S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిత్రం - విచిత్రం

సినిమా చూసే ఓపిక లేదు. హాలుకు వెళ్లి సినిమా చూచి దశాబ్దం దాటింది. ఫెస్టివల్ సినిమాలు మాత్రం చూసిన జ్ఞాపకం ఉంది. ఇంటర్నెట్లో సినిమాలు చూడటానికి కావలసినన్ని అవకాశాలు ఉన్నాయి. మా అబ్బాయి అమెరికా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ నేను కూడా వాడుతుంటాను. అతను సేకరించి తన కంప్యూటర్‌లో ఉంచిన సినిమాలను, డాక్యుమెంటరీలను ఫ్లెక్స్ అనే ఆప్ ద్వారా నేను ఇక్కడి నుండి చూస్తుంటాను. ఈ మధ్యన ఎయిర్టెల్ వాళ్ల ఎక్ట్స్రీమ్ అనే ఆప్ కూడా దొరికింది. జియో వాళ్ల ఆప్‌లు దొరికాయి. సినిమా చూడాలనుకోవాలే గానీ ఎక్కడెక్కడి సినిమాలనైనా చూడటానికి అవకాశం నాకు ఉంది. కానీ చూచే ఓపిక మాత్రం లేదు. ఆ మధ్యన ఎందుకోగానీ వరస పెట్టుకొని హిందీ సినిమాలు చూచాను. వాటిలో కొన్ని మనసులో మిగిలి ఉన్నాయి. అప్పుడప్పుడు అవి గుర్తుకు వస్తుంటాయి. ఇటువంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి చాప్ స్టిక్స్, మసాన్, బజార్, ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా అన్నవి. వీటిలో అన్నింటికన్నా ముందు నేను చూచిన చిత్రం పేరు చాప్ స్టిక్స్. సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. చైనా జపాన్ వాళ్లు కర్రపుల్లలను చెంచాలలాగా వాడి తిండి తింటారు. ఆ పుల్లల పేర్లు ఈ సినిమాకు పెట్టారు. పద్ధతి కొద్దీ సినిమా రివ్యూలు చదివే ప్రయత్నం చేశాను. బాగుంది అన్న వాళ్లు తక్కువగా కనిపించారు. కానీ కథ మాత్రం విచిత్రంగా తోచింది. కనుక ప్రయత్నించి ఆ సినిమా నేను చూచాను. నాకు చాలా నచ్చింది. సినిమా గొప్పగా లేదు. దాన్ని మరింత బాగా తీసి ఉండవచ్చు అని నాకే అనిపించింది. కానీ ఇటువంటి విషయం గురించి సినిమా తీసి విడుదల చేయగలిగిన ధైర్యం ఎవరికో ఉండడం నాకు నచ్చింది.
ఈ సినిమాలో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆమె అప్పుడప్పుడే ఉద్యోగంలో చేరి ఒంటరిగా బతకడం మొదలుపెడుతుంది. ముంబై లేదా బొంబాయి నగరంలో ఇలాంటి వాళ్లకు కొదువ లేదు. ఆ అమ్మాయి ఒక కారు కొంటుంది. దాన్ని తీసుకుని పూజ చేయడానికి గుడికి వెళుతుంది. కారు పార్కింగ్‌కు జాగా దొరకదు. ఒకతను సాయం చేస్తాను అంటూ వస్తాడు. కారు పార్కు చేయిస్తాడు. గుడిలో దర్శనం తర్వాత వెళ్లి చూస్తే కారు ఉండదు. అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళుతుంది. చిత్రంగా అమ్మాయి పేరు నిర్మా. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆ పేరుని గురించి జోకు వేస్తాడు. పోలీసు స్టేషన్‌లోనే ఒకతను అమ్మాయితో పరిచయం చేసుకుని కారు దొరకాలంటే నువ్వు ఫలానా వ్యక్తితో కలిసి మాట్లాడాలి అని ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నంబర్ తాలూకు మనిషి పేరు ఆర్టిస్ట్. అసలు పేరు సినిమా మొత్తం వరకు తెలియదు.
