S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైవే

సమయం రాత్రి పదకొండున్నర..
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఓల్వో బస్సు టెర్మినల్ నుంచి బయల్దేరింది.
కుండపోతగా కురుస్తోంది వాన. అసలే విపరీతమైన రద్దీ. దానికితోడు ఉధృతంగా కురుస్తున్న వర్షం నెమ్మదిగా నిక్కుతూ, నీలుగుతూ కృష్ణానది బ్రిడ్జి మీదికి వచ్చింది.
శాలువా తలమీంచి చెవులను కప్పేస్తూ లాక్కుని ముడుచుకుని కూర్చుంది శిశిర.
ఉధృతంగా కురిసిన వర్షాలకు కృష్ణా నదిలో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి...
‘ఏంటో పెళ్లికి వచ్చాం, వెళ్తున్నాం. కాసేపు కృష్ణానది బ్రిడ్జి మీద తిరగలేదు, దుర్గమ్మని దర్శించుకోలేదు. విజయవాడ అందాలు వీక్షించలేదు. మళ్లీ ఎప్పుడొస్తామో ఏంటో’ దిగులుగా అంది.
‘విజయవాడ రావడానికేం ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. దీనికేం వీసా కావాలా?’ కొంచెం అసహనంగా అన్నాడు రాహుల్.
‘ఏంటి వచ్చేది! హైదరాబాద్‌లో పుట్టాను, పెరిగాను. పాతికేళ్లొచ్చాయి. చిన్నప్పుడెప్పుడో అమ్మా, నాన్న తీసుకెళ్లారుట సాలార్‌జంగ్ మ్యూజియంకి. నాకు గుర్తు కూడా లేదు. మళ్లీ వెళ్లానా? పక్కన ఉన్నా టైం ఉండద్దూ...’
శిశిర మాటలకి రాహుల్ ఏం మాట్లాడలేదు.
అతనికి టెన్షన్‌గా ఉంది. తెల్లవారితే మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. అక్కడికీ పెళ్లి అయి భోజనాలు కాగానే బయలుదేరుదామనుకుంటే ‘అప్పగింతల కార్యక్రమం ఉంది చూసి వెళ్దాం. ఇప్పుడు వెళ్లినా అర్ధరాత్రి చేరతాం హైదరాబాద్. పదకొండు గంటలకి ఎక్కితే తెల్లారేసరికి వెళ్లిపోతాం ఎంత దూరం ఉందని పెద్ద’ అంది శిశిర.
ఈ మహాతల్లికి అసలు టెన్షన్ లేదు. కూల్‌గా ఉంటుంది ఏం మనిషో. దానికి తోడు అకస్మాత్తుగా ఈ వానొకటి. మరీ ఇంత దారుణంగా కురుస్తోందేంటో? మూడు గంటల నుంచీ ఆగకుండా కురుస్తోంది’ చిరాగ్గా అనుకున్నాడు రాహుల్.
శిశిర, రాహుల్, విజయ్ చిన్నప్పటి నుంచీ పక్కపక్క ఫ్లాట్స్‌లో ఉంటున్నారు. ముగ్గురూ విడివిడి స్కూల్స్‌లో చదువుకున్నా ఇంజనీరింగ్ మాత్రం ముగ్గురూ ఒకే కాలేజీలో చదివారు హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో.
విజయ్ పెదనాన్న కూతురు శృతి. వాళ్లు విజయవాడలో ఉంటారు. అవడానికి పెదనాన్న కూతురైనా స్వంత చెల్లెలికన్నా ఎక్కువగా చూసుకుంటాడు విజయ్ శృతిని. కారణం అతనికి చెల్లెళ్లు లేరు. ఒక్కడే కొడుకు. శృతి ఏడాదికోసారి హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉండడంతో శిశిరకి, రాహుల్‌కి కూడా మంచి సన్నిహితురాలైంది. ఆమె పెళ్లికి విజయ్ ముందే వెళ్లి దగ్గరుండి ఏర్పాట్లు చేసాడు.
శిశిర, రాహుల్ శనాదివారాలు కలిసి వచ్చాయని రెండు రోజుల ముందు వచ్చారు. సోమవారం ఇద్దరికీ పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ. ముగ్గురూ ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డారు.
‘ఈ వాన చూస్తుంటే సైక్లోన్ ఎఫెక్టా అనిపిస్తోంది. ఇంత సడన్‌గా సైక్లోన్ ఎక్కడి నుంచి వచ్చి ఉండచ్చు’ అన్నాడు.
‘సడన్‌గానో, రెండు రోజుల ముందే హెచ్చరించారో మనం నిన్నా, మొన్నా వార్తలు తెలుసుకున్నామా? లేదుగా’ అంది శిశిర.
అయుండచ్చు అనుకుంటూ కిటికీలోంచి బైటకు చూశాడు. ఏమీ కనిపించడం లేదు. అంటే విజయవాడ అవుట్‌స్కర్ట్స్‌కి వచ్చినట్టుంది బస్ అనుకున్నాడు.
‘నాకు నిద్రొస్తోంది పడుకుంటున్నా’ అంది శిశిర.
‘పడుకో తల్లీ’ చిరాగ్గా అన్నాడు. అతనికి చికాకొచ్చింది. అసలే టెన్షన్ కూర్చుంటే కాసేపు ఏదో ఒకటి మాట్లాడి కాలక్షేపం చేయక నిద్రేంట అనుకున్నాడు.
శిశిర కళ్లు మూసుకున్న కొద్ది క్షణాల్లోనే మంచి నిద్ర పట్టింది. చేసేది లేక రాహుల్ కూడా కళ్లు మూసుకున్నాడు. అతనికి కునుకు పట్టడం బస్ పెద్ద కుదుపుతో ఆగిపోవడం ఒక్కసారిగా జరిగింది.
ఆ కుదుపునకు శిశిర కెవ్వుమంటూ లేచింది. ‘ఏమైంది?’ ఆదుర్దాగా అడిగింది.
‘ఏమో..’ బస్ ఎందుకాగిందా అన్నట్టు డ్రైవర్ కేబిన్ వైపు చూస్తూ అన్నాడు.
ఇంతలో బిలబిల్లాడుతూ మిగతా ప్రయాణీకులు లేచి డోర్ దగ్గరకు వెళ్లడం, డ్రైవర్ బస్సు దిగేయడం, చూస్తూండగానే గందరగోళంగా మారిపోయింది. పూర్తి లోడ్‌తో వెళ్తున్న లారీ బస్సుని గుద్దింది. బస్సు వెనుక వైపు పచ్చడి అయింది. అద్దాలు పగిలి రోడ్డు మీద పెంకులు చిందరవందరగా పడ్డాయి.
రాహుల్ కూడా దిగుతోంటే నేనూ వస్తా అంటూ శిశిర కూడా లేచి శాలువా కప్పుకుని రాహుల్‌ని అనుసరించింది.
అప్పుడే తగ్గుముఖం పడుతోంది వాన. సన్నగా జల్లు మాత్రం పడుతోంది. ప్రయాణీకులంతా గుమిగూడి ఏదేదో మాట్లాడుతున్నారు. డ్రైవర్, అతని అసిస్టెంట్ ఇద్దరూ మరి పదిమంది మగవాళ్లు లారీ డ్రైవర్‌ని పట్టుకుని చితకబాదేస్తున్నారు.
వాళ్ల మాటల్నిబట్టి ఆ డ్రైవర్ తాగి బండి నడిపిస్తున్నాడు.
అదృష్టవశాత్తూ ప్రయాణీకులకి ఏమీ జరగలేదు కానీ, గవర్నమెంటు ప్రాపర్టీ అయిన బస్సు పాడై పోయింది. ఎవరో ట్రాఫిక్ పోలీసులకి ఫోన్ చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ల టార్చి ఫోకస్ చేసి బస్సుని పరిశీలిస్తున్నారు కొందరు.
‘ఎలా ఇప్పుడు?’ భయంగా అంది శిశిర.
‘నాకూ అర్థం కావడంలేదు’
‘ఇప్పుడు ఈ బస్సు కదలదు. మరో బస్సు రావాలి మనం వెళ్లాలి’
ఎక్కడ ఉందాం అందాక. ఎటు చూసినా పెద్దపెద్ద చెట్లు, పొదలతో చిక్కగా, చీకటిగా ఉన్న పరిసరాలను చూస్తూ అంది.
రాహుల్ ఆమె మాట వినిపించుకోకుండా గుమికూడిన వాళ్ల దగ్గరకు వెళ్లి ‘ఇప్పుడేమన్నా బస్ వస్తుందంటారా సార్’ అనడిగాడు.
ఆయన వినిపించుకోకుండా వేరే వాళ్లతో లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం గురించి ఉపన్యాసం ఇవ్వసాగాడు. ఎవరూ ఎవరి గోలా వినిపించుకునేలా లేరు. ఎవరికి తోచిన మాటలు వాళ్లు మాట్లాడేస్తున్నారు.
కర్తవ్యం ఆలోచించకుండా ఇప్పుడీ ఉపన్యాసాలు, ఫ్లాష్‌బ్యాక్‌లు అవసరమా? అనిపించింది రాహుల్‌కి.
గుంపు దగ్గర్నించి కదిలి శిశిర నిలబడిన చోటుకి వచ్చాడు. అడపాదడపా కార్లు జర్రున సాగిపోతున్నాయి కానీ ఎవరూ బస్సెందుకు ఆగిందో, ఇంతమంది ప్రయాణీకులు ఎటు వెళ్తారో, ఏదన్నా సాయం కావాలేమో అన్న ఆసక్తి చూపించకపోవడం శిశిరకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది.
నలుగురు ఆడవాళ్లు కలిసి బస్సుకి కొంచెం దూరంగా పొదల వైపు వెళ్తున్నారు. ఎవరి అవసరం వాళ్లది అనుకుంది శిశిర.
‘ఏం చేద్దాం శిశిరా? టైం చూస్తే ఒంటిగంట దాటింది. ఇంకో బస్సు రావాలి. మనమంతా వెళ్లాలి. ఆ బస్సులో చోటుండాలి. ఇంతమందిని ఎక్కించుకుంటాడో లేదో డ్రైవర్ ఎలా? ఏం చేద్దాం?’ దిగులుగా అడిగాడు.
‘ఆలోచిస్తున్నాను.. ఇలారా’ అంటూ రాహుల్ చేయి పట్టుకుని రోడ్డుకి అవతల పక్కకి తీసుకెళ్లింది.
‘కార్లు వెళ్తున్నాయి. ఎవరో ఒకళ్లు లిఫ్ట్ ఇస్తారు. ట్రై చేద్దాం’ అంది.
ఇంతలో రెండు కార్లు వీళ్లు చేయి ఊపినా చూడలేదో, చూసి కూడా ఆపలేదో వెళ్లిపోయాయి.
షిట్ విసుక్కుంది శిశిర. ‘మనకి లిఫ్ట్ ఇస్తే వాళ్ల సీట్లు అరిగిపోతాయా? వెధవలు ఇద్దరే ఉన్నారు కారు వెనకాల సీటు ఖాళీగా ఉంది ఇవ్వచ్చు కదా’
‘ఈ చీకట్లో మనం చేయి ఊపడం చూళ్లెదేమోలే ఎవరో ఒకళ్లు ఆపుతారు చూద్దాం’ అన్నాడు.
ఇంతలో ట్రాఫిక్ పోలీసుల వెహికల్ రావడం, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో జనం కోలాహలం ఎక్కువై పోయింది.
‘అదిగో ఇంకో కారొస్తోంది’ అంది శిశిర రెండడుగులు రోడ్డు వైపు వేస్తూ.
‘ఏయ్ అలా వెళ్లకు. అసలే హైవే. వాళ్లు స్పీడ్‌గా వెళ్తున్నారు డేంజర్’ అన్నాడు ఆమెని వారిస్తూ.
శిశిర వినిపించుకోకుండా రెండు చేతులు గట్టిగా ఊపసాగింది కారు ఇంకా కొంచెం దూరంగా ఉన్నపుడే.
అలా ఊపుతూనే ఉంది దగ్గరకొచ్చిందాకా. కారు సడన్‌బ్రేక్‌తో ఆగింది.
‘కమాన్ రాహుల్’ అంటూ రాహుల్ చేయి పట్టుకుని కారు దగ్గరకు వెళ్లింది.
డ్రైవింగ్ సీటులో ఒకతను, అతని పక్కన మరొకరు, వెనక సీటులో ఒకతను ముగ్గురూ మగవాళ్లే. ముప్పై, ముప్పై ఐదేళ్లుంటాయి. గ్లాస్ ఓపెన్ చేశాడు డ్రైవింగ్ సీటు పక్కతను.
శిశిర తల ముందుకు వంచి ‘లిఫ్ట్ కావాలండి. మీరు వెళ్లేది హైదరాబాదేగా’ అడిగింది.
‘యస్..’ అన్నాడతను.
‘బస్‌కి యాక్సిడెంట్ అయింది. మేము హైదరాబాద్ వెళ్లాలి. రేపు ఉదయం ఇంటర్వ్యూ ఉంది’
‘ఎక్కండి’ అన్నాడతను వెనకాల కూర్చున్నతనితో డోర్ తీయి అంటూ.
శిశిర ఆనందంగా థాంక్యూ అంటూ రాహుల్‌తో అంది ‘మన బ్యాగులు తీసుకురా’
రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సులోంచి ఇద్దరి బ్యాగులు తీసుకుని వచ్చాడు.
ఇద్దరూ వెనకాల సీటులో కూర్చున్నారు. కారు కదిలింది. హమ్మయ్య గండం గడిచింది అనుకున్నారిద్దరూ.
కొంచెం దూరం వెళ్లిందాకా ఎవరూ మాట్లాడలేదు. తరువాత ముందు కూర్చున్న వాళ్లలో ఒకతను అడిగాడు ‘ఏం చదువుకున్నారు?’
‘ఇంజనీరింగ్’ ఇద్దరూ ఒకేసారి చెప్పారు.
‘ఓ.. మీరిద్దరూ క్లాస్‌మేట్సా’
‘అవును. మేం విజయవాడలో ఒక ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తున్నాం’
‘ఓ ఐసీ’ మళ్లీ వౌనం.
‘కొంచెం సేపట్లో సూర్యాపేట వస్తుంది. అక్కడ వీళ్లు కారాపితే టీ తాగుదాం. నాకు టెన్షన్‌తో తలనొప్పిగా ఉంది’ అన్నాడు రాహుల్ శిశిర చెవిలో రహస్యంగా.
సరే అంది శిశిర అదే స్వరంతో.
ఇద్దరూ సూర్యాపేట కోసం ఎదురుచూస్తూ విండోలోంచి బైటికి చూస్తూ కూర్చున్నారు.
మరో అరగంటలో సూర్యాపేటలో ఆగింది కారు. అందరికీ రాహులే టీ తెచ్చాడు.
అప్పుడు ఆ లైట్ల వెలుగులో అందరూ ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు. అపరిచిత వ్యక్తుల్ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది రాహుల్‌కి. వాళ్లల్లో ఒకతను తప్ప మిగతా ఇద్దరూ పెద్దగా చదువుకున్న వాళ్లలా కనిపించడంలేదు. చదువుకున్న వాడిలా ఉన్నతను మాత్రం కొంచెం ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. అతనే డ్రైవ్ చేస్తున్నాడు.
మళ్లీ శిశిరతో రహస్యంగా అన్నాడు ‘నాకేంటో వీళ్లు నచ్చలేదు’
‘అయితే! మనమేం వీళ్లతో పర్మినెంట్‌గా స్నేహం చేయబోవడం లేదుగా. హైదరాబాద్ చేరాక వాళ్లెవరో, మనమెవరో’ అంది. కారు తిరిగి కదిలింది.
ఇద్దరికీ కొంచెం రిలాక్స్‌గా అనిపించి కళ్లు మూసుకుని కూర్చున్నారు.
శిశిరకి నిద్ర పట్టింది. రాహుల్‌కి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించి కళ్లు తెరిచాడు. తన పక్కన కూర్చున్నతను సీటు మీంచి ఒంగి ముందు కూర్చున్నతనితో చాలా నెమ్మదిగా ఏదో మాట్లాడుతున్నాడు. రాహుల్ విండోలోంచి బైటకి చూశాడు.
కారు హైవే మీద వెళ్తున్నట్టు లేదు... చాలా చిక్కటి పొదలు కనిపిస్తున్నాయి రెండు వైపులా. మధ్యలో రోడ్డు సన్నగా ఉంది.
ఇదేంటి వీళ్లు ఎట్నించి వెళ్తున్నారు? అనుమానంగా అడిగాడు ‘్భయ్ ఇదే రూటు?’
వంగి మాట్లాడుతున్న అతను సరిగా సర్దుకుని కూర్చున్నాడు. ఎవరూ మాట్లాడలేదు.
రాహుల్ మళ్లీ అడిగాడు. ‘రూటేంటి భాయ్ ఇలా ఉంది. విజయవాడ, హైదరాబాద్ రోడ్డు ఇప్పుడు చాలా బాగుంది కదా’
కారు ఎడంవైపు తిప్పాడతను. అక్కడ రోడ్డే కనిపించలేదు. రెండువేపులా పెద్దపెద్ద చెట్లు, పొదలు. రాహుల్‌కి భయం వేసింది. వీళ్లెటు వెళ్తున్నారు?
శిశిర చేయి మీద తట్టి ‘శిశిరా’ అని పిల్చాడు నెమ్మదిగా.
మంచి నిద్రలో ఉందేమో బలవంతంగా కళ్లు తెరిచి ‘వచ్చేసామా?’ అంది.
ఆమె వైపు బాగా వంగి చెవిలో అన్నాడు ‘వీళ్లు దారి తప్పారో, కావాలని వచ్చారో రూటు మార్చారు. గెటప్ బి అలర్ట్’
శిశిర మత్తు వదిలిపోయింది ఆ మాటలకి ‘ఏంటి?’ గట్టిగా అనేసింది.
ముందు సీట్లో ఉన్నతను వెనక్కి చూసి ‘ఏమైంది’ అన్నాడు.
రాహుల్ అదే అదనుగా మళ్లీ అడిగాడు ‘రూటు మారిందేంటీ భాయ్’
రాహుల్ పక్కతను కసురుతూ అన్నాడు ‘ఏయ్ చుప్‌బే... ఏంది అడిగిందే అడుగుతున్నావ్. మాకు తెల్వదా రూటేందో’
అతని మొరటు మాటలకి చిర్రెత్తింది రాహుల్‌కి. తమాయించుకుంటూ అన్నాడు.
‘తెల్సినా ఒక్కోసారి చీకట్లో దారి తప్పటం సహజం. ఇట్స్ నాచురల్.. ఒక్కసారి చూసుకోండి సార్’
‘ఎక్కువ మాట్లాడకోయ్. మాకు తెలుసు. ఏం చేయాలో’ ముందు సీట్లోంచి వచ్చిందీ మాట.
ఈసారి రాహుల్‌తోపాటు శిశిరకి కూడా అనుమానం, భయం, కోపం ముప్పిరిగొన్నాయి.
‘తెలిస్తే ఇటెందుకు వచ్చారు?’ గట్టిగా అడిగింది.
రాహుల్ పక్కన కూర్చున్నతను కుడిచేయి చాచి శిశిర తొడ మీద గిచ్చి అన్నాడు ‘ఈడైతే మజా ఉంటది నీతోని’
శిశిర విసురుగా అతని చేయి తోసేస్తూ గట్టిగా అరిచింది ‘ఇడియట్ చెప్పుతో కొడతాను ఏంటిరా వాగుతున్నావ్’ కారు కీచుమంటూ ఆగింది.
రాహుల్‌కి, శిశిరకి పరిస్థితి అర్థమైపోయింది. వీళ్లు మామూలు వ్యక్తులు కాదు.. దుర్మార్గులు. ఇద్దరం గోతిలో పడబోతున్నాం. శిశిరకి ప్రమాదం వాటిల్లబోతోంది.
రాహుల్ మెదడు చురుగ్గా ఆలోచించసాగింది. ఇప్పుడు కారు దిగి పరిగెత్తినా వాల్లని తప్పించుకోవడం ఇంపాజిబుల్.. పైగా రెండు పక్కలా పొదలు... ఈ చీకట్లో వర్షం పడిన ఈ ప్రదేశంలో బురద నిండిపోయింది కాలు పెడితే జారిపోవడమే... చాలా కష్టం. ఎటు వెళ్లాలన్నా ప్రమాదంగానే అనిపిస్తోంది. తను వాళ్లని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇప్పుడు కండబలం కన్నా బుద్ధిబలం కావాలి. ఏం చేయాలి?
శిశిరకి కూడా అర్థమై పోయింది. ఇప్పుడు తన పరిస్థితి భయంకరంగా మారబోతోంది. వాళ్లు కచ్చితంగా తనని నాశనం చేయడానికి ఇటు వచ్చారు. రాహుల్ అడ్డుపడితే వాడి ప్రాణాలు తీసినా తీస్తారు. శిశిరకి ఒక్కసారిగా రోజూ చదివే వార్తలు, టీవీలో క్రైమ్ న్యూస్ గుర్తొచ్చాయి. భయంతో వణికిపోసాగింది. ఎలా? ఎలా? రాహుల్ అంది ఏడుపు గొంతుతో. రాహుల్ ఓదార్పుగా ఆమె చేతిని తట్టాడు.
ముందు సీట్లో కూర్చున్న వాళ్లు దిగారు. వెనక డోర్ తెరిచి రాహుల్ వైపు చూసి ‘ఏయ్ దిగరా’ అన్నారు. రాహుల్ దిగలేదు, మాట్లాడలేదు.
రాహుల్ పక్కన కూర్చున్నతను ‘చెప్తుంటే అర్తం అయితలేదా? దిగుబే’ అన్నాడు.
శిశిర వణికిపోతూ రాహుల్ చేయి గట్టిగా పట్టుకుని ‘ఒద్దు రాహుల్ దిగొద్దు’ అంది.
‘ఏందే నకరలెత్తున్నయా?’ అంటూ రాహుల్‌ని కారులోంచి తోస్తూ శిశిర పక్కకి వచ్చి రెండు చేతుల్తో ఆమెని పట్టుకున్నాడతను.
రాహుల్ కారులోంచి దాదాపు కిందపడిపోయేవాడే నిలదొక్కుకుంటూ అన్నాడు ‘బ్రదర్స్ ప్లీజ్. ఆమెనేం చేయద్దు... ఇది కరెక్ట్ కాదు మనం మనుషులం... బిహేవ్ లైక్ హ్యూమన్ బీయింగ్’
‘నోర్మూసుకో నీకు ఇంగ్లీషు వచ్చని మాకు తెలుసు. ఎక్కువ మాట్లాడకు... ఇంత చల్లగా ఉన్న రాత్రి ఇంత అందమైన అమ్మాయి మేము వదలడానికి పిచ్చోళ్లం కాము’ మరొకతను రాహుల్ మెడ పట్టుకుని కారులోంచి లాగాడు.
‘బ్రదర్స్ ప్లీజ్... మీరు పది నిమిషాల ఎంజాయ్‌మెంట్ కోసం చూస్తున్నారు. ఆ తరవాత జీవితాంతం మీరు నరకం చూడాల్సి వస్తుంది. నా మాట వినండి. మనుషులమై పుట్టినందుకు మనుషుల్లా బతకాలి బ్రదర్స్. మీకూ సిస్టర్స్ ఉంటారు. వాళ్లని గుర్తు చేసుకోండి’
ఎవరూ ఇంక రాహుల్ మాట వినదల్చుకునేలా లేరు. ఒకతను రాహుల్ కాలర్ పట్టుకుని దూరంగా లాక్కెళుతుంటే మిగతా ఇద్దరూ శిశిర మీద పడ్డారు.
శిశిర ‘రాహుల్, రాహుల్ సేవ్‌మీ’ అని ఏడుస్తూ గట్టిగా అరవసాగింది.
రాహుల్ బుర్ర వేగంగా పని చేయసాగింది. రెండు చేతుల పిడికిళ్లు బిగించి గట్టిగా తనని పట్టుకున్న వాడి పొట్టలో గుద్దాడు. తన బలమే తప్ప ఎదుటివాడి బలం అంచనా వేయలేని అతను ఆ దెబ్బకి విసురుగా నాలుగడుగులు వెళ్లి బోర్లా పడ్డాడు బురదలో. అతను బూతులు తిడుతూ లేచేలోగా మెరుపులా వెళ్లిన రాహుల్ శిశిర మీద పడిన వాళ్లిద్దరి కాళ్లు బలంగా లాగి కారులోంచి కిందపడేసి గట్టిగా అరిచాడు‘ ‘శిశిరా కమాన్ డోర్ తీసుకుని దిగి డ్రైవింగ్ వైపు రా’
శిశిర అదే అదనుగా గభాల్న తన వైపు ఉన్న డోర్ తీసుకుని బురదలో కూరుకుపోతున్న కాళ్లను ఈడ్చుకుంటూ కారు గభాల్న డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. అప్పటికే ఆమె చున్నీ లాగేసి ఎక్కడో పారేశారా కామాంధులు.
పడిపోయిన వాళ్లల్లో ఒకతను లేచి రాహుల్‌ని పిడిగుద్దులు గుద్దుతున్నాడు. రాహుల్ కూడా కొడుతున్నాడు కానీ, వాళ్ల బలం ముందు నిలవలేక పోతున్నాడు. అతని పెదాలకి వెచ్చటి రక్తం తగిలింది. మరొకతను శిశిర వైపు వెళ్లి కారులోంచి ఆమెని లాగుతున్నాడు. శిశిర ప్రతిఘటిస్తూనే ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో అన్నట్టు కళ్లు అటూ ఇటూ తిప్పి చూడసాగింది.
అతను కాళ్లు పట్టుకుని లాగడంతో రెండు సీట్ల మీదా వెల్లకిలా పడిపోయింది. కాళ్లు రెండు నేల మీద ఆనాయి. శిశిర వేగంగా కాళ్లెత్తి అతని మొహంమీదా, గుండెల మీదా తన్నసాగింది. అతను బలంగా ఆమె రెండు కాళ్లు పట్టుకుని, మీదకి ఎగబాకి ఒక చేత్తో ఆమె రెండు చేతులూ పట్టుకుని ఆమెని మరికాస్త పైకి నెట్టాడు. ఆమె స్టీరింగ్ తలకి తగిలింది. బాధగా కెవ్వుమంది. అతను కాళ్లను పట్టుకున్న చేయి వదిలి రెండో చేయి ఆమె టాప్ మీద వేశాడు. శిశిర కాలు జాడించి తన్నబోతుంటే కుడికాలు డాష్‌బోర్డ్ కిందికి పడి కాలికి ఏదో తగిలింది. శిశిర పాదాలతో రెండు మూడుసార్లు అటూ ఇటూ లాగింది ఆ వస్తువుని. స్పర్శనిబట్టి అది బాటిల్ అని అర్థమైంది ఆమెకి.
శిశిర ఆలోచించలేదింక. బలమంతా ఉపయోగించి కుడిచేయి అతని చేతుల్నించి విడిపించుకుంది. అతను ఆమెని మరికాస్త పైకి జరిపి ఆమె నడుం పట్టుకోవడానికి రెండు చేతులూ నడుం కిందికి పోనిచ్చాడు. అదే అదనుగా గభాల్న చేయిచాచి సీటు కిందికి పోనిచ్చి అటూ ఇటూ వెతికింది. అదృష్టం బాగుంది.
గాజు సీసా అందుకుంది. అంతే అది తీసుకుని తన మీద పడి మొహం మీదా, మెడ మీదా రక్కుతోన్న అతని తల మీద లాగి కొట్టింది.
అప్పటికే రాహుల్ రెండు చేతుల్తో అందినంత బురద తీసి తనని కొడుతున్న ఇద్దరు వ్యక్తుల మొహాల మీదికి ఎడాపెడా చల్లుతున్నాడు. వాళ్లు బూతులు తిడుతూ ఒకచేత్తో తుడుచుకుంటూ మరోచేత్తో రాహుల్‌ని తోసేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈలోగా శిశిర కొట్టిన దెబ్బకి అవతల వ్యక్తి గట్టిగా అరుస్తూ కారులోంచి కిందపడ్డాడు. రాహుల్ ఇంక ఆగలేదు. మరి కాస్త బురద తీసి వాళ్ల మొహాల మీద విసిరికొట్టి గభాల్న కారు దగ్గరికి పరుగెత్తి డ్రైవింగ్ సీటులో కూర్చుని స్టార్ట్ చేశాడు.
మొహం నిండా వాడి గోళ్లు గుచ్చుకుని మంట పెడుతుంటే శిశిర సీటులో సరిగా కూర్చుంది.
కళ్ల నిండా, వొంటి పడిన బురద తుడుచుకుంటూ ఆ ఇద్దరు కింద పడి గిలగిలా కొట్టుకుంటున్న వాడి దగ్గరకు ఈడ్చుకుంటూ వచ్చేలోగా కారు నాలుగు గజాలు ముందుకుపోడం గమనించి ఒరేయ్... ల... కొడకా అని అరుస్తూ వాళ్లల్లో ఒకడు కారు వెనకాల పరిగెత్తుకుంటూ రావడం, పడటం సైడ్ మిర్రర్‌లోంచి గమనించిన రాహుల్ కారు కుడిపక్క పొదల్లోకి పోనిచ్చి, అతి కష్టం మీద రివర్స్ చేసుకుని వచ్చిన దారినే తిప్పాడు.
వాళ్లు ‘అరేయ్ నా కారురా, కారు తీసుకెళ్లిపోతున్నాడు. పట్టుకోండిరా’ అని అరుచుకుంటూ కారుకి ఎదురుగా పరిగెత్తుకుని వస్తుంటే కసిగా యాక్సిలేటర్ తొక్కాడు రాహుల్.
అదృష్టవశాత్తూ ఆ చిన్న రోడ్డు తారురోడ్డు కావడం కొంత సాయపడడంతో కారు త్వరగానే స్పీడందుకుంది. వాళ్లల్లో ఎవరో కారు తగిలి పడిపోవడం మిగతా ఇద్దరూ గట్టిగా బూతులు తిడుతూ కారు వెనకాల రావడం గమనించినా ఆగకుండా పోనిచ్చాడు.
శిశిర రెండు చేతుల్లో మొహం కప్పుకుని వెక్కివెక్కి ఏడవసాగింది.
‘శిశిరా ఏడవకు.. ప్లీజ్... నువ్వేడిస్తే నాకు ఉన్న ధైర్యం పోతుంది. దేవుడి దయ వల్ల మనం బైటపడ్డాం. పద.. మళ్లీ సూర్యాపేట వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో కంప్లైట్ చేసి, ఈ కారు అక్కడ హ్యాండోవర్ చేద్దాం. అక్కడే తెల్లారిందాకా ఉందాం. లేదంటే మరో మంచి బస్సు వస్తే వెళ్లిపోదాం. సరేనా? ఏడవకు. నీకు తోడుగా ఉండి పెళ్లికి తీసుకొచ్చాను. క్షేమంగా నీ పేరెంట్స్‌కి నిన్ను అప్పగించడం నా బాధ్యత. అయినా మీ ఆడపిల్లలు ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని ధైర్యంగా, సాహసంగా బుద్ధిబలంతో ఎదుర్కోవాలి గానీ ఏడిస్తే ఎలా?’
‘వాడి తల మీద సీసాతో కొట్టాను. అది సాహసం కాదా? వాడు చచ్చాడో, బతికాడో కూడా చూడలేదు’ వెక్కుతూనే ఉంది.
‘పాపీ చిరాయువు అన్నారు వాడేం చావడు’
‘అయినా చేతిలో ఆయుధం లేకుండా ముగ్గురు వ్యక్తులను ఎలా ఎదుర్కోగలం’ అంటున్న శిశిర వైపు చూస్తూ ‘పిచ్చిదానా! మన బుర్ర ఉపయోగించి ఆలోచిస్తే ప్రకృతే మనకి బోలెడన్ని ఆయుధాలిస్తుంది. నా చేతిలో ఏ ఆయుధం ఉందని చెప్పు ఇప్పుడు’ అన్నాడు రాహుల్.
శిశిర చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ అతని వైపు చూసి అంది ‘నిజమే. భయంతో అరిచేకన్నా కర్తవ్యం ఆలోచించి ప్రమాదాన్ని దాటాలి. అయినా జంతువుల్లో క్రూర జంతువులేవో మనకి తెలుసు. కానీ మనుషుల్లో క్రూరులెవరో, మంచివాళ్లెవరో ఎలా తెలుస్తుంది రాహుల్?’
అవును ఎలా తెలుస్తుంది అనుకున్నాడు రాహుల్ నిట్టూరుస్తూ.
*

-అత్తలూరి విజయలక్ష్మి