S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నచ్చిందా.. అవసరమా?

ఒక వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేందుకు అనేక పరీక్షలు ఉంటాయి. అలానే మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉండబోతుందో తేల్చడానికి కూడా ఒక చిన్న పరీక్ష ఉంది. మీరు ఒక వస్తువును కొనే పద్దతిని బట్టి మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తును అంచనా వేయవచ్చు.
ఒక వస్తువును కొనేప్పుడు నచ్చింది కాబట్టి కొంటున్నారా? అవసరం కాబట్టి కొంటున్నారా? ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు అనే దాని బట్టి మీ ఆర్థిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
అమెరికాలో జరిపిన ఒక సర్వేలో దాదాపు 80 శాతం మంది నచ్చిందని కొంటున్నారు కానీ అవసరంతో కాదట! ఈ స్థాయిలో కాకపోయినా మన వద్ద కూడా ఇలా కొనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అవసరంతో కాకుండా ఎమోషన్‌తో కొత్త వస్తువులను కొనేస్తున్నారు. ఆ వస్తువు కొనడం వల్ల ఆర్థికంగా ఎలా ప్రభావం పడుతుంది అనే అంశంపై పెద్దగా ఆలోచనలు ఉండవు. వడ్డీ లేకుండా నెలసరి వాయిదాలపై లెటెస్ట్ సెల్‌ఫోన్ అమ్మకానికి కనిపించగానే కొనకుండా ఉండలేరు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, అడ్రస్ ఫ్రూప్ కూడా అవసరం లేదు. లెటెస్ట్ మోడల్ సెల్‌ఫోన్ తీసుకు వెళ్లండి అనగానే అడుగులు అటువైపు పడుతున్నాయి అంటే... మిమ్ములను మీరు సమీక్షించుకోవాలి.
సెల్‌ఫోన్లు, కొత్త కొత్త మోడల్ టీవిలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒక్క సంతకం చేస్తే చాలు అవి ఇంట్లో వాలిపోతాయి. అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. నెల నెలా వాయిదాలు కట్టాలి. కొన్ని కంపెనీలైతే ఏకంగా తొలి వాయిదాను వారే కడుతున్నారు. ఎలాగైనా మిమ్ములను ఆకర్శించడమే వారి లక్ష్యం. దాని కోసం అందమైన మోడల్స్‌తో చక్కని ప్రకటనలు గుప్పిస్తారు.
అవసరం ఉంది కాబట్టి కొంటున్నానా? లేక నచ్చి కొంటున్నానా? అని తమను తాము ప్రశ్నించుకునే వారు ఇలాంటి అందమైన ప్రకటనల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకొంటారు.
మీరు ఎలా ఖర్చు చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మీ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
చాలా మంది కొత్త మోడల్ అనగానే సెల్‌ఫోన్ కొనేస్తారు. సాధారణంగా సెల్‌ఫోన్‌ను మాట్లాడేందుకు, ఎస్‌ఎంఎస్‌లు, ఫోటోలు తీయడం వంటి సాధారణ పనుల కోసమే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్ అని ప్రకటనలు కనిపించగానే మనసు అటువైపు వెళుతుంది. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోన్‌తో పని జరగడం లేదా? నిజంగా ఆ కొత్త ఫీచర్ల అవసరం ఉందా? వాటిని ఉపయోగిస్తామా? అనే ఆలోచన కూడా లేకుండా కొత్త సెల్‌ఫోన్‌ను సొంతం చేసుకుంటారు.
ఇలాంటి వారి ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమే. చేసే ఉద్యోగంలో ఏదైనా తేడా వచ్చినా? ఆదాయం తగ్గినా నిండా అప్పుల్లో మునిగిపోయే వారు ఇలాంటి వారే.