సినిమా చాలా ఆసక్తికరంగా ముందుకు నడుస్తుంది. చివరకు కారు దొరుకుతుంది. చిన్నప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే కరపత్రాలు పంచారు. తరువాతి కథనం వెండితెరపై చూడండి అని ఆ కరపత్రాలలో రాసి ఉండేది. నేను కూడా ఇంచుమించు అదే పద్ధతిలో మిమ్మల్ని ఈ సినిమా చూడమని సూచన చేస్తున్నాను అన్నట్టు నేను చాలా సినిమాల్లో చూసినట్లు ఉన్నాను.
వీటన్నిటికన్నా కరీబ్ కరీబ్ సింగిల్ సినిమా మరింత బలంగా జ్ఞాపకం ఉండిపోయింది. ఈ పేరుకు ఇంచుమించు ఒంటరిగా అని అర్థం. ఇంగ్లీషులో రాసిన పేరులో ఒక ఎల్ ఎక్కువగా కనిపించింది. ఎందుకు అర్థం కాలేదు. సినిమా పట్ల ఆకర్షణ పెరిగింది. వెతికి చూచాను. చిత్రంగా కనిపించింది. విచిత్రంగా వినిపించింది. నిజానికి వివరాలు గుర్తు లేవు కానీ, సినిమా నా మీద ప్రభావం చూపించింది అన్న విషయం మాత్రం అనుమానం లేని సంగతి.
ఈ సినిమాలో హీరోయిన్ కేరళ నటి అన్నారు. ఆమె పేరు పార్వతి అనుకుంటాను. నిజానికి చిన్న అమ్మాయి కాదు. ఈ సినిమాలో యుగళ గీతాలు, పార్కుల్లో గంతులు, ప్రపంచంలో ఎక్కడా జరగని ప్రేమలు అలాంటివి ఏమీ లేవు. కనుకనే సినిమా చిత్రంగా కనిపించింది. చిత్రం అంటే బొమ్మ. చిత్రం అంటే సహజం కానిది అని కూడా చెప్పలేమో. సినిమా నిజంగా మామూలుగా లేదు. ఒక కొత్త దారిలో ఉంది.
హీరోయిన్ వయసు 30 పైన ఉంటుంది అంటే నమ్మాలి. పాపం ఆ అమ్మాయి భర్త పోయాడు. ఆమె ఆ భర్తను మరవలేక పోతున్నది. అతని పేరును కంప్యూటర్‌లో, ఫోన్‌లో పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నది. అంటే ఒంటరిగా ఉన్నది. ఒంటరితనాన్ని భరించలేక అమ్మాయి చివరికి మళ్లీ ఇంటర్నెట్‌లో సంబంధాలు చూసే ఒక వెబ్‌సైట్‌లో పేరు రిజిస్టర్ చేసుకుంటుంది. ఇంకేముంది? ఆకతాయి కుర్రవాళ్ల అల్లరి మొదలవుతుంది. భవిష్యత్ చాలా సందేశాలు వస్తాయి అనుకుంటున్నాను. వాటన్నిటితో పని లేదు కానీ, ఒక మనిషి మాత్రం కొంచెం గంభీరంగా ఒక ప్రతిపాదన చేస్తాడు. మనం ఇద్దరమూ కలిసి ఒక కాఫీ అంగడి వారికి లాభం కలుద్దామా అంటాడు. అతని ముఖం చూస్తే బాగా పరిచయం ఉన్న నటుడుగా కనిపించాడు. పేరు ఇర్ఫాన్‌ఖాన్ అని తెలుసుకునానను. అతను చాలా సహజంగా ఉంటాడు. నటించినట్టు కనిపించదు. ఇలాంటి నటులు అరుదుగా ఉంటారు.
