శరీర భాష
Published Saturday, 28 September 2019‘ఏంవాయ్, మై డియర్ వెంకటేశం! ముఖం వేలవేశావ్’ అంటాడు గిరీశం తన శిష్యుడితో. ఆ అబ్బాయి తీరు చూస్తేనే నీరసంగా ఉన్నాడన్న సంగతి గురువుకు అర్థమయిపోయింది. ఎలెక్షన్‌లు జరగకముందే కొంతమంది నాయకుల ముఖంలో కనిపించిన వాలకం చూస్తే, ఇక ఈ వ్యక్తి గెలిచే అవకాశం లేదూ అన్న సంగతి ముందే అందరికీ అర్థమయి పోయింది. ఈ రకం చెపుతూ పోతే మనిషి గురించి నోరు విప్పనవసరం లేకుండానే అన్ని సంగతులు ఎదుటి వారికి తెలిసిపోతాయి అన్న విషయం స్థిరం అవుతుంది.
చాలాకాలంగా శరీరం మాట్లాడుతుంది అన్న అంశాన్ని గురించి రకరకాలుగా చెపుతూనే ఉన్నారు. అతని ముఖం వెలిగిపోతున్నది, నడకలో రాజసం కనిపిస్తున్నది, అంగాంగాలలో అధికారం ప్రతిబింబిస్తున్నది వంటి మాటలు మనకు పరిచయమయినవే. రాజకీయ నాయకులు కానీ, వెంకటేశం కానీ మాట్లాడకుండానే వారి మనసులలోకి తొంగి చూడడం మనకు కూడా సరదాగానే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మాట తీరు ఒక రకంగానూ, మనిషి తీరు మరొక రకంగానూ ఉండి ఎదుటి వారిని తికమక పెట్టడం అందరికీ అనుభవంలో ఉంటుంది. నోటితో మెచ్చుకుంటూ నొసటితో వెక్కిరించే రకం అని కొందరిని అనడం తెలిసే ఉంటుంది. ఎదుటి మనిషి భావాలను శరీరంలోని కదలికల ద్వారా తెలుసుకో గలుగుతాము అన్న భావన శాస్తప్రరంగా కూడా గట్టిగా ఉండేది. పెద్ద ఉద్యోగాల ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు బోర్డులో ఉన్న నిపుణులలో ఒకతను ఏ ప్రశ్నలూ అడగకుండానే చెపుతున్నదా? లేక ఇది కేవలం సరదా మాత్రమేనా? మనిషిని పట్టి ఇచ్చే కదలికలు అంటూ ఏవైనా ఉన్నాయా? మనం మన శరీర భాషను మార్చుకోవచ్చునా? ఇవన్నీ చాలా ఆసక్తికరమయిన ప్రశ్నలు.
’60 దశకం నుంచి మొదలు అల్బర్ట్ మెహ్రాబియాన్ అనే పరిశోధకుడు చెప్పిన ఒక అంకెను పట్టుకుని అందరూ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మనిషి భాషలో 93 శాతం శరీరం పలుకుతుందని, ఇక నోరు పలికేది ఏడు శాతం మాత్రమేనని ఆ పరిశోధకుడు అప్పట్లో అన్నట్టు ఉన్నాడు. అతను కూడా నిజానికి తన మాటలను గట్టిగా నమ్మినట్టు కనిపించదు. భావావేశంతో ఒక మాట చెపుతున్నప్పుడు గొంతు, ముఖం ఒక రకంగా ఉంటాయి. పలికిన మాట మరొక రకంగా ఉంటుంది అని అతను చెప్పగలిగాడు. పాన్ పసంద్ అనే మిఠాయి టి.వి. ప్రకటనలో కిరాయి కోసం వచ్చిన ఇంటి యజమాని చాలా ప్రేమగా కిరాయి అడిగినట్టు కనిపించేది, వినిపించేది. నోటితో ఒక క్రూరమయిన మాటను చాలా మృదువుగా, ప్రేమగా పలికినప్పటికీ అది తిట్టు అన్న సంగతి అర్థం కాకుండా ఉండదు. ఇటువంటి కొన్ని ప్రయోగాలు చేసి మెహ్రాబియాన్ మాటలకు ఏడు శాతం మాత్రమే ప్రభావం ఉంది అన్నాడు. 38 శాతం గొంతు తీరులో భావం తెలుస్తుంది అన్నాడు. మిగతా 55 శాతం శరీరం మాట్లాడుతుంది అన్నాడు. అయితే ఇవన్నీ ఒక వ్యక్తి తన ఇష్టాయిష్టాలను గురించి చెపుతున్నప్పుడు మాత్రమే సత్యం అవుతాయని అతను గట్టిగా చెప్పాడు. నా సిద్ధాంతాన్ని అన్ని సందర్భాలకు దయచేసి వాడకండి అని కూడా అభ్యర్థించాడు. కానీ గణాంకాల మీద ప్రేమ ఉన్న వారందరూ అతని 93+7 సిద్ధాంతాన్ని పేర్కొంటూనే వచ్చారు.
నిజంగా మనిషి మనసులోని విషయాలను 93 శాతం వరకూ కేవలం శరీరాన్ని చూసి అర్థం చేసుకోవడం వీలయితే మనకు అన్ని భాషలు అవసరం వచ్చేది కాదు. ఒక్కొక్కరూ ఇన్ని భాషలు నేర్చుకోవలసిన అవసరం అంతకన్నా వచ్చేది కాదు. అబద్ధం చెప్పి ఎవరూ బయటపడే వారు కూడా కారు.
అందరూ హాయిగా అబద్ధాలు ఆడగలుగుతారు. కొందరు అందంగా అబద్ధం ఆడి అందరినీ నమ్మించగలుగుతారు. అప్పుడప్పుడు అబద్ధం ఆడడం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. అయితే ఎదుటి వారి అబద్ధాలు ఆడితే మాత్రం మనం చిక్కులో పడతాము. శరీర భాష గురించి ఈ అబద్ధాలను వెలికి తీసే చోట వచ్చినంత ప్రసక్తి మరెక్కడా రాదు. నేరస్థులు ఆడిన అబద్ధాలను రుజువు చేయడానికి లై డిటెక్టర్ పరీక్షలు ఇవాళటికీ కొనసాగుతున్నాయి. అబద్ధం ఆడేవారు ముక్కు గోక్కుంటారని, కుడి పక్కకు చూస్తారని, మరేవో కొన్ని పనులు చేస్తారని అందరూ అనుకున్నారు. అందులో నిజానికి చాలామటుకు ఆలోచనలు వీగిపోయాయి.
అబద్ధం ఆడేవారు కుడివేపు చూడడం గురించి ఇటీవలి కాలంలో కూడా తీవ్రంగా పరిశోధనలు జరిగాయి. అంతా అబద్ధమే అని రుజువయి పోయింది. నిజానికి అబద్ధం ఆడేటప్పుడు కళ్ల తీరు మారుతుందని, మనుషులు కూచున్న చోటే అటూ ఇటూ కదులుతుంటారని, చేతులు నులమడం, ముఖం తుడవడం వంటివి చేస్తారని కొంతకాలం గమనించారు. బోలెడన్ని పరిశోధనలు జరిగిన తరువాత అబద్ధాలను గుర్తించడానికి అసలు మార్గం పరీక్షకు కూచున్న వ్యక్తి మాటలు మాత్రమే అని తేలిపోయింది. అయితే గొంతెత్తి మాట్లాడటం, వీలయినంత తక్కువ సమాచారం ఇవ్వడం, నమ్మకం కలిగించడానికి అన్నట్టు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పడం లాంటి కొన్ని లక్షణాలు సూచనలుగా పనికి వస్తాయని తెలిసింది. నిజానికి అబద్ధాన్ని గుర్తించాలంటే ఎదుటి మనిషికి లేదా ఆ ప్రయత్నం చేస్తున్న మనిషికి అందుకు సంబంధించిన భావన అనుకోకుండా కలగాలి అని తేల్చారు. శరీర భాష మీద ఆధారపడితే తేలేది ఏమీ లేదని కూడా గట్టిగా గుర్తించారు. అయినప్పటికీ, జడ్జ్‌లు, పోలీసులు, నేర పరిశోధనలోని మిగతా అధికారులు తమ పాత పద్ధతుల మీద నమ్మకం వదలడం లేదు.