సెల్‌ఫోన్ కావచ్చు, టీవి కావచ్చు ఇంట్లోకి ఫర్నీచర్ కావచ్చు. చివరకు దుస్తులు కావచ్చు కంటికి నచ్చిందని కొంటున్నారా? లేక అవసరం అని కొంటున్నారా? మీకు మీరే ప్రశ్నించుకొని . అవసరమే అనే సమాధానం వస్తేనే కొనండి. మార్కెట్‌లో కంటికి నచ్చిందని కొని అసలు ఉపయోగించని వస్తువులు ప్రతి ఇంట్లో చాలానే ఉంటాయి. ఇలాంటి అలవాట్లే మీ ఆర్థిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
జీవితమంతా లెక్కల మయమేనా? నచ్చిన వస్తువు కొనవద్దా? అంటే అలా అని కాదు. నచ్చిన వస్తువు కొనడం తప్పు కాదు కానీ దాని వల్ల ఎలాంటి భారం పడుతుంది అనే ఆలోచన ముఖ్యం. చిన్న చిన్న కోరికలను కూడా అణిచిపెట్టుకోవలసిన అవసరం లేదు. నచ్చిన వస్తువు కొనడం, నచ్చిన చోటుకు వెళ్లడం, నచ్చిన హోటల్‌కు వెళ్లడం తప్పేమీ కాదు కొద్ది పాటి ఖర్చుతో నచ్చిన పని చేయడం వల్ల జీవితం ఉత్సాహంగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు తప్పేమీ కాదు. కానీ కుటుంబ బడ్జెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపించే ఖర్చులపై ఆలోచన అవసరం. ఆదాయానికి మించిన ఖర్చు వద్దు. ప్రాధాన్యతలు గుర్తించకుండా ఖర్చులు వద్దు. వాయిదాల్లో బందీ అయితే అత్యవసరమైన ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటి బడ్జెట్ తలక్రిందులవుతుంది.
ఎమోషనల్ కొనుగోళ్లను అడ్డుకోవడానికి నిపుణులు ఒక చిన్న చిట్కా వివరించారు. కొత్త మోడల్ సెల్‌ఫోన్ వచ్చింది ... చాలా ఫీచర్లు ఉన్నాయి కొనాలా? చిన్న చిన్న కోరికలను కూడా అదుపులో పెట్టుకొని బతకాలా? అనుకుంటే ఈ చిట్కాను అమలు చేయవచ్చు.
సెల్‌ఫోన్ ఖరీదు 25వేలు అనుకుంటే మీ సేవింగ్ ఖాతాలో లక్షా పాతిక వేలు అంటే సెల్‌ఫోన్ ఖరీదు కన్నా ఐదింతలు ఉంటే కొనుక్కోవచ్చు. అలా కాకుండా పాతిక వేలు మాత్రమే ఉంటే ఆ డబ్బుతో సెల్‌ఫోన్ కొంటే అత్యవసర ఖర్చు వస్తే ఏం చేస్తారు. కొందరు సేవింగ్ ఖాతాలో ఏమీ లేకపోయినా వాయిదాలపై కొంటున్నారు. అది అవసరమా?
ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల వారిని కంపెనీలు టార్గెట్ చేసుకుంటున్నాయి. ఎమోషనల్ పర్చెసింగ్‌తో దెబ్బతింటున్నది వీళ్లే. ఎమోషనల్ పర్చెసింగ్‌కు బదులు తెలివిగా ఆలోచించాలి ఈ వస్తువు మనకు అవసరమా? ఇప్పుడే అవసరమా? ఈ ధరతో అవసరమా? అనే ఆలోచన చేసి అవసరం అని తేలిన తరువాతనే కొనుగోలు చేయాలి. ఒక వస్తువును కొనే ముందు ఇలా మిమ్ములను మీరు ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకుంటే ఖర్చు మీ అదుపులో ఉంటుంది. ఏ ఖర్చు అయినా సరే ఇష్టమా? అవసరమా? అని ప్రశ్నించుకుంటే మీ ఆర్థిక ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. భవిషత్తు ప్రశాంతంగా ఉంటుంది.

-బి.మురళి