సినిమాలో నాయకుడు ఇతనే. బాగా ధనవంతుడు. బహుశా ఏదో వ్యాపారం చేస్తుంటాడు. ఆ సంగతి బయట పెట్టనివ్వడు. అతని ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. మొత్తానికి కథానాయికతో అతను దోస్తీ కలుపుతాడు. ఆ లోపల సినిమాలు ఎన్నో చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. ఇద్దరూ కలిసి కాఫీ తాగడంలోనే మలుపులు, మెలికలలు కనిపిస్తాయి. నాయకుని పాత్ర పేరు యోగి. అతను మాత్రం భోగి. కథలోని ఆకర్షణలు అన్నీ నేను ఇక్కడ చెప్పేస్తే బహుశా ఇక్కడే అందరి ఆసక్తి ముగిసిపోతుంది. హీరోయిన్ టెలిఫోన్ నంబర్ కనుగొనడానికి హీరో చేసే పన్నాగాలు విచిత్రంగా ఉంటాయి. ఆమె వ్యకిత్వాన్ని తెలుసుకోవడానికి అతను పడే తపన అంతకంటే విచిత్రంగా ఉంటుంది.
అమ్మాయి భర్త పోయాడు. ఆమె ఒంటరిగా ఉంటుంది. కనుక చాలా మందికి సహాయపడుతూ ఉంటుంది. అందరూ ఆమెను అవసరాలకు ఇంచుమించు పనిమనిషిగా వాడుకుంటారు. ఆమెకు అందులో ఎటువంటి అభ్యంతరము కనిపించదు. అంటే ఆమె వ్యక్తిత్వం గురించి మనం అర్థం చేసుకోవడానికి సినిమాలో చాలా చాలా అవకాశాలు కలిగిస్తారు అని అర్థం.
యోగి అనే నాయకుడు పార్వతి అనే నాయికతోపాటు దేశం మీద పెరగడానికి ఒక పథకం వేస్తాడు. అతనికి అంతకు ముందు ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం కూడా జరిగినట్టు బయటపడతాడు. ఇద్దరూ కలిసి వాళ్ల ముగ్గురిని తిరిగి చూచి రావాలి. అది కార్యక్రమం. ఇక సినిమాలో మెలికలు మొదలవుతాయి. నాకు ఒక్క విషయం బాగా గుర్తుంది. అమ్మాయి తన మంచినీళ్ల బాటిల్‌ను నాయకుడికి ఇవ్వడానికి అంగీకరించదు. నా సీసాలో నుంచి నీళ్లు నేను మాత్రమే తాగుతాను అంటుంది. సినిమా చివర్లో మాత్రం ఆమె బాటిల్‌ని అతనికి అందిస్తుంది. నాకు సులభంగా మామూలు సినిమాలో పద్ధతి ప్రకారం ఈ ఒక్క విషయం అర్థమైంది. మిగతా సినిమా మొత్తంలోనూ వీళ్లిద్దరికీ ఏ రకంగానూ కుదరదు. అయినా ఎందుకు ఇద్దరూ ఒకరినొకరు వెంటబడి తరుముతూ తిరుగుతారు అర్థం కాదు. అదే సినిమాలోని ఆకర్షణ.
యోగి పాత ప్రియురాళ్ల పేరున ఇద్దరూ కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల సమయంలో చాలా చాలా చిత్రాలు జరుగుతాయి. ఒకచోట బజ్జీల కోసం కిందకు దిగిన నాయకుడు కేవలం బజ్జీల కొరకు రైల్ మిస్ అవుతాడు. అమ్మాయి ఒంటరి అవుతుంది. మళ్లీ ఇద్దరూ తిరిగి కలుస్తారు. అంతా గందరగోళం. కావాలనే కథలో ఇట్లాంటి మెలికలను ఏర్పాటు చేసినట్టు మనం తర్వాత గుర్తిస్తాము.
