S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతరంగుడైన ఆత్మారాముడు

మన భారతీయ రైల్వే ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థల్లో ప్రముఖమైనది. ప్లాట్‌ఫారమ్‌లు శుభ్రం చేసే వారి మొదలుకుని వేలాది మైళ్లు ప్రయాణం చేసే రైళ్లను ఒక పద్ధతిలో నడిపిస్తూ పర్యవేక్షించే అత్యుత్తమ అధికారి వరకూ ఓ జవాబుదారీ తనముంటుంది. ఎనె్నన్ని శాఖలో? ఎంతమంది ఉద్యోగులో? ఉదాహరణకు ప్రయాణీకులను చేరవేసే రైళ్లకు కనీసం 15,20 బోగీలకు తక్కువ ఉండవు. ఒక్కో బోగీలో, 70కి పైగా ప్రయాణీకులుంటారు. వీరందరూ సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే గుండె ధైర్యాన్నిచ్చేది ఇంజన్ డ్రైవరే. మరి ఆ డ్రైవర్ నమ్ముకునేదెవరిని? తన అంతరాత్మను. ఆత్మారాముడి అవసరం డ్రైవర్‌కే. ఇంతమంది ప్రాణాలు తన అప్రమత్తతపై ఆధారపడ్డాయని అనుకోకుండా ఉంటాడా? అందుకే అన్నీ డ్రైవర్‌కు వదిలేసి, హాయిగా పడుకుంటాం. రైలు ప్రయాణం - ఒక్కటే కాదు. ఏ ప్రయాణమైనా అంతే. వాహన చోదకులపైనే బ్రతుకులు ఆధారపడి ఉంటాయి. బ్రతుకు బండిని నడిపేది ‘లోపల దాక్కున్న అంతరాత్మ’. మనల్ని గమ్యస్థానం చేర్చేది, రక్షించేదీ వాడే. మంచి చెడుల తారతమ్యం, న్యాయా న్యాయ విచారణ దయా దాక్షిణ్యాల యొక్క అవసరం.. అన్నీ లోపలి వాడివల్లే పుట్తూంటాయి. పశుపక్ష్యాదులకు తప్ప లోకంలో మనిషై పుట్టిన ప్రతి వాడికీ ఈ జ్ఞానం ఉంది.
చిక్కంతా ‘దీనితోబాటు పుట్టే ‘అహం’ (ఇగో) తానే.
లోపలి వాణ్ణి అణగత్రొక్కేసి ‘నోరు మూసుకోమని హెచ్చరించే దిక్కుమాలిన గుణం ఇదే. కారణం? మరొకరి సలహా కిట్టదు. ‘మాయాతీత స్వరూపుడి మాయ కాబట్టి’. ప్రాణం పోసి ఆడిస్తూ ఆనందించే పైవాడి సంకల్పమే. కాకపోతే ఈ కీలుబొమ్మలు మాట్లాడే మాటలు, ఆటలు, నీతుల కూతలు వినటం ఆయనకో సరదాయే! అందుకే వాడెక్కడ? అని ఎగిరిపడే వాణ్ణి ఆయాసం వచ్చి అలిసిపోయేదాకా ‘అరవనీలే’ అనుకుంటూ దోబూచులాడుతూంటాడు.
మరోపక్క తన విశ్వవ్యాపకతనీ, సర్వశక్తుడననే సత్యాన్ని మన ఊహకందనంతగా చూపిస్తూంటాడు.
యుగ యుగాలుగా ఎనె్నన్ని కథలు వినలేదు మనం?
పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషింపూచున్ హాస
లీలా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ భక్షింపుచున్ సంతత
శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై నుండెన్ సురారి సుతుడేత ద్విశ్వమున్ భూవరా!
అంటాడు భాగవతంలో పోతన.
పట్టుమని పదేళ్లు నిండకుండానే, హరి ఎలా ఉంటాడో? తెలియని ప్రహ్లాదుడి దినచర్య యిది. ఆ అమాయకుడైన భక్తుడికి ఎవరు చెప్పారు? ఎంత పెరిగి ఏం లాభం? ఎన్ని వరాలున్నా, ఎంత సంపాదించినా ఏమిటి ప్రయోజనం?
ముక్కుపచ్చలారని వాడికున్న ఈ కాస్త ఇంగితజ్ఞానం తండ్రికి లేదు. అదీ ప్రారబ్దమంటే. పానీయం తాగేప్పుడు, దాహం తీరిన వేళ ప్రహ్లాదుడికి దైవమే కనిపిస్తున్నాడు. ఆహారం తీసుకున్న వేళ.. ఆకలి తీరుతోంటే కూడా దైవమే కనిపిస్తున్నాడు. ఆకలీ వాడే, అన్నమూ వాడే. రుచిగా అనుభవానికి రావడానికీ కారణం వాడే. వీటన్నింటి వల్లా దేహాన్ని పోషిస్తున్నదీ పైవాడే.
దేహమూ, దేహి రెండూ దైవమే అన్న భావన కలిగిన ప్రహ్లాదుడు కర్తవ్య నిర్వహణలో భాగంగా చేసే సంభాషణల్లో, దైవమే అనుభవాని కొస్తున్నాడు.
