మరకతవల్లీం.. మనసా స్మరామి
Published Saturday, 28 September 2019ఉ.అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి రుూవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
మన తెలుగు భాషలోని లాలిత్యం, సౌకుమార్యం, అర్థ గాంభీర్యం, సరళత్వం ఎంత గొప్పగా ఉంటాయో తెలుసుకోవటానికి ఒక పోతన పద్యం చాలు. అందుకే ఆయన కవులకూ, గాయకులకూ చిరస్మరణీయుడు. అన్ని భాషలకూ, మూలమై తల్లిగా భావించే సంస్కృత భాషకు ఎంతటి గౌరవ స్థానముందో వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నో శతాబ్దాల క్రితం కవులందరి కంటే ముందు పుట్టిన మహాకవి కాళిదాసు ఎంతటి ప్రజ్ఞావంతుడో చెప్పేందుకు ఉదాహరణలు ఎన్నని చెప్పి తృప్తిపడగలం? మెప్పించగలం? అసలు ఆ అర్హత ఉందా మనకు? అనిపిస్తుంది.
ఆ మహానుభావుడు నమ్ముకున్న దేవత - మహాకాళి. సర్వ సిద్ధులనూ యిచ్చి జగత్ప్రసిద్ధుణ్ణి చేసింది. తనను భక్తులు ఎలా ప్రసన్నం చేసుకోవచ్చునో, కాళిదాసు ద్వారా లోకానికి చెప్పింది.
‘మాణిక్య వీణా ముపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలా సాం
మాహేంద్రద్యుతి కోమలాంగం
మాతంగ కన్యాం మనసా స్మరామి’ అంటూ అమ్మవారిని ఎలుగెత్తి ఉచ్ఛైస్వరంతో కీర్తించిన కాళిదాసు రూపురేఖలెలా ఉండి ఉంటాయో మనకు తెలియకపోవచ్చునేమో గానీ, ఇలాగే గానం చేసి ఉంటాడేమో అనిపించేంతగా తన సుస్వరసహితమైన కంఠస్వరంతో తారస్థాయిలో ఘంటసాల పాడిన సంగతి మాత్రం మనందరికీ తెలుసు. ఎలా పాడాలో బాగా తెలిసి ఆర్తిగా గానం చేస్తే, దేవతలు, అన్ని పనులూ మానుకుని ప్రక్కనే నిలబడి వింటారు. మనకంటె ఉన్నత స్థానంలో వారిని ‘నీ అంతటి వాడు ఈ లోకంలో ఎవరున్నారు? నువ్వు కాకపోతే ఈ పని ఎవరు చేయగలరు? మరెవరు దిక్కు నాకు? అని, ప్రాధేయపడి అడిగి చూడండి. ప్రసన్నులవకుండా ఎవడైనా ఉండగలడా? పనులు సానుకూలమవ్వవా? దేవతలను ప్రసన్నులను చేసుకోవడానికి మహావిద్వాంసులూ కవులూ భక్తులూ ఈ మార్గానే్న మనస్ఫూర్తిగా నమ్మారు. సత్ఫలితాలు పొందారు. పుట్టు లోభులను ఎవరూ పొగిడేందుకు సిద్ధపడేవారు కాదు.
రాజుల్ మత్తులు వారి సేవ నఱకప్రాయమని మహారాజులనే తృణీకరించిన స్వాభిమానులైన మహానుభావులను స్ఫూర్తిగా తీసుకున్న భక్తుల్లో త్యాగయ్య ముఖ్యుడు.
సంగీతమూర్తి త్రయంలోని ముగ్గురూ అమ్మవారి దయకు పాత్రులైనవారే. వీరిలో శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితులు, ఇద్దరూ దేవీ ఉపాసకులు. శ్యామశాస్ర్తీ కామాక్షీ పదకమల చరణదాసుడు. ‘శ్యామ కృష్ణ సోదరీ’ అనే ముద్రతో ఆ తల్లికి తనను సోదరుడిగా భావించి, నాదార్చనే జీవితంగా అర్చకుడుగా బ్రతికాడు. దీక్షితులు జగన్మాతను మంత్రపూర్వకంగా ఆవాహనం చేసుకుని, సంగీతార్చన గావించిన మహా పండితుడు. వైద్యనాథ క్షేత్రంలో ముద్దు కుమారస్వామి వరప్రసాదిగా జన్మించాడు. త్యాగరాజ కీర్తనలలో సందేశం అంతర్లీనమైతే, మిగిలిన ఇద్దరి రచనలు ఉపాసనా మార్గాన్ని చూపించే దివ్యమైన బీజాక్షర సహిత సంగీత రచనలు. నిజం చెప్పాలంటే అవే రాగ నిధులు. ఆదిశంకరాచార్యుల కాలం నాటికి, శ్యామ శాస్త్రులు వారి పూర్వీకులు కంచిలో బంగారు కామాక్షి విగ్రహానికి అర్చకత్వం వహించేవారు.
క్రమంగా శ్యామశాస్ర్తీ వంశం వారు ఆ అర్చకత్వాన్ని కొనసాగించారు. ఆ తర్వాత తంజావూరు చేరారు. ‘్భలోక చాప చుట్టి’ అనే బిరుదున్న మన ప్రాంతంపు ‘బొబ్బిలి కేశవయ్య’ అనే సంగీత విద్వాంసుడితో సంగీత పోటీలో పాల్గొనవలసి వచ్చినపుడు అమ్మవారిని ఉపాసించి ‘దేవీ బ్రోవ సమయమిదే’ చింతామణి రాగంలో పాడి ప్రసన్నం చేసుకుని ఆ బొబ్బిలి కేశవయ్యను ఓడించారు, శ్యామాశాస్ర్తీ.
