S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మోసం చెయ్యవద్దు

ఒక ఊళ్లో పరంధామయ్య అనే లోభి ఉండేవాడు. ఆయన ఎంగిలి చేత్తో కాకిని తోలకపోయేవాడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టకపోయేవాడు. దానధర్మాలు అంటే పరంధామయ్యకు అసలే గిట్టవు. మనుషులు తమ తమ పూర్వజన్మ పాపకర్మల వల్ల బీదవారుగా పుడతారని, దేవుడు వాళ్లను అలా పుట్టించటం వాళ్లను శిక్షించటానికేనని, బీదవాళ్లను మన దానధర్మాలతో ఆడుకోవటం వల్ల, మనం దేవుడి అభిమతానికి వ్యతిరేకంగా నడిచిన వాళ్లమవుతామనేవాడు. అలా నడిచి, దేవుడికి కోపం తెప్పించకూడదనేవాడు.
పరంధామయ్య వితండ వాదాన్ని గమనించి దేవుడు కూడా విసుగుకునేవాడు.
ఒకసారి పరంధామయ్యకు జబ్బు చేసింది. మంచంలోనే ఉండిపోయాడు. ఎక్కడికీ కదలటానికి కూడా ఆయనకు శక్తి లేకుండా పోయింది. గచ్చాకు పచ్చాకు వైద్యం చేయించుకున్నాడు. కానీ ఫలితం లేకపోయింది. బంధువులు మిత్రులు దగ్గరలో ఉన్న పెద్ద ఊరిలో మంచి డాక్టర్లతో వైద్యం చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. పెద్ద ఊరికి వెళ్లటం, మంచి డాక్టర్‌ను సంప్రదించటం, డాక్టర్ ఫీజులు, పరీక్షలు, ప్రయాణం ఖర్చులు, ఇవన్నీ లెక్క వేసుకున్నాడు పరంధామయ్య. బోలెడంత సొమ్ము అయింది. అంత పెద్ద మొత్తాన్ని చూసిన పరంధామయ్య గుండె గుభేలుమంది. ‘అమ్మో.. ఇంత ఖర్చా?’ అనుకుని గుండెలు బాదుకున్నాడు. ఆయనకు ఎటూ పాలుపోవటం లేదు. మరింత అశ్రద్ధ చేస్తే పరంధామయ్య ప్రాణాలకే ముప్పు అని స్నేహితులు హెచ్చరించారు.
ఒకనాడు పరంధామయ్య స్నేహితుడు ఒకరు ఆయన్ను చూడటానికి వచ్చాడు. తన స్థితి చెప్పుకుని పరంధామయ్య కన్నీరు మున్నీరయ్యాడు. స్నేహితుడికి జాలి వేసింది. ఖర్చుతో కూడిన మానవ ప్రయత్నాలు ఏవీ చేయటానికి ఇష్టపడటం లేదు కనుక ఆయన పరంధామయ్యకు ఒక సలహా ఇస్తాడు. అదేంటంటే - ఆయన దేవుడిని వేడుకోవటం. ఖర్చులేని ఈ సలహా పరంధామయ్యకు వచ్చింది. దేవుడిని ప్రార్థించాడు. ఎంతకూ దేవుడు కరగలేదు. ఇక ఇలా కాదని, పరంధామయ్య దేవుడికి మ్రొక్కుకున్నాడు. ‘దేవుడూ! నాకు ఆరోగ్యం చేకూర్చితే నీకు గుడి కట్టిస్తాను’ అని.
పరంధామయ్య మీద దేవుడికి జాలి కలిగింది. పరంధామయ్యను ఆరోగ్యవంతునిగా చేశాడు. ఆయన జబ్బూగిబ్బూ ఎగిరిపోయింది. ఎప్పటిలా లేచి తిరగసాగాడు. దేవుడు పరంధామయ్య ‘మొక్కు’ను గుర్తుకు చేశాడు.
గుడి కట్టటానికి అయ్యే ఖర్చు మొత్తం చూశాక పరంధామయ్య బేజారయ్యాడు. ‘అమ్మో ఇంత ఖర్చా..’ అనుకున్నాడు. మొక్కు తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందేమోనన్న భయం వేసింది. అందుకని ఓ ఉపాయం ఆలోచించాడు. బొమ్మలు అమ్మే కొట్టుకు వెళ్లి ఒక బొమ్మ గుడిని కొన్నాడు. మొక్కు క్రింద చెల్లు పెట్టుకోమని దేవుడిని ప్రార్థించాడు. ఆ బొమ్మ గుడిని ఆయనకు అప్పజెప్పాడు.
దేవుడికి పరంధామయ్య మీద కోపం వచ్చింది. పిసినారి పరంధామయ్యకు గుణపాఠం నేర్పదలిచాడు. ఒకనాడు పరంధామయ్య కలలో దేవుడు కనిపించాడు. ఫలానా రామయ్య పొలంలో లంకెబిందెలు ఉన్నాయని, ఆ లంకె బిందెలను, రామయ్య పొలం కొనుక్కుని స్వంతం చేసుకొమ్మని సలహా ఇచ్చాడు.
పరంధామయ్యకు ఎంతో సంతోషం కలిగింది. రాళ్లూ రప్పలు ఉన్న రామయ్య పొలాన్ని రెట్టింపు ధరకు కొన్నాడు. పొలం తన స్వాధీనంలోకి వచ్చాక కూలీలకు నియమించి, పొలాన్ని త్రవ్వించాడు. పొలంలో ఓ మూలన వేలెడంత పొడవున్న రెండు లంకె బిందెలు కనిపించాయి. లబోదిబోమంటూ లంకె బిందెల్ని తెరిచాడు. అవి ఖాళీగా కనిపించాయి.
‘దేవుడా నాకు ఎందుకు ఇలా అన్యాయం చేసావు?’ అని దేవుడిని ప్రశ్నించాడు.
‘నీ బొమ్మ గుడికి, నా వేలెడంత లంకె బిందెలు చెల్లు’ అన్నాడు దేవుడు.
నీతి: ఇతరులను మోసగించాలని చూస్తే తామే మోసపోతారు

-కూర చిదంబరం 86393 38675