మాట్లాడుతున్నది దైవం. మాటలు దైవం. ఎవరితో మాట్లాడుతున్నాడో వాడే దైవం. అన్నిచోట్ల దైవమే కనిపిస్తున్నాడు. రాక్షస కులంలో పుట్టినా జీవన వ్యాపారమంతా ఒక ఆరాధనా భావంగా సాగిన పరమభక్తుడైన ప్రహ్లాదుడికి శ్రీమన్నారాయణ దర్శనం లభించటంలో ఆశ్చర్యముందా చెప్పండి? ఏ యుగంలోనైనా ఈ భావాలున్న ఎవరికైనా ఏ సామాన్యుడికైనా ఇది సాధ్యమే. కందువగు హీనాధికము లిందులేవంటాడు అన్నమయ్య. ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం అనుకుని బ్రతికే వారికి ఈ మాటలు తలకెక్కవు.
నిజానికి పూజ, అర్చ అనేది, సీరియస్‌గా భయపడుతూ చేయక్కర్లేదు. పూజా మందిరంలో బిగుసుకు పోయి సైగలేవో చేసేస్తూ అల్లరి చేయనక్కర్లేదు.
ఆడవచ్చు. పాడవచ్చు. హాయిగా బ్రతకవచ్చు. అంతేగానీ మూతి ముడిచేసుకుని నొసలు చిట్లించుకుని, ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకునే వారి మీద చిర్రుబుర్రులాడుతూ చేసే పూజ పూజవుతుందా? ఎందుకా పూజ? ఎవరి కోసం?
‘హాసలీలా నిద్రాదులు సేయుచున్’ అంటాడు పోతన.
సందర్భాన్నిబట్టి ప్రహ్లాదుడు నవ్వుతాడు. లీలగా నర్తిస్తాడు. అందులో కూడా ఆ దైవాన్ని అనుభవిస్తున్నాడు. దైవమే చిరునవ్వుగా మారి అతడి పెదవులపై పూయిస్తున్నాడు.
పరమాత్మ ప్రతి హృదయ పీఠంలోనూ సుస్థిరంగా నెలకొని ఉన్నాడు.
ఒక్కపూట అతిథిగా ఎవరింట్లోనైనా భోజనం చేశామనుకోండి. ఆ యజమానిని మరిచిపోగలమా?
రోజూ మనకు ఆకలిని కలిగించి, తిన్న పదార్థాన్ని క్రమం తప్పకుండా జీర్ణం చేస్తూ శరీరం నిలబడేందుకు కావలసిన శక్తినీ బలాన్నీ, మన కళ్లకు కనిపించకుండా ప్రసాదిస్తున్న అంతరాత్మ కంటే దగ్గర బంధువుంటాడా? చిన్నా చితకా రుగ్మతలను దూరం చేసే రోగ నిరోధక శక్తిని కూడా ఈ శరీరానికిచ్చాడే? ఈ అంతరాత్మ లోపలే ఉన్న సంగతే మరిచిపోయే స్థితికి దిగజారితే ఏది గత్యంతరం? అందుకే న్యాయాన్యాయములను బోధించి, కృత్యాకృత్యములను తెలిపించి ప్రత్యేకుడు నీవని కనిపించి భృత్యుడైన త్యాగరాజు చెయ్యి పట్టి విడువరాదు’ అని దీనంగా అడుగుతాడు త్యాగరాజు.
జీవిత బీమా సంస్థ నినాదం ‘యోగ క్షేమం వహామ్యహమ్’ భగవద్గీతా శ్లోకానికి కొసమెరుపు.
అనన్యాశ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్
ననే్న ధ్యానిస్తూ అనన్య చింతనతో బ్రతికేవాడి హృదయంలోనే నిత్యం ఉంటూ వాడి యోగ క్షేమాలను నేనే చూసుకుంటానన్నాడు.
జగమేలే పరమాత్మ తన అంతరంగంలోనే ప్రతిష్టుతుడైన సంగతి తెలిసిన వారి జీవితంలో హెచ్చుతగ్గులుండవు.
వారి మాట చేత ఒకేలా ఉంటాయి. లేనివారి మాటలు పైకి ఒకలా ఉంటాయి. లోపల ఆలోచనలు మరోలా ఉంటాయి.
ఊసరవెల్లుల్లాంటి రాజకీయ నాయకులు, విమర్శకులు నిత్యం టీవీల్లో దర్శనమిస్తూ చేసే చర్చాగోష్టుల్లో అంతరాత్మల నోళ్లు మూసేస్తూ ఎలా మాట్లాడతారో మనకు అనుభవమే. వారికదో కాలక్షేపం. సత్యదూరమైన విషయాలు, సిద్ధాంతాలు, వాదనలు, నిజానిజాలు తెలిసినా మనకది ఒక వినోదం.
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా?
అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంగుష్ట మాత్ర దేహంతో మన లోపలే తిష్టవేసి కూర్చున్న వాడికంతా ఎఱుకే.

- మల్లాది సూరిబాబు 90527 65490, 9182718656