S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమృతం పంచిన అమ్మ

-షేక్ అబ్దుల్ హకీం జాని
‘‘నాయనా! రాత్రిపూట చలి విపరీతంగా పెరిగిపోయింది. ఒక కంబళి తీసుకురా బాబూ’’ కుమారుడ్ని దీనంగా అడిగింది జగదాంబ.
‘‘పని ఒత్తిడితో సతమతవుతున్నాను. కంబళ్లు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఏదో ఒక దుప్పటి తెస్తాలే. వెళ్లి కాసేపు నిద్రపో. ఊరికే నస పెట్టబాకు’’ గదిమాడు పెద్ద కుమారుడు చక్రధర్.
చేసేది లేక ఆ వృద్ధురాలు పక్కగదిలో ఉన్న మంచంపై కూర్చుంది. ఒక్కసారిగా ఆవిడ జీవితం కళ్ల ముందు కనబడింది. మనసులోనే గతాన్ని నెమరువేసుకుంది.
నిజానికి జగదాంబ కలవారి ఇంటి కోడలే. తాతల నుండి సంక్రమించిన పొలాన్ని భర్త స్వయంగా దున్ని ధాన్యరాశులను పండించేవాడు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దవాడి పేరు చక్రధర్. రెండవ వాడు మురళీధర్. మూడవ సంతానమైన కుమార్తె పేరు మణిమాల. పిల్లలను అదే గ్రామంలో ఉన్న ఒక చిన్న పాఠశాలలో చేర్చింది. వారు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇంతలో జగదాంబ భర్త ఉత్తమ్‌కు ఆర్థిక ఇబ్బందులు మొదలైనాయి. దాంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఇంకా పాఠశాలలోనే చదువుతున్న చిన్న పిల్లలు, మరోవైపు తనకు దూరమైన పొలం, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఆలోచించుకుని ఉత్తమ్ మంచం పట్టాడు. మానసికంగా కృంగిపోయిన ఉత్తమ్ కొద్ది రోజులకు కాలం చేశాడు. వైధవ్యం పొందిన జగదాంబ పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక తన ముగ్గురు సంతానాన్ని తీసుకుని పొరుగున ఉన్న పట్నానికి వలసపోయింది. తన నగలను అమ్మి ఒక కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఖాళీ సమయాలలో కుట్టుమిషన్‌పై దుస్తులు కుట్టేది. తానేదో మేడలు, మిద్దెలు కట్టాలనే తపనతో అదనపు సంపాదన కోసం జగదాంబ ఏనాడూ ప్రాకులాడలేదు. తన బిడ్డలను బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలనే ఏకైక లక్ష్యం. ఆమె అహర్నిశలు శ్రమించింది. ముగ్గురు పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్పించింది. పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు. సెలవు రోజుల్లో అవకాశమున్నప్పుడు కిరాణా దుకాణంలో తల్లికి అప్పుడప్పుడూ పిల్లలు సాయంగా ఉండేవారు. ఈ విధంగా జగదాంబ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించింది.
ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న జగదాంబ ముగ్గురు సంతానం నగరంలో పెద్ద ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మంచి సంబంధాలు దొరకడంతో అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. తల్లి మాత్రం చిన్న పట్నంలోనే నివశిస్తుంది. జగదాంబ వయోభారం వల్ల శ్రమ చేయలేక కిరాణా దుకాణాన్ని తీసేసింది. ఎవరైనా దుస్తులు కుట్టమని ఇస్తే ఓపిక చేసుకుని అప్పుడప్పుడు కుట్టేది. ఆ వచ్చిన డబ్బుతో జీవితాన్ని వెళ్లబుచ్చుతుంది. తన ముగ్గురు సంతానంలో ఎవరో ఒకరు కాస్తోకూస్తో వాళ్లకు తీరికైనప్పుడు, అమ్మ గుర్తున్నప్పుడు డబ్బు పంపేవారు. నగరంలో వారంతా యాంత్రిక జీవన చదరంగంలో పరుగులు తీసేవారు.
ఒక రోజు పెద్దకుమారుడైన చక్రధర్‌కు తల్లి నుండి ఫోన్ వచ్చింది.
‘‘నాయనా చక్రధర్! వయోభారం వల్ల నేను ఏ పనీ చేయలేకపోతున్నాను. నీ వద్దకు వచ్చి కొంత కాలం ఉండాలనుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే నగరానికి వస్తాను’’ అని ప్రాధేయపడుతూ అడిగింది తల్లి.
‘‘ఇక్కడ మేమంతా పనుల ఒత్తిడిలో పరుగులు తీస్తున్నామమ్మా. నిన్ను ప్రత్యేకించి చూసుకునే తీరిక లేనంత పనిభారంతో అల్లాడుతున్నాను. నీ కోడలు కూడా ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. నిన్ను కనిపెట్టుకొని ఉండాలంటే మాకు కుదరదు. పోనీ పనిమనిషిని పెట్టుకుందామా అంటే ఇక్కడ పనిమనుషులు దొరకడం లేదు. అందువల్ల నా వద్ద కొద్దిరోజులు ఉండి ఆ తరువాత తమ్ముడి వద్దకు వెళుదువుకానీ’’ అన్నాడు చక్రధర్.
ఎలాగో ఓపిక చేసుకుని జగదాంబ నగరానికి చేరుకుని పెద్ద కుమారుడైన చక్రధర్ ఇంటికి చేరింది. చక్రధర్‌కు ఇద్దరు మగ పిల్లలు. నాయనమ్మను చూడగానే వాళ్లకు ప్రాణం లేచొచ్చింది.
‘‘ఆగండర్రా! ఊరి నుండి రాగానే అలా మీద పడిపోతారా ఏంటి. వెళ్లి పాఠశాలలో ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేయండి’’ అంటూ పిల్లల్ని కసిరింది. పెద్దకోడలు మదాలస.
ఆ రాత్రి గడిచింది. ఉదయానే్న అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని అల్పాహారం సేవించారు. పాఠశాల వాహనం రావడంతో పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారు.
‘‘అమ్మా! నేనూ, నీ కోడలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి కార్యాలయానికి వెళుతున్నాము. మేము వచ్చే పాటికి సాయంత్రం అవుతుంది. పిల్లలు కూడా పాఠశాల నుండి అప్పుడే వస్తారు. నువ్వు లోపల గడియ పెట్టుకుని విశ్రాంతి తీసుకో. మేము వచ్చేవరకు గడియ తీయమాకు. అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది’’ అని పెద్ద కుమారుడు చక్రధర్ అన్నాడు. జగదాంబను ఇంట్లో ఒంటరిగా వదలి అందరూ ఎటోళ్లు అటు వెళ్లిపోయారు.
జగదాంబ లోపల నుండి తలుపు గడియ పెట్టుకుని కొద్దిసేపు నిద్రపోయింది. ఎటూ కదలడానికి లేదు. తననెవరో జైల్లో పెట్టారనే భావన. సాయంత్రమైంది. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వచ్చారు. ఆఫీసు నుండి పెద్ద కోడలు మదాలస కూడా వచ్చేసి వేడివేడి కాఫీ తాగి ప్రపంచ పనిభారమంతా తన భుజస్కంధాలపై ఉందనే భావనతో మదాలస తాపీగా మంచంపై నడుము వాల్చింది. ఇంతలో పిల్లలిద్దరూ అమ్మ వద్దకు వచ్చారు.
‘‘అమ్మా! మేము ట్యూషన్‌కు వెళ్లాలి. టిఫిన్ పెట్టూ’’ అన్నారు పిల్లలు.
‘‘ఇప్పుడే కదా నేను ఆఫీసు నుండి వచ్చింది’’ విసుక్కుంటూ కొంత చిరుతిండిని పిల్లలకు పెట్టింది మదాలస.
పిల్లలు వాటిని తిని ట్యూషన్‌కు వెళ్లిపోయారు. ఈమధ్య కాలంలో వృద్ధురాలైన జగదాంబనూ ఎవరూ పట్టించుకోలేదు. పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. జగదాంబకు ఏదైనా తినాలని మనస్సులో ఉంది. కోడల్ని అడిగితే ఏమనుకుంటుందో అనే చిన్నపాటి సందేహం. ఎందుకొచ్చిన తంటాలే అని మంచినీళ్లు తాగేసి ఊరుకుంది. చీకటి పడింది. కుమారుడు చక్రధర్ ఆఫీసు నుండి, పిల్లలిద్దరూ ట్యూషన్ నుండి వచ్చేశారు. రాగానే పిల్లలు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకోవడం మొదలుపెట్టారు. చక్రధర్ తన సెల్‌ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అవుతుందో అనే భయంతో వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లను చూసి డిలీట్ చేస్తున్నాడు. కోడలు వంటపనిలో నిమగ్నమైంది. జగదాంబ ఏం చేయాలో పాలుపోక జపమాల తీసుకుని దైవ ప్రార్థనలు మొదలుపెట్టింది. ఇంతలో వంట పూర్తి కావడంతో భోజనానికి రమ్మని అందరినీ పిలిచింది మదాలస. అందరూ భోజనం చేశారు. ఆ రాత్రి గడిచింది. తిరిగి ఉదయం కాగానే తంతు మొదలైంది. గానుగెద్దుల్లాగా నిన్న ఏం చేశారో ఈ రోజు కూడా యథాతథంగా వారివారి కార్యక్రమంలో నిమగ్నమై శరవేగంతో పరుగులు తీస్తూ వెళ్లిపోయారు. జగదాంబకు పలకరించే నాథుడు లేడు. నాలుగు రోజులు గడిచాయి. జగదాంబకు జ్వరం వచ్చింది. ఎంతో కష్టం మీద చక్రధర్ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లాడు. వైద్యుడు అన్ని పరీక్షలు చేశాడు.
‘‘మీ అమ్మగారికి విష జ్వరం వచ్చింది. వేలకు మందులు వేయాలి. విశ్రాంతి చాలా అవసరం. దగ్గరుండి చూసుకోవాలి’’ అన్నాడు వైద్యుడు.
‘‘నాకు సెలవు దొరకదు డాక్టర్‌గారూ. వీలుంటే జ్వరం తగ్గే వరకు మీ ఆసుపత్రిలోనే, మీ పర్యవేక్షణలో ఉంచండి. జ్వరం నయం కాగానే నాకు ఫోన్ చేయండి. నేను వచ్చి ఇంటికి తీసుకుపోతాను. ఎంత ఖర్చు అయ్యిందో చెబితే నేను మీకు చెల్లిస్తాను’’ అని చెప్పాడు చక్రధర్.
అందుకు డాక్టర్ ఒప్పుకున్నాడు. ఒక గది తీసుకుని నర్సు పర్యవేక్షణలో తల్లిని ఉంచి ఇంటిముఖం పట్టాడు చక్రధర్.
జగదాంబ పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న పిదప జ్వరం తగ్గింది. ఆ మీదట ఇంటికి తీసుకుని వచ్చారు. ఆసుపత్రిలో డాక్టర్ లక్షన్నర బిల్లు వేశాడు. ఆ బిల్లును చూసుకుని చక్రధర్ భార్య మదాలస గుండెలు బాదుకుంది.
‘‘ఈ ముసలిది ఇంకా మన ఇంట్లోనే ఉంటే కొంప కొల్లేరు అవుతుంది. మనం బొచ్చ పట్టుకుని అడుక్కోవలసి వస్తుంది. ఈవిడ గారిని చూడవలసిన బాధ్యత చిన్న కుమారుడిపై కూడా ఉంది కదా? రేపు ఆదివారం అతడి వద్ద వదలిరండి’’ పురమాయించింది మదాలస.
పెళ్లాం ధాటికి తట్టుకోలేక తల్లిని చిన్న కుమారుడైన మురళీధర్ వద్దకు తీసుకుని వెళ్లాడు. తల్లిని చూడగానే మురళీధర్ దంపతులు అవాక్కయ్యారు.
‘‘ఇదేమిటన్నయ్య? నువ్వు చెప్పా పెట్టకుండా అమ్మను తీసుకొని వస్తే ఎలా? మేమే పది రోజుల పాటు విదేశాలకు విహారయాత్రకు వెళుతున్నాము. ఆ తరువాత అమ్మను నా వద్దకు తీసుకొని వస్తాను’’ అన్నాడు మురళీధర్.
చక్రధర్ చేసేది లేక అదే నగరంలో ఉంటున్న చెల్లెలు మణిమాల ఇంటికి తల్లిని తీసుకొని వెళ్లాడు.
తల్లిని చూడగానే మణిమాల గుండె జారిపోయింది. ఏడవలేక నవ్విందన్నట్లు కృత్రిమ నవ్వును ముఖంపై తెచ్చుకుంది.
‘‘రామ్మా! ఇప్పుడేనా రావడం. మీ అల్లుడుగారు క్యాంపుకు వెళ్లారు’’ అని చెప్పింది మణిమాల.
‘‘అమ్మా మణిమాల! చిన్న అన్నయ్య వాళ్లు విదేశాలకు విహారయాత్రల కోసం వెళుతున్నారు. మొన్నటి వరకు నేను అమ్మను సాకాను. చిన్న అన్నయ్య విదేశాల నుండి రాగానే అమ్మను తన ఇంటికి తీసుకుని వెళతానన్నాడు. అప్పటి వరకు అమ్మను నీ దగ్గరే ఉంచుకోమ్మా’’ అని ప్రాధేయ పడ్డాడు చక్రధర్.
‘‘అదెలా కుదురుతుంది అన్నయ్య. తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత మగపిల్లలది. నేను భర్తచాటు ఆడదాన్ని. మీరు అమ్మను నా దగ్గరికి తెస్తే ఎలా? నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఉద్యోగం కూడా మానేశాను. నీ ఇంటికి తీసుకుని వెళ్లు’’ అని ఖరాఖండిగా చెప్పింది మణిమాల.
‘‘ముందుగా నా దగ్గరే అమ్మను ఉంచుకున్నానమ్మా. అమ్మకు విషజ్వరం వచ్చి నాకు లక్షన్నర వదిలాయి. వారం పది రోజుల్లో చిన్న అన్నయ్య వాళ్లు వచ్చేస్తారుగా. వెంటనే అమ్మను అక్కడికి పంపుదువుగాని’’ అని సర్దిచెప్పాడు చక్రధర్.
చేసేది లేక మణిమాల తల్లిని తన వద్దనే ఉంచుకుంది.
రెండు రోజులు గడిచాయి. మణిమాల భర్త క్యాంప్ నుండి తిరిగి వచ్చాడు.
‘‘ఏమిటీ తగలాటకం. మీ అమ్మను మన వద్ద వదిలారేంటి. మీ అన్నయ్యలు ఉంచుకోవచ్చు కదా?
ఏం మాయరోగం వచ్చింది వాళ్లకు?’’ కోపంగా అన్నాడు మణిమాల భర్త జ్వాలా ప్రసాద్.
విషయమంతా పూసి గుచ్చినట్లు భర్తతో చెప్పింది మణిమాల.
‘‘పది రోజుల భాగ్యానికి మనకు చెడ్డ పేరు దేనికి?’’ అన్నది మణిమాల.
ఇంతలో జగదాంబ తన గదిలో నుండి హాల్లోకి వచ్చింది.
‘‘బాగున్నారా అత్తయ్య? హహహా’’ అంటూ ప్రేమ ఒలకపోశాడు అల్లుడు జ్వాలా ప్రసాద్.
‘‘బాగున్నాను నాయనా... మీరు బాగున్నారా?’’ అడిగింది జగదాంబ.
‘‘బాగున్నానండి. మీరు విశ్రాంతి తీసుకోండి’’ వెటకారంగా చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు జ్వాలా ప్రసాద్.
అల్లుడు జ్వాలా ప్రసాద్ చాలా పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. నిత్యం ఏసి గదుల్లో కూర్చుని పనిచేయడమే. జీతం లక్ష రూపాయలు పైమాటే. ఇక పై సంపాదనకు అడ్డు అదుపూ లేదు. ఈయనగారొక్కరే కష్టపడి సంపాదిస్తున్నట్లు, దేశంలో అందరూ దోపిడీ చేసి సంపాదిస్తున్నారనే భావనలో నిత్యం మునిగి తేలుతుంది అతని భార్య మణిమాల.
ఆ రోజు గడిచింది. బారెడు పొద్దెక్కినా కుమార్తె మణిమాల నిద్ర లేవలేదు. అల్లుడు జ్వాలా ప్రసాద్ నిద్ర లేచి స్నానపానాదులు పూర్తి చేసుకుని ఉద్యోగానికి
వెళ్లిపోయాడు. పిల్లలు కూడా స్నానాలు పూర్తి చేసుకుని ఇంటికి ఎదురుగా ఉన్న హోటల్ నుండి అల్పాహారం తెచ్చుకుని తిని పాఠశాలకు వెళ్లిపోయారు. పనిమనిషి వచ్చి అంట్లు తోమి, ఇల్లు ఊడ్చి, నీళ్లతో తుడిచి వెళ్లిపోయింది. అప్పటికి కానీ మణిమాలకు మత్తు వదలలేదు.
‘‘అమ్మా మణిమాలా! బారెడు ప్రొద్దెక్కేవరకు నిద్రపోతే ఎలా? మీ ఆయన, పిల్లలకు ఇబ్బంది కలగదా?’’ ప్రశ్నించింది తల్లి జగదాంబ.
‘‘ఇదంతా నగర జీవితంలో మామూలే అమ్మా. ఇంటిల్లిపాదికీ వండి వార్చేపాటికి నా ఎముకలు అరిగిపోతున్నాయి. అయినా వాళ్లు పడుతున్న కష్టం ఏముంది? అల్లుడు గారు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు హోటల్‌లో అల్పాహారం తింటారు. మధ్యాహ్నం ఆఫీసు దగ్గర హోటల్‌లో భోజనం చేస్తారు. పిల్లలు కూడా ఇంటి ముందున్న హోటల్ నుండి అల్పాహారం తెచ్చుకుని తిని వెళతారు. మధ్యాహ్న భోజనాన్ని నేను రిక్షావాడికి ఇచ్చి పంపిస్తాను. దీంట్లో ఇబ్బంది ఏముంది?’’ తాపీగా చెప్పింది మణిమాల.
కాసేపు తరువాత ఇంటి ఎదురు హోటల్ నుండే అల్పాహారం తెప్పించి తను ఇంత తిని తల్లికి కూడా పెట్టింది. తరువాత మధ్యాహ్న భోజనం సిద్ధం చేసింది. రిక్షావాడి చేత పిల్లలకు పంపించింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ తిన్నారు. ఆ తరువాత మణిమాల హాయిగా నిద్రపోయింది. సాయంత్రం నాలుగింటికి నిద్రలేచింది.
‘‘ఉదయం బారెడు ప్రొద్దెక్కిన తరువాత నిద్ర లేస్తున్నావు. మళ్లీ మధ్యాహ్నం నిద్రపోవలసిన అవసరం ఏముంది?’’ అని జగదాంబ కూతుర్ని ప్రశ్నించింది.
‘‘అమ్మో! మధ్యాహ్నం నిద్రపోకపోతే నాకు తల పట్టేస్తుంది’’ అంది మణిమాల.
‘‘రాత్రిపూట త్వరగా నిద్రపోవచ్చు కదమ్మా?’’ తిరిగి ప్రశ్నించింది తల్లి.
‘‘అమ్మా! నాకున్న ఏకైక కాలక్షేపం టీవీ ఒక్కటే. రాత్రి పొద్దుపోయిన తరువాత నాకు ఇష్టమైన క్రైం కథలు, హర్రర్ ధారావాహికలు వస్తాయి. అవి చూడందే నాకు నిద్రపట్టదు. అందువల్ల ఉదయం కొద్దిగా ఆలస్యంగా నిద్రలేస్తున్నాను’’ అన్నది మణిమాల.
‘‘పెళ్లికి ముందు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి కళ్లాపు చల్లి, ముంగిట ముగ్గు వేసేదానివి. ఆ క్రమశిక్షణ ఏమైందమ్మా?’’ అడిగింది జగదాంబ.
‘‘అమ్మా! నువ్వు పది రోజుల పాటు చుట్టం చూపుగా వచ్చావు. నా ఇంటి విషయంలో తల దూర్చకు. అయినా అమ్మను చూడాలనే బాధ్యత ఆడపిల్లపై లేదు. నీ అల్లుడు ఎంతో మంచివాడు కాబట్టి ఇంట్లోకి రానిస్తున్నాడు. అసలే మా ఆయన రేయనక, పగలనక రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. ఇక్కడ డబ్బులు చెట్లకు కాయడం లేదు. ఇంటి కోసం బండెడు చాకిరీ చేసే నేను విశ్రాంతి తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నేను అడ్డం పడితే ఈ ఇంట్లో వాళ్లకు గంజినీళ్లు పోసే దిక్కు కూడా లేదు. అయినా నా పెళ్లిలో నువ్వు కట్నకానుకలు ఏమీ ఇవ్వలేదు కదా? ఏదో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఇంత మంచి సంబంధం తెచ్చే దానివా? అయినా నేను మీ ఇంటికి కాన్పులకు కూడా రాలేదే? అన్నీ మా ఆయనే చూసుకున్నాడు. క్రమశిక్షణ గురించి మాట్లాడితే ఎలా? ఎవరి ఇంటి నియమాలు వాళ్లకు ఉంటాయి’’ బదులిచ్చింది మణిమాల.
ఆ మాటలకు జగదాంబ విస్తుపోయింది. పది రోజులు గడిచాయి. రెండవ కుమారుడు మురళీధర్ విదేశాల నుండి వచ్చాడని తెలిసింది. ముసలి తల్లిని వదిలించుకునే ఆత్రంతో వెంటనే ఆలస్యం చేయకుండా మణిమాల తల్లిని ఆటోలో ఎక్కించుకుని చిన్న అన్నయ్య ఇంటికి తీసుకుని వెళ్లింది.
‘‘ఈ రోజే కదా అమ్మా మేము విదేశాల నుండి వచ్చింది. ఎంతో అలసిపోయాము. అంత ఆగమేఘాల మీద రాకపోతే ఏం కొంప మునిగింది. నాలుగు రోజులు ఆగిన తరువాత రావచ్చు కదా?’’ అసహనంగా అన్నాడు రెండవ కుమారుడు మురళీధర్.
చేసేది లేక ఓ మూలనున్న గదిని చూపించాడు. ఆ గదిలో పనికిరాని పాత సామాను ఉండటంతో దోమల దండు జగదాంబపై దండయాత్ర చేసింది.
‘‘నాయనా మురళీధర్! ఈ గది నిండా దోమలున్నాయి. దోమలను తరిమే మందు కానీ, దోమతెరను కానీ ఏర్పాటు చేయి బాబూ’’ దీనంగా అడిగింది అమ్మ.
‘‘నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టి 24 గంటలు కాలేదు. అన్నీ ఆగమేఘాలపై రావాలంటే ఎలా? కొంచెం ఓపిక పట్టు’’ అని కసిరాడు మురళీధర్.
దోమల వల్ల ఆ రాత్రంతా జగదాంబకు నిద్ర పట్టలేదు. ఎలాగో ఆ రోజు గడిచింది.
ఉదయానే్న చిన్న కోడలు నందిని అందరికీ అల్పాహారం చేసి పెట్టింది. పచ్చడిలో ఉప్పు, కారం ఎక్కువగా ఉండటంతో జగదాంబ సరిగా తినలేకపోయింది.
‘‘అమ్మా నందిని! కొంచెం ఉప్పు, కారం తగ్గించు తల్లీ. తినలేకపోయాను.’’ అన్నది జగదాంబ.
‘‘మీకంటే వయస్సు అయిపోయిందండి. నా భర్త, పిల్లలకు ఉప్పుకారాలు తగలకుంటే ఎలా?’’ మీకు నచ్చేలా వండాలంటే నా వల్ల కాదు. పెట్టింది తినండి’’ కసిరింది నందిని.
ప్రతీరోజు ఏదో ఒక సమస్యతో జగదాంబ సతమతమయ్యేది. ఆవిడ గోడు ఎవరికీ పట్టేది కాదు. ఒకరోజు జగదాంబ ముగ్గురు సంతానం సమావేశమయ్యారు.
‘‘అన్నయ్య! అమ్మకు వయసైపోయింది. ఆమె చాదస్తం భరించలేకపోతున్నాము. వృద్ధాశ్రమంలో అమ్మను ఉంచితే బాగుంటుందని నా సలహా’’ అన్నాడు మురళీధర్.
