S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్న ఆశ

ఆఫీసుకు వచ్చి నా కేబిన్‌లో కూర్చొన్నా. ఏసీ నుండి చల్లగాలి తాకుతూ ఉన్నా, నా మనసు ఆందోళనగానే ఉంది. బ్రాంచ్ మేనేజర్ హోదాలో ప్రతిరోజూ ఎన్నో సవాళ్లు. వీటన్నిటికీ అలవాటు పడ్డాను. కానీ, రాత్రి ఇంట్లో జరిగిన సంఘటన నా మనసును కలిచి వేస్తూ ఉంది.

‘సార్ కాఫీ!’ కాఫీ కప్పు టేబుల్ పై పెట్టి వెళ్లిపోయాడు సుబ్బారావు
కప్పు అందుకున్నా! వేడి కాఫీ నుండి పొగలు సుడులు తిరుగుతూ పైకి లేస్తోంది. నా మనసు రాత్రి జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతూ ఉంది.
***
నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడికి మంచి కాలేజీలో ఇంజనీరింగు సీటు రాలేదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమని చెప్పా. డొనేషన్ కట్టి చేర్చించమని అడిగాడు. వాడు అడిగినట్టే వాడికి నచ్చిన ఒక పేరు మోసిన కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి వాడికి సీటు కొనిచ్చా. నిన్ననే వాడి మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలు వచ్చాయి. నాలుగు సబ్జెట్లు తప్పాడు. నిలదీసి అడిగితే కాలేజీ నచ్చలేదని నిర్లక్షంగా సమాధానం చెప్పాడు. ఈ మధ్య వాడిని గమనిస్తూనే ఉన్నాను.
చెడు స్నేహాల వైపు, చెడు అలవాట్లవైపు అడుగులు వేస్తున్నట్టు ఉంది. వాడు చక్కగా చదువుకోకపోతే జీవితంలో ఎలా స్థిరపడగలడు? భవిష్యత్తును ఎలా నిర్మించుకోగలడు? నలుగురిలో గౌరవం ఎలా పొందగలడు?
ఆలోచిస్తూ ఉండగానే మా ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్ వచ్చాడు. ఈరోజు కలవాల్సిన బాకీదారుల లిస్టు నా ముందు ఉంచాడు.
‘‘మనం ఈరోజు వెళ్లాల్సింది కొత్త గూడెం వైపే కదా..’’
‘అవును సార్’
‘మరైతే ఆ చిరురైతు అమాసయ్య పేరు ఈ లిస్టులో లేదు?’ ఈరోజు కలవాల్సిన బాకీదారుల లిస్టు చూస్తూ అడిగాను ప్రసాద్‌ను.
‘అతని ఇంటికి మరోసారి వెళ్దాం సరా. ఇపుడు వద్దు’ ముక్తసరిగా చెప్పాడు ప్రసాద్.
‘క్రితం సారి వెళ్లినపుడు పొలాన్ని జప్తు చేస్తామని వాళ్లకు చెప్పాం కదా. ఐనా వాళ్లు ఇప్పటివరకు లోను కట్టనేలేదు. డెట్ రికవరీ డాక్యుమెంట్స్ తీసుకో. వాళ్ల దగ్గర సంతకాలు పెట్టించుకుని పొలాన్ని జప్తు చేద్దాం. ’ మేనేజర్ హోదాలో దృఢంగా పలికాను నేను.
‘మనం వెళ్లి సరిగా రెండురోజులకు ఆ అమాసయ్య చనిపోయాడు సర్. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ల ఇంటికి వెళ్లడం బాగోదు.’ తగ్ని స్వరంతో చెప్పాడు ప్రసాద్.
‘చనిపోయాడా! ఎలా జరిగింది?’ అతని చనిపోవడం అనే విచారం కన్నా అప్పుకట్టకుండా చనిపోయాడన్నదే నా ప్రశ్నలో ఎక్కువగా ప్రస్పుటించింది.
‘కరెంట్ షాక్‌తో చనిపోయాడు. కొందరు ఆక్సిడెంట్ అంటున్నారు. మరికొందరు సూసైడ్ అంటున్నారు’
‘సూసైడ్‌నా ? ఎందుకు? అప్రయత్నంగా కంగారుగా అడిగాను.
‘అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తు చేస్తారని, పొలాన్ని జప్తు చేస్తే పరువు పోతుందని, పరువు కన్నా ముందు ప్రాణం పోవడం మంచిదని అతను కరెంటును ముట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కొందరు అంటున్నారు’
‘రికవరీకి రేపు వెళ్దాం’ మనసులో మొదలైన అలజడి పైకి కనబడకుండా చెప్పాను. ప్రసాద్ నా కేబిన్ నుంచి వెళ్లిపోయాడు.
***
అమాసయ్య చనిపోయాడన్న విషయం నాకు బాధను, అసౌకర్యాన్ని కలిగించింది. మనసు మూలల్లో తప్పు చేసానన్న భావనను మొలకెత్తించింది. కొందరు బ్యాంకురుణాలను కావాలనే ఎగ్గొడుతున్నారు. వారిని చూసి మిగిలిన వారు కూడా అప్పు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఎన్నికల సమసయంలో రాజకీయ నాయకులు ఇచ్చే రుణమాఫీ హామీల వల్ల కూడా కొందరు రుణాలు చెల్లించడం లేదు. ఇక మా పైఅధికారుల సంగతి చెప్పనక్కర్లేదు.
విరివిగా రుణాలు ఇవ్వమని వారే మాకు టార్గెట్లు నిర్దేశిస్తారు. రుణాలు ఇచ్చాక వసూళ్లు చేయమని వారే మాపై వత్తిడి పెంచుతారు.
అమాసయ్య ప్రమాదవశాత్తు చనిపోయి ఉండవచ్చు. లేక అప్పు కట్టమని నేను చేసిన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయి ఉండవచ్చు . అతకు నా కారణంగా చనిపోయాడేమో అనే ఆరోచన నన్ను నిలువునా దహించి వేస్తూ ఉంది. నా ఆలోచనలు క్రమంగా గతంలోకి ప్రయాణించాయి.
***
సరిగ్గా నెల రోజుల క్రితం అప్పు వసూళ్లల్లో భాగంగా కొత్తగూడెం దగ్గరలోని అమాసయ్య కలిసాను. మూడేళ్ల క్రితం క్రాప్ లోన్ పేరుతో బ్యాయం నుండి డైబై వేల రూపాయలు తీసుకొన్నాడు. ఒక్కరూపాయైనా తిరిగి చెల్లించలేదు. అదే విషయాన్ని గట్టిగా అడిగాను అతన్ని.
‘‘ఈ సారి పంట చేతికి రాగానే ఎంతో కొంత అప్పు కడతాను సార్’’ వినమ్రంగానే అభ్యర్థించాడు.
‘ఈసారి పంట చేతికి రావడానికి మరో ఆర్నెల్లు పడుతుంది. అప్పటిదాకా మా పై అధికారులకు ఏం చెప్పమంటావ్’ నిలదీసాను.
‘ఎలాగోలా పెద్దమనసు చేసుకోండి సార్. మరికొంత సమయం ఇవ్వండి. ’ బతిమిలాడాడు అతను.
‘క్రితం సారి పంట రాబడి బ్యాంకుకు కట్టి ఉండవచ్చు కదా. అప్పుతీసుకొనేటపుడు ఉండే శ్రద్ధ తిరిగి జమ చేయాల్సి వచ్చినపుడు ఉండదు మీకు’ మాటలో వాడి పెంచాను నేను.
‘‘అలా అనకండి దొరా! మా అబ్బాయిని ఇంజనీరింగు లో చేర్పించాను. పొలంలో వచ్చే ఆదాయం పశువుల నుంచి వచ్చే ఆదాయం సరిపోక నేను, మా ఇంటి ఆడది ఇద్దరం కూలికి కూడా పోతూన్నాము. మా కష్టం అంతా వాడి చదువుకే తగలేస్తా ఉన్నాము. అందుకే బ్యాంకులో లోను కట్టడానికి కష్టమై పోతూ ఉంది. ఈసారి పంట రాగానే అప్పు తీర్చేస్తా’’ అభ్యర్థించాడు అతడు.
‘అసలు ఈనీకు కట్టే ఉద్దేశం లేదు. ఉంటే నీ కొడుకును ఏ డిగ్రిలోనో చేర్పించేవాడివి. అయినా నీ కొడుకు ఇంజనీరింగు చదివితే నాకేంటి? వీధులమ్మిట అడుక్కుంటే నాకేంటి? అప్పు ఎగ్గొట్టడానికి ఏవేవో కాకమ్మ కబుర్లు చెబుతున్నావు నువ్వు.’’ అన్నాను.
‘‘మేము పేదవాళ్లమే కానీ నీతి తక్కువ వాళ్లం కాదు సార్. ఈసారి పంట రాగానే అప్పుకడతాం.’’ అప్పటిదాకా వౌనంగా ఉన్న అమాసయ్య భార్య నన్ను సూటిగా చూస్తూ చెప్పింది. ఆమె వైపు చూశాను. ముఖానికి నిండుగా పసుపు పూసుకొని నుదిటిన రూపాయి బిళ్లంత కుంకుమ పెట్టుకుని తలనిండా చేమంతులు తురుముకొని పల్లెటూరి ఇల్లాలికి ప్రాతినిధ్యం వహించే సగటు స్ర్తి పాత్రను ధరించినట్టు అనిపించింది నాకు ఆమె రూపం.
‘‘నేను మాట్లాడతావున్నాను కదా. నువ్వు నోరు మూసుకొని లోనికెల్లు ’’ అని తన భార్యను గద్దించాడు అమాసయ్య.
‘‘అయ్యా! దాని మాటలు పట్టించు
కోకుండి. అది ఒట్టి ముక్కు సూటి మడిసి. ఇంతకాలం ఎలాగూ ఆగారు. మరో ఆరుమాసాలు గడువు ఇవ్వండి’’ కాళ్లపై పడినంత పనిచేశాడు అమాసయ్య.
‘‘ అలా కుదరదు కానీ నీకు ఒక్క నెల టైం ఇస్తున్నాం. ఈలోగా కట్టలేదంటే నీ పొలాన్ని జప్తుం చేస్తాం’’ కఠినంగా చెప్పి వచ్చేసానునేను. నా వెంటే మా ఫీల్ట్ ఆఫీసర్ ప్రసాద్ కూడా వచ్చేసాడు.***
‘‘సార్ ధనుంజయ వర్మగారు వస్తున్నారు.’’ పరుగెత్తుకుంటూ నా క్యాబిన్‌లోకి వచ్చి చెప్పాడు సుబ్బారావు.
ఆలోచనల నుండి తేరుకుని నా కేబిన్‌కు ఉన్న గాజు అద్దం నుండి బయటకు చూశాను. ధనుంజయవర్మ వస్తోంటే బ్యాంకు సిబ్బంది తోపాటు బ్యాంకు కు వచ్చిన కష్టమర్లు సైతం అతన్ని చూసి గౌరవ సూచికంగా నిల్చుంటూ ఉన్నారు. కొందరు పలకరిస్తూ ఉన్నారు. మరికొందరు అతని దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వర్మ ప్రయివేటు ట్రాన్స్ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టరు అతను. చాలామంది పార్టనర్స్ ఉన్న వారి వ్యాపారానికి ఇతనే పెద్ద ఇనె్వస్టర్, మేనేజింగ్ డైరెక్టరు. వర్మ కంపెనీ వాళ్లు ఐదు సంవత్సరాల క్రితం మా బ్యాంకు నుండి కోటి రూపాయలు అప్పు తీసుకొన్నారు. మొదట్లో కొంతకాలం వాయిదాలు చెల్లించి ఆ తరువాత ఆపేశారు. సుమారు ఆరునెలల నుంచి వర్మగారికి ఫోన్ చేసి వాయిదాలు చెల్లించమని అడుగుతూనే ఉన్నాం. రెండు మూడు సార్లు వారిని స్వయంగా కలిసి అభ్యర్థించాను కూడా. వారు నా మాటను పెడ చెవిన పెట్టారు. పై అధికారుల ఒత్తిడి వల్ల నోటీసు పంపక తప్పలేదు. బహుశా ఆ విషయం గూర్చి మాట్లాడడానికి వారు స్వయంగా వచ్చారేమో.
