S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫాస్ట్ ట్వంటీ ట్వంటీ..

రోజురోజుకీ వేగం పెరిగిపోతోంది. ప్రతి విషయంలోనూ ఉరుకులు పరుగులే.. టెక్నాలజీ, విద్య, వైద్యం, ఆటలు.. ఇలా ఒకటేమిటి? అన్ని రంగాలు వడివడిగా, కాలానుగుణంగా దూసుకుపోతున్నాయి. 1990ల్లో కంప్యూటర్.. 2000 తరువాత స్మార్ట్ ఫోన్.. 2010లో నానోటెక్నాలజీ.. ఇలా టెక్నాలజీ ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. ఈ సాంకేతిక మార్పులు మనిషి నడవడికను, జీవన విధానాన్ని సమూలంగా మార్చేశాయి. గతంతో పోలిస్తే సాంకేతిక పరిజ్ఞానం వడవడిగా ప్రజా జీవితంలో వచ్చేస్తోంది. ఇక రాబోయే దశాబ్దంలో మనం ఇంతవరకూ కనీవినీ ఎరుగని ఎన్నో సాంకేతిక మార్పులు జరుగుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో కొత్త పోకడలను ఆవిష్కరిస్తుందని, ఫలితంగా మనుషులు నిత్య జీవన విధానం ఎన్నో మార్పులకు లోనవుతుందని అర్థమవుతోంది. డ్రోన్ విమానాలు, విద్యుత్‌తో నడిచే డ్రైవర్ లేని కార్లు, కృత్రిమ అవయవాలు, ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్, మనిషి డీఎన్‌ఏను బట్టి ప్రత్యేక మందుల తయారీ.. వంటివి సాకారం అయ్యే దిశగా పరుగులిడుతున్నాయి. ఇలాంటి మార్పులకు కొత్త దశాబ్ది సాక్షీభూతంగా నిలవనుంది. ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్‌ను 60 ఓవర్లకు ఆడేవారు. తరువాత 50 ఓవర్లకు దాన్ని కుదించారు. అంత ఓపిక కూడా నేటి తరానికి లేదు. అందుకే నేడు 20 ఓవర్లకు మ్యాచ్ ఆడుతున్నారు. అందులో ఆచితూచి ఓపిగ్గా ఆడాల్సిన అవసరం లేదు.. అస్సలు ఆలోచించకుండా బంతి ఎదురవడం ఆలస్యం.. దంచి పడేయడమే.. ఇది ఒక్క క్రికెట్ విషయంలోనే అనుకుంటే పొరబాటు.. ప్రతీ రంగంలో 2020 హవానే.. సహస్రాబ్ది మొదలుకొని నేటివరకు నడిచింది ఒక ఎత్తు అయితే.. ఈ 2020 సంవత్సరంలో జరగాల్సింది.. జరగబోయేది మరో ఎత్తుగా కనిపిస్తోంది. 2020లో ఏ రంగం, ఎలా వడివడిగా పరుగులిడుతుందో ఒకసారి అవలోకిద్దాం..
విజన్ 2020
విజన్-2020.. ఇది ఒక ల్యాండ్ మార్క్. దేశచరిత్రలో మైలురాయి. రెండు దశాబ్దాల కాలంగా మనదేశంలో వినిపిస్తోన్న మాట ఇది. 2020 నాటికి మనదేశం ఎలా ఉండాలి? అనే అంశంపై చాలామంది చాలా రకాలుగా కలలు గన్న అంశం. 20వ శతాబ్దపు ఆఖర్లో అంటే 1990ల చివర్లో ప్రపంచమంతా రాబోతున్న కొత్త సహస్రాబ్ది గురించి చర్చ మార్మోగింది. నూతన సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. అందులో భాగంగానే 21 శతాబ్దం, అందులోనూ మొదటి ఇరవై సంవత్సరాలకు టార్గెట్లు పెట్టుకుని నూతనత్వం దిశగా ప్రపంచాన్ని నడిపించాలనే ప్రయత్నం మొదలైంది. దీనికే ‘విజన్ 2020’ అని పేరు పెట్టారు. భారతదేశంలో మన లక్ష్యాలు ఎలా ఉండాలనే దానిపై నాటి రాష్టప్రతి అబ్దుల్ కలాం, డాక్టర్ వై.ఎస్. రాజన్‌తో కలిసి ‘ఇండియా 2020’ అనే పేరుతో పుస్తకాన్ని రాశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే నినాదాన్ని చేపట్టింది. కేంద్ర ప్లానింగ్ కమిషన్ ‘ఇండియా 2020’ పేరుతో ఒక డాక్యుమెంటును కూడా విడుదల చేసింది. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని భూతద్దంలో చూపెడుతూ ‘విజన్ 2020’గా నామకరణం చేశారు. ఎవరు రాసినా, ఏ పేరు పెట్టినా అన్ని డాక్యుమెంట్లు, రచనల్లోనూ ఉన్న సారాంశం ఒక్కటే.. దాదాపు భాష కూడా అదే.. దీని మూల వ్యూహకర్త ప్రపంచ బ్యాంకు. వారి ఆలోచన ప్రకారమే చంద్రబాబు నాయుడు వంటి పాలకులందరూ నడుచుకున్నారు. ప్రపంచ బ్యాంకు సిద్ధాంతానే్న తమ నాలుక ద్వారా పలికించారు. నాటి యువతరాన్ని ఇది ఆకర్షించింది.
మనం 2020లోకి ప్రవేశించి ఐదు రోజులు గడిచాయి. ఈ ఇరవై సంవత్సరాల్లో ఏం సాధించామని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆకాశంలో విహరిస్తూ పాతాళంలోకి దిగబడిపోయాం. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తామంటూ చెప్పిన మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో నేటి సంక్షోభాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రజలందరికీ ఉన్నతమైన సౌకర్యాలు, నాణ్యమైన సేవలు అందిస్తామని, పేదరికం నిర్మూలన, అసమానత తగ్గింపు ‘విజన్ 2020’ లక్ష్యాలుగా ప్రకటించారు. మెరుగైన విద్య, వైద్యసేవలు, అందరికీ ఉపాధి, ఆదాయాల పెంపుదల, గ్రామాల్లో పట్టణ సౌకర్యాలు, స్మార్ట్ సిటీలు.. ఇలా అందమైన లోకాన్ని చూపెట్టి జనాన్ని మభ్యపెట్టారు. ఇవన్నీ సాధించాలంటే ‘గ్రోత్ ఇంజన్లు’ కావాలి. వాటికి ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అనే పరికరాలు అమర్చాలని చెప్పారు. వ్యవసాయంలో డైరీ, చేపలు-రొయ్యల పెంపకం, కాంట్రాక్టు వ్యవసాయం ప్రవేశపెట్టాలన్నారు. సహకార సొసైటీలను కంపెనీ చట్టంలోకి తీసుకొచ్చారు. ఫలితంగా సహకార డైరీలు, చక్కెర కర్మాగారాలు వ్యక్తుల పరమయ్యాయి. కార్పొరేట్ విద్య, వైద్యాన్ని ప్రోత్సహించడానికే ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడులు, ఆస్పత్రులు మూతబడ్డాయి. దాని ఫలితం ఎంత క్రూరంగా ఉంటుందో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది.
గ్రామ స్వరాజ్యం
పల్లెలకు శాస్త్ర సాంకేతిక ఫలాలు.. 2020 నాటికి మనదేశంలో గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాలని అప్పటి మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం భావించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చోటు చేసుకున్న అభివృద్ధి గ్రామాలకు చేరాలని, తద్వారా పల్లెలు సమగ్రాభివృద్ధిని సాధించగలవని చాటిచెప్పారు. గ్రామాలను పట్టణాలు, నగరాలతో అనుసంధానం చేయడానికి సాంకేతికత ఉపయోగపడుతుంది. నేడు ఆ దిశగా శాస్త్ర, ఆసంకేతిక రంగాలను అభివృద్ధిపర్చాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు కనీస వౌలిక సదుపాయాలను కల్పించడంతో అవి అభివృద్ధి పథంలో పయనించినట్లు కాదు. గ్రామాలన్నింటికీ.. పట్టణ సదుపాయాలను సమకూర్చాలి. అంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం.. నాణ్యమైన వైద్యంతో పాటు టెలీ మెడిసిన్‌ను సైతం గ్రామాలకు చేరువ చేయాలి. అత్యాధునిక పద్ధతుల్లో విద్య, వైద్య అందించడం ద్వారా గ్రామీణ ప్రజలకు స్వయం సమృద్ధిని కల్పించినట్లు అవుతుంది. ఇదే విషయాన్ని అబ్దుల్ కలాం చాలాసార్లు ప్రస్తావించారు కూడా. ప్రతి వ్యక్తీ అక్షరాస్యుడు కావాలి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యతను పారద్రోలాలి. నూతన సంవత్సరం సందర్భంగా చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను స్వీకరిస్తే ఇదేమంత కష్టమైన విషయం ఏమీ కాదు. ప్రతి రాష్ట్రం కూడా నిర్బంధ విద్యను గ్రామీణ నిరుపేద విద్యార్థులకు తప్పనిసరిగా అందించాలి.
విద్యారంగం
విద్యారంగంపై ఖర్చు పెరిగింది కానీ.. విద్యారంగంలో మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇంతవరకూ సాధిస్తున్నాం. విద్యనభ్యసించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో విద్యను ప్రోత్సహించేందుకు మధ్యాహ్న భోజనం, సర్వశిక్షా అభియాన్, గ్రామీణ ప్రాంతాల్లో భవనాల నిర్మాణంపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. స్కూల్ నుంచి ఉన్నత చదువులపై ఆల్ ఇండియా సర్వే విస్తృతమైన సమాచారాన్ని సేకరించింది. ప్రాథమిక విద్య అనంతరం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. సమాజంలో బలహీన వర్గాల విషయానికి వస్తే కచ్చితమైన వైరుధ్యాన్ని గమనించవచ్చు. ఉన్నత విద్యపై ఇచ్చిన నివేదిక ప్రకారం 1998లో 229 యూనివర్శిటీలు ఉండగా.. ఆ సంఖ్య 2011-12 నాటికి 642కు పెరిగింది. ప్రస్తుతం ఉన్న యూనివర్శిటీల సంఖ్య 993. దేశంలోని యువతకు విద్యనందించేందుకు 2020లో 1500 యూనివర్శిటీలు నెలకొల్పాల్సి ఉందని నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అంచనా వేసింది.
ఆరోగ్యం
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 17.5 శాతం ఉంది. అలాగే భారతదేశంలో 20 శాతం మంది జనాభా వివిధ రోగాలతో బాధపడుతున్నవారే. ఎటుచూసినా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్నాయి. జబ్బుల వల్ల 60 మిలియన్ మంది ఏకంగా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అంటే ఏడాదికి వారు సంపాదిస్తున్న దాంట్లో జబ్బులను నయం చేసేందుకు కావాల్సిన మందులకే ఖర్చు పెడుతున్నారు. ఇక అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో వైద్యుల కొరత ఉందని లానె్సట్ స్టడీ చెబుతోంది. ఇందులో రాష్ట్రాల వారీగా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గోవా రాష్ట్రంలో ప్రతి 614 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే.. బీహార్ వంటి రాష్ట్రంలో ప్రతి 8, 789 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇక పేదరికంతో ఉన్న రాష్ట్రాల్లో 10 ఆసుపత్రులు ఉంటే ఆరింటిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండదు. అంతేకాదు ఆసుపత్రుల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉండదు. పరిశుభ్రత ఉండటం లేదు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు ఆరోగ్యం కోసం కేటాయించాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందే అవకాశం కల్పిస్తోంది. ఆయా రాష్ట్రప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇక చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో 100 శాతం ఖర్చులను కేంద్రమే భరిస్తోంది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆసుపత్రులు లేనందువల్ల పేద మహిళలు తమ ప్రసవాల కోసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. సరైన రహదారులు లేక కొంతమంది గర్భిణీలు ఆసుపత్రికి చేరేలోపే చనిపోతున్నారు. మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో పెరిగినప్పటికీ గ్రౌండ్ లెవల్లో మాత్రం సదుపాయాలు పెరగడం లేదు. మొత్తానికి ఆరోగ్య భారత్ కావాలంటే.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ప్రభుత్వాలు పరుగులు పెట్టాల్సిందే..
మందులు
జబ్బును బట్టి మందు వాడుకునే పద్ధతి ఈ దశాబ్దంలో మారిపోనుంది. ఇప్పుడు మనిషిని బట్టి మందు తయారుచేసి అందించే పద్ధతి అందుబాటులోకి రానుంది. అంటే ఇది మీకోసమే మాత్రమే తయారుచేసే మందులు అన్నమాట. ‘కస్టమైజ్డ్ మెడిసన్’ పేరుతో ఈ ప్రక్రియపై ఇప్పుడిప్పుడే శాస్తవ్రేత్తలు ప్రయోగాలను అధికం చేశారు. ఈ దశాబ్ది చివరికల్లా వైద్యంలో ఎన్నో మార్పులు రానున్నాయి. అందులో ఒకటి మనిషి బట్టి మందు తయారుచేసి అందించే కొత్త పోకడ చాలా వడివడిగా రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
నానోటెక్నాలజీ
కృత్రిమ అవయవాలంటే.. చెక్క కాళ్లు, అల్యూమినియం చేతులు కాదు. బయో టెక్నాలజీ, నానోటెక్నాలజీ ఆధారంగా పూర్తిగా సహజ సిద్ధమైన అవయవాలు మనం త్వరలోనే చూసే అవకాశం వస్తోంది. వీటిని కృత్రిమంగా తయారుచేశారని చెబితే కానీ గుర్తించలేనంత సహజసిద్ధంగా రూపొందించేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దశాబ్దంలో కృత్రిమ గుండెను ఆవిష్కరించినా ఆశ్చర్యపడక్కరలేదు. యూకేలోని టచ్ బయానిక్స్ అనే సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలతో మనిషి చర్మాన్ని పోలిన విధంగా కృత్రిమ చేతులను తయారుచేస్తోంది. ఈ కృత్రిమ చేతివేళ్లు సాధారణ చేతివేళ్ల మాదిరిగానే పనిచేస్తాయి. ఇటువంటి ఎన్నో ఆవిష్కరణలు చూసే అవకాశం ఈ దశాబ్దంలో కలుగుతుంది.
అంతరిక్షంలోనూ..
వారం రోజులు సెలవిస్తే.. ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్లివద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడూ ఈ భూమీదేనా.. అప్పుడప్పుడూ ఆకాశంలో విహరిద్దాం అనుకునేవారికి ఈ కొత్త దశాబ్దిలో అవకాశం కలగవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నాసా, ఇస్రో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు యూ ఎస్, యూరప్‌లోని కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు ఈ కలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘మార్స్ మిషన్’లో ఉపయోగించనున్న రోవర్‌ను ఇటీవలే ఆవిష్కరించింది. ప్రాచీన జీవజాతి మనుగడ అనే్వషణే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయోగం మరిన్ని లక్ష్యాలను కూడా ఛేదించనుంది. భవిష్యత్తులో అంగారకునిపైకి మానవసహిత యాత్రలకు కూడా ఇది బాటలు వేయనుందని నాసా శాస్తవ్రేత్తలు తెలిపారు. తొలిసారి చేస్తున్న ఈ ప్రయోగం భవిష్యత్తు మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఎంతగానో దోహదం చేయనుంది.
టెలికాం
రాబోయే దశాబ్దంలో 5జీ, 6జీ అంటూ టెలికాం సేవల తీరు మారబోతోంది. మొబైల్ ద్వారా అత్యంత వేగంగా డేటా సేవలను అందించగలుగుతున్న 4జీ తర్వాత టెలికాం గతినే మార్చనున్న 5జీ సేవలను ఇప్పుడిప్పుడే ప్రయోగాత్మకంగా వివిధ దేశాల్లో చేపడుతున్నారు. మన దేశ భౌగోళిక విస్తృతి దృష్ట్యా, రాబోయే దశాబ్ది మొత్తం 5జీదేనని, దశాబ్దం చివరలో మాత్రం 6జీకి శ్రీకారం చుట్టవచ్చునన్నది టెలికాం సంస్థల అభిప్రాయం. ఆటోమేషన్ ప్రక్రియ డిటిజల్ ద్వారా సాకారం కావడం రాబోయే దశాబ్దిలో వచ్చే అతి పెద్ద మార్పు. నెట్‌వర్క్‌ను సమకూర్చడమే కాకుండా వినియోగదారులు కోరుకున్న సేవలు ఏ సమయంలోనైనా సరే, ఎక్కడైనా అందించేలా టెలికాం సంస్థలు రూపుదిద్దుకోనున్నాయి. మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లుగా పేర్కొనే 20-60 గిగాహెర్జ్ వల్ల డేటా సెకనుకు 10 గిగా బైట్స్ వేగంతో బదిలీ చేయవచ్చు. క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, నెట్‌తో అనుసంధానమయ్యే డ్రైవర్ రహిత వాహనాలు, నవీన నగరాలు, స్మార్ట్ హోమ్స్‌లో టెలికాందే కీలకపాత్ర. మొబైల్ వృద్ధి అధికంగా ఉండే దేశాల్లో అమెరికాతోపాటు చైనా, భారత్ వంటి దేశాలే కీలకపాత్ర పోషించనున్నాయి.
