S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గిల్గమేష్ గాథ

చదవడం ఒక వ్యసనం. వెతికి వెతికి మరీ చదవడం అంతకంటే మంచి వ్యసనం. ఈ వెతుకులాటలో కొన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయి. రుచికరమైన పదార్థాన్ని ఒక్కరే తినకూడదు అన్నది ఒక మంచి పద్ధతి. అదే రకంగా మంచి రచనలు కనిపించినప్పుడు కూడా అందరితో పంచుకోవాలి అన్నది ఇంకా మంచి పద్ధతి. గిల్గమేష్ అని ఒక్క ఎపిక్ దొరికింది. అంటే ప్రాచీన గాథ అన్నమాట. దాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి నవల అని వర్ణించారు. మనకు మనసు ఊరుకోదు కదా! శోధన కొంత జరిగింది.
మహాభారతం అందులోని కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 3137 ప్రాంతంలో జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గిల్గమేష్ గాథ మాత్రం అంతకన్నా ముందు జరిగింది అంటున్నారు. నిజంగా కథ జరిగింది లేనిది తర్వాత చర్చించవచ్చు. కానీ, కనీసం ఒక రచన జరిగింది. సుమేరు అన్న మాట చాలామంది వినే ఉంటారు. దీనికి మన మేరు పర్వతానికి సంబంధం ఉంది అంటున్నారు. సుమేరు భాషలో ఈ గాథను మొదటిసారి రాసినది క్రీస్తు పూర్వము 2150 ప్రాంతంలో అని తేల్చారు. కనుకనే దీనిని ప్రపంచంలోనే మొదటి రచన అంటున్నారు. అప్పటికి రాత తెలియదు. మట్టి బిళ్లల మీద మూడు మూలల తుంగ మొదళ్లను కోసుగా కోసి కలాలుగా వాడి రాసిన క్యూనిఫామ్ అనే రాత పద్ధతిలో ఈ రచన ఉంది. మొత్తం 12 బిళ్లలు దొరికాయి. వాటిలో చివరిది తరువాత చేర్చినది అన్నారు.
పాతకాలపు జానపద గాథలను, కథలను పెట్టుకునే పద్ధతి అప్పుడే మొదలయింది అన్నమాట. తరువాత ఆ రచనను అకేడియన్ అనే మరొక భాషలో రాసి పెట్టారు. ఆ పలకలు కూడా దొరికాయి. అయితే చాలాకాలం వరకు వాటిని చదవడం మాత్రం ఎవరికీ చేతకాలేదు. కనుక ఈ కథ మరుగున పడి ఉండిపోయింది. కొంతకాలం క్రితమే దాన్ని చదవగలిగారు. ఇంగ్లీషులోకి అనువాదాలు కూడా వచ్చాయి. వ్యాఖ్యానాలు అంతకన్నా ఎక్కువగా వచ్చాయి. నాలాంటి వాళ్లకు చదివే అవకాశం వచ్చింది.
గిల్గమేష్ కథ చదువుతూ ఉంటే అందులో తెలిసిన ఎన్నో విషయాలు కనిపించాయి. ఆశ్చర్యం కలిగింది. ప్రపంచమంతటా ప్రాచీన కథలు ఒకే రకంగా ఉంటాయి అన్న భావన బలంగా కలిగింది. భారతదేశం భాష, మిగతా కొన్ని అంశాలు ఆ రచనలో నాకు కనిపించాయి అంటే ఆశ్చర్యం కాదు. ఈ అంశాలను గురించి ప్రత్యేకంగా పరిశోధించవలసి ఉంది. గిల్గమేష్ అన్న ఈ కావ్యం లేదా పురాణం ఒకే రచన కాదని, కొన్ని కథలను ఒకచోట చేర్చి, ఈ రకంగా తయారుచేశారని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఏమైతేనేమి, ఒక చక్కని రచన మనకు అందింది. దాన్ని అందరికీ పంచి చెప్పే అవకాశం నాకు దక్కింది.
ప్రపంచము, నాగరికత అనగానే అందరికీ మీసోపోటేమియా అనవలసిన మెసపొటేమియా గుర్తుకు వస్తుంది. వాళ్లు రాత నేర్చుకున్నారు. కనుక వాళ్ల వివరాలన్నీ ఇప్పటిదాకా దొరుకుతున్నాయి. నిజానికి ఈ మధ్య వస్తున్న సైన్స్ రచనలలో కూడా ఇక్కడి వివరాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. మానవ పరిణామం గురించి రాసిన పుస్తకాలలో చైనా, భారతదేశాల ప్రసక్తి ఎక్కడా కనిపించడం లేదు. శాఖాచంక్రమణం అనే కొమ్మలు దూకుడు వద్దు కానీ, గిల్గమేష్ వివరాలలోకి వెళదాము.