తమ్ముడి మీద కోపంతో అన్న జపేశ్యుడు శ్రీరామ పంచాయతన విగ్రహాలను కావేరీ నదిలో విసిరేస్తే, గతిలేని స్థితిలో నిర్వీర్యుడై, చింతాక్రాంతుడై దిక్కుతోచని స్థితిలో త్యాగయ్య క్షేత్ర పర్యటనకు బయలుదేరాడు.
కోవూరు సుందరేశ మొదలియార్ ఆహ్వానంపై ఆయన స్వగ్రామం కోవూరు వెళ్లి అక్కడ నెలకొన్న అమ్మవారిని ప్రార్థించి కోవూరు పంచరత్నాలు రచించి పాడిన త్యాగయ్యకు, ఓ రాత్రి అమ్మవారే కలలో దర్శనమిచ్చి ‘నాయనా! ఎందుకిలా మతి చెడి తిరుగుతావు? నిత్యం నువ్వు పూజించే విగ్రహాలు ఎక్కడికీ పోలేదు. కావేరీ తీరంలో అక్కడే ఉన్నాయి, వెళ్లమని చెప్పిన మాటకు పరమానంద భరితుడై, ఆ సంబరంతో వెళ్లి విగ్రహాలను తెచ్చుకున్నట్లుగా చరిత్ర. అపారమైన అమ్మ కరుణకు అదో గుర్తు. మన శాస్త్రాలు, నిర్గుణ నిరాకారం నుండి సగుణ సాకార విరాట్పురుషుడేర్పడి, మహామాయ వల్ల రమ్యమైన పంచభూతాత్మక ప్రకృతి ఏర్పడిందని చెప్తాయి. శ్రీ మహావిష్ణువుకు లక్ష్మిగా, బ్రహ్మకు వాగ్దేవిగా పరమశివునికి మహాశక్తి పార్వతిగా సహకరిస్తారని పెద్దల వాక్కు.
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః.. పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ॥
అన్నట్లు ‘అర్ధనారీశ్వరులుగా పార్వతీ
పరమేశ్వరుల్ని, భావిస్తాం. వివాహ ప్రక్రియకు నాందీ, భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థపై ఉన్న గౌరవానికి కారణమిదే. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను తనలో సగంగా భావించమన్నాయి శాస్త్రాలు.
‘నారాయణ స్వరూప వరాయ’ అని కాళ్లు కడిగించుకుని కన్యాదానం జరిపించుకున్న వరుణ్ణి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగానూ, ఆశలతో ఇంట్లోకి అడుగుపెట్టే వధువును కలుముల తల్లిగా, చదువుల తల్లిగా చూడమన్నారు విజ్ఞులు.
శ్రావణం తర్వాత భాద్రపదం, ఆ తర్వాత ఆశ్వీయుజం, తదుపరి కార్తీకం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతంతో ప్రారంభమై ధనలక్ష్మీ వ్రతంతో పరిసమాప్తి అయ్యే కాలంలో ఎక్కువ భాగం స్ర్తిరూప దేవతా రాధనకే కేటాయించారు. వరలక్ష్మి, సరస్వతి, దుర్గ, ధనలక్ష్మి ఇలా వివిధ రూపాల్లో మాతృరూపిణిగా శక్తిగా ఆరాధిస్తున్నాం.
మనం పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచీ ఈ పండుగలు అలా వస్తూనే వున్నాయి. వెళ్తున్నాయి. వీటివల్ల సమాజానికి గానీ, అందులోని వ్యక్తికిగానీ ప్రయోజనం ఎంతవరకూ లభిస్తోంది? ఈ పండుగలు ఎలా బ్రతకమంటున్నాయి? వావీ వరసా లేని అత్యాచారాలు, అమానుషమైన చిత్రహింసలు, అకాల మరణాలు, ఒల్లు కొవ్వెక్కి చేసే ప్రేమ హత్యలు, పేపర్లలో చదవటం కాదు, ప్రత్యక్షంగా కళ్లప్పగించి టీవీల్లో చూస్తున్నాం. అవేవో వార్తల్లాగానే పరిగణింపబడుతూ ఉన్నాయే తప్ప, యథార్థం చెప్పాలంటే, మనసులోకి వెళ్లటం లేదు. చూసే వాళ్లకు చీమకుట్టినట్లుగానైనా లేదు. ఏ ఒక్కరికీ స్పందన లేదు. ఒకవేళ పొరబాటున విన్న తర్వాత ఉలిక్కిపడినా, పరిష్కారమేమిటో తెలియని అసందిగ్ధ స్థితి. ఒక తల్లికి కూతురు, ఒక అక్కకు చెల్లెలు, ఒకరికి భార్య, తల్లి తండ్రి.. ఇలా బాంధవ్యాల బంధాలు తలుచుకునే ఇంగిత జ్ఞానం లేని స్థితికి సమాజం జారిపోతోందే? కలహ కంఠులు కాని కలకంఠులు చూపించవలసిన ప్రతాపం అత్తగార్ల మీద కాదు - మత్తగజాలను అదుపు చేయటంలో చూపించాలి. సింహాల్లా పోరాడాలి. దానికి ఇంతకంటే మంచి రోజు లేదు. మన సంకల్పమే మనకు బలం. మన కోసం దిగి వచ్చి ఇక్కడ కొలువైయున్న శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరు బ్రహ్మ విష్ణు శివాత్మికా అయిన నారాయణికీ జరుపుకుంటున్న బ్రహ్మోత్సవ పర్వదిన సమయం కూడా.