‘‘అవును మరి. మనకున్న సవాలక్ష సమస్యలతో అతలాకుతలమవుతున్నాము. ఈవిడగారిని భరించే ఓపిక మనకెక్కడిది? వృద్ధాశ్రమానికి పంపడమే ఉత్తమం’’ అని ముక్తకంఠంతో ఆమోదించారు మురళీధర్, మదాలస.
‘‘నేను ఒక వృద్ధాశ్రమంలో మాట్లాడాను. అయితే నెలకు రూ.10వేల వరకు చెల్లించవలసి ఉంటుంది. మనం ముగ్గురం తలా కొంత డబ్బు వేసుకుని వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. అక్కడ వాళ్లు అమ్మను చాలా బాగా చూసుకుంటారు. ఆ వృద్ధాశ్రమం ఇల్లులాగే ఉంటుంది. సమయానికి వేడినీళ్లు, వేడివేడి భోజనం అన్ని సౌకర్యాలు ఉన్నాయి’’ గొప్పగా చెప్పాడు మురళీధర్.
‘‘మీరిద్దరూ మగపిల్లలు. అమ్మ బాధ్యత మీది. నాదెలా అవుతుంది. భర్తచాటు ఆడదాన్ని. అసలే మా ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదిస్తున్నాడు. నా వల్ల కాదు. నేను డబ్బు ఇవ్వలేను’’ తేల్చి చెప్పింది మణిమాల.
‘‘అమ్మా తల్లీ! మేమేం దోపిడీలు, దొంగతనాలు చేసి సంపాదించడం లేదు. మేము కూడా రక్తాన్ని దారపోసే డబ్బు సంపాదిస్తున్నాము. దేశంలో నీ భర్త ఒక్కడే రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తున్నాడని అపోహ పడకు’’ గదమాయించాడు మురళీధర్.
‘‘ఇక్కడ సమస్య సంపాదనలది కాదు. అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిస్తే ఖర్చును ఎవరు భరించాలి అనేదే సమస్య. తమ్ముడూ! తను కొంత కూడా ఖర్చును భరించలేనని చెల్లాయి తేల్చి చెప్పేసింది. ఇక చేసేదేముంది. మనిద్దరమే ఆ ఖర్చును భరించాలి. చెరి సగం డబ్బులు వేసుకుని అమ్మను వృద్ధాశ్రమంలో ఈ రోజే చేర్పిద్దాం’’ అన్నాడు పెద్దవాడు చక్రధర్.
అదేరోజు అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించి, వారికి రెండు మాసాల డబ్బు రూ.20 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి ఎటోళ్లు అటు వెళ్లిపోయారు. అప్పటి నుండి జగదాంబకు కష్టాలు మొదలయ్యాయి. వృద్ధాశ్రమంలో అందరూ వయోవృద్ధులే. అందరూ కలవారి తల్లిదండ్రులే. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని ఉన్నతస్థాయికి వచ్చేలా తమ జీవితాల్ని ధారపోసినవారే. బిడ్డలకు రెక్కలు రాగానే తల్లిదండ్రులు వారికి భారమయ్యారు. వృద్ధాశ్రమంలో పడవేశారు. వృద్ధాశ్రమంలో తహశీల్దారు వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారి తల్లిదండ్రులు కూడా ఉండటం జగదాంబ హృదయాన్ని కలచివేసింది. ఎప్పుడు రాలిపోతాయో తెలియని ఈ పండుటాకులు బిడ్డలకు భారమయ్యాయా? అని మనసులోనే బోరున విలపించింది. వృద్ధాశ్రమంలో అందరూ వయోవృద్ధులు కావడంతో కొంతమంది మరుగుదొడ్లకు వెళ్లే లోపే మూత్రవిసర్జన చేసేవారు. కొందరైతే మల విసర్జన కూడా చేసేవారు. వృద్ధాశ్రమ సిబ్బంది మొత్తం శుభ్రం చేసి ఫినాయిల్‌తో కడిగేవారు. అంతకుమించి పర్యవేక్షణ అంత బాగా ఉండేది కాదు. అనారోగ్యంతో బాధపడేవారు ఒకవైపు, ఆప్యాయంగా పలకరించే రక్తసంబంధీకులు లేరని దీనంగా విలపించేవారు మరో వైపు. దేవుడు పిలుపు కోసం ఎదురుచూస్తూ ఆవేదన చెందే వారు ఇంకొక వైపు అదో శోకసంద్రలా తలపించే వాతావరణం అక్కడ కనిపిస్తుంది. నెల పూర్తికాగానే వృద్ధాశ్రమానికి డబ్బులు చెల్లించడానికి వచ్చేవారు తప్పితే ఈ పండుటాకులు ఉన్నాయా? రాలాయా? అని గమనించేవారు ఎవ్వరూ లేరు. అక్కడ ఎవరైనా వృద్ధులు చనిపోతే ఇంటికి ఫోన్ చేస్తారు. కొంతమందైతే తమ ఇళ్లకు తీసుకుని వెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. మరికొందరైతే వృద్ధాశ్రమం నుండే స్మశానవాటికకు తీసుకుని వెళ్లి దహనం చేసేవారు. ఈ దృశ్యాలు జగదాంబ మనస్సును కదిలించివేశాయి. ఈ బాధలను చూసి కొందరు వృద్ధులు తమ బిడ్డలకు శాపనార్థాలు పెట్టేవారు. వారిని జగదాంబ వారించేది.
‘‘చిన్నతనంలో బిడ్డలు మన గుండెలపై తంతే ఆనందించాం. మనం ఎటువంటి శాపనార్థలూ వారికి ఇవ్వలేదు. ఇదీ అంతే. మనం కన్నవాళ్లం. అమృతం పంచాలి కానీ విషాన్ని చిమ్మకూడదు. ఈ వయసులో మనల్ని వాళ్లు బాగా చూసుకునే గుణాన్ని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థించాలే తప్పా వారి నాశనాన్ని మనం కోరుకోకూడదు’’ తోటి వృద్ధులతో అంది జగదాంబ.
అమృతం పంచే అమ్మ మనసంటే ఏమిటో అందరికీ రుచి చూపించినట్లయింది. కొంత కాలం గడిచింది. జగదాంబ వృద్ధాశ్రమంలోనే కాలం గడుపుతుంది. జగదాంబ ముగ్గురు సంతానం హాయిగా జీవిస్తున్నారు. అనుకోకుండా వారందరికీ కష్టాలు మొదలైనాయి. పెద్ద కుమారుడు చక్రధర్ ఆఫీసులో అనేక సమస్యలు వచ్చాయి. ఆఫీసులో కొందరు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను చోరీ చేసి బయటి వారికి అమ్మేశారు. ఆ కుంభకోణం బయటపడింది. ఏ నేరం చేయకపోయినప్పటికీ అందులో చక్రధర్ పేరును ప్రధానంగా చూపడంతో అతని ఉద్యోగం పోయింది. రెండవ కుమారుడైన మురళీధర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయింది. కుమార్తె మణిమాలకు గర్భసంచిలో లోపం ఉండటంతో పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు. ఆమె పిల్లలకు సైతం తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. ఆనోటా ఈనోటా ఈ సంగతులన్నీ జగదాంబ చెవిన పడి తీవ్రంగా దుఃఖించింది. తన జీవన పయనమే చుక్కాని లేని నావలా ఉంది. తన బిడ్డలకు ఇన్ని కష్టాలు రావడంతో ఆ తల్లి మనస్సు విలవిలలాడింది. కన్నీరుమున్నీరయ్యేలా ఏడ్చిన ఆమెకు మైకం కమ్మినట్లయింది. మంచంపై నడుము వాల్చింది. జగదాంబకు బాగా నిద్ర పట్టింది. కాసేపటికి ఎవరో వచ్చి నిద్ర లేపారు.
‘‘అమ్మా! మీ కోసం ఎవరో వచ్చారు’’ అని చెప్పారు.
జగదాంబ వారి వద్దకు వెళ్లి విషయమేమిటని అడిగింది.
‘‘అమ్మా! చాలా సంవత్సరాలుగా మీ ఆస్తికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తుంది. దానికి సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వచ్చింది. న్యాయమూర్తిగారి తీర్పును అనుసరించి దాదాపు అయిదు కోట్ల రూపాయల ఆస్తి మీకు వచ్చింది. మీ బిడ్డలు కూడా తలా ఓ చోట ఉంటున్నారు. ఎవరి చిరునామా కూడా మేము తెలుసుకోలేకపోయాం. మీరు ఈ వృద్ధాశ్రమంలో ఉన్నట్లు మేము ఎంతో కష్టంతో తెలుసుకోగలిగాము’’ అని చెప్పారు వచ్చిన వ్యక్తులు.
‘‘ఈ విషయం వినగానే జగదాంబ కళ్ల నుండి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి. తనను వెతుక్కుంటూ వచ్చి ఆస్తిపత్రాలు ఇచ్చినవారికి ధన్యవాదాలు తెలిపింది. సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆస్తికి చెందిన పత్రాలను దక్కించుకుంది. ఇంత ఆస్తి తనకు దక్కింది కాబట్టి ఇక హాయిగా తాను బ్రతకవచ్చు అని ఆ తల్లి ఏ కోశానా ఆలోచించలేదు. ఆనోటా ఈనోటా విన్న తన కన్నబిడ్డల కష్టాలు జగదాంబ కళ్లముందు కనిపించాయి. ఆ తల్లి హృదయం ద్రవించింది. మరుసటి రోజే వృద్ధాశ్రమం వారి సహకారంతో పెద్ద కుమారుడైన చక్రధర్ ఇంటికి వెళ్లింది. చిన్న కుమారుడైన మురళీధర్, కుమార్తె మణిమాల కుటుంబాలను అక్కడకు పిలిపించింది. తల్లికి తీర్పు అనుకూలంగా వచ్చి ఆస్తిపాస్తులు లభించాయన్న సంగతి వారికి తెలియదు. మళ్లీ ఈవిడగారు ఏం నిర్ణయం తీసుకుందో? అనే చెడు ఆలోచనలతోనే చక్రధర్ ఇంటికి చేరారు. అయితే జగదాంబ మనసులో చెడు ఆలోచనలు ఏకోశానా లేవు. కష్టాల కడలిలో మునిగిపోయిన తన బిడ్డలను ఆలింగనం చేసుకుని బోరున విలపించింది. కొంతసేపటికి తేరుకుని తన బిడ్డలతో మాట్లాడింది.
‘‘నాయనలారా! మీరు పడుతున్న కష్టాలన్నీ నేను తెలుసుకున్నాను. అయితే అప్పట్లో మిమ్మల్ని ఆదుకోలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను. ప్రస్తుతం భగవంతుడు నా పరిస్థితిని మార్చాడు. మీ నాన్న బ్రతికున్నప్పటి నుండి కోర్టులో నలుగుతున్న కేసుకు సంబంధించిన తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఆ కారణంగా అయిదు కోట్ల రూపాయల ఆస్తి నాకు దక్కింది. ఆ డబ్బుతో మిమ్మల్ని ఆదుకోవాలనేది నా కోరిక. ఆ డబ్బును మీ ముగ్గురికి సమానంగా పంచి నేను వృద్ధాశ్రమానికి వెళ్లిపోతాను’’ అని చెప్పింది జగదాంబ.
తల్లి నోటి వెంట ఆ మాట రాగానే ఒకవైపు ఆనందంగా ఉన్నా మరో వైపు ఒక్కొక్కరికీ తల తీసేసినట్లయింది. తాము ఇంత చదువులు చదువుకుని, పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వృద్ధాప్యంలో తల్లిని చూసుకునే సంస్కారహీనంగా ప్రవర్తించినందుకు వారిపై వారికే అసహ్యం వేసింది. తమ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిని సరిగా సాకకపోగా ఆమె తమకు భారమన్నట్లు వృద్ధాశ్రమానికి పంపిన ఆ సంఘటనలు కళ్ల ముందు మెదిలాయి. తమ తల్లికి ఇన్ని కష్టాలు పెట్టడం వల్లనే భగవంతుడు తమ జీవితాల్ని చిన్నాభిన్నం చేశాడని జగదాంబ సంతానం భావించి తల్లికి చేసిన అన్యాయాన్ని తలచుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. తాము కూడా వృద్ధులైన తరువాత తమ బిడ్డలు ఈ విధంగా ప్రవర్తిస్తే తమ పరిస్థితి ఏమిటని తలచుకుని భయభ్రాంతులయ్యారు. కన్నబిడ్డలమైన తాము హాలాహలాన్ని చిందించినప్పటికీ తమ కష్టాలను చూసి కరిగిపోయి తమ తల్లి వెతుక్కుంటూ వచ్చి అమృతాన్ని పంచుతున్న ఆ సంఘటనను చూసి అందరూ చలించిపోయి తల్లి పాదాలపై పడి తమ తప్పును క్షమించమని చిన్న పిల్లల్లా బోరున విలపించారు. అమృతం పంచిన అమ్మ మనస్సును తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో అమ్మను చూడవలసిన బాధ్యత తమదే అని గుర్తించారు. ఇకపై అమ్మను వృద్ధాశ్రమంలో కాకుండా తన వద్దనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటానని పెద్ద కుమారుడు చక్రధర్ అన్నాడు.
తనకు వచ్చిన డబ్బును జగదాంబ ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచింది. ఇంతలో చక్రధర్ తన కార్యాలయంలో ఎటువంటి తప్పు చేయలేదని ఋజువు కావడంతో అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు. రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న రెండవ కుమారుడు మురళీధర్‌కు జైపూర్ కృత్రిమ పాదాన్ని అమర్చారు.
రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పులపాలైన కుమార్తె మణిమాల అప్పులన్నీ తీర్చారు. ఆనాటి నుండి పెద్ద కుమారుడైన చక్రధర్ వద్దనే తల్లిని ఉంచి కంటికి రెప్పలా సంరక్షిస్తూ ఏ లోటూ లేకుండా చూసుకున్నారు.
వారానికి ఓసారి అందరూ చక్రధర్ ఇంటికి వచ్చి అమ్మను చూసుకుని, క్షేమ సమాచారాలు తెలుసుకుని కలసి భోజనం చేసేవారు. నాయనమ్మ జగదాంబకు తమ తల్లిదండ్రులు ఇస్తున్న గౌరవాన్ని చూసిన పిల్లలు పెద్దల ఎడల భక్త్భివన పెరిగి వారి తల్లిదండ్రులకు సైతం అంతే గౌరవం ఇస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.

-షేక్ అబ్దుల్ హకీం జాని.. 9949429827