ఉపన్యాసం ఇచ్చేవారికి చేతులను తెగ తిప్పడం బాగా అలవాటుగా ఉంటుంది. మరి కొంతమందికి ఆ చేతులను ఏం చేసుకోవాలో అర్థం కాదు. సాధారణంగా జేబులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అది దాచి పెడుతున్నారనడానికి సూచన అన్న అపార్థం కూడా లేకపోలేదు. చేతులతో పెద్ద చిక్కే వస్తుంది. టి.వి.లో వచ్చే వ్యాపార ప్రకటనల్లో ఇంతకంటే మరో మార్గం లేదు. ఇంతకన్నా మంచి వస్తువు లేదు అని చెప్పడానికి రెండు చేతులను పైకి ఎత్తి అరచేతులను పైకి పట్టి చూపించడం ప్రకటన సంస్థల వారికి ఒక ప్రమాణంగా మారిపోయింది. అరచేతులు ముందుకు చాచి చూపిస్తే అంతకన్నా మంచి వ్యక్తులు లేరు, అటువంటి వారిని సులభంగా నమ్మవచ్చు అన్న భావన కూడా ఒకటి ఉంది.
ఇన్ని భాషలు ఉండగా ఒక శరీర భాష కూడా పుట్టింది. అందులో కొన్ని కదలికలకు మాత్రం ప్రపంచమంతటా ఒకే అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆటలో గెలిచిన వారు తమ రెండు చేతులను ‘వి’ ఆకారంలో పైకి ఎత్తుతారు. గుడ్డివాళ్లు కూడా ఇదే రకంగా పైకి ఎత్తారు అని పరిశోధకులు గమనించారు. విజయాన్ని సూచిస్తున్న ఆ మనుషులు ముఖాన్ని కూడా పైకి ఎత్తుతారు. ఇక ఓడిన వారు భుజాలు కుంచించుకుని కిందకు చూస్తూంటారు. టెన్నిస్ క్రీడాకారులు పాయింట్ పోయిన సందర్భాలలో కూడా ముఖంలో ప్రత్యేకమయిన తీరు కనబరుస్తారని కూడా పరిశోధకులు గమనించారు.
మన దేశంలో ఒక విషయాన్ని కాదు అనడానికి తల అడ్డంగా ఆడించి చూపిస్తాము. కానీ ప్రపంచమంతటా ఆ కదలికకు అదే అర్థం లేదు. ఈ రకంగా శరీర భాషకు ఒక డిక్షనరీ తయారు చేస్తే అది చాలా దూరం పోతుంది. అటువంటి వివరాలకు ఇది సందర్భం కాదు.
ఇక మనుషుల నడక, కదలికలలో చాలా భావాలు బయటపడతాయని చెపుతున్నారు. అమ్మాయిల నడక ఇంచుమించు నాట్యంలా ఉండి ఎదుటి వారిని ఆకర్షిస్తుంది అని చాలామంది పరిశీలించారు. ఆ నడక తీరు కూడా నెల మొత్తం ఒకేలాగ ఉండదట. వారి లైంగిక పరిస్థితిని నడక మారుతుంది అంటున్నారు. జంతువులలాగే మనుషులలో కూడా ఆడ, మగ ఆకర్షణకు శరీరం సూచనగా ఉంటుంది అని అర్థం. లైంగిక భావనలను కేవలం శరీరం కదలికలతో అంచనా వేయడానికి పూనుకుంటే కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఆడ మనిషికి ఎదుట నున్న పురుషుని మీద ఆసక్తి కలిగితే అనవసరంగా జుట్టును సవరించుకుంటుంది. గుడ్డలు సరిచేసుకుంటుంది. ఊరికే కదులుతుంది. నేరుగా కళ్లలోకి చూస్తుంది అని కొంతమంది గమనించారు. అయితే ఆడవాళ్లు ఒక మగ మనిషిని కలిసిన మొదటి నాలుగు నిమిషాలలో అందరితోనూ ఈ రకమైన ప్రవర్తన కనబరుస్తారు. ఒక నాలుగయిదు నిమిషాలపాటు ఎదుటి మనిషిని కొంత అంచనా వేస్తారు. ఆ తరువాత కూడా శరీర భాషలో సంకేతాలు కనిపిస్తే అప్పుడు లైంగికత గురించి ఆలోచించాలి అన్నారు పరిశోధకులు. మొత్తానికి శరీర భాషను అర్థం చేసుకోవడంలో తప్పులు చేసిన వారే ఎక్కువ అని తెలుస్తున్నది. నడకను, నడవడిని మార్చి ఎదుటి వారిని ఏమార్చే వారు కూడా ఉన్నారని పరిశోధకులు గమనించారు.