ముగ్గురు పాత స్నేహితుల తీరు కూడా చాలా చిత్రంగా చూపించారు. ఒక సందర్భంలో అమ్మాయి బహుశా మందు కొడుతుంది. నానా గోల చేస్తుంది. అది నాకు నచ్చలేదు. నాకు నచ్చకపోవడం వల్ల సినిమాలో అది నప్పలేదు అనలేను. ఈ కాలం పిల్లల సంగతి చాలా వేరుగా ఉంటుంది. పాతకాలపు సినిమాల వాసనలో మునిగితేలుతున్న నాకు కూడా ఈ సినిమా నచ్చింది. గుర్తులేదు కనుక మళ్లీ చూడాలని అనుకుంటున్నాను. మరిక అందరూ ఈ సినిమా చూచి ఎవరి అభిప్రాయం వాళ్లు ఏర్పరచుకోవాలి.
ఈ కాలంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్‌లోకి వెళ్లిపోతారు. ఎదుటి వారిని గురించి చెబుతున్నాను కానీ, నేను కూడా ఇంచుమించు ఇంటర్నెట్‌లో బతుకుతున్నాను. సినిమా పేరు కొట్టి చూశాను. ఒకచోట సినిమా సమీక్షలు కనిపించాయి. ఒకతను పాతకాలం నుంచి ఇప్పటి వరకు బాగా నచ్చిన జంట నటులను గురించి చెప్పి, వాళ్ల అందరికంటే ఈ సినిమాలో నాయిక నాయకుల మధ్యన కనిపించిన కెమిస్ట్రీ చాలా బాగుంది అంటూ రాశాడు. ఆ మాట నాకు చిత్రంగా తోచింది. ఈ సినిమాలో వాళ్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కన్నా మరేదో ఎక్కువగా కనిపించినట్లు నాకు తోచింది. వాళ్లకు ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలగలేదు. కానీ అంగీకారం కుదిరింది. అది ఆశ్చర్యకరమైన విషయం. సినిమా మళ్లీ ఒకసారి చూడాలి. నేను ఒక సమీక్ష రాయాలి. అప్పుడు కానీ నాకు సంతృప్తి కాదు. ఈలోగా మీరు కూడా సినిమా చూడడానికి ప్రయత్నం చేయండి. వీలైతే మీరు కూడా సమీక్ష రాయండి. ఆ రాసింది ఏదో నాకు పంపండి. నేను దాన్ని అందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను.
ప్రేమలు, జంటలు, పార్కులు, పాటలు లేదు సినిమాలు కూడా పెరుగుతాయని నాకు మరొక సినిమా చూసిన తర్వాత నమ్మకం కలిగింది. ఆ సినిమా పేరు బజార్ లేదా బాజార్. అందులో గోడలకు వేసే రంగుల ప్రకటనలో కనిపించే ఒక నాయకుడు నాకు కనిపించాడు. అతను క్రికెట్ మేటి పటౌడీ నవాబ్ కొడుకు. నాకు ఈ కాలం నటులను గురించి ఎక్కువగా తెలియదు. అతను చాలా అందంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉంటాడు. హుందాగా ఉండే ఉంటాడు. ఈ సినిమాలో ఈ మూడు లక్షణాలు మరింత కొట్టవచ్చినట్టు కనిపించాయి. అతను ఈ సినిమాలో గొప్ప ధనవంతుడు. సినిమా మొత్తం వ్యాపారం గురించి సాగుతుంది. వ్యాపారంలో నాయకుని గురించి ఆసక్తి పెంచుకున్న మరొక కుర్రవాడు ఉద్యోగం కోసం అతని వద్దకు వస్తాడు. కనీసం