‘నమస్కారం వర్మగారు. రండి కూర్చోండి’ నేను లేచి వారికి ఎదురెళ్ల మరీ నా కేబిన్‌ల్లోకి ఆహ్వానించాను.
సుబ్బారావు పరుగెత్తుకుంటూ వెళ్లి కాఫీ పట్టుకొచ్చాడు.
కుశల ప్రశ్నలు షేర్ మార్కెటు, రాజకీయాల పై కొంత సేపు మా మధ్య చర్చ జరిగింది. ఆతరువాత నెమ్మదిగా అసలు విషయాల్లోకి వెళ్లాం. పై అధికారుల ఒత్తిడి వల్ల నోటీసు పంపాల్సి వచ్చిందని తప్పుగా భావించవద్దని ప్రాధేయపడ్డాను. వారు మహావిష్ణువు లాగా నా మాటలు నవ్వుతూ విన్నారు. బ్యాంకులు ఉన్నది తమ బోటి వారికి అప్పు ఇవ్వడానికే అన్నట్టు మాట్లాడారు. అప్పు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా నీరవ్ మోడీల గురించి గొప్పగా ముచ్చటించారు నాతో.
బిజెనెస్ సరిగా నడవడంలేదు. కంపెనీ నష్టాలల్లో ఉంది. కొత్త బ్రాంచీలు మార్కెట్లో ఇంకా నిలదొక్కుకోలేదు. ఇప్పట్లో అప్పు చెల్లించడం వీలుపడదు. మా లోన్ రీషెడ్యూల్ చేసుకోండి. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో చూద్దాం. మీ పై అధికారులతో నేను మాట్లాడుతాను. మీకు పై అధికారుల ఒత్తిడి లేకుండా చూసుకొంటాను.’ అంటూ నవ్వుతూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను.
వేలల్లో అప్పులు తీసుకొన్న పేదవారిపై చర్యలు తీసుకోగలిగిన మేము, కోట్లల్లో అప్పులు తీసుకొన్న ఇలాంటి ఖరీదైన పారిశ్రామిక వేత్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయులం వీరికి సమాజంలో ఉన్న విలువ, సంపద, పలుకబడి, రాజకీయ నాయకుల అండదండలు మా చేతులకు సంకెళ్లు వేస్తున్నాయి. ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును లోన్ల రూపంలో తీసుకుని వారి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ సమాజంలో హోదాను , గౌరవాన్ని అనుభవించే ధనుంజయ వర్మ లాంటి పెద్ద మనుషులను ఏమీ చెయ్యలేని మేము అమాసయ్య లాంటి అల్పులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఆలోచిస్తూ ఉంటే తల తిరిగినట్టు అయింది. కుర్చీలో వెనుక్కువాలి కళ్లు మూసుకొన్నాను. నా ఆలోచనలు అమాసయ్య కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇంటి పెద్ద ఆకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబం ఎంతటి క్షోభను అనుభవిస్తుందో నేను ఊహించగలను.
***
‘‘సార్ అమాసయ్య భార్య వచ్చింది. లోన్ కట్టడానికి’ ప్రసాద్నా కేబిన్‌ల్లోకి వచ్చి చెప్పాడు.
కళ్లు తెరిచాను. కేబిన్ కు ఉన్న గాజు అద్దం నుండి బయటకు చూసాను. లోన్ కట్టి స్లిప్ చేతికి తీసుకొంటూ కనబడింది ఆమె. మనిషి చిక్కిపోయి ఉంది. మునుపటిలా ముఖానికి పసుపు, నుదిట కుంకుమ బొట్టు లేక బోసిగా కనబడింది. ఆమె కళ్లల్లో శూన్యం. చేతల్లో నిర్లిప్తత. కనబడుతూంది. ఆమెను చూడగానే బాధనిపించింది. కష్టపడి సంపాదించే భర్త చనిపోయాడు. మరి , లోన్ కట్టడానికి డబ్బులు ఎలా సర్దుకుందో నన్న సందేహమూ వచ్చింది నాకు. ‘ఆమెను నాకేబిన్ కు పిలవండి’ ప్రసాద్‌కు చెప్పాను. ప్రసాద్ ఆమెను నా కేబిన్ కు పంపి తన సీట్ కు వెళ్లిపోయాడు.