బిజినెస్
కొత్త దశాబ్దంలో మదుపర్ల ధోరణి మారనుందని ఆర్థిక నిపుణుల అంచనా.. ఒక్క క్లిక్‌తో పెట్టుబడి పెట్టాలి.. మరో క్లిక్‌తో వాటిని తేసేసుకోవాలి.. ఇలాంటి ఆలోచనే నేడు అధికం అవుతోంది. యువత అధికంగా ఉన్న మనదేశంలో ఆర్థిక పెట్టుబడుల వైపే మొగ్గు కనిపిస్తోంది. ఇది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అయ్యే వీలుంది. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్లలోకి సిప్‌ల ద్వారా నెలకు రూ. 8,500 కోట్ల వరకూ వస్తున్నాయని, వీటిపై దృష్టి ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో ఈ మొత్తం మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. ప్రతి విషయంలోనూ యువత మార్పును కోరుకుంటోంది. బీమాపై ఇప్పటికే అవగాహన పెరిగింది. కొత్త దశాబ్దంలో బీమా ఆర్థిక ప్రణాళికల్లో ప్రథమ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టర్మ్ పాలసీల విషయంలో వృద్ధి కనిపించనుంది.
బ్యాంకింగ్
వేల సంవత్సరాల నుండీ మనం నగదును ఉపయోగిస్తున్నాం. ఇది భౌతికంగా చాలా గుర్తింపును పొందింది. 2016 నోట్ల రద్దు తరువాత చెల్లింపుల విషయంలో గట్టి మార్పులే కనిపించాయి. నగదు రహిత లావాదేవీల వేగం పెరిగింది. మొబిక్విక్ వాలెట్లలో గట్టి మార్పులే కనిపిస్తున్నాయి. ఇక కొన్ని ఫైనాన్షియల్ కంపెనీలు ఏఐ ఆధారిత బాట్స్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వంటి వినూత్న సాంకేతిక పరిష్కారాలను చూపిస్తున్నారు. ఇప్పటికే మనం ఆధార్ అనుసంధానిత చెల్లింపు సేవలు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగిస్తున్నాం కూడా. ఇప్పటి యువ వినియోగదార్లు.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బ్యాంకు పాసు పుస్తకాలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లోనే లావాదేవీలను జరుపుతున్నారు. అలాగే భవిష్యత్తులో నగదుతో కూడా పని ఉండకపోవచ్చు. ఇప్పటికే డెబిట్, క్రెడిట్ కార్టులు, వాలెట్‌లతో నడిపేస్తున్నారు. ఈ దశాబ్దంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రావచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. వర్చువల్ కార్డులు, వాలెట్లు, కాంటాక్ట్‌లెస్ కార్డులు రాజ్యమేలే పరిస్థితి చాలా వేగంగా రానుంది.
విద్యుత్
సంప్రదాయ విద్యుత్తు తయారీకి వినియోగించే బొగ్గు ఎంతో కాలుష్యానికి కారణమవుతోందని, పర్యావరణానికి నష్టం చేస్తోందని అందరూ అంగీకరించే అంశమే. కానీ దానికి సరైన ప్రత్యామ్నాయం ఇంతవరకూ రాలేదు. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు.. వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ఆవిష్కరణ జరిగినప్పటికీ అవి పూర్తిగా థర్మల్ విద్యుత్తు స్థానాన్ని ఆక్రమించలేకపోయాయి. కానీ ఈ కొత్త విభాగాల్లో పరిశోధనలు పెరిగి సౌర విద్యుత్తు బాగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు అన్ని విద్యుత్తు అవసరాలకు సౌర విద్యుత్తును, ఇతర సంప్రదాయేతర విద్యుత్తు వనరులను వినియోగించుకునే అవకాశం కొత్త దశాబ్దంలో అందుబాటులోకి వస్తుంది. రాబోయే దశాబ్దంలో పెట్రోలు బంకులు క్రమంగా మాయం కావొచ్చు. వాటిస్థానంలో ఛార్జింగ్ స్టేషన్లు కనిపించవచ్చు. మనదేశంలోనే కాదు ఇకముందు ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇప్పటికే చైనాలో గతేడాది 11 లక్షల విద్యుత్ కార్లు విక్రయమయ్యాయి. ఇవి మొత్తం ప్రపంచ విక్రయాల్లో సగభాగానికి సమానం. మనదేశం విద్యుత్ కార్ల విక్రయాల్లో కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ.. 2030 కల్లా దేశవ్యాప్తంగా రోడ్లపై కేవలం విద్యుత్ వాహనాలే తిరిగేలా చేయాలన్న లక్ష్యమైతే ఉంది. ఆ దిశగా మన కార్ల కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.
సాంకేతికత
మనిషి చేయలేని, చేయడానికి సమయం తీసుకునే పనులను కంప్యూటర్లు విపరీతమైన వేగంతో చేసేస్తున్నాయి. ఇక మనిషి మాదిరిగానే తమంతట తాము ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే కంప్యూటర్ల ఆవిష్కరణ కొత్త దశాబ్దిలో జరగబోతోంది. కొన్ని సందర్భాల్లో మనిషి ఆలోచన అయినా పక్కదాని పడుతుంది కానీ.. ఇటువంటి కంప్యూటర్లు మాత్రం తప్పుడు ఆలోచన్లు చేయవు. నానోటెక్నాలజీలో భాగమైన ఆటమ్స్, మాలిక్యూల్స్‌ను కలగలిపి కంప్యూటర్ చిప్‌లను తయారుచేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తే మనిషి ఆలోచనను పోలిన కంప్యూటర్లు కార్యరూపం దాల్చినట్టేనని శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు. జనాభా తగ్గిపోతున్న దేశాల్లో పనివాళ్లు దొరకటం ఎంతో కష్టం. ఎంతో ఖరీదు కూడా. అందువల్ల మనిషి మాదిరిగా సేవలు అందించగల రోబో పనిమనుషులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డుల ఆవిష్కరణకు పలువురు శాస్తవ్రేత్తలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి సఫలీకృతం అయితే ప్రతి ఇంట్లో రెఫ్రిజిరేటర్, వాషింగ్‌మెషీన్స్‌లా రోబోలు ఉంటాయి. దానికి ఇచ్చిన ప్రోగ్రామును అనుసరించి అన్ని పనులూ చేసేస్తుంది. అలాగే స్టెనో అవసరం లేకుండా రోబోనే పనిచేస్తుంది.
వాయిస్ కంట్రోల్, వాయిస్ కమాండ్ పేరుతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఈ దశాబ్దంలో అందుబాటులోకి రానుంది. మనం చెబుతూ ఉంటే కంప్యూటర్లో అది స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లో లైట్లు, ఫాన్ స్విచ్‌లు వేయడం, టీవీ ఆన్ చేయడం, ఏసీలు చెప్పిన ప్రకారం నడుచుకోవడం, కారు ఎక్కగానే ఏసీ, రేడియో ఆన్ చేయడం, చెప్పిన మాటల్ని ఇతర భాషల్లోకి తర్జుమా చేయడం వంటివన్నీ ఇక చేయాల్సిన పనిలేదు. మాట చెబితే చాలు.. అన్ని పనులూ పూర్తయిపోయే కృత్రిమ మేథతో కూడిన పరిజ్ఞానం అందుబాటులోకి రాబోతోంది. తెలుగు భాషను ఇంగ్లీషులోకి మార్చు అని చెప్పగానే కంప్యూటర్ ఒక్క నిముషంలో అనువాద ప్రతిని అందిస్తుంది. డిక్టేట్ చేస్తూ పోతే ఉత్తరం సిద్ధమవుతుంది. ఇటువంటి ఎంతో వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం కొత్త దశాబ్దిలో విరివిగా అందుబాటులోకి రానుంది.
ఇలా 2020లో అన్నీ చాలా వేగంగా, సాంకేతికతే లక్ష్యంగా దూసుకుపోనున్నాయి. అయితే రాజకీయాలు, చట్టాలను అమలుచేయడంలో, కోర్టులలో ఈ వేగం కనిపించనుందో లేదో వేచి చూడాలి మరి! ఏదిఏమైనా ఒత్తిడి, డిప్రెషన్, వ్యతిరేకత వంటివి మనుషుల జీవితాల్లో ఉండకుండా ప్రతి ఒక్కరి జీవితం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. *

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి