S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇద్దరూ అసాధ్యులే

జీవితంలో ఎదురుదెబ్బలు తినీతినీ
బతకడం నేర్చుకున్నారు.. ఆ ఇద్దరూ..
పోరాడితేనే జీవించగలమన్న పాఠాన్ని
చిన్నతనం నుంచే ఒంటబట్టించుకున్నారు.. ఆ ఇద్దరూ..
ఇష్టం ఒకటైతే.. కష్టాలు మరోదారిని చూపాయి వారికి..
ఆ దారిలో అడుగడుగునా అవమానాలే.. అడ్డంకులే..
అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడల్లా
తిరుగులేని విశ్వాసంతో తిరగబడటం నేర్పింది జీవితం...
ఆ తిరుగుబాటు ధోరణి వారిని నాయకులను చేసింది. సవాళ్లను ఎదుర్కోవడం, పోరాడటం, విజయం రుచి చూడటం ఎలాగో నేర్చుకున్న ఆ ఇద్దరూ ఇప్పుడు పరిపూర్ణ విజయంతో అసాధ్యులనిపించుకుంటున్నారు.
ఆ ఇద్దరిలో ఒకరు తమిళుల ‘విప్లవ నాయిక’ జయలలిత....
మరొకరు.. బెంగాలీల ‘పెద్దక్క’ మమతాబెనర్జీ.
***
ఒకరు 34 సంవత్సరాల తమిళ రాజకీయ యవనికపై వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని అందరినీ ‘ఔరా’ అన్పిస్తే, మరొకరు వంగదేశంలో కమ్యూనిస్టులను కూకటివేళ్లతో తొలగించి, అక్కడ మునుపెన్నడూ ఏ పార్టీకి దక్కనంత బలంతో సగర్వంగా అధికారం చేపడుతున్నారు..
అందుకే ప్రజలు వారిద్దరినీ ‘అసాధ్యులు’ అంటున్నారు.
మందహాసం మాట ఎరుగని జీవితాలతో అడుగులు ప్రారంభించిన ఈ ఇద్దరూ మహారాణులుగా దరహాసం చిందించేలా ఎలా ఎదిగారు? వారి వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఆసక్తికర విషయాలెన్నో..
***
సాదాసీదా జీవితం..
వీధి పోరాటం
ప్రజాఉద్యమ నాయకుడు ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ అంటే ప్రజలకు ఎంతో గౌరవం. ఆయనంటే జనానికి పిచ్చి. ఓ సారి కోల్‌కతకు ఆయన వచ్చినపుడు- నిండా పదిహేనేళ్లు లేని ఓ యువతి ఆయనకు ఎదురెళ్లింది. ఆయన ప్రయాణిస్తున్న కారు బోనెట్‌పైకి ఎక్కి నిరసన తెలుపుతూ నృత్యం చేసింది. ఆ యువతి పేరు మమతా బెనర్జీ. ఎవరినీ లెక్కచేయని వైఖరితో, ధైర్యంగా అంతటి నాయకుడిని నిలువరించిన ఆమె డిగ్రీ చదువుతూండగానే విద్యార్థిసంఘ రాజకీయాల్లో అడుగుపెట్టింది. తండ్రి కాంగ్రెస్‌లో పనిచేసేవారు. దుందుడుకుతనమే ఆమెకు పేరు తెచ్చింది, కష్టాలనూ తెచ్చింది. రెండింటినీ భరించి, కీర్తిని ఆర్జించిన మమత బెంగాల్ ప్రజలకు పెద్దక్క (దీదీ) మారిపోయింది.
సంప్రదాయ, మధ్య తరగతి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రొమలీశ్వర్, గాయత్రీ దేవిల గారాలపట్టి మమత. ఆమె తొమ్మిదేళ్ల వయసులో తండ్రి మరణించడంతో కుటుంబం కష్టాల్లో పడింది. తండ్రి కాంగ్రెస్‌వాది. పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలది ఉక్కుపిడికిలి. డిగ్రీ చేస్తున్నప్పటినుంచి రాజకీయాలవైపు మొగ్గుచూపిన మమత జీవితంలో ఎదురైన కష్టాలతో కరడుగట్టిన మనిషిలా మారిపోయింది. పదునైన భాష, మొండిగా వీధికెక్కి పోరాడే తత్వం అలవాటైపోయాయి. 1970లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. కమ్యూనిస్టులను ఎదుర్కోవడం మాటలు కాదు. భౌతిక దాడులూ పరిపాటే. ఇరవై ఏళ్లు రాకుండానే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఆ తరువాత ఆలిండియా మహిళా కాంగ్రెస్‌కు జనరల్ సెక్రటరీగా పనిచేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ 1984లో లోక్‌సభకు (జాదవ్‌పూర్ నియోజికవర్గం) పోటీ చేసి కమ్యూనిస్టు యోధుడు సోమనాథ్ ఛటర్జీపై విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించింది. అతిపిన్నవయుస్సులో ఎంపీగా ఎన్నికైన మహిళగా రికార్డు సృష్టించిన ఆమె ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మినహా అపజయం ఎరుగలేదు. ఇక ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. రెండు దశాబ్దాలపాటు సేవలందించాక, కాంగ్రెస్ పార్టీతో విభేదించి 1997లో బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని 1998లో ప్రారంభించిన మమత నెమ్మదిగా రాష్ట్రంలో పట్టు సాధించడం మొదలెట్టారు. ‘మ, మాతి, మనుష్’ (అమ్మ, జన్మభూమి, ప్రజలు) అన్న నినాదంతో సొంత పార్టీని ముందుకు నడిపారు. కరడుగట్టిన కమ్యూనిస్టుల దాడులు ఎదుర్కొనే నేపథ్యంలో ఆమెపై ఒకసారి భౌతిక దాడి సైతం జరిగింది. తలకు బలమైన గాయాలయ్యాయి. ఎందరో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ కమ్యూనిస్టుల దాడుల్లో చాలామంది చనిపోయారు. వారి వైఖరి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన ఆమె నిజమైన నాయకురాలిగా ఎదగాలంటే తానూ వీధికెక్కాలని భావించారు. ఏ పోరాటమైనా సరే రోడ్డెక్కడం, ఢీకొట్టడం ఆమెకు అలవాటు. ఆమె నోరు తెరిస్తే ఎవరైనా భయపడాల్సిందే. స్వచ్ఛమైన, సరళమైన బెంగాలీలో కటువుగా, అసువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. ఎవరినీ లెక్కచేయకపోవడం, తెగువ ఆమె సొంతం. బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అమలుచేసిన పారిశ్రామిక విధానాన్ని ఎదుర్కొనేందుకు ఆమె చేసిన ఉద్యమం రక్తసిక్తమైంది. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. చివరకు ఆమె విజయం సాధించి జనానికి దగ్గరయ్యారు. నారద-శారద కుంభకోణంలో పార్టీ నేతలు పీకల్లోతు ఇరుక్కుపోయినా చెక్కుచెదరని మనస్సుతో పార్టీపై ఆ మకిలి పడకుండా పోరాటం చేశారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చేవరకు సెక్రటేరియట్‌లో అడుగుపెట్టనని ప్రతిజ్ఞచేసి దాన్ని నెరవేర్చుకున్న ఘనత ఆమెకే సొంతం. సాదాసీదాగా ఉండే సంప్రదాయ బెంగాలీ చీరలు ఆమెకు ఇష్టం. భుజాన వేలాడే చేతిసంచీ ఆమెకు పెద్దరికాన్ని తెచ్చిపెట్టే అంశం. ఆ సంచీలో కళ్లజోడు, ఒకటి రెండు పుస్తకాలు, చేతి రుమాలు, కావలసినన్ని చాక్లెట్లు ఎప్పుడూ ఉంటాయి. తను తింటూ పిల్లలకు అప్పుడప్పుడు ఇవ్వడం ఆమెకు అలవాటు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా స్వయంగా పలకరించి వెళ్లడం అమెకు ఇష్టం. సెక్రటేరియట్‌కు కాలినడకన వెళ్లడం సరదా. మామూలు రబ్బరు చెప్పులు (స్లిప్పర్లు) తప్ప మరొకటి వాడరు. కమ్యూనిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయినది ఏ పార్టీవారైనా ఆమె కరిగిపోతారు. ఆమె కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల వర్థంతి నాడు ఇప్పటికీ ఆమె వెళ్లి నివాళి అర్పిస్తారు. కమ్యూనిస్టుల పీచమణచడానికి ఆమె వారి దారిలోనే వెళతారు. ఎందరు తప్పుబట్టినా కన్నుకు కన్ను ధోరణినే ఆమె అనుసరిస్తారు. వారిపై ఎదురుదాడికి కార్యకర్తలు దిగితే మద్దతు ఇస్తారు. అవసరమైతే మోపెడ్‌పై, ఏ కార్యకర్తతోనైనా వెళ్లడానికి వెనుకాడరు. భేషజం లేని శైలి ఆమెది. రాజకీయ అవసరాలను బట్టి జాతీయ పార్టీలతో స్నేహం నెరపుతారు. గొడవపడటానికి ‘సై’ అంటారు. ఆమె వైఖరి ఒక్కోసారి ‘ఇంత దారుణమా?’ అన్నట్లుంటుంది. కానీ, బెంగాలీల మనసు దోచుకునేందుకు ఎలా ప్రవర్తించాలో ఆమెకు తెలిసింతగా మరెవరికీ తెలీదు. ఆమె ఏం చేసినా రాష్ట్రం కోసమేనన్నది వారి భావన. రైల్వేమంత్రిగా ఆమె తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి వరాలుగా మారాయి. ‘దురంతో ఎక్స్‌ప్రెస్’ ఆమె ప్రసాదమే. సీనియర్ సిటిజన్లకు రాయితీల పెంపు, జర్నలిస్టులకు, దంపతులకు కూడా రాయితీ వర్తించడం వంటి నిర్ణయాలు ఆమె హయాంలోనే తీసుకున్నారు. ఇలా ఆమె ఏ పదవిలో ఉన్నా ప్రజలకు ఏం కావాలో, ఓట్లుగా ఎలా మలుచుకోవాలో బాగా తెలుసు. కేంద్రంలో ప్రణభ్‌ముఖర్జీ మంత్రిగా ఉన్నప్పుడు నిప్పు-ఉప్పులా ఉన్న మమత ఆయన రాష్టప్రతి అయ్యేటప్పుడు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇలా సందర్భాన్ని బట్టి, తనకు, పార్టీకి, బెంగాల్‌కు కలసివచ్చేందుకు ఏం చేయడానికైనా ఆమె వెనుకాడలేదు. తనకు ఇబ్బందిపెట్టేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించలేదు. చివరకు రాజకీయ వ్యంగ్య కార్టూన్లను భరించలేనితత్వం ఆమెది. పార్లమెంట్‌లో మహిళాబిల్లును వ్యతిరేకిస్తున్నప్పుడు సమాజ్‌వాదీ ఎంపిని లోక్‌సభ వెల్ నుంచి కాలర్ పట్టి ఈడ్చుకొచ్చి మమత సంచలనం సృష్టించారు. ఆమె జీవితంలో ఇలాంటి దూకుడు వ్యవహారాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ప్రత్యర్థుల పనిపట్టేదాకా ఊరుకోని మనస్తత్వం ఆమెది. ఇవన్నీ పేద, మధ్య తరగతికి ఆమెను తిరుగులేని నాయికగా గుర్తింపు తెచ్చాయి.
ఇవీ పాచికలు
ఈసారి ఎన్నికల్లో గెలుపుకోసం ఆమె ఐదేళ్లనుంచి అడుగులు వేశారు. పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ఇంతవరకూ లేని కులాల అంశాన్ని ఆమె పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉండే ముస్లింలకు దగ్గరయ్యేందుకు ఎన్డీయేను లక్ష్యం చేసుకున్నారు. అతిపెద్దసంఖ్యలో ఉండే దళితుల్లో మతువా, సమశుద్ర వర్గాలను దగ్గరకు తీసుకున్నారు. 2011లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. విద్యార్థినులకు రాయితీలు ప్రకటించారు. మారుమూల పల్లెలకూ తారురోడ్లు వేశారు. రాష్ట్రం మొత్తంమీద రహదార్ల రూపురేఖలు మార్చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచారు. బెంగాలీ సంస్కృతిని తట్టిలేపారు. జననాడిని పసిగట్టి మెట్రో సహా పలు పథకాలకు రాష్ట్ర నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టేలా చూశారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌వద్ద రవీంద్ర సంగీతం వినిపించేలా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. క్రీడారంగానికి పెద్దఎత్తున నిధులిచ్చారు. ఇంతవరకూ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన మమత మున్ముందు ప్రధాని పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని అడుగులు వేయవచ్చు. సూచన ప్రాయంగా ఆమె ఆ మాట అంటున్నారు కూడా. రాష్ట్రంలో తన వారసుడిగా మేనల్లుడు అభిజిత్ బెనర్జీని ఇప్పటికే రంగంలోకి దింపిన మమత మాటల గారడీ మరోసారి తేటతెల్లమైంది. తాజా ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె మాట్లాడుతూ ‘నేను విఐపిని కాను. లెస్ ఇంపార్టెంట్ పర్సన్ (ఎల్‌ఐపి)ని’ అనడంలో లౌక్యం కన్పిస్తుంది. ఆ మాటల మంత్రమేకదా 61 సంవత్సరాల మమతను అసాధ్యురాలిని చేసింది. పశ్చిమబెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా 34 ఏళ్లపాటు ఏకధాటిగా అధికారంలో కొనసాగిన కమూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టిన నేతగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ పార్టీ సాధించని మెజారిటీతో సగర్వంగా అధికారం చేపట్టిన మమత అసాధ్యురాలు కాదని ఎవరు చెప్పగలరు?

పడిలేచిన కెరటం.. మొండిఘటం

తమిళనాట దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన అన్నాడిఎంకె సారథి జయలలిత- ఓ పడిలేచిన కెరటం, ఓ మొండిఘటం. కన్నుకు కన్ను...పన్నుకు పన్ను ధోరణితో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే జయ- తానూ అన్ని కష్టాలనూ ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సాగిన దుశ్శాసన పర్వంలో బాధితురాలైన ఆమె జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. రాజనీతి గురించి పక్కనబెడితే రాజకీయాల్లో తానూ తప్పటడుగులు వేశారు. మితిమీరిన అహంభావం, లెక్కలేనితనం, అతి విశ్వాసం చాలామందికి నచ్చకపోవచ్చుగానీ.. తమిళలకు ఆ పోకడ ఇష్టం. అందుకే ఆమెను ఆప్యాయంగా ‘అమ్మ’ అని, ‘విప్లవ నాయకి’ అని పిలుస్తారు. చాలామందికి తెలియని ‘తంగతరగై’ (గోల్డెన్ మెయిడిన్) అనే విశేషణం కూడా ఆమెకు ఉంది. మైసూరు రాష్ట్రంలో మెల్కోటెలో సంప్రదాయ తమిళ అయ్యంగార్ కుటుంబంలో పుట్టిన జయలలిత సంపన్న కుటుంబం నుంచే వచ్చింది. మైసూరు రాజుల వద్ద పనిచేసిన తాత, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన పిన్ని, సినిమా నటిగా వర్థిల్లిన తల్లి, ఉన్నతస్థాయిలో స్థిరపడిన రక్తసంబంధీకుల మధ్య ఒదిగిన జయలలితకు చిన్నప్పటి కలలన్నీ బాగా చదువుకోవాలనే. కానీ, జీవితం అనుకున్నట్లుంటే ఇంకేమికావాలి? వేదవల్లి (సంధ్య), జయరామ్‌ల గారాలపట్టి జయలలిత అసలు పేరు కోమలవెల్లి. ఏడాది వయస్సు వచ్చాక ఆమెకు జయలలిత అన్న పేరు పెట్టారు. ఇది రోజూ పిలిచే పేరన్నమాట. ఈమెకు జయకుమార్ అనే సోదరుడు కూడా ఉండేవారు. రెండేళ్ల వయసులో తండ్రి చనిపోవడం, బంధువులు పట్టించుకోకపోవడంతో ఆమె కుటుంబం కష్టాల్లో పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి వేదవల్లి సంధ్యగా సినిమాల్లో నటించాల్సి వచ్చింది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన పిన్నివద్ద కొంతకాలం పెరిగిన జయలలిత తల్లిని చూడటానికి వేసవిసెలవుల్లో మాత్రమే అవకాశం వచ్చేది. మానసికంగా కుంగిపోవడానికి, ఒంటరిగా ఉండటానికి కుటుంబ పరిస్థితులు కారణమయ్యాయి. ఈసడింపులు, చులకనగా మాట్లాడటం ఆమెను బాధించేవి. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబం గడవకపోవడంతో తల్లి సంధ్య జయను సినిమాల్లో నటించమని ఒత్తిడి చేసింది. మొదట నాటకాలు, ఆ తరువాత కన్నడలో నటించిన జయలలిత తెలుగులోనూ రాణించారు. తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పుడే అగ్రహీరో ఎంజిఆర్‌తో పరిచయం అయింది. ఆ తరువాత పార్టీలో చేరిన ఆమెకు ఎదురేలేకుండా పోయింది. 1982లో తొలిసారిగా ఆమె పార్టీ తరపున చేసిన ప్రసంగం ఏమిటో తెలుసా? ‘ది గ్రేట్‌నెస్ ఆఫ్ విమెన్’ (పెన్ని పెరుమై). పురుషాధిక్యతను ఏమాత్రం భరించలేని జయ- అలా మారడానికి పరిస్థితులే కారణమని చెప్పాలి. ఇంగ్లీషులో ఆమె ప్రావీణ్యం చూసిన ఎంజిఆర్ 1984లో రాజ్యసభకు పంపారు. ఆ తరువాత ఇద్దరి మధ్య కాస్త విభేదాలు వచ్చాయి. ఎంజీఆర్ మరణానంతరం పార్టీనుంచి తనను తరిమేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా, అవమానించినా తట్టుకున్న జయ ఎవరికీ కొరకరాని కొయ్యగానే ఉంది. ఎంజీఆర్ అంతిమయాత్రలో ఆమెను వాహనంపైనుంచి కిందకు లాగేసిన ఉదంతం ఓ సంచలన ఘట్టం. ఎంజిఆర్ మరణించాక ఆయన భార్య జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినా పార్టీని నడపలేకపోవడంతో జయకు కలసివచ్చింది. ఇక అప్పటినుంచి ఆమెకు తిరుగులేకుండాపోయింది. 1991లో ఆమె తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టింది. చిన్నవయస్సులోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రికార్డు సృష్టించిన జయలలిత- లెక్కలు చూపని ఆస్తుల కేసులో జైలుపాలవడం, పదవినుంచి దిగిపోవడం, మళ్లీ కోర్టు తీర్పు మేరకు అధికారంలోకి రావడం ఓ సంచలనం. డిఎంకె అధినేత కరుణానిధి అంటే పొడగిట్టని జయ.. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఆయనను అరెస్టు చేయించిన తీరు ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. తనకు అవమానం జరిగిన సభలో అధికారంలోకి వచ్చేవరకు అడుగుపెట్టనని చెప్పిన జయ అన్నమాట ప్రకారమే చేశారు. చివరకు అసెంబ్లీని కూడా కొత్తగా నిర్మించేలా చేసిన ఆమె చాలా విషయాల్లో కఠినంగానే వ్యవహరిస్తారు. తనను గౌరవించకపోతే ఎవరినీ లెక్కచేయని తత్వం ఆమెది. నిన్నమొన్నటివరకు బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు, వాచీలు, పాదరక్షలు అంటే మోజుపడ్డ జయ ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. బహుశా జైలుజీవితం నేర్పిన పాఠం కావచ్చు. రాజకీయంగా ఆటుపోట్లు, న్యాయ వివాదాలు, ఎదురైన విపత్కర పరిస్థితులు దేశంలో మరే రాజకీయ నేతకు ఎదురవలేదనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తాజా ఎన్నికల్లో ఆమె గెలవడం కష్టమని అందరూ భావించిన నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకున్న ఈ ధీరవనిత.. ఈ ఘనత సాధించడానికి ఎన్నో ఎత్తులు వేశారు.
ఇవీ పాచికలు...
2011లో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక క్రమపద్ధతిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చేదోడువాదోడుగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంటర్ వరకు ఉచిత విద్య, ఉచితంగా సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, కళ్లద్దాలు, భోజనం కూడా ఇచ్చే స్కీం విద్యార్థివర్గాన్ని ఆకట్టుకుంది. చవకగా భోజనం పెట్టే అమ్మ క్యాంటీన్లు, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, ఇలా ఎన్నో తాయిలాలు అందించింది. ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆమెదే. ఇదే పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏకం కాకుండా ఎత్తులు వేయడం, ఒంటరిగా పోటీ చేయడం, బిజెపితో తటస్థంగా వ్యవహరించడం వంటి వ్యూహాలు ఆమెకు ఉపకరించాయి. తనకు నచ్చనివారిని ఏరి పారేయడం, నచ్చినవారిని అక్కున చేర్చుకోవడం ఆమెకు తెలిసిన విద్య. తాజా ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకున్న జయ- ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నానని, వ్యక్తిగతంగా తనకూ ఏమీ అవసరం లేదని, తమిళనాడు ప్రజలకోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అందుకే కదా అక్కడివారు ‘అమ్మా’ అని ఆరాధిస్తారు. అచ్చమైన తమిళయాసలో ప్రజలకు అర్ధమయ్యేలా సూటిగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. అందుకే భారత రాజకీయాల్లో ఆమె ఓ విలక్షణ నేత.
*

నేతచీర, పెయింటింగ్స్ ఇష్టం
మమతాబెనర్జీకి సంప్రదాయ బెంగాలీ చీరలంటే ఇష్టం. ముఖ్యంగా ‘్ధనికహలిక’ చీరలంటే ఆమెకు ప్రీతి. హుగ్లీ జిల్లాలోని ‘్ధనికహలిక’ గ్రామంలో వీటిని నేస్తారు. 100-100 దారపు పోగుల లెక్కతో వీటిని అల్లుతారు. 1.5-2.0 అంగుళాల రంగుల అంచు వీటికి ఉంటుంది. మిగతా చీలకు భిన్నంగా ఆరు మూరల పొడుగుండే ఇవి మమతకు అత్యంత ఇష్టం. సాధారంగా తెలుపు, అప్పుడప్పుడు గ్రే, కాస్త ముదురు రంగు చీరలను ఆమె వాడతారు. ఈమె వాడే చీర ఖరీదు మహా అయితే 350 రూపాయలుంటుంది. ఒక్కో కార్మికుడు నెలకు 12 చీరలు నేయగలుగుతారు. ఒక్కోచీరపై వారికి 30 రూపాయలవరకు లాభం ఉంటుంది. మమత బ్రాండ్ వల్ల ఈ చీరలకు మంచి మార్కెట్ ఉంది. ఇక స్వతహాగా ఆమె మంచి రచయిత, కళాకారిణి కూడా. ఇప్పటివరకు ఆమె 5వేల పెయింటింగ్స్ వేసుంటారు. తరచూ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూంటారు. పార్టీ నిధుల సేకరణకు ఇలా చేస్తారు. ఒక్కో ఎగ్జిబిషన్‌లో దాదాపు 2 కోట్ల వరకు ఆమె బొమ్మలకు ధర పలుకుతుంది. బెంగాలీలో 12, ఇంగ్లీషులో మూడు నవలలు రాసిన ఆమె కవితలూ రాస్తారు. ఆశువుగా కవితలు ఆలపిస్తుంటారు కూడా. కటువుగా వ్యవహరించే మమతకు మరోరూపం ఇది. ఆమె వేసే బొమ్మల్లో ఎక్కువగా ‘అమ్మ’ కన్పిస్తుంది- బెంగాలీ ఆడపడుచులా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ తన సాదాసీదా ఇంట్లోనే ఆమె నివసిస్తుండటం ఆమె విలక్షణతకు నిదర్శనం.హిస్టరీలో గ్రాడ్యుయేషన్, ఇస్లామిక్ హిస్టరీలో పిజి, బిఇడి, లా చదివిన మమత అంతకంటే బాగా రాజకీయాల్ని చదివేశారు.

పుస్తకాలంటే పిచ్చి..
సినిమాలన్నీ హిట్
‘మూర్త్భీవించిన అహంకారానికి మారుపేరు జయలలిత’ అని చాలామంది చెబుతారు. కానీ, ఆమె స్వతహాగా సాత్వికురాలు. రాజకీయాలు, కుటుంబ పరిస్థితులు ఆమెనలా మార్చేశాయి. నిజానికి చదువంటే ఆమెకు ఇష్టం. ఇంగ్లీషులో నిష్ణాతురాలు. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో దిట్ట. ఆమెకు పుస్తకాలంటే మక్కువ. ఆమె నివసిస్తున్న పొయెస్ గార్డెన్‌లో ఇంట్లో 3వేల పుస్తకాలతో లైబ్రరీ ఉంది. సినిమాల్లో నటించినపుడు ఖాళీ దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివే అలవాటున్న జయ ఇప్పటికీ ఆ అలవాటును కొనసాగిస్తున్నారు. దాదాపు 140 సినిమాల్లో నటిస్తే అందులో 125 చిత్రాలు సూపర్‌హిట్. తెలుగులో ‘మనుషులు-మమతలు’ సినిమాతో అరంగేట్రం చేసిన ఆమెకు భరతనాట్యం, మోహినీఆట్టం, మణిపురి, కథక్ నృత్యరీతుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. పాశ్చాత్య సంగీత సాధనమైన పియానో వాద్యాన్నీ ఆమె నేర్చుకున్నారు. ‘్థయ్’ అనే పత్రిక ఉన్నన్నాళ్లూ కాలమిస్టుగా వ్యాసాలు రాసిన జయ ఒకే ఒక్క నవల రాశారు. ఇంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే జయకు నమ్మకమైన స్నేహితులు పుస్తకాలే.

-ఎస్.కె.రామానుజం