ఉరూక్ అని ఒక రాజ్యం. దానికి గిల్గమేష్ అని ఒక రాజు. అతను నిజానికి దేవుడు. కొంత భాగం మాత్రమే మనిషి. కనీసం అందరూ ఈ రకంగా అనుకుంటారు. అతను మాత్రం అమానుషంగా బతుకుతూ ఉంటాడు. ఆడ వారిని బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. కొత్తగా పెళ్లయిన వధువు మొదటి రోజు తన దగ్గర పడుకోవాలి అంటాడు. ఈ ఆచారం మన దేశంలో కూడా ఎక్కడో వినిపించినట్టు గుర్తు. రాజు కాకుండా పూజారులు ఈ పని చేసినట్లు ఉంది. దేవతలు మాత్రం ఈ రాజుగారి మీద కావలసినంత కరుణ చూపారు. ధైర్యంతోపాటు శక్తి పాటవాలు కూడా ఇచ్చారు.
రాజుగారు సుఖంగానే ఉన్నాడు కానీ, ప్రజలకు అతని పట్ల అసంతృప్తి లేదు. ఆ రాజును బాగుపరచడానికి ఏమో సృష్టి బాధ్యతను నిర్వహించే దేవత అరూరు ఒక మానవుడుని తయారుచేస్తుంది. పుట్టుకకు మానవుడే కానీ అతడు సిసలైన అడవి మనిషి. జంతువుల పొదుగుల నుంచి పాలు తాగుతాడు. నీళ్ల కోసం వాటితో పోటీ పడతాడు. అతనికి గిల్గమేష్‌కు సమానంగా బలం ఉంది. అతని వల్ల దేశంలోని మనుషులకు అసౌకర్యం కలుగుతున్నట్టు రాజుకు తెలుస్తుంది. ఇంతకూ ఆ పాత్ర పేరు చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఎంకీడు అంటే మన ఎంకడు లాగా వినిపిస్తుంది కదూ? ఎంకీడును బాగుపరచడానికి ఒక ఆడమనిషిని పంపిస్తారు. ఆమె పేరు షమ్హత్. ఆమె ఒక దేవదాసి. ఎంకీడును వశపరచుకొంటుంది. అతనితో సహవాసం చేస్తుంది. ఎంకీడు మనిషిగా మారతాడు. నగరానికి వస్తాడు. రాజుకు చేరువవుతాడు. ఇదంతా అనుకున్నంత సులభంగా జరగదు. మధ్యలో బోలెడంత నాటకం ఉంటుంది. గిల్గమేష్ తనతో సమాన బలంగల ఎంకీడుతో పోటీ పడవలసి వస్తుంది.
గిల్గమేష్ కథను ఎవరైనా ధైర్యం చేసి ఇప్పుడు సినిమాగా తీస్తే కూడా చక్కగా పెరుగుతుంది. అన్ని రకాల రంగులు ఆ కథలు అప్పుడే రాసుకున్నారు.
మొత్తానికి గిల్గమేష్ ప్రభువు, ఎంకీడు నేస్తాలుగా ఉంటారు. వాళ్లు చెయ్యకూడని పని ఏదో చేస్తారు. దేవతలను సంతృప్తి పరుస్తారు. అప్పుడు దేవతలు ఒక ఎద్దును భూమి మీదకు పంపిస్తారు. వీళ్లిద్దరూ కలిసి ఆ ఎద్దును చంపుతారు నిజమే కానీ, దేవతల అసంతృప్తి కారణంగా ఎంకీడు అనారోగ్యానికి గురయి చనిపోతాడు. గిల్గమేష్ ఒంటరివాడవుతాడు. మళ్లీ తన పాత పద్ధతులకు బానిస అవుతాడు. అతనికి చావును జయించాలి అన్న కోరిక పుడుతుంది.
గిల్గమేష్ రాజు, ఎంకీడు కలిసి చెయ్యరాని పని చేశారు అని మాటల ధోరణిలో నేను రాశాను. ఆ పని ఎందుకు చేశారు అని నాకు అనుమానం వచ్చింది. వెతికి చూస్తే, రచనలో అందుకు జవాబు ఉంది. బ్రతుకు ప్రశాంతంగా జరుగుతూ ఉంటే గిల్గమేష్‌కు నచ్చలేదు. పైగా తన పేరు చిరస్థాయిగా నిలబడాలి అన్న కోరిక కలిగింది. కనుక మిత్రునితో కలిసి అతను మహా వృక్షాలు ఉన్న అడవిలోకి వెళ్లి అక్కడ ఏదో కల్లోలం కలుగజేస్తాడు. అక్కడ హుంబాబా అడవుల సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక రాక్షసుడు ఉంటాడు. రాజు ఆ రాక్షసుడికి ఆడవాళ్లను ఎరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయినా పని జరగదు. ఎన్ని మలుపులు, ఎన్ని విశేషాలు తిరుగుతుంది ఈ కథ అన్న ఆశ్చర్యం మనకు మిగులుతుంది. మనిషి కాల్పనికత ఎంత దూరం వెళుతుంది అన్న దానికి ఇటువంటి రచనలు ఉదాహరణలుగా నిలబెడతారు. మనకు తెలిసిన నాగరికత ముక్క కూడా తెలియని వేల సంవత్సరాల నాడే ప్రజా జీవితంలో ఎన్నో వింత ధోరణులు ఉండేవి అన్నమాట.
