లో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటలు కాడ అందరూ కలిసి ఆడవారు ఆడుకుని చెరువుల్లో వేసి వస్తారు. ఈ రోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కెర, బెల్లం కలిపి పెడతారు.
నానే బియ్యం బతుకమ్మ
నాలుగో రోజు నానబియ్యం ఫలహారంగా పెడతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ పంచదారతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.
అట్ల బతుకమ్మ
ఐదో రోజు తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి పూలను అయిందరాలుగా పేర్చి బతుకమ్మను ఆడతారు. ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడతారు.
అలిగిన బతుకమ్మ
ఆరో రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించరు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరో రోజు బతుకమ్మను ఆడరు.
వేపకాయల బతుకమ్మ
ఏడో రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతిచ గులాబీ పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. పప్పు బెల్లాలను నైవేద్యంగా పెడతారు.
వెన్నముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డిపువ్వు.. మొదలైన పూలతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటల మధ్య చెరువులో వేస్తారు. ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ఇస్తారు.
సద్దుల బతుకమ్మ
ఇదే చివరి పండుగరోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు మహిళలు చాలా ఉత్సాహంగా ఆడతారు. పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారుచేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకుని బతుకమ్మను వేసిన తరువాత గౌరమ్మను పూజించి వారి చెంపలకు పసుపును రాసుకుంటారు. చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడేవరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్నా వారి సొంత ఊరికి చేరుకుని ఆడపిల్లలు అందరూ కలిసి ఆనందంగా బతుకమ్మను ఆడుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు.
*
బతుకమ్మ పాట
మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి, ప్రకృతితో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక ప్రకృతితో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండుగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి ప్రకృతితో మమేకమైపోతారు.. అదే బతుకమ్మ పండుగ గొప్పతనం.
శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో
శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో
చెయ్యబోతినమ్మ ఉయ్యాలో
కాపాడు మమ్మేలు ఉయ్యాలో
కైలాస రాణి ఉయ్యాలో
శంకరా పార్వతి ఉయ్యాలో
శంబు రాణివే తల్లి ఉయ్యాలో
తల్లి నినె్నప్పుడు ఉయ్యాలో
ధ్యానించెదమ్మ ఉయ్యాలో
కాపాడు మమ్మేలు ఉయ్యాలో
కైలాస రాణి ఉయ్యాలో
అంభికా నాకిదే ఉయ్యాలో
విడిసద ఉయ్యాలో
ఆకాశ గంగతో ఉయ్యాలో
ఆచుమించుము తల్లి ఉయ్యాలో
పసుపు కుంకుమ నీకు ఉయ్యాలో
పట్టదమే తల్లి ఉయ్యాలో
సారె చీరెలు నీకు ఉయ్యాలో
పెట్టెదమే తల్లి నీకు ఉయ్యాలో
పువ్వులు, బుకలు నీకు ఉయ్యాలో
చల్లెదము నీకు ఉయ్యాలో
అత్తరు, పన్నీరు ఉయ్యాలో
చల్లెదమమ్మ నీకు ఉయ్యాలో
పట్టుచీరెలు నీకు ఉయ్యాలో
పెడుదము మా తల్లి ఉయ్యాలో
నిద్రపోవే తల్లి ఉయ్యాలో
నిద్రపోవమ్మ తల్లి ఉయ్యాలో
నిద్రకు నూరేళ్లు ఉయ్యాలో
నీకు వెయ్యేళ్లు ఉయ్యాలో
నిను కన్నతల్లికి ఉయ్యాలో
నిండా నూరేళ్లు ఉయ్యాలో
*

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి