S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉక్కు పిడికిలి

నేనే వీరుడినని జబ్బచరిచి చెప్పగలిగే ధీశాలి అతడు...
పిడికిలి బిగించి పంచ్ విసిరితే ప్రత్యర్థి మట్టికరవాల్సిందే...
అతడు గుండెనిండా ఊపిరి తీసి మాట విసిరితే...ముష్టిఘాతమే...
బరిలో దిగకముందే హూంకరించి శత్రువును భయపెట్టే కండలవీరుడాయన...
యుద్ధానికైనా సమఉజ్జీలుండాలని నమ్మి వియత్నాంపై యుద్ధం వద్దని
దేశాన్ని ఎదిరించిన యోధుడు..
మాటలో.. చేతలో పంచ్...
జీవితం చివరివరకూ అదే ధోరణి... 74 ఏళ్ల..వృద్ధాప్యంలోనూ తగ్గని కసి...
ముస్లింలను దేశంలో అడుగుపెట్టనివ్వనన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించాలంటూ పిలుపుఇచ్చిన సాహసి అతడు...
అతడే బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలి...

ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ గురించి తెలుసుకోవడం అంటే అమెరికాలో నల్లజాతీయుల అస్తిత్వ పోరాటాలను తెలుసుకోవడమే. జాత్యహంకారంపై బిగిసిన ఉక్కు పిడికిలే అలీ. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని ఒహియో నదిలో పడేసిన కాసియస్ క్లే జూనియర్ క్రిస్టియానిటీ విడిచి ఇస్లామ్ మతాన్ని స్వీకరించడం, తన పేరును మహమ్మద్ అలీగా మార్చుకోవడం అతను జాతి వివక్షపై జరిపిన తొలి యుద్ధాలు. మరణించే వరకూ తాను నమ్మిన సిద్ధాంతాలను పాటించిన మానవతావాది అలీ. బాక్సింగ్ రింగ్‌లో తిరుగులేని యోధుడిగా ఎదిగిన అలీని మానవీయ కోణం నుంచి చూస్తే సామాజిక అసమానతలను ఎదిరించిన మహా నాయకుడిగా మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతాడు. అందుకే, అతని చరిత్ర అంటే అమెరికా నల్ల జాతీయుల చరిత్ర. అతని చరిత్ర అంటే బాక్సింగ్ చరిత్ర. అతని జీవితం అస్తిత్వ పోరాటం. అతను గడిపిన ప్రతి క్షణం ప్రజాహితం కోసమే. బాక్సింగ్ రింగ్‌లో అతనికి శత్రువులు ఉండవచ్చు. ప్రత్యర్థులు అతనిని ఎన్నో రకాలుగా విమర్శించవచ్చు. అతని టెక్నిక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. కానీ, అతని పోరాటస్ఫూర్తిని, నిజాయితీని, వ్యక్తిత్వాన్ని, త్యాగనిరతిని ఎవరూ శంకించరు. బాక్సింగ్‌లో అతని తిరుగులేని ఆధిపత్యాన్ని ఎవరూ కాదనలేరు. ‘ది గ్రేటెస్ట్’ అని తనను తాను ప్రకటించుకున్నా, ఎవరూ ఆక్షేపించే సాహసం చేయలేదంటే బాక్సింగ్ ప్రపంచంలో అలీకి ఉన్న క్రేజ్‌ని సులభంగా ఊహించుకోవచ్చు.
జాత్యహంకారంపై ఉక్కు పిడికిలి!
అలీని హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ
చాంపియన్ షిప్‌ను మూడు పర్యాయాలు కైవసం చేసుకొన్న తొలి బాక్సర్‌గా, తిరుగులేని వీరుడిగానే చాలా మందికి అతను తెలుసు. కానీ, అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న అమానుషాలకు వ్యతిరేకంగా గళమెత్తిన అలీ తనకు ఎదురైన హెచ్చరికలను, కెరీర్‌కు వచ్చే ప్రమాదాలను పట్టించుకోలేదు. వియత్నాంపై అమెరికా యుద్ధానికి దిగడాన్ని నిరసించాడు. అమెరికా పౌరులు తప్పనిసరిగా కొంతకాలం సైన్యంలో పని చేయాలన్న నిబంధనను పట్టించుకోలేదు. ‘వియత్నాం కావచ్చు.. మరే దేశమైనా కావచ్చు.. ఆయా దేశాల పౌరులు ఎవరూ నాకు శత్రువులుకారు. వారిని తుపాకీ ఎక్కుపెట్టాల్సిన అవసరం నాకు లేదు. అమాయకులపై ఊచకోత కోయడానికే సైన్యం చేరడాన్ని నేను ఎంతమాత్రం సమర్థించను. ప్రభుత్వం ఏం చేసినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను భయపడేది లేదు’ అని అలీ స్పష్టం చేశాడు. ఫలితంగా అమెరికా సర్కారు ఆగ్రహానికి గురయ్యాడు. సుమారు మూడేళ్లు సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నాడు. చివరికి న్యాయ పోరాటంలో గెలిచాడు. మళ్లీ అంతర్జాతీయ బాక్సింగ్ రింగ్‌పై తళుక్కుమని మెరిశాడు.
జాత్యహంకారానికి విరుద్ధంగా టీనేజర్‌గా ఉన్నప్పుడు మొదలైన అలీ పోరాటం చివరి వరకూ కొనసాగింది. అమెరికా యుద్ధ పిపాసను ఎండగట్టాడు. రసాయినిక ఆయుధాలున్నాయని ఆరోపిస్తూ ఇరాక్‌పై యుద్ధం చేసి, సద్దాం హుస్సేన్‌ను అమెరికా బందీగా పట్టుకున్నప్పుడు అతనిని బేషరతుగా విడిచిపెట్టాలని అలీ డిమాండ్ చేశాడు. సద్దాం ఉరిని వ్యతిరేకించాడు. అమెరికాలో ఇప్పటికీ కొనసాగుతున్న జాతి వివక్షను నిరసించాడు. అతని పోరాటం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. నల్లజాతీయులను జాగృతం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనపై యుద్ధ్భేరిని మోగించింది. అలీ భౌతికంగా లేకపోయినా, అతను చూపిన బాట యువతరానికి మార్గదర్శకమవుతుంది.
కెంటుకీలోని లాస్విల్లేలో 1942 జనవరి 17న జన్మించిన కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ తండ్రి కాసియస్ క్లే ఒక పెయింటర్. తల్లి ఒడెసా సాధారణ గృహిణి. మహమ్మద్ అలీగా మారక ముందు, కాసియస్ క్లేగా ఉన్న రోజుల్లోనే, తన 12 ఏళ్ల వయసులో అతను బాక్సింగ్ ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. ఈ రంగంలోకి అతను యాదృచ్ఛికంగా వచ్చాడు. అలీ సైకిల్‌ను ఎవరో దొంగతనం చేశారు. పోలీస్ అధికారి జో మార్టిన్ వద్దకు వెళ్లి అలీ ఫిర్యాదు చేశాడు. దొంగ దొరికితే తుక్కుతుక్కుగా ఉతికేస్తానంటూ కోపంతో ఊగిపోతున్న అలీలో మార్టిన్‌కు భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌ను శాసించే గొప్ప బాక్సర్ కనిపించాడు. మార్టిన్ బాక్సింగ్ ట్రైనర్ కూడా కావడంతో, వెంటనే అలీని శిక్షణ తరగతుల్లో చేర్చుకున్నాడు. అక్కడే అలీ బాక్సింగ్‌లో ఓనమాలు దిద్దుకున్నాడు. సుమారు 40 కిలోల బరువే ఉన్నప్పటికీ, అలీలోని అథ్లెటిక్ లక్షణాలను గమనించిన మార్టిన్ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. రెండేళ్లలోనే అమెచూర్ బాక్సర్‌గా పేరుప్రఖ్యాతులు ఆర్జించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్ లైట్ హెవీవెయిట్ బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత, ఆరేళ్ల అమెచూర్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ప్రొఫెషనల్‌గా మారాడు. అప్పటికే నల్లజాతీయుడైనందువల్ల అతను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒలింపిక్ పతకాన్ని గెల్చుకున్న తర్వాత కూడా నల్లజాతీయుడైన కారణంగా అతను వివక్షను ఎదుర్కోక తప్పలేదు. లూయిస్‌విల్లేలోని ఒక రెస్టారెంట్‌లో భోజనం వడ్డించడానికి అక్కడి వెయిటర్లు నిరాకరించారని, దీనితో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అలీ తన ఆత్మకథ ‘ది గ్రేటెస్ట్’లో రాసుకున్నాడు. ఆ కోపంతోనే ఒలింపిక్ పతకాన్ని ఒహియో నదిలో విసిరేశానని తెలిపాడు. ఈ సంఘటన నిజంగానే చోటు చేసుకుందా లేక పతకాన్ని ఎక్కడో పోగొట్టుకున్న అలీ కట్టుకథ అల్లాడా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే. నిజానిజాలు ఏవైనా, నల్లజాతీయుల పట్ల అమెరికాలో వివక్ష ఆ కాలంలో తీవ్ర స్థాయిలో ఉండేదనడంలో సందేహం లేదు. జాతి వివక్ష చూపే క్రిస్టియానిటీలో కొనసాగడం దండగ అని నిర్ణయించుకున్న అతను ఇస్లామ్ మతాన్ని తీసుకున్నాడు. కాసియస్ క్లే అన్న పేరును మహమ్మద్ అలీగా మార్చేసుకున్నాడు. 1964లో సోనీ లిస్టన్‌ను ఓడించి మొట్టమొదటిసారి ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అలీ వేసిన ప్రతి అడుగు ఓ మైలురాయిగా మిగిలిపోయింది.
అతని ప్రతి ఫైట్ ఔత్సాహిక బాక్సర్లకు పాఠ్యాంశమైంది.
అంతులేని ఆత్మాభిమానం
అమెరికా ప్రభుత్వం బాక్సింగ్ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చి, దానికి అతని పేరునే ఖరారు చేసింది. అలీకి అమెరికన్లలో ఉన్న క్రేజ్ అలాంటిది. బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులు ఎంతోమంది అతని అభిమానులే కావడం విశేషం. జో ఫ్రేజర్, జార్జి ఫోర్మన్ తదితరులు కూడా అలీ అభిమానులే. 32 ఏళ్ల క్రితం పార్కిన్సన్స్ వ్యాధి సోకిన తర్వాత అతను శారీరకంగా కుంగిపోయాడు. అయితే, మానసికంగా అతనిని దెబ్బతీయలేకపోయింది. చివరి క్షణం వరకూ అలీ నల్లజాతీయుల ఆత్మ గౌరవం కోసం, పార్సిన్సన్స్ వ్యాధిగ్రస్థులకు సేవ చేయడం కోసం కృషి చేస్తునే ఉన్నాడు. 2014లో న్యుమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. అతను బతికే అవకాశాలు తక్కువని వైద్యులు ప్రకటించారుకూడా. కానీ, కొన్ని రోజుల్లోనే అతను కోలుకున్నాడు. 2015లో మూత్ర నాళాల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో మరోసారి ఆసుపత్రికి చేరాల్సి వచ్చింది. అప్పుడు కూడా మృత్యువుతో పోరాడి గెలిచాడు. కదల్లేని పరిస్థితుల్లో వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికీ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫొనిక్స్‌లో ఏర్పాటు చేసిన సెలబ్రిటీ ఫైట్ నైట్ డిన్నర్‌లో పాల్గొని, తద్వారా వచ్చిన సొమ్మును పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం విరాళంగా అందచేశాడు. ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టనివ్వనని అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించాడు. ట్రంప్‌ను సమర్ధించవద్దంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు.
* * *
మహమ్మద్ అలీ పొడవు 6 అడుగుల 3 అంగుళాలు. కెరీర్‌ను కొనసాగించిన కాలంలో అతని సగటు బరువు 90 కిలోలు. రింగ్‌లో అత్యంత వేగంగా కదలడం, సమయం చూసి ప్రత్యర్థిని బలమైన పంచ్‌లతో చిత్తుచేయడం అతను అనుసరించిన వ్యూహాలు. అందుకే అతనిని ‘సీతాకోక చిలుకలా ఎగురుతూ, తేనెటీగలా కుడతాడు’ అని అంటారు. మూడు దశాబ్దాలు కొనసాగిన కెరీర్‌లో అతను 61 ఫైట్స్‌లో పాల్గొన్నాడు. 56 విజయాలు సాధించాడు. వాటిలో 37 నాకౌట్ ద్వారా సంపాదించినవే కావడం విశేషం. కేవలం ఐదు ఫైట్స్‌ను అలీ ఓడాడు. ‘రంబుల్ ఇన్ ది జంగిల్’, ‘థ్రిలియా ఇన్ మనీలా’ బాక్సింగ్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించాయి. 1954లో అమెచూర్ బాక్సింగ్ కెరీర్‌ను మొదలుపెట్టిన అలీ 105 ఫైట్స్‌లో పాల్గొన్నాడు. విజయాల శతకాన్ని సాధించాడు. కేవలం ఐదు ఫైట్స్‌లో ఓడాడు.
పట్టుదలకు మారుపేరు
మహమ్మద్ అలీ పట్టుదలకు మారుపేరు. కెరీర్‌లో మొట్టమొదటి పరాజయం అతనికి జో ఫ్రేజర్ రూపంలో ఎదురైంది. ప్రతీకారం తీర్చుకోవడానికి అలీ సుమారు ఏడాదిపాటు ఎదురుచూశాడు. 1975 అక్టోబర్ ఒకటో తేదీన జరిగిన ఫైట్‌లో జో ఫ్రేజర్‌ను ఓడించి, తనంటే ఏమిటో నిరూపించుకున్నాడు. 1967లో అమెరికా ఆర్మీలో చేరడానికి నిరాకరించినందుకు సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నాడు. ‘నా గ్లోవ్స్ జైలుకు వెళతాయి’ అంటూ నినదించిన అలీ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడానికిగానీ, రాజీ కుదుర్చుకోవడానికిగానీ సుముఖత వ్యక్తం చేయలేదు. చివరికి న్యాయపోరాటంలో గెలిచాడు. కానీ, కెరీర్‌లో అత్యంత కీలకమైన మూడున్నర సంవత్సరాలను పోగొట్టుకున్నాడు. సస్పెన్షన్‌కు గురికాక ముందు 29 ఫైట్స్‌లో పాల్గొని అన్నింటినీ గెల్చుకున్న ‘అజేయుడు’ తన రెండో ఇన్నింగ్స్‌లో అదే స్థాయిలో రాణించలేకపోయాడు. అతను ఏమాత్రం రాజీకి వచ్చినా పరిస్థితి మరోలా ఉండేది. కానీ, యుద్ధ పిపాసిగా మారిన అమెరికా ప్రభుత్వానికి తలవంచేది లేదని ప్రకటించి ఆత్మాభిమానాన్ని చాటుకున్నాడు.
భిన్న పాత్రల్లో జీవించిన అలీ!
రింగ్‌లో మెరుపువేగంతో కదులుతూ, చిరుతలా ప్రత్యర్థిపై దాడి చేసి, బలమైన ముష్టిఘాతాలతో గాయపరచడం, విజయాలను సాధించడం మహమ్మద్ అలీ వృత్తి. ప్రత్యర్థి రింగ్‌లో కుప్పకూలినప్పుడు అతని కళ్లల్లో క్రూరత్వం కనిపిస్తుంది. నాకౌట్‌లో గెలిచిన ప్రతిసారీ అతను పొందే అటవిక ఆనందాన్ని గుర్తించడం కష్టం కాదు. ఆ సమయంలో అతను క్రూరుడిగా, కర్కోటకుడిగా, మానవత్వం లేని దుర్మార్గుడిగానే గోచరిస్తాడు. ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ అలీ ఒక కోణం మాత్రమే ఇది. మరో కోణం నుంచి చూస్తే అతను జాత్యహంకారంపై పోరాడిన మానవతావాదిగా సాక్షాత్కరిస్తాడు. మానవీయ విలువలను నరనరాన జీర్ణించుకున్న మహీ మనిషిగా దర్శనమిస్తాడు. వృత్తి వేరు.. ప్రవృత్తి వేరు.. అన్న సూత్రాన్ని ఆచరణలో చూపించిన అరుదైన వ్యక్తి, బాక్సింగ్ ఆణిముత్యం అలీ.
ఫ్రేజర్ ఘనత
బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుడు మహమ్మద్ అలీ.
ఇది అందరికీ తెలిసిన విషయం. అయతే, అలీని కూడా ఖంగుతినిపించిన ఘనత జో ఫ్రేజర్‌ది. 1970లో నవంబర్ 18న బాబ్ ఫోస్టర్‌ను చిత్తుచేసి ప్రపంచ హెవీవెయట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్న ఫ్రేజర్ అప్పట్లో ‘ఫైర్ బ్రాండ్‌గా’గా ముద్రపడ్డాడు. అలీ చక్కటి ఫామ్‌లో ఉన్నప్పుడు అతనితో తలపడడానికి బాక్సర్లంతా గడగడలాడేవారు. అతనితో టైటిల్ పోరులో బరిలోకి దిగితే ఓటమి ఖాయమనే భయం అందరికీ ఉండేది. అలాంటి రోజుల్లో అలీని ఓడించిన ఘనతను దక్కించుకున్న అరుదైన బాక్సర్ ఫ్రేజర్. అయతే, ప్రపంచ టైటిల్‌ను దక్కించుకున్న ఘనత ఫ్రేజర్‌ది. అతనితో తలపడితే, రింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరాల్సి ఉంటుందని అప్పట్లో చాలా మంది బాక్సర్లు చమత్కరించేవారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రపంచ టైటిల్ కోసం అలీని ఓడించడం మాత్రం ఫ్రేజర్ కెరీర్‌లో ఒక గొప్ప విజయంగా సుస్థిర స్థానం సంపాదించింది. అలీ కూడా ఫ్రేజర్‌ను సమర్థుడని ప్రశంసించి, తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.
నాలుగు దశాబ్దాల క్రితం..
యార్క్ యాంకీ స్టేడియంలో సుమారు 40 సంవత్సరాల క్రితం జరిగిన బాక్సింగ్ ఫైట్‌ను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 1976 సెప్టెంబర్ 28 నాటి ఆ పోరులో మహమ్మద్ అలీ తన బలమైన పంచ్‌లు, తిరుగులేని హుక్‌లతో కెన్ నార్టన్‌ను చిత్తుచేశాడు. యాంకీ స్టేడియంలో అదే చివరి బాక్సింగ్ ఫైట్. ఆతర్వాత బేస్‌బాల్‌కు ఈ స్టేడియం కేంద్రమైంది. బాక్సింగ్ అభిమానులు ఇక్కడ ఓ బాక్సింగ్ ఫైట్ కోసం మూడు దశాబ్దాలకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. వారు సుదీర్ఘ నిరీక్షణకు ఇటీవలే తెరపడింది. జూనియర్ మిడిల్‌వెయిట్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ యూరీ ఫోర్మన్, మాజీ చాంపియన్ మిగుల్ కొటో ఢీకొన్నారు. ఈ ఫైట్‌కు హాజరలైన సుమారు 30 వేల మంది ప్రేక్షకులు కేరింతలు కొడుతూ యాంకీ స్టేడియం పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
లిస్టన్ మోసం..
మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న కాసియస్ క్లే 60వ దశకంలో బాక్సింగ్ రంగంలో సంచలనాలు సృష్టించాడు. అతనిని ఎదుర్కోవడం అంటే ఓటమిని ఆహ్వానించడమే అని అంతా భయపడేవారు. అలాంటి బాక్సర్‌తో పోటీపడాల్సి వచ్చినందుకు సోనీ లిస్టన్ కంగారుపడ్డాడు. 1964లో జరిగిన ఫైట్‌లో అతను విజయానికి దగ్గరి మార్గాన్ని ఎంచుకొని ‘బాక్సింగ్ చీటర్’గా ముద్రపడ్డాడు. గ్లోవ్స్‌కు ఆయింట్‌మెంట్ రాసుకొని అలీ ముఖానికి తగిలే విధంగా ఒకటి రెండు పంచ్‌లు కొడితే, చాలని అతని ఆలోచన. ఆ ప్రయత్నం ఫలించింది కూడా. లిస్టర్ గ్లోవ్ తగిలిన చోట చర్మం మండడమేకాదు.. కళ్ల నుంచి ధారాళంగా నీరు కారడం మొదలయ్యేసరికి అలీ కంగారు పడ్డాడు. అతని ట్రైనర్‌కు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో లిస్టన్ బండారం బైటపడింది. తర్వాతి కాలంలో ఆ ఫైట్ ‘బర్నింగ్ గ్లోవ్స్’ (మండుతున్న గ్లోవ్స్) అన్న పేరుతో చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. లిస్టన్ ఒక మోసగాడిగా మిగిలిపోయాడు. విజయానికి దగ్గర దారి అంటూ ఏదీ ఉండదన్న వాస్తవం మరోసారి ప్రపంచానికి తెలిసింది. క్రీడా స్ఫూర్తితో రాణించకపోతే లిస్టన్‌లా చరిత్ర హీనులవుతారు.
నేనే గొప్ప!
మహమ్మద్ అలీ మద్రాసు (చెన్నై) వచ్చినప్పుడు తమిళనాడు అధికారులు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రశ్నలు, సమాధానాలతో సమావేశం ముగింపు దశకు చేరింది. హఠాత్తుగా ఓ విలేఖరి లేచి ‘మీ లెఫ్ట్ హుక్ చాలా బలహీనంగా ఉంటుంది. ప్రత్యర్థిని దవడను లక్ష్యంగా చేసుకొని బలమైన లెఫ్ట్ హుక్‌ను సంధించడంలో మీరు విఫలమవుతున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?’ అని అడిగాడు. అప్పటి వరకూ సరదాగా మాట్లాడుతున్న అలీ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ఆగ్రహాన్ని అణచుకుంటూ సదరు విలేఖరిని దగ్గరికి పిలిచాడు. ‘చూడు బాబూ... నేను యాభైకిపైగా ఫైట్స్‌లో పాల్గొన్నాను. నా పంచ్ బలం ఏమిటో చెప్పడానికి చాలా మంది ముఖాలపై ఉన్న బలమైన దెబ్బలు, గాట్లే సాక్ష్యం. నేను ఎక్కువ ఫైట్స్ నాకౌట్ ద్వారానే గెలిచాను. నా పంచ్ సామర్థ్యం ఏమిటో నా విజయాలే స్పష్టం చేస్తాయి. నా ముఖాన్ని జాగ్రత్తగా చూడు. ఎక్కడైనా ఒక్క మచ్చగానీ, గాటుగానీ కనిపిస్తున్నదా? ఎవరూ నన్ను ఇప్పటి వరకూ గాయపరచలేకపోయారు. అందుకే నన్ను మించిన వారు లేరని మరోసారి అంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా?’ అనడంతో సదరు విలేఖరి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. పొరపాటున తనపై పంచ్ విసురుతాడేమోనన్న భయంతో అతనికి గుండె ఆగినంత పని కావచ్చు. అలీనా మజాకా!
*
మెజిషియన్ అలీ!
మహమ్మద్ అలీ బాక్సర్ మాత్రమే కాదు.. మెజిషియన్ కూడా. ఏ కార్యక్రంలో పాల్గొన్నా ఒకటి రెండు మ్యాజిక్ ట్రిక్స్‌తో అభిమానులను అలరించేవాడు. గాలిలో పడవను నడిపించడం అలీ ట్రిక్స్‌లో ఒకటి. మ్యాజిక్ ప్రదర్శన పూర్తయిన తర్వాత అందులో కిటుకుల్ని ప్రేక్షకులకు వివరించేవాడు.

పాటగాడు!
సస్పెన్షన్ కారణంగా 43 నెలలు బాక్సింగ్‌కు దూరంగా ఉన్న కాలంలో అలీ పాటగాడిగా అవతారం ఎత్తాడు. ‘బక్ వైట్’ అనే ఆల్బమ్‌ను విడుదల చేశాడు. థియేటర్‌లో చేరి ఏడు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. చాలా మంద్ర స్వరంతో అలీ పాడేవాడని అతని సన్నిహితులు చెప్తారు. కానీ, అతని ఆల్బమ్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఒకసారి వచనంలో అతని ఆల్బమ్ విడుదల అయిందట. అందులోనే అలీ మొట్టమొదటిసారి ‘ఐ యాం ది గ్రేటెస్ట్’ అని ప్రకటించుకున్నాడు.

గ్లోవ్స్‌కు క్రేజీ!
మహమ్మద్ అలీ తన కెరీర్‌లో మొట్టమొదటి హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సోనీ లిస్టన్‌ను ఓడించి కైవసం చేసుకున్నాడు. అప్పట్లో అతనికి ఆ ఫైట్ ద్వారా 6,30,000 డాలర్లులభించాయి. 50 సంవత్సరాల తర్వాత, అప్పటి ఫైట్‌లో ఉపయోగించిన గ్లోవ్స్‌ను వేలం వేసినప్పుడు అతనికి 8,36,000 డాలర్లు వచ్చాయి.

గ్రేట్ ఫైట్
ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చరిత్రలో అత్యుత్తమ బాక్సర్ల జాబితాను రూపొందిస్తే మహమ్మద్ అలీ, జార్జి ఫోర్మన్, మైక్ టైసన్ పేర్లు అగ్రస్థానంలో కనిపిస్తాయి. అలాంటి ‘లెజెండ్స్’ పరస్పరం పోటీపడితే? టైటిల్ కోసం పంచ్‌లు విసురుకుంటే? ఆ ఊహే ఉత్కంఠను సృష్టిస్తుంది. అభిమానులకు ఉర్రూత లూగిస్తుంది. అందరూ కలలుకనే అలాంటి అరుదై ఫైట్ 42 సంవత్సరాల క్రితం, 1974 అక్టోబర్ 30న అభిమానులకు దక్కింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా అవతరించక ముందు జైరేగా పిలిచే ఓ చిన్న దేశానికి రాజు మొబుతు సెసె సెకో కృషి ఫలితంగా అలీ, ఫోర్మన్ మధ్య ఫైట్ సాధ్యమైంది. ఇద్దరూ మేటి బాక్సర్లే. ఇద్దరూ సమర్థులే. టైటిల్ గెలిచే శక్తిసామర్థ్యాలు ఉన్నవారు. అందుకే పోరు హోరాహోరీగా సాగింది. బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఫైట్‌గా చిరస్థాయగా నిలిచిపోయంది. ‘రంబుల్ ఇన్ ది జంగిల్’ (అడవిలో ఘంటారావం)గా ప్రసిద్ధికెక్కిన ఈ ఫైట్‌కు చెరో ఐదు మిలియన్ డాలర్లను ఇవ్వడానికి సెకో సిద్ధమయ్యాడు. ఆ రోజుల్లో ఇది ఎవరూ ఊహించలేనంత మొత్తం. 1960 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన అలీ ఆతర్వాత ప్రొఫెషనల్ బాక్సర్‌గా అత్యున్నత శిఖరాలకు చేరాడు. క్రమంగా వయసు మీద పడుతుండగా, 32 ఏళ్ల వయసులో అతను వేగంగా కదలడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. అందుకే ఆ ఫైట్‌లో, 1968 ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించిన 25 ఏళ్ల ఫోర్మన్‌ను 4-1 ఫేవరిట్‌గా పేర్కొన్నారు. భారీగా పందాలు కాశాలు. వాస్తవానికి ఈ ఫైట్ సెప్టెంబర్ 25న జరాల్సి ఉండింది. అయితే, ట్రైనింగ్ పార్ట్‌నర్ బిల్ మెక్‌ముర్రే విసిరిన పంచ్ బలంగా తగలడంతో ఫోర్మన్ కంటి కింద గాయమైంది. ఫలితంగా సుమారు నెల రోజులు ఫైట్‌ను వాయిదావేశారు. కానీ, ఫైట్ జరిగేంత వరకూ ఇద్దరు బాక్సర్లు అక్కడి నుంచి కదలడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. కిన్షాసెర్ (జైరే)లో అక్టోబర్ 30న జరిగిన ఫైట్‌కు ఇద్దరూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా
ప్రపంచ మీడియా మొత్తం కిన్షాసెర్‌లోనే మకాం వేసింది. అమెరికాసహా వివిధ దేశాల్లోని బాక్సింగ్ అభిమానులు టీవీలో ప్రత్యక్షంగా తిలకించడానికి వీలుగా ఫైట్ తెల్లవారు జామున నాలుగు గంటలకు మొదలైంది. ఇద్దరి ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు. ఫోర్మన్ బరువు 100 కిలోలుకాగా, అలీ బరువు 98 కిలోలు. అప్పటికే బలమైన పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ‘రాక్షస బాక్సర్’గా పేరు సంపాదించిన ఫోర్మన్ గెలుస్తాడని క్రీడా పండితులు ఊహించారు. ఆ ఫైట్‌లో అలీని ఫోర్మన్ చంపేస్తాడని అనుమానించిన వారు లక్షల్లో ఉన్నారు. సుమారు 6,000 మంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది టీవీల్లో ఎంతో ఆసక్తిగా ఫైట్‌ను తిలకించారు. ఎవరూ ఊహించని విధంగా అలీ చెలరేగిపోయాడు. అత్యం వేగవంతమైన ఫుట్‌వర్క్, వ్యూహాత్మక కదలికలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఫోర్మన్ పంచ్‌ల్లో పశుబలమే ఎక్కువ. మొదటి రౌండ్‌లోనే ఫోర్మన్‌పై హుక్‌ను బలంగా కనెక్ట్ చేసిన అలీ దాదాపు అతనిని నాకౌట్ చేశాడు. కానీ, కొన్ని క్షణాల్లోనే కోలుకున్న ఫోర్మన్ ఫైట్‌ను కొనసాగించాడు. అతని బలమైన పంచ్‌లు తగిలితే ఏమవుతుందో అలీకి తెలుసు. అందుకే ‘రోప్ ఎ డోప్’ వ్యూహాన్ని ఎంచుకున్నాడు. ప్రత్యర్థికి అందకుండా రింగ్‌లో తిరుగుతూ, ఎదుటి బాక్సర్ అలసటతో నీరసించిన వెంటనే దాడి చేయడమే ‘రోప్ ఎ డోప్’ విధానం. అలీ వ్యూహం ఫలించింది. ఒక్కో రౌండ్ జరుగుతున్న కొద్దీ ఫోర్మన్‌లో చికాకు పెరిగింది. అతను తీవ్రమైన అసహనానికి గురయ్యాడు. ఏడు రౌండ్లు ముగిసే సమయానికి అలసట కూడా ముంచుకొచ్చింది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న అలీ ఎనిమిదో రౌండ్‌లో ఫోర్మన్‌పై విరుచుకుపడ్డాడు. మెరుపు వేగంతో కదులుతూ, బలమైన పంచ్‌తో అతనిని పడగొట్టాడు. విజేతగా నిలిచాడు. అలీ గెలిచినా ఫోర్మన్ కూడా అతనితో సమానంగా అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. మొత్తానికి ‘రంబుల్ ఇన్ ది జంగిల్’ బాక్సింగ్ చరిత్రలో ‘ఫైట్ ఆఫ్ ది సెంచరీ’గా నిలిచిపోయింది. అందుకే ఆ ఫైట్ జరిగి నాలుగు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి వేధిస్తుండగా, అనారోగ్యంతో ఇల్లు కదల్లేని పరిస్థితిలో ఉన్న అలీ ఈనెల మూడున మృతి చెందాడు. అలీతో పోరాడి ఓడిన ఫోర్మన్ ఇప్పుడు మత ప్రచారకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. కలకాలం గుర్తుండిపోయే ఫైట్‌తో ఇద్దరూ బాక్సింగ్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక అధ్యాయాలను సృష్టించుకున్నారు.

అలీని అబ్బురపరచిన లైనా
తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు రావడం సహజం. అయతే, క్రీడా రంగంలో తల్లిదండ్రుల పేరును నిలబెట్టే స్థాయలో రాణించిన వారు చాలా తక్కువ. అలాంటి అరుదైన ఆణిముత్యాల్లో లైనా అలీది అగ్రస్థానం. ప్రపంచ హెవీవెయట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ మూడో భార్య వెరోనికా పోర్చె కుమార్తె లైనా తండ్రి పేరును నిలబెడుతూ బాక్సింగ్ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తండ్రి అలీని తన అద్వితీయ ప్రతిభతో అబ్బురపరచింది. అతని ఆలోచనా సరళిని మార్చేసింది. మహిళలకు బాక్సింగ్ ఏమాత్రం పనికిరాదని అలీ నిశ్చితాభిప్రాయం. ఇది పురుషులకే పరిమితమని, మహిళల శరీరాకృతి బాక్సింగ్ సరిపోదని అనేక సందర్భాల్లో వాదించాడు. అయతే, అతని అభిప్రాయాలు తప్పని లైనా నిరూపించింది. 1977 డిసెంబర్ 30న జన్మించిన ఆమె తన 18వ ఏట ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తింది. సూపర్ హెవీవెయట్, లైట్ హెవీవెయట్ విభాగాల్లో 21 ఫైట్స్‌లో పాల్గొంది. అన్నింటినీ గెలిచింది. 1999 అక్టోబర్ 8న ఏప్రిల్ ఫ్లవర్‌తో జరిగిన తొలి ఫైట్‌లో నాకౌట్ విజయంతో ఆరంభమైన ఆమె జైత్ర యాత్ర 2007 ఫిబ్రవరి 3న గ్రెండోలిన్ ఓనిల్‌తో జరిగిన ఫైట్‌లో విజయభేరి మోగించడంతో ముగిసింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. మహిళా బాక్సింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన అలీ ఆమె పోరాట పటిమకు ముగ్ధుడయ్యాడు. లైలా తండ్రినైనందుకు ఎంతో గర్వపడుతున్నానని ప్రకటించాడు. మహిళా బాక్సింగ్‌పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. మాటకు కట్టుబడి ఎంతకైనా తెగించే అలీతో బహిరంగ క్షమాపణ చెప్పిన ఘనత లైలాకే దక్కింది.

-విశ్వమిత్ర