గిల్గమేష్ అనే రాజు నిజంగానే ఉండేవాడు అని కొంతమంది పరిశోధకులు అన్నారు. కాదు అది కేవలం కథ అన్న వారు కూడా ఉన్నారు.
మన పురాణాలలో ఒక స్వర్గం ఉంటుంది. దానికి అధిపతిగా ఇంద్రుడు ఉంటాడు. అతని వద్ద రంభ, మేనక లాంటి అందగత్తెలు ఉంటారు. వానకు ఒక దేవుడు, ధనానికి ఒక దేవుడు, మరణానికి ఒక దేవుడు మన పురాణాల్లో ఉంటారు. ఈ ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ పుట్టింది ఎవరికీ తెలియదు. అచ్చంగా ఇదే పద్ధతిలో గిల్గమేష్ కథలో కూడా ఇష్తార్ అని ఒక దేవత ఉంటుంది. ఆమె అనూ అనే ఆకాశరాజు కూతురు. పని లేని దేవత కాదు. ఆమె ప్రేమకు యుద్ధానికి అధిదేవత. ఎంతో అందమైనది. గిల్గమేష్ రాజు కూడా అందమైనవాడు. ఇఫ్తార్ అతని మీద మనసు పారేసుకుంటుంది. మన వాడు మాత్రం ఆమె అంతకుముందు కొంతమంది అందగాళ్లను అన్యాయం చేసింది అన్న కారణంగా తిరస్కరిస్తాడు. ఇటువంటి సంఘటనలు మన పురాణాలలో కూడా చదివినట్టు కొత్తగా చెప్పనవసరం లేదు. మనసు విరిగిన ఆ దేవత కారణంగా ఎద్దు భూమి మీదకి వస్తుంది.
నేను ఇక్కడ కొంచెం తికమక పడ్డానేమో. మరొకసారి మళ్లీ గిల్గమేష్ చదవాలి. వీలైతే మీరంతా చదవాలి. పుస్తకాలు మన తెలుగులోకి రావడానికి ఎంతకాలం పడుతుంది అన్న సంగతి తెలియదు. అన్నిటికీ నేనే పూనుకోవాలి అని అనుకునే పద్ధతి నేను మానేశాను. నేను కొన్ని పనులు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. వాటిలో చదవడం ఒకటి. సంగీతం వినడం మరొకటి.
లోకాభిరామం రాయడం గురించి మనసులో చర్చ జరుగుతున్నది. ఆరు సంవత్సరాలు ముగిశాయి. కాలం ఏడవ సంవత్సరంలో ప్రవేశించింది. చెబుతున్న విషయాలుల ఎంత ఆసక్తికరంగా ఉంటున్నాయి అన్న ప్రశ్న నా మనసులోనే పుడుతున్నది. గిల్గమేష్ కథ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది అన్న నమ్మకం ఉంది.
ఏంటిది చనిపోయాడు. ఈ గణేష్ ఒంటరివాడయ్యాడు. అధోలోకంలో ఉన్న మిత్రులతో పాటు కాలం గడపడానికి అవకాశం కావాలి అనుకుంటాడు. అందుకొరకు దేవతలను వేడుకుంటున్నాను. భూమి మీద ఉండే మనుషులు నేరుగా దేవతలతో మాట్లాడగలగడం, వారి లోకానికి వెళ్లి రావడం మన పురాణాలలో కూడా కనపడతాయి. ఉరూక్ దేశం వారు, మన దేశం వారు ఆ కాలంలోనే మాట్లాడుకున్నారేమో అన్న అనుమానం కలుగుతుంది. గిల్గమేష్ దేశంలోని బీద వారితో మొదలు, మత గురువుల దాకా అందరూ తన మిత్రుడు ఎంకీడు గురించి దుఃఖాన్ని ప్రకటించాలని శాసిస్తాడు. ఎంకీడు విగ్రహాలను స్థాపించాలని శాసిస్తాడు. మిత్రుని శవాన్ని తగలడానికి కూడా ఒప్పుకోడు. ఆరు పగళ్లు, ఏడు రాత్రులు గడిచిన తరువాత మిత్రుని శరీరంలో పురుగులు చేరడం చూచి దహనానికి ఒప్పుకుంటాడు.
గిల్గమేష్ అన్న ఈ రచనలో బైబిల్‌లోని ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చే సంఘటనలు ఉన్నాయి. మహా వర్షం కురుస్తుంది. అంతా మునుగుతుంది. ఉష్ణ పిష్టం అనే మాటను గుర్తుకు తెచ్చే పేరుగల ఒక పాత్ర అక్కడ ముందుకు వస్తుంది. అతను అతని భార్య ఒక పడవలో జంతువులను ఒక్కొక్క జాతికి ఒక జంట ప్రకారం చేర్చి కాపాడుతారు. వారికి దేవతలు చిరంజీవులుగా బతుకుతారని వరం ఇస్తారు. గిల్గమేష్ వాళ్లిద్దరినీ ఆశ్రయిస్తాడు. మరణం లేకుండా బతికే మార్గాన్ని తెలుసుకోవాలని ప్రయత్నంలో పడతాడు.
ఉట్నాపిష్టిం, అవును, పుస్తకంలో కనిపించే పేరు ఇదే, అతని భార్య ఒక అందమైన లోకంలో బతుకుతూ ఉంటారు. ఆ లోకం పేరు దిల్ మున్. గిల్గమేష్ అక్కడికి బయలుదేరతాడు. ఎట్లా అని అడగకండి. పురాణాలను ఎప్పుడైనా ప్రశ్నించామా? అది తూర్పున ఉందని తెలుసు. అక్కడికి చేరే ప్రయత్నంలో అతను పెద్ద నదులను దాటుతాడు. కొండలను ఎక్కుతాడు. సముద్రాలను దాటుతాడు. సింహాలు, ఎలుగుబంట్లు, మరెన్నో మృగాలను చంపుతాడు.
చివరకు భూమి తూర్పు అంచుకు చేరుకుంటాడు. భూమి గుండ్రంగా ఉందని తెలియదు. అక్కడ మాషూ అనే పర్వతం ఉందట. మన వాడు గిల్గమేష్ అక్కడికి చేరుతాడు. సూర్యుడు ఉదయించేది అక్కడే అని రాశారు. ఎంత బాగుంది కదూ ఆలోచన? అక్కడ రక్షణగా రెండు తేలు వంటి జీవులు ఉంటాయి. వాటితో మనవాడు నేస్తం కడతాడు. 12 లీగుల దూరం సొరంగంలో ప్రయాణం చేస్తాడు. ఈ వివరాలన్నీ వింటూ ఉంటే మొత్తం కథ తెలుసుకోవాలని అనిపించింది అనుకుంటాను. నాకు కొంత మసాలా జోడించి దీన్ని నవలగా రాస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడో కాదు ఆలోచన ఈ అక్షరాలు రాస్తుంటే వచ్చింది. మంచి రచనలతో కలిగే మంచి ఇదే. వాటి ప్రభావం ఎవరెవరి అభిప్రాయాలను బట్టి వేరు వేరుగా ఉంటుంది. ఆ నవలను మరెవరైనా రాస్తే బాగుంటుందని నాకు మళ్లీ అనిపిస్తున్నది. గిల్గమేష్‌కు అక్కడ సారాయి తయారుచేసే సిదూరి అనే దేవత కనపడుతుంది. ఒక సున్నా పెడితే ఆమె సింధూరి అవుతుందేమో? ఆ తరువాత వచ్చే వ్యక్తి పేరు వింటే ఆశ్చర్యపోతారు! ఉర్షనాబి, మన వృషనాబికి ఏమవుతాడంటారు?
నా అలవాటుకు వ్యతిరేకంగా కథ మొత్తం చెబుతున్నట్టున్నాను. కనుక ఇక్కడ ఆపుతాను. ఒక్క విషయం మాత్రం చెబుతాను. చివరకు గిల్గమేష్ కూడా చనిపోతాడు. అటువంటి రాజు మళ్లీ దొరకడు అని దేశంలోని వారందరూ అంటారు. ఇటువంటి కథ మళ్లీ దొరకదు అని నేను అంటున్నాను. పనె్నండవ పలకలో కథ తర్వాత చెప్పింది అనడానికి అనుమానం లేదు. అందులో ఎంకడు, క్షమించాలి ఎంకీడు మళ్లీ వస్తాడు. అంటే కథ పాతకాలంలో మళ్లీ మొదలవుతుంది. అది మరో కథ. కనుక మరోసారి చెప్పుకుందాము. గిల్గమేష్ కథ రకరకాల రూపాలలో రకరకాల చోట్ల ఉందట. ఆ పలకలు ఇంకా బతికి ఉన్నాయట. ఎన్ని రూపాలు ఉన్నా నాటి నుండి నేటి వరకు మనిషి తీరు మారలేదు అన్నది మాత్రం నాకు తోచిన ఒక నిజం.

-కె.బి.గోపాలం