‘నమస్కారం సార్’ ఒక ఇరవైయేళ్ల యువకుడిని వెంటబెట్టుకుని తడబడుతూ వచ్చింది ఆమె. బహుశా అతడు వాళ్ల అబ్బాయి అనుకొంటా. మా అబ్బాయి వయసు ఉంటుంది వాడికి.
‘నమస్తే అమ్మా! మీరు?’
‘లోన్ కట్టడానికి వచ్చాం సార్‌‘
‘అమాసయ్య చనిపోయాడని తెలసింది..మరి... ’
నా ప్రశ్న పూర్తి కాలేదు కానీ తన కళ్ల నుండి కన్నీటి సంద్రం పొంగింది.
‘మా నాన్న గారు చనిపోవడం తో ఆక్సిడెంటల్ డెత్ క్రింద వారి పేరు మీద ఉండే ఇన్సూరెన్స్ డబ్బులు చేతికి వచ్చాయి ఆ డబ్బుతో అప్పు కట్టేశాం సార్’’
నా మనసును చదివిన వాడిల వాళ్ల అబ్బాయి కల్పించుకుని నాకు చెప్పాడు.
‘నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు కదా.’ ఆ కుర్రాడి వైపు లాలనగా చూస్తూ అడిగాను. అతడు వౌనంగా తలదించుకున్నాడు.
‘వాళ్ల నాన్న చనిపోవడంతో వాడు కాలేజీ మానేసాడు సార్ పొలం పనులకు వెళ్తున్నాడు. వాడ్ని చదివించే శక్తి నా ఒక్కదానికి ఎక్కడిదిః ’ కన్నీటికి అడ్డుకట్ట వేస్తూ చెప్పింది ఆవిడ.
నేను వౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాను.
‘మా పొలం కాగితాలు ఇస్తే వెళ్లిపోతాము సార్ ’ చేతులు జోడించింది. ‘నీ పేరేమిటి’ అని ఆ అబ్బాయిని చూస్తూ అడిగాను.
‘లోకేష్ సార్’
‘ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఎంత పర్సంట్ వచ్చింది?’
‘డిస్టింక్షన్ వచ్చింది సార్’
‘మీ పొలాన్ని తాకట్టు పెట్టుకుని మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాను. అతడ్ని చదివించండి.’ తడబడుతున్న స్వరంతో చిన్నగా చెప్పాను.
వాడి కళ్లల్లో వెలుగు కనబడింది. కానీ ఆమె కళ్లల్లో భయం కనబడింది.
‘ఒకసారి అప్పు తీసుకొని నా పెనిమిటి కోల్పోయాను. మరో సారి అప్పు తీసుకొని .. ’ ఆమె పూర్తి చేయలేకపోయింద.
‘మీ అబ్బాయికి సరస్వతీ దేవి కటాక్షం ఉంది. చదివిస్తే వృద్ధిలోకి వస్తాడు. మీ లోన్ కు నేను పూచీ వహిస్తాను. లోన్ తీసుకొని వాడిని చదివించండి.’ ఈ సారి స్థిరంగా చెప్పాను నేను.
ఆమె కళ్లల్లో భవిష్యత్తుపై ఆశ కనబడింది. వాడి కళ్లల్లో ఆనందం కనబడింది.
నేను వారికి చేస్తున్న ఈ చిన్న సాయం అమాసయ్య ఆత్మకు శాంతిని, అమాసయ్య భార్యకు ధైర్యాన్ని, అమాసయ్య కొడుకుకు భరోసాను న ఆ మనసుకు ప్రశాంతతను కల్గిస్తుందని చిన్న ఆశ...
స్వస్తి... *

పేట యుగంధర్ 9492571731