నా దగ్గరకు కూడా చేయలేక పోతాడు. కానీ ఏదో ఒక రకంగా అతనికి దగ్గరవుతాడు. సినిమాలో పెద్ద డ్రామా జరుగుతుంది. సినిమా మొత్తం నాటకీయంగా ఉంటుంది. ఇందులో ఇంతో అంతో ప్రేమ కూడా కనిపిస్తుంది. కానీ అది మామూలుగా ఉండదు. ఇటువంటి సినిమాలు థియేటర్లలోకి వచ్చి డబ్బులు ఇచ్చి జనం చూస్తారు అన్న నమ్మకం నాకు మాత్రం లేదు. నాకు ఈ సినిమా నచ్చింది. నాకు నచ్చిన చాలా సంగతులు చాలామందికి నచ్చవు. ఊరంతా ఒకవైపు అన్న పద్ధతిలో ఉంటుంది నా ధోరణి. కానీ ఈ సినిమా చాలామందికి నచ్చింది అని నా అనుమానం. జీవితంలోని వాస్తవాలను, వ్యాపారంలోని మర్మాలను, ఈ సినిమాలో ఆకర్షణీయంగా చూపించారు. ఇటువంటి విషయాలు మామూలు వాళ్లకు పట్టవు. పట్టిన వాళ్లకు మిగతా సంగతులు పడవు. స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండానే 99 శాతం మంది అని నా నమ్మకం. నేను ఒకప్పుడు అందులోకి ప్రవేశించాను. డబ్బులు పోగొట్టుకోలేదు కానీ సంపాదించలేక పోయాను కూడా. ఈ మధ్యన ఒక తమ్ముడు రిటైర్ అయిన తరువాత స్టాక్ మార్కెట్‌తో లాభాలు సంపాదించాను అని చెప్పాడు. అప్పుడు నాకు ఈ సినిమా గుర్తుకు వచ్చింది. తమ్ముడికి ఈ సినిమా చూడమని చెప్పాలి. అందరికీ ఈ సినిమా చూడమని చెప్పలేను. మొదట చెప్పిన సినిమా ఇంచుమించు చాలామందికి నచ్చుతుంది. ఈ సినిమా మాత్రం ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు. ఇటువంటి సినిమాలు చూస్తుంటే ఒక చిత్రమైన భావన కలుగుతుంది.
మొత్తానికి నేను కూడా కూర్చుని ఏకబిగిని చివరి దాకా సినిమా చూడగలుగుతారు అన్న నమ్మకం మాత్రం నాకు కొంత కలిగింది. కనుకనే కొన్ని సినిమాలు చూడగలిగాను. బాయ్ మీట్స్ గర్ల్ చూడడం నాకు ఏ మాత్రం నచ్చదు. అలాగని వాటిలో కాస్త ఉండదు అని నేను అనడం లేదు. దాన్ని అందుకునే చోటి నుండి నేను చాలా ముందుకు కదిలిపోయాను. కనుక నాకు ఆ సినిమాలు నచ్చవు అని నాకు తెలుసు. కానీ జీవితంలోని వాస్తవాలను చెప్పే సినిమాలను మాత్రం ఓపికగా చూస్తాను.
సినిమాకు అందరూ సరదా కోసం వస్తారు. చూపించే వాస్తవాలు సరదాగా ఉంటే వాటిని చూడగలుగుతారు. కానీ వాస్తవాలు అన్నీ సరదాగా ఉండవు. అందుకు ఉదాహరణ నేను ప్రస్తావించిన మసాన్ అనే మరో సినిమా. అన్నింటిని గురించి ఒకేసారి చెప్పి ఊదరకొట్టడం నా ఉద్దేశం కదా. కనుక ఇక్కడితో ఆపుతాను. వెళ్లి ఏదైనా సినిమా చూస్తాను. అది నచ్చితే మళ్లీ ఎప్పుడో ఒకసారి సినిమాలను గురించి మళ్లీ రాస్తాను.

-కె